నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

113 - ద్వాదశమాస చతుర్థివ్రత నిరూపణమ్

సనాతన మహర్షి పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా? నీకు నేను చతుర్థి వ్రతములను చెప్పెదను. ఈ వ్రతము నాచరించిన స్త్రీ పురుషులు సకలాభీష్టములను పొందెదరు. చైత్ర శుద్ధ చతుర్థినాడు వాసుదేవ స్వరూపియగు గణపతిని చక్కగా పూజించి సువర్ల దక్షిణ నిచ్చి అందరి నమస్కారములను పొందుచు విష్ణులోకమును పొందును. వైశాఖ శుద్ధ చతుర్థినాడు సంకర్షణ రూపియగు గణపతిని ప్రార్థించి గృహస్థులగు బ్రాహ్మణులకు యథావిధిగా శంఖమునిచ్చి సంకర్షణ లోకమును చేరి చాలా కల్పములు ఆనందించును. జ్యేష్ఠ మాస చతుర్థినాడు ప్రద్యుమ్న రూపియగు గణపతిని ప్రార్థించి యూధులకు ఫలమును మూలమును ప్రదానము చేసి స్వర్గమును పొందును. ఆషాఢ చతుర్థినాడు అనిరుద్ద రూపియగు గణపతిని చక్కగా పూజించి యతులకు అలాబు పత్రములను ఇచ్చి అభీష్టమును పొందును. ఇట్లు పన్నెండు సంవత్సరములు చతుర్మూర్తి వ్రతములనాచరించి ఫలమును కోరువారు యథావిధిగా ఉద్యాపనమును చేయవలయును. జ్యేష్ఠ చతుర్థినాడు ఇంకొకటి సతీవ్రతమును ఆచరించి పార్వతీదేవి లోకమున ఆనందించును. ఆషాఢ చతుర్థినాడు మరియొక శుభకరమగు వ్రతమున్నది. ఈ దినము రథంతర కల్పమునకు ప్రారంభమైన దీనము. శ్రద్దాయుక్తమగు మనసుతో యథావిధిగా గణేశుని పూజించి దేవతలకు కూడా పొందరాని ఫలమును పొందును. శ్రావణ చతుర్థినాడు చంద్రోదయ సమయమున యథావిధిగా గణేశునకు అర్ఘ్యప్రదానమును గావించవలయును. లంబోదరుని, చతుర్బాహుని, త్రినేత్రుని, రక్తవర్లునీ, నానారత్నాభరణాలంకృతుని, ప్రసన్నవదనుని ధ్యానించవలయును. ఆవాహనాది షోడశోపచారములచే చక్కగా పూజించవలయును. గణేశ ప్రీతి దాయకమగు మోదకమును నైవేద్యము సమర్పించవలయును. ఇట్లు వ్రతము నాచరించి మోదకమును భుజించి, భూమియందే చక్కగా పరుండవలయును. ఈ వ్రతము ప్రభావము వలన మనసులో తలచిన కోరికలను పొంది, పరమున గణేశ పదమును పొందును. జగత్రయమున ఈ వ్రతములో సమానమగు మరియొక వ్రతము లేదు. కావున సర్వాభీష్టములను కోరువారు ప్రయత్నముచే ఈ వ్రతము నాచరించవలయును. ఈ దినముననే దూర్వాగణపతి వ్రతము కోందరు చెప్పెదరు. ఇపుడు ఆ విధానమును చెప్పెదను. బంగారముతో గణపతిని నిర్మించి తామ్రపాత్రపై యుంచి రక్తవస్త్రముతో చుట్టి సర్వతో భద్ర మండలమున రక్త పుష్పములతో పంచ పత్రములచే పూజించవలయును. మారేడు పత్రము, ఉత్తరేణి పత్రము, జమ్మి పత్రము, గరక, తులసి ఈ పత్రములచే, ఇతర పుష్పములచే పూజించి, ఫలములు మోదకములు ఉపహారముగా కల్పించి అర్యము నీయవలయును. తరువాత విఘ్ననాయకుని ప్రార్థించి, దక్షిణతో ప్రతిమను వీధిజ్ఞుడగు ఆచార్యునకు సత్కరించి ఈయవలయును. ఇట్లు అయిదు సంవత్సరములు ఈ వ్రతము నాచరించి యథావిధిగా ఉపాసించి ఇహలోకమున అఖిల భోగముల ననుభవించి అంతమున గణపతి లోకమున పొందును. ఇక భాద్రపద శుద్ధ చతుర్థికి బహులాధేనువును స్రగ్గంధ యవసాదులతో పూజించవలయును. తరువాత ప్రదక్షిణమును చేసి