భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
136. సాంబో పాఖ్యానమున సూర్యప్రతిష్ఠా వర్ణనము
తా॥ నారదుడిట్లు చెప్పేదొడగెను. “ఇక పై సూర్యదేవునకు గంధమాల్యాదుల చేత వస్త్ర తాంబూలాదుల యొక్క సంస్కారమును (అధివాసనము) గూర్చి చెప్పెదను. “సహస్రశీర్షా పురుషః' అను పురుషసూక్త మంత్రములతో మండపమును ప్రవేశింపవలెను (1) ఉపలేపనాదులచే సంసర్గము నందని వేణోక పరిశుద్దప్రదేశమున ఐదు వర్ణములతో చతురస్ర మండలమును లిఖింపవలెను, (2) అది టెక్కెములు, తోరణములు, ఛత్రములు, టెక్కెపు కంబములు పుష్పమాలికలు మున్నగు వానితో నలంకృతమై విచిత్రమైన మేలుకట్టుతో నొప్పారుచు, వివిధములగు పూల రాశులతో వేదజల్లబడి యుండవలెను (3) దాని నడుమ దర్భలు పరచి అచట సూర్యదేవుని ప్రతిమను స్థాపింపవలెను. (4) అట సూర్యదేవునకు ఆహ్వానము చేసి యతనికి అర్ఘ్యమియవలెను (4) బంగారు పాత్రలో మధుపర్కము మొలగునవి సమర్పించి అటుపై దేవునకు సమర్పింపదగిన లేగతోగూడిన ఆరోగ్యవంతమైన ఆవును నివేదింపవలెను, (చూపింపవలెను) (5) “సహస్ర కిరణుడవైన' ఓసూర్య దేవా! గోపతి పైన నీకు నమస్కారము' అనుచు దేవుని అర్ఘ్యముతో పూజించివస్త్రములను ధరింపజేసి (6) యజ్ఞోపవీతము, నైవేద్యము సమర్పించి, తలయంటీ యిట్లు ప్రతిసంవత్సరము నిర్దుష్టమైన తత్రసాదమును స్వీకరింపవలేను. (7) అది శ్రావణ మాసమునందు ప్రశస్తమైనది. బ్రాహ్మణులకు భోజన సంతర్పణలతో ప్రతి సంవత్సరమునందున దీనిని ప్రయోగించుచుండవలెను. (8) లోపము లేకుండునట్లే సూర్యాధివాస సంస్కారమును శ్రావణమున చేయవలెను. భాస్కరుని వివిధ గంధములతోను, చందనాగురు కుంకుమలతోను (9) అలంకారముల తోను పూజించి, పరిమళ భరితములైన పుష్పములతో, మాలలతో, అనేక విధములుగ చిత్రవిచిత్రములుగ అల్లబడిన హారములతోడను అలంకరింపవలెను.
తా॥ ఆ తరువాత సూర్యప్రతిమ ముందర ధూపము వేయవలెను 'సహస్ర శీర్షా పురుషః' ఆదిగాగల సూక్తముతో మండపమున ప్రవేశింపజేయవలెను (11) నమశ్శంభవే చ', మంత్రముతో శయ్య మీద నుంచవలెను 'విశ్వతశ్చక్షుః, మంత్రముతో నీటి ధ్వనులను అరికట్టవలెను. (12) ఇక శుభప్రదమైన సంకలీకరణమును గూర్చి చెప్పుచున్నాను. స్నాపనము ముగియగనే తన దేహమునందు ‘న్యాసము' చేసి కొనుట ఉత్తమము. (13) ప్రతిమ యందు ఆయా స్థలములను స్పృశించినట్లుగనే న్యాస సందర్భమున స్వదేహభాగములనట్లు స్పృశింపవలెను. “ఓం హుం ఖషోల్కాయనమః” ఇది మూలమంత్రము (14) ఆదిత్యశబ్దములోని అక్షరములే ఈ దేవుని గూర్చి వివరింపుచున్నవి, ఓం కారమును శిరస్సుమీద, హుం కారకమును ముక్కు పైన (15) ఖ కారమును నొసటియందు, ష కారమును ముఖమునందు న్యాసము చేయవలెను. ల కారమును కంఠమున, క కారము హృదయ దేశమున న్యసింపవలెను. (16) య కారము ఎడమ భుజము పైనను, నకారము కుడి భుజము పైనను, మ కారము ఎడమ కడుపు పైనను, విసర్గను కడుపు కుడిభాగమునను న్యాసము చేయవలెను. (17) ఓం కారము నెప్పుడైనను జ్వాలల సమూహములచే చెల్లచెదురుగా నున్నట్లు భావింపవలెను. హుం కారమును శుద్ద వర్ణముతో ప్రకాశించునదిగను శుభమును కలిగించునదిగను ధ్యానించినచో చాలును (18) ఖ కారమును భిన్నాంజనమువలేను, తరుణ్ భాస్కరుని వలేను ప్రకాశించునదిగను ప్రాజ్ఞుడు భావింపవలెను. (19) 'షో' కారమును బంగారు వర్ణమున నుండు నదిగ భావింపవలెను, అ కారమును తెల్లదామర వర్ణము వంటి వర్ణముతో ప్రకాశించునదిగ చింతింపవలెను. (20) హీం కారమును జాజిపూవురంగుతోను, అన్నివర్ణముల కలయికగా, స కారమును పాలవంటి తెల్లని వర్ణము కలదానినిగా భావింపవలెను (21) న కారమును మంచుతో కూడిన మొల్ల పువ్వువంటి వర్ణమున శోభించునదిగ, హీం కారమును మెఱుపుతీగవంటి కాంతిగలదిగనులేక సర్వవర్ణ సమ్మేళనముగను భావింపవలెను. (22) సకారము పాలవలే తెల్లనిదిగ, న కారమును సర్వవర్ణ శోభితముగను. మకారమును బంగారు వర్ణముతో ప్రకాశించునదీగను భావింపవలెను.
