నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

28 - శ్రాద్ధక్రియావర్ణనమ్

సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్టా ! ఉత్తమమైన శ్రాద్ధవిధిని వినుము. ఈ విధిని వినినచో సర్వపాప నివృత్తి కలుగును. సంశయములేదు. మృతదినమునకు ముందురోజు స్నానము చేసి ఏకభుక్తముగా నుండవలయును. క్రింద పరుండవలయును. బ్రహ్మ చర్యము నవలంబించవలయును. రాత్రిపూట బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. దంతధావనము, తాంబూలము, తైలాభ్యంగనము, రతి, ఓషధిపరాన్నములను శ్రాద్ధకర్త పరిత్యజించవలయును. ప్రయాణమును, కలహమును, క్రోధమును స్త్రీ సంగమమును, బరువుమోయుటను, పగటినిద్రను శ్రాద్ధకర్త, భోక్త పరిత్యజించవలయును. శ్రాద్ధమున నియంత్రణ చేయబడిన విప్రుడు స్త్రీ సంగమును చేసినచో బ్రహ్మ హత్యాపాపమును పొందును. నరకమును పొందును. శ్రాద్దమునందు శ్రోత్రియుడు, విష్ణుతత్పురుడు, స్వాచారనిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు పురాణార్ధ విశారదుడు త్రిమధు త్రిసుపర్ణజ్ఞానము కలవాడు, సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతతత్త్వవిశారదుడు వేదాంతతత్త్వసంపన్నుడు సర్వలోకహితాకాంక్షి, కృతజ్ఞుడు గుణసంపన్నుడు, గురుశుశ్రూషారతుడు, సచ్చాస్త్రకథనములతో పరోపదేశ నిరతుడు అయిన విప్రుని నిమంత్రణ చేయవలయును. ఇక ఇపుడు శ్రాద్ధమున నియంత్రణకు యోగ్యులుకానివారిని, చెప్పెదను వినుము. న్యూ గాంగుని, అధికొంగుని, లుబ్ధుని, రోగిని, కుష్టువ్యాధిగ్రస్తుని, కునఖుని, లంబకర్ణుని, వ్రతభ్రష్టుని, జ్యోతిష్కుని, శవదాహకుని, కువాదిని, పరికేత్తను, దేవలకుని, ఖలుని, నిందకుని, అమర్జాగ్రస్తుని, ధూర్తుని, గ్రామయాజకుని, అసచ్ఛాస్త్రాభి నిరతుని, పరాన్ననిరతుని శూద్రస్త్రీ పుత్రుని పోషించువానిని, శూద్రస్త్రీ పతిని, భర్తుండగా స్త్రీకి జారుని వలన కలిగిన పుత్రుని, భర్త చనిపోయిన తరువాత ఇతరుని వలన కలిగిన పుత్రుని, యజ్ఞము చేయుదగని వానిచే యజ్ఞమును చేయించువానిని, దంభాచారపరుని, నిషయోజనముగా ముండనము చేసుకొనువానిని పరస్త్రీలను పరుల ధనుమును ఆశించువారిని, విష్ణుభక్తివిహీనుని, శివభక్తి పరాజ్ముఖుని, వేద విక్రయముచేయు వానిని, వ్రతమును విక్రయించువానిని, స్మృతి విక్రాయకుని, మంత్ర విజ్రాయకుని, గాయకుని, కావ్యకర్తను, వైద్యముచే జీవించువానిని, వేదనిందాపరుని, గ్రామారణ్య ప్రదాహకుని, అతికాముకుని, రస విక్రయకారకుని కూటయుక్తిరతుని ప్రయత్నముతో శ్రాద్ధమున పరిత్యజించవలయును.