శక్తియున్నచో దానము నీయవలయును. శక్తి లేనిచో నమస్కరించి విడిచి పెట్టవలయును. అయిదు సంవత్సరములుకొని పదిసంవత్సరములుకొని, పదునారు సంవత్సరములుకాని, వ్రతము నాచరించి, ఉద్యాపన గావించి, పాలిచ్చు ధేనువును దానము చేయవలయును. ఈ వ్రతము ప్రభావము వలన మనసునకు నచ్చిన భోగముల ననుభవించి దేవతా బృందముచే సత్కరించబడుచు గోలోకమును పొందును. ఇక భాద్రపద శుద్ధ చతుర్థినాడు సిద్దివైనాయక వ్రతమును ఆవాహనాది షోడశోపచారములచే అర్చించి, ఏకాగ్రమనసుతో సిద్ధి వినాయకుని ధ్యానించవలయును. ఏకదంతుని, శూర్పకర్ణుని, గజవక్రుని, చతుర్భుజుని, పాశాంకుశధరుని, దేవుని, తప్తకాంచన సన్నిభుని ధ్యానించవలయును. ఏకవింశతి పత్రములను ఏక వింశతి నామములతో భక్తి యుక్తుడై సమర్పించవలయును. ఆ నామములను వినుము. సుముఖునకు శమీపత్రమును, గణాధీశునకు భృంగపత్రమును, ఉమాపుత్రునకు బిల్వపత్రమును, గజముఖునకు దూర్వాపత్రమును, లంబోదరునకు బదరీ పత్రమును, హరసూనునకు ధత్తూర పత్రమును, శూర్పకర్లునకు తులసిని, వక్రతుండునకు శింబిసత్రమును, గుహాగ్రజునకు అపామార్గమును, ఏకదంతునకు బార్హత పత్రమును, హేరంబునకు సింధూర పత్రమును, చతుర్లోతునకు పత్రజమును, సర్వేశ్వరునకు అగస్త్య పత్రమును సమర్పించవలయును. తరువాత దూర్వాయుగ్మమును స్వీకరించి గంధ పుష్పాక్షతలతో పూజించి అయిదు మోదకములను అర్పించవలయును. ఆచమనము చేసి నమస్కరించి ప్రార్థించి విడువ వలయును. బంగారు వినాయక ప్రతిమను దక్షిణగా గురవునకు నమస్కరించి సమర్పించవలయును. బ్రాహ్మణులకు దక్షిణ నీయ వలయును. ఇట్లు అయిదు సంవత్సరములు పూజించి ఐహికా ముష్మికములను పొందును. ఈ చతుర్థినాడు చంద్రుని చూడరాదు. చూచినచో అపవాదును పొందును. ఈ దోష నాశము కొరకు పౌరాణిక మంత్రమును పఠించవలయును. సింహము ప్రసేనుని చంపెను. సింహము జాంబవంతునిచే చచ్చెను. ఓ సుకుమారూ? నీవు రోదించకుము. ఇదిగో ఇది స్యమంతకమణి. ఆశ్వయుజ శుక్ల చవితినాడు కపర్దీశుని వినాయకుని పురుషసూక్తముచే ఉపచారములచే పూజించవలయును. కారణ రహితములగు ముష్టిగతములు, కపర్థి సహితములగు తండులములను బ్రాహ్మణ బ్రహ్మచారికి గంధ పుష్పములచే ఆర్పించి దానము చేయవలయును. హరదై వత్య మిశ్రితములగు వైశ్వదేవత్య తండులములు. ఈ తండులములను సమర్పించుటచే కపర్ది గణనాధుడు ప్రీతి చెందును గాక. కార్తీక కృష్ణ చతుర్థినాడు కరకవ్రతము చెప్పబడినది. ఈ వ్రతమును స్త్రీలు మాత్రమే చేయవలయును. ఇపుడు ఈ విధానమును చెప్పెదను. స్త్రీ చక్కగా స్నానము చేసి అలకరించుకొని గణాధీశుని పూజించవలయును. గణాధిపుని మందు పూర్ణపక్వాన్నమును పదికరకములను ఉంచవలయును. భక్తిచే సావధాన మనసు కలదై దేవ దేవుని సమర్చించి, నా దేవుడు ప్రీతి చెందును గాక అని ఉచ్చరించి సమర్పించవలయును. సంకల్పాను సారముగా ముత్తయిదువులకు, బ్రాహ్మణులకు అదరముతో సమర్పించవలయును. తరువాత రాత్రిపూట చంద్రోదయ కాలమున యధావిధిగా అర్ఘ్యమునీయవలయును. వ్రత పూర్తికొరకు మిష్టాన్నమును భుజించ వలయును. కరకమును పాలతో కాని నీటితో కాని వక్కలు అక్షతలు రత్నములతో బ్రాహ్మణునకు సమర్పించవలయును. ఇట్లు స్త్రీ ఈ వ్రతమును పన్నెండు సంవత్సరములు ఆచరించి ఉపాయనములను సమర్పించి ఈ వ్రతమును విసర్జించ వచ్చును. స్త్రీలకు సౌభాగ్యమును ప్రసాదించు ఈ వ్రతముతో సమానమగు వ్రతము మరియొకటి ఈ మూడులోకములలో లేదు కావున దీనిని ఎప్పుడూ ఆచరించవలయునని చెప్పితిమి. మార్గశిర శుక్ల చతుర్థినాడు నాగవతము చెప్పబడినది. ప్రాతఃకాలమున వ్రతమును సంకల్పించి పవిత్రమగు గోశృంగజలమును త్రాగి, స్నానము చేసి మధ్యాహ్న కాలమున శంఖపాలాది పన్నగులను ఆదిశేషుని ఆహ్వానించి షోడశోపచారములచే పూజించవలయును. క్షీరములచే స్నానము చేయించి తృప్తి పరచవలయును. ఇదియే నాగవతము. ఇట్లు మానవులు నాగవతము నాచరించినచో వెంటనే విషములు నశించును. సర్పములు కాటువేయవు. మార్గశుక్ల చతుర్థినాడు ఒక సంవత్సరము మొత్తము ఏకభుక్తముతో నుండి ఆచరించవలయును. రెండవ సంవత్సరము రాత్రి భోజనముతో చేయవలయును. మూడవ సంవత్సరము అయాచితోపవాసములతో నాలుగవ సంవత్సరము కూడా ఇట్టే ఆచరించవలయును. ఇట్లు యధావిధిగా యధాక్రమముగా నాలుగు సంవత్సరములు వ్రతము నాచరించి, వ్రాత సమాప్తి గావించి, చివర వ్రత స్నానమును గావించి బంగారముతో భూగణములో మూషక రధమును చేయించవలయును. శక్తిలేనివాడు వర్ణములతోనే శుభ్రమగు పద్మమును, సుపత్రమును నిర్మించి, దానిపై కలశమును స్థాపించి తామపాత్ర నుంచి శుభ్రమగు తండులములను నింపి, దానిపై గణేశుని స్థాపించి రెండు వస్త్రములతో కప్పి గంధాదులచే పూజించవలయును. గణేశుడు ప్రీతి చెందుగాక అని మోదకమును నివేదన చేయవలయును. గీత వాద్యముచే పురాణ కధలచే జాగరణ చేయవలయును. ప్రభాత కాలమున స్నానము చేసి యధావిధిగా హోమముచేసి తిలములచే ద్రోహులచే, యవలచే, తెల్లని ఆవాలచే, నేయిచే, గణ, గణాధిప, కూష్మాండ, త్రిపురాంతక, లంబోదర, ఏకదంత, రుక్మదంష్ట్ర, విఘ్నప, బ్రహ్మ, యమ, వరుణ, సోమ, సూర్య, హుతాశన గంధమాది, పరమేష్ఠి, అను పదునారు నామములను ప్రణవము ఆది యందుచ్చ రించి చతుర్థి విభక్ష్యంతములుగా చివర నమః అని పలికి, అనగా “ఓం గణాయనమః” “ఓం గణాధిపాయనమః”. ఇట్లా పదునారు నామములను ఉచ్చరించి ప్రత్యేకముగా అగ్నిలో హోమమును గావించవలయును. “వక్రతుండాయ ఫట్" అని నూటా ఏనిమిది మారులు హోమము గావించవలయును. తరువాత భూః భువః సువః అను వ్యాహృతులచే, శక్తి కొలది హోమము గావించి పూర్ణాహుతుని చేయవలయును. తరువాత దిక్పాలకులను పూజించి బ్రాహ్మణులకు మోదకములతో పాయసములతో భోజనము పెట్టవలయును. తరువాత ఆచార్యునకు దూడతోనున్న గోవును దక్షిణతో దానము చేయవలయును. ఇతరులకు కూడా యధాశక్తి భూరి దక్షిణ నీయవలయును. నమస్కరించి ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణులను విడువ వలయును. తరువాత తాను సంతోషముతో బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు మానవుడీ వ్రతమును ఆచరించి ఇహ లోకమున సకల భోగములననుభవించి, అంతకాలమున గణాధీపతి అనుగ్రహము వలన విష్ణు సాయిజ్యమును పొందును. ఈ వ్రతమునే కొందరు వరవ్రతమని యందురు. ఈ వ్రతమునకు విధానము ఫలము ఇదియే. పుష్య శుద్ధ చతుర్థినాడు భక్తితో విఘ్నేశుని ప్రార్థించి, ఒక బ్రాహ్మణునికి మోదకములతో భోజనము పెట్టి దక్షిణ నీయవలయును. ఇట్లు వ్రతము నాచరించినచో సర్వసంపదలను పొందును. మాఘకృష్ణ చతుర్థినాడు సంకష్ట వ్రతము చెప్పబడినది. వ్రతమును చేయదలచిన వాడు నియమ పూర్వకముగా ఉపవాసమును సంకల్పించి చంద్రోదయము వరకు సావధానముగా నుండవలయును. తరువాత చంద్రోదయ కాలమున మృణ్మయగణనాయకుని నిర్మించి సాయుధుని సవాహనుని పీఠమున స్థాపించి యధావిధిగా షోడశోపరచారములచే చక్కగా పూజించి గుడతిల కుట్టములతో మోదకమును నివేదన చేసి, తామ్ర పాత్రలో రక్తచందన మిశితముగా. కుశ దూర్వపుష్పాక్షత సహితముగా, శమీపత్రములను దధిని కలిపీ చంద్రునకు అర్ఘ్యమునీయవలయును. గగనార్లవ మాణిక్యమా? చంద్రా! దాక్షాయణీ పతీ! గణేశ ప్రతిరూపక! నేనిచ్చు ఆర్ఘ్యమును గ్రహించుము. ఇట్లు గణేశునకు దివ్యము పాపనాశనమగు ఆర్యమునిచ్చి, శక్తి కలది బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వారి ఆజ్ఞచే తాను తినవలయును. ఇట్లు శుభకరమగు సంకష్టవ్రతము నాచరించినచో, ధన ధాన్య సమృద్ధి కలిగి కష్టములను పొందకుండును. మాఘశుక్ల చవితినాడు ఉత్తమమగు గౌరీవ్రతము నాచరించ వలయును. ఈ దినమున గౌరీదేవిని పూజించి యోగినీగణములతో నరులు విశేషించి నారీగణము కుంకుమతో మల్లె పూవులతో, రక్త సూత్రములతో, రక్త పుష్పములతో అలక్ష రసముతో ధూపదీప బలులతో గుడముతో కలిసిన అల్లముతో పాలతో, పాయసముతో, లవణములతో పాలకులతో ముత్తయిదువలను పూజించవలయును. అట్లే సద్రాహ్మణులను పూజించవలయును. సౌభాగ్య వృద్ధి కొరకు దానములను చేయవలయును. బంధువులతో కలిసి భుజించవలయును. ఈ గౌరీవ్రతము సౌభాగ్యమును ఆరోగ్యమును పెంచును. ప్రతి సంవత్సరము స్త్రీలు పురుషులు ఈ వ్రతమును నాచరించవలయును. దీనినే కొందరు డుండి వ్రతమని, మరి కొందరు కుండల వ్రతమని చెప్పిరి. కొందరు లలితా వ్రతమని, మరి కొందరు శాంతివ్రతమని చెప్పిరి. ఈ వ్రతమున చేసిన స్నాన దాన జప హోమములన్నియూ గణేశ ప్రసాదము వలన వేయిరెట్లుగా ఫలితము నిచ్చును. ఫాల్గున శుద్ధ చతుర్థినాడు శుభకరమగు డుండి రాజ వ్రతమును ఆచరించవలయును. తిలపిష్టములతో బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భుజించవలయును. గణేశారాధన పరుడు తిలములతో దానహోమపూజలు జరిపినచో గణేశాను గ్రహము వలన సిద్ధిని పొందును. బంగారముతో గజాననుని చేసి భక్తితో పూజించి, బ్రాహ్మణోత్తమునకు దానము చేసినచో సర్వసంపత్సమృద్ది కలుగును. ఏదో ఒక మాసములో చతుర్థి ఆదివారముతో కలిసి వచ్చినచో, లేదా మంగలవారముతో వచ్చిననూ అది చాలా విశేష ఫలప్రదము. శుద్ధ బహుళ పక్షములలోని అన్ని చతుర్థులలోనూ విఘ్న నాయకునినే భక్తి తత్పరులై పూజించవలయును.

ఇది శ్రీ బృహన్నారద మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్థ పాదమున ద్వాదశమాసస్థిత చతుర్థి వ్రతనిరూపణమను నూటపద మూడవ అధ్యాయము సమాప్తము.