తా॥ అప్పుడు ప్రసన్నమగుటకు సుముఖుడైయున్న మహాత్ముడు, సహస్రకిరణుడునైన సూర్యదేవుని సెజ్జ పై చేర్చవలయును (24) పిమ్మట బ్రాహ్మణులు కుండములయందు అగ్ని కార్యమును జేయుదురు. అరణి యందలి లౌకికమైన అగ్నినే జాగృతముచేసి (25) ప్రజ్వలింపజేసి సశాస్త్ర విధానముగ హవనము చేయవలెను. ఋగ్వేదీయుడు తూర్పు దిక్కునను, మాధ్యందిన శాఖీయుడు దక్షిణ దిక్కునను, (26) యుజుర్వేద శాఖీయుడు పడమర దిక్కున, అధర్వణ వేదీయుడు ఉత్తర దిక్కునను కుండమునందు హోమము చేయవలెను. భోజకుడు కుండము మధ్యభాగమున చేయవలెను (27) జమ్మి, మోదుగు, మేడి, ఉత్తరేను సమిధలతో పన్నెండు వేలు లేక ఎనిమిది వేలు, లేక నాలుగువేలు హవనము చేయవలయును (28) రెండువేలు, లేక మూడువేలు, అథవా ఒక వేయి యైనను చేయవలెను. “అగ్నిర్మూర్టా' మంత్రముతో కుండమునకు స్థల విభజనము చేయబడును (29) అదే మంత్రముతోను, 'అగ్నిందూతం' మంత్రముతోను త్రవ్వుట, తడుపుట చేయవలయునని చెప్పబడినది. 'సంబుధ్యస్వాగ్నే' మంత్రముతో గర్భాధానము చేయింపవలయును.
తా॥ సీమంత మహామంత్రముతోడను హవనము చేయవలెను. అట్లే జాతకర్మ, ప్రాణాయామము చెప్పబడినవి. (31) సమః స్వాహామంత్రముతో నామకరణము, అన్న ప్రాశనమంత్రముతో అన్నప్రాశనము చేయుట కాదేశింపవలేను (32) జ్యేష్ఠమగ్రే మంత్రముతో చూడా కర్మ, ప్రతబంధ మంత్రముతో వ్రత బంధమును చేయింపవలెను. సమావర్తనమున ఆకృష్ణన మంత్రముతో హోమము చేయవలయును. భార్యా సంయోజనమును స్వయముగ కల్పంపవలెను (34) అగ్నిహోత్ర కర్మలు, యజ్ఞ కర్మలు అన్నింటి యందును మహావాహృతి మంత్రముతో హవనము చేయవలయును (35) మాతృకా దేవతలకు, యజ్ఞ భూతములకు బలి కర్మ నిర్వర్తింపవలయును, ఈ అధివాసక కార్యక్రమమును సర్వకామనల సమృద్ధి కొఱకు చేయింపవలెను. (36)మూడు దీనములుగాని, ఐదు దినములుగాని లేక ఒక్కదినముగాని ఇది చేయింపవలెను. స్నానము చేయింపబడినది, చక్కగా అలకంరింపడినది, వివిధ మణులు, రత్నములు మొదలగు వానితో చేయబడిన ఆభరణములు ధరింపజేయబడినది (37) భక్త గణముచేత జాగ్రత్తగా రక్షింపబడుచుండినదియునైన సూర్యవిగ్రహమునిట్లు అధివాసనము చేయ వలెను. దేవాగారమునకు ఈ శాన్య దిగ్భాగమున దివ్యమైన మందిరమును (38) నిర్మించి అందు చక్కగా దర్భలుపరచి దాని పై శ్రేష్ఠమైన తెల్లని వస్త్రములు పరచి, తూర్పదిక్కునకు శిరస్సు నుంచి పరుండునట్లు తలగడ నలంకరించి అందమైన శయ్యను సిద్ధముచేయవలెను. (39) సూర్యమూర్తిని దాని పై పరుండబెట్టవలెను. సూర్యమూర్తికి కుడివైపున నిక్షుభను, ఎడమ భాగమున మహారాజ్ఞిని అలంకరింప జేయవలెను.
తా॥ సూర్య మూర్తి పాద ప్రదేశ భాగమున దండ పింగలకులను స్థాపింపవలేను ఏరాత్రి సూర్యమూర్తినట ప్రవేశ పెట్టిరో ఆరాత్రి అంతయునామూర్తినటనే ఉండునట్లు, నలువైపుల నుండియు భక్తు లాదేవుని స్తుతించుచుండునట్లు, చూడవలెను (41) బ్రాహ్మణుల చేత, వందిమాగధులచేత, సంగీతజ్ఞులచేత, చారణులచేత అన్నివైపుల నుండి స్తోత్రములు కీర్తనలు జరుగుచుండునట్లు చూడవలెను. (42) సూర్య భక్తి తత్పరులందరు ఆరాత్రి యంతయు జాగరణము చేయవలెను. రాత్రి తెల్లవారుట తోడనే ఋగ్వేద విధానముగా సూర్యదేవుని మేలుకొలుపవలయును (43) హవిష్యము స్వీకరింపగోరు భక్తులను, బ్రాహ్మణులను, భోజకులను దక్షిణాదులతో పూజించి, వారిచే స్వస్తి వాచనము చేయించి (44) నాభిస్థానమును (బండికంటి నడిమి తూమును) గర్భ గృహమునకు మధ్యగా వచ్చునట్లు అమర్చి, బంగారుతో చేయబడిన ఏడు గుఱ్ఱముల రథమును విధ్యుక్తముగ నట ఉంచవలెను. (45) విధాన విదుడైన యజమాని సర్వబీజములను, ఓషధులను ధరించి అర్ఘ్య ప్రదానముచేసి ఇతరుల సహాయముతో రథమును అచట స్టాపించవలెను. (46) శంఖధ్వాసములు, దుందుభి ధ్వనుల మధ్య సాక్షత జలధార విడువ వలెను. జయజయ శుభ నినాదములతో ఆలయమునకు ప్రదక్షిణమాచరింపవలెను. (47) శుభ తిధి వారనక్షత్ర, రవి హోరా ముహూర్తమున భాస్కర ప్రతిమను రధమునందు స్టాపింపవలెను. (48) క్రిందు ముఖము కాకుండ, ఊర్ధ్వముఖము కాకుండ, ప్రక్కకు వంగి యుండునట్లు కాకుండ, ప్రతిమను సమాభిముఖముగ నుండునట్లు స్థాపింపవలెను. (49) పత్నీమూర్తులను కూడా ఇరువైపుల చక్కగా నుండునట్లు స్థాపింపవలెను. నిక్షుభను రవికి కుడివైపున, రాజిని ఎడమవైపున నిలుపవలెను.