మొదటిదినమున కాని మృతాహమున కాని పిలువలయును. నియంత్రణ చేయబడిన విప్రుడు బ్రహ్మచారియై జితేంద్రియుడై యుండవలయును. “శ్రాద్దమున క్షణము చేయవలయును ప్రసన్నులు కండు” అని పలుకవలయును. జితేంద్రియుడై దర్భపాణియై ప్రాజ్ఞుడైన ద్విజుని నియంత్రణ చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి ప్రాతఃకృత్యమును ముగించుకొని కుతపకాలమున విద్వాంసుడు శ్రాద్ధము నాచరించవలయును. దీనములోని ఎనిమిదవ భాగమున సూర్యుడు, మందగించిన సమయం కుతకాలమందురు. అపుడు పితరుల కర్పించినది అక్షయమగును. అపరాహ్లామున పితరులకు దత్త మైనది అక్షయమగునని బ్రహ్మ చెప్పెను. కావున ద్విజులు ఆ సమయమునే ఈయవలయును. అకాలమున కవ్యము ఆర్పించినచో దానిని రాక్షసమని అందురు. అది పితృదేవతలను చెందదు. సాయంకాలమున దత్తమైన కవ్యము రాక్షసమనబడును. ఆసమయమున ఇచ్చినవాడు, భోక్తకూడ నరకమును చెందుదురు. మృతాహా తిథి దండపరిమితముగా నున్న చో అపరాహ్లావిద్దయున్నచో ఆ సమయముననే శ్రాద్దము నాచరించవలయును. మృతాహ తిథి రెండు దినములలో ఆపరాఫ్లమున నున్న చో పూర్వదినమున కయకర్మ చేయవలయును. రెండవ దినమున వృద్ధి కార్యమును చేయవలయును. పూర్వదినమున మతాహో తిథి రెండు ముహూర్తములుండి ద్వితీయ దినమున సాయంకాలము వరకున్నచో రెండవదినమున కవ్యమును చేయవలయును. రెండు ముహూర్త కాలమున్న చో పూర్వదినముననే చేయవలయునని కొందిర మతము కాని ఇది అందరి మతము కాదు. నిమంత్రణ చేయబడిన విప్రులు వచ్చిన వెంటనే కర్త ప్రాయశ్చిత్తముతో విశుద్దుడై వారినుండి అనుజ్ఞను పొందవలయును. విశ్వేదేవస్థానమునకు ఇద్దరు విప్రులను పితృస్థానమునకు ముగ్గురు విప్రులను నియంత్రణ చేయవలయును. లేదా విశ్వేదేవులను ఒకరిని, పితృదేవతలకు ఒకరిని కూడా నిమంత్రణ చేయవలయును. బ్రాహ్మణునకు చతురస్రమును, క్షత్రియునకు త్రికోణమును, వైశ్యనకు వర్తులాకాలముగను శూద్రునకు ప్రోక్షణమును చేయవలయును. బ్రాహ్మణులు లభించనిచో సోదరుని కాని, పుత్రుని కాని చివరకు తన వారిని నియోగించుకొనవలయును. కాని వేదవర్జితుడగు విప్రుని మాత్రము నియోగించరాదు. బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చేసి ఆచమనమును చేయించి కూర్చుండ నియమించి నారాయణ స్మరణ చేయచు యథావిధిగా ఆర్చన చేయవలయును. బ్రాహ్మణుల మధ్య దేశమున ద్వారదేశమున ‘అపహృతా’  అను ఋక్కుచే కర్త నువ్వులను చల్లవలయును, యవలచే దర్భలచే విశ్వేదేతలకు ఇది ఆసనమని ఆసనమునిచ్చి మరల క్షణము నీయవలయును. అక్షయ్య ఆసనము లిచ్చునపుడు షష్ఠీవిభక్తిని ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదామున చతుర్థి విభక్తిని ఇతరవిషయములలో సంబుద్ధిని ఉపయోగించవలయును. దర్భశాఖాసమన్వితమైన పాత్రద్వయమును ఆమోదించి ఆ పాత్రలను “శం నో దేవీ” అను మంత్రముచే జలమున ప్రోక్షించవలయును. ‘యవోసి’ అను మంత్రముచే యవలను చల్లవలయును. మౌనముగా గంధపుష్పములచే ఆర్పించవలయును. “విశ్వేదేవాస్స” అను మంత్రముచే విశ్వేదేవతలను ఆవాహనము చేయవలయును “యా దివ్యా” అను మంత్రముచే సావధానమనస్కుడై అర్ఘ్యము నీయవలయును. ధూపదీపగంధపుష్పాదులచే పూజించవలయును. విశ్వేదేవుల అనుమతిని పొంది పితృదేవతలకు పూజించవలయును. పితృదేవతలను తిలయుక్త, దర్భలను ఆసనముగా నీయవలయును. మూడు పాత్రలను ఆసాదించవలయును. పూర్వమువలె ఆర్యాదులనీయవలయును. ‘శం నో దేవీ’ అను మంత్రముచే జలమును  ప్రోక్షించి ‘తిలోసి’ అను మంత్రముచే తిలలను చల్లవలయును. “ఉశన్త” అను మంత్రముముచే ఆవాహన చేయవలయను ‘యా దివ్యా’ అను మంత్రముచే పూర్వములే ఆర్యము నీయవలయును. ధూపదీపగంధపుష్పవస్త్రాభరణములచే విభవానుసారముగా పూజించవలయును. తరువాత వివేకము కలవాడై ఘృతయుక్తమైన అన్నాగ్రమును తీసుకొని ‘అగ్నౌ కరిష్యే’ అని అనుజ్ఞనడిగి, ‘కురుష్య’  ‘క్రియతాం’ ‘కురుష్వ’ “క్రియతాం” ‘కురు’ అని అనుజ్ఞనీయవలయును. స్వగృహ్యోక్త విధానము ననుసరించి ఉపసానాగ్నిని ఆదానము చేసుకొని “సోమాయ చ పిత్సమతే స్వధా నమ” అని కానీ ఉచ్చరించవలయును. స్వాహాంతముగానైనను పితృయజ్ఞమువలె హోమును చేయవలయును. ఈ ఆహుతులచే మాత్రమే పితృదేవతలకు అక్షయతృప్తి కలుగును. ఉపాసనాగ్ని లేనియెడల బ్రాహ్మణుని హస్తమున హోమము చేయవలయును.

ఆచారనుగుణముగా హస్తమునందు కాని అగ్నియందు కాని హోమమును చేయవలయును. పొర్వణము వచ్చినపుడు ఉపాసనాగ్నిని దూరముగా నుంచరాదు. అగ్ని సంధానము చేసి హోమమును చేసి విసర్జన చేయవలయును. పార్వణ సమయమున అగ్ని దూరముగా నున్న చో సోదరులచే కాని అగ్నితో కూడియున్న ద్విజులచే కాని శ్రాద్ధమును చేయించవలయును. మృతాహదినమున తన అగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు లౌకికాగ్నితో నున్నపుడు, ఉపాసనాగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు సమీపమున నున్నపుడు అగ్నిలో కాని హస్తములో కాని హోమమును చేసినచో వాడు పొతకియగును. ఉపాసనాన్ని దూరముగా నున్నపుడు అట్లు చేయవచ్చునని కొందరి మతము. హోమశేషాన్నమును శ్రీహరిని స్మరించుచు విప్రపాత్రలలో నుంచవలయును. రుచికరమైన భక్ష్యభోజ్య లేహ్యములచే విప్రులను పూజించవలయును. అపుడు విశ్వేదేవ పితృదేవతాస్థలములలో అన్నత్యాగమును చేయవలయును. “ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః యే యత్ర విహితా శ్రాద్దే సావధానా భవంతు తే” అను మంత్రముచే “యే దేవాస” అను ఋక్కుతో విశ్వేదేవతలను ప్రార్థించవలయును. (“మహానుభావులు మహాబలులైన విశ్వేదేవతలు ఇచటకు రండు! శ్రాద్ధమున విధించబడిన వారు కావున సావధానులు కండు” అని పై మంత్రమున కర్థము). “యే చ హో” అను ఋక్కుతో పితృదేవతలను ప్రార్థించవలయును. “అమూర్తానాం చ మూర్తానాం పితృణాం దీప్తతేజసామ్ నమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షుషామ్” అను  మంత్రముచే నారాయణ స్మరణముతో పితృదేవతను ప్రార్థిచవలయును. (మూర్తిమంతులు మూర్తిరహితులు దీప్త తేజస్కులు, యోగచక్షువులు, ధ్యానరతులు అగు పితృదేవతలకు నమస్కారము” అని పై మంత్రమునకు అర్థము). దానము చేయబడిన దానిని హవిస్సును శ్రాద్ధ కర్మను శ్రీమహావిష్ణువునకు సమర్పించవలయును. అపుడు ఆ బ్రాహ్మణులందరూ మౌనముగా భోజనము చేయవలయును. నవ్వుచున్నవానికి మాటాలాడువానికి చేసిన దానము రాక్షసమగును. ఆచారానుగుణముగా మధుమాంసాదులు వడ్డించవలయును. వాజ్మయముతో ఘృతపాత్రలను చేతబట్టుకొని పాకాదులను ప్రశంసించవలయును. శ్రాద్దమున నియోగించబడిన బ్రాహ్మణుడు ఘృతపాత్రను వదిలినచో శ్రాద్దఘాతకుడై నరకమును పొందును. భోజనమును చేయుచున్న విప్రులు ఒకరినొకరు తొకినచో ఆ అన్నము విడువక భుజించి ఎనిమిదివందలు గాయత్రీ జపములను . చేయవలయును. విప్రులు భోజనము చేయుచుండగా కర్త శ్రద్ధతో అనంతుడు అపరాజితుడు అగు నారాయణుని స్మరించువలయును. రక్షోఘ్నలగు వైష్ణవులను, విశేషించి పితృదేవతలను స్మరించవలయును. పురుషసూక్తమును సాచి కేతోపాఖ్యానమును, మధుసూక్తమును, సుపర్ల సూక్తమును పవమానసూక్తమును, యజుర్వేద మంత్రములను సామవేదమంత్రములను పుణ్యప్రదములగు ఇతిహాస పురాణములను ధర్మ శాస్త్రములను బ్రాహ్మణ భోజనము జరుగువరకు జపించవలయును. బ్రాహ్మణుల భోజనము జరిగిన తరువాత వికిరాన్నమును చల్లవలయును. శేషాన్నమును భుజించవలయును. ప్రార్థించి మధుసూక్తమును పఠించవలయును. కర్త పొదప్రక్షాళనమును చేసుకొని చక్కగా ఆచమనము చేసి, బ్రాహ్మణవచనము తరువాత పిండదానమును చేయవలయును. స్వస్తివాచనమును అక్షయోదకమును చేయవలయును. తరువాత సావధానుడై విప్రులకు ఆభివాదనము చేయవలయును, పాత్ర చాలనము చేయకనే స్వస్తి వాచనము చేసినచో వారి పితరులు ఒక సంవత్సరము ఉచ్చిష్ణ బోజనము చేతురు. “దాతారో నోభివర్థంతాం” ఇత్యాది స్మృతివచనములచే బ్రాహ్మణులనుండి ఆశీర్వాదమును పొందవలయును. తరువాత న్యుబ్దపాత్రను తీసుకొని పితృదేవతలను విసర్జించవలయును. శ్రాద్ధకర్త, భోక్త ఇరువురు ఆ రాత్రి స్త్రీ సంగమమును చేయరాదు. స్వాధ్యాయమును, ప్రయాణమును చేయరాదు.

 ప్రయాణము చేయుచు దారిలో నున్నవాడు, రోగాది పీడితుడు, ధన హీనుడు ఆమశ్రాద్దమును చేయవలయును, భార్య ఋతుమతిగా ఉన్నవాడు బంగారముతో శ్రాద్ధము చేయవలయును. ద్రవ్యములు, విప్రులు లేని పక్షమున అన్నమును మూత్రము వండించి పితృసూక్తముచే హోమమును చేయవలయును. పూర్తిగా వండుట కే పదార్థములు లేనివాడైనచో తన శక్తికొలది గోవులకు తృణమునీయవలయును. లేదా స్నానము చేసి యథావిధిగా తిలతర్పణము చేయవలయును, ఏమీ లేనివాడైనచో నిర్జనారణ్యమునకు వెళ్ళీ నేను పరమదరిద్రుడను మహాపాపీని అని పలుకుచు పెద్దగా రోదించవలయును. శ్రాద్ధ కర్త రెండవదినమున పితృతర్పణమును చేయనిచో ఆ కులము నశి¢చును, బ్రహ్మహత్యాపాపమును పొందును. శ్రద్దతో శ్రాద్దమును చేయు మానవులకు సంతతి చ్చేదము జరగదు. సంపన్నులగుదురు. శ్రాద్దమున పితృదేవలను పూజించినచో శ్రీహరియే పూజించబడును. శ్రీహరి సంతోషించినచో దేవతలందరూ సంతోషింతురు. పితరులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సిద్దులు మనుజులు హరి స్వరూపులే. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు శ్రీహరి వలననే పుట్టినది. కావున కర్త భోక్త శ్రీహరియే ఈ జగమున ఉన్నదిలేని, కనపడునది కనపడనిది అంతా విష్ణుమయముగా తెలియును. విష్ణువు కంటే ఇతరమైనదేదియు లేదు. ఈ ప్రపంచమునకు ఆధారభూతుడు, సర్వభూతాత్మకుడు, ఆవ్యయుడు సాటిలేని స్వభావము కలవాడు హవ్య కవ్య భోక్త భగవానుడే. పరబ్రహ్మ ధేయుడైనవాడు జనార్దను డొక్కడే కర్త కారయిత అంతా సనాతనుడగు శ్రీమహావిష్ణువే. ఓ మునిశ్రేష్టా ! ఇట్లు ఉత్తమశ్రాద్ధ విధి చెప్పబడినది. ఇట్లు చేసిన వారి పాపము నశించును. శ్రాద్ధకాలమున ఈ ఉత్తమ విధిని పఠించినచో వారి పితరులు సంతోషించెదరు. సంతతి వృద్ధి చెందును.

ఇది శ్రీ బృహాన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున శ్రాద్ధక్రియా వర్ణనమను ఇరువదియెనిమిదివ అధ్యాయము సమాప్తము.