తా॥ వారికి కానుకల రూపమున సమర్పించుకొనుటకు-ముందే సేకరింపబడియున్న వివిధ సంభారములను అచట నమర్చి పెట్టవలెను. లడ్డువములు, యూషికలు (పప్పుకట్టులు) భక్ష్యవిశేషములు, చక్కిలములు బజ్జికలు, (51) పులగములు పాయసాన్నములు మున్నగు పదార్థములతో ఇంద్రాద్యష్ట దిక్పాలకులకు బలి పెట్టవలెను “దేవతలకు అధిపతివి, బలవంతుడవు, వజ్రాయుధమును చేత ధరించినవాడవు (52) శతమఖుడవునైన ఓయింద్రా! నీకు నమస్కారము' (అని వారివారి విశేషములతో ఆయా దిక్పాలదేవతలను స్తుతించుచు బలి పెట్టవలెను) 'త్రాతార మింద్రం' మంత్రముతో ఇంద్రునికి ఆవాహమగును (53) రక్తనేత్రుడు, జ్వాలామాలకలచే అలంకృతుడు, శక్తియను ఆయుధమును ధరించినవాడు, తీక్షమైనవాడు, అజవాహనుడు అయిన అగ్నిదేవునకు సమస్కారము' ఆగ్నేయ దిశయందు అగ్నిమంత్రముతో అగ్నికి ఆవాహన చెప్పబడినది (54) దండాయుధమును చేత ధరించినవాడు, నల్లనివాడు, మహిషము వాహనముగా గలవాడు, సూర్యపుత్రుడు నైన యమధర్మరాజుకు నమస్కారము (55) యమాయత్వా' మంత్రముతో యముని ముద్రలు చెప్పబడినవి. ఖడ్గహస్తుడు, నీల లోహిత వర్ణమున ప్రకాశించు శరీరముగలవాడు (56) సర్వబాహ్యవిషయముల కధిపతి, విరూపుడుగా ప్రసిద్ధినందిన వాడునైన నిరృతికీ నమస్కారము. 'ఆయంగౌః' మంత్రముచే నైరృతి దిక్కున నిరృతిని భావింపవలెను. (57) పడమటి దిక్కున వరుణ మంత్రముతో పాశహస్తుడైన వరుణుని భావింపవలెను. పంచనదులను సరస్వతీనదినీ మంత్రపూర్వకముగ ఆహ్వానింపవలెనని తెలియవలెను (58) ప్రాణాత్మకుడు, తపింపజేయువాడు, పరిశుద్దుడు, ప్రాణులను బ్రతికించువాడు, ధ్వజహస్తుడు, హయంకరుడనైన వాయుదేవునకునమస్కారము (59) అతని ఆవాహన యద్దేవాదేవ హేడనమ్ మంత్రముతో ననియెఱుంగవలెను గదా హస్తుడు, సోముడు, బలిమిగలవాడు నృగతుడు.
తా॥ గద, పట్టిశము (అడ్డకత్తి) ధరించినవాడు అయిన కుబేరునకు నమస్కారము ఈశావాస్యంచ గుహ్యా' అనునది కుబేర మంత్రము (61) నాలుగుముఖములు గలదేవుడు, పద్మాసనమున కూర్చుండువాడు. కృష్ణాజినము పై కూర్చుండువాడు, లంబోదరుడు (62) ప్రమథగణములకు అధిపతి, నీలకంఠుడు, శూలాయుధము ధరించువాడు విరూపాక్షుడు, రుద్రుడు, ముల్లోకములకు అధిపతియైన శివునకు నమస్కారము, అఖిత్వా శూరనో' మంత్రమును ఈ శానును కొఱకు భావింపవలెను (63) “సర్పము లన్నింటికి అధిపతి, తెల్లని వర్ణమున ప్రకాశించు శరీరముగలవాడు, వేయిపడగలు గలవాడు నైన అనంతునకు నిత్యమునమస్కరింతును” (64) 'నమో అస్తు సర్వేభ్యః' అను మంత్రము అనంతుని ధ్యానించుటకు చెప్పబడినది. పంచరాత్రాదులచేత అంగన్యాస కరన్యాసములు ప్రయోగింపబడును. (65) అప్పుడు ఆపై పాలవంటి ఉపపానీయములచేత స్తుతులు, స్తోత్రములచేతను భాస్కరదేవుని ప్రసన్నుని చేసికొని బ్రాహ్మణులకు భోజకులకు దక్షిణనీయవలెను. (66) మహాపుణ్యప్రదమైన ఈ సూర్యక్రతువును దక్షిణలు లేకుండగ ఎప్పుడును చేయకూడదు. ఇట్టి విధితో ఏ ప్రతిమ సూర్య భక్తులచే స్థాపింపబడునో (67) అది వారికి నిత్యము సాన్నిధ్యముననే ఉండి వారికి అభ్యదయాభివృద్ధికరమై ఒప్పారుచుండును. ఏడు జన్మలయందును వారిని ఏ వ్యాధులును పీడింపజాలవు (68) గంధ మాల్యోపహారములతో సూర్యాధి వాసోత్సవ కార్యక్రమమున పాల్గొనుటకు మూడురాత్రులు యాత్రచేసిన వారికి సూర్యలోక నివాసము ప్రాప్తించును. (69) తనదైనను లేక ఇతరుల దేవరిదైనను రవి ప్రతిమాస్థాపనము ఘటించిన వానికి స్వర్లోక ప్రాప్తియగును.
తా॥ పది అశ్వమేధయాగములు, వంద వాజపేయ యాగములు చేసిన ఫలమును సూర్య ప్రతిష్ట చేసిన పురుషుడు పొందును (71) సూర్యాలయ నిర్మాణముచేయు పుణ్యాత్ముని కీర్తి ఎంత కాలముండునో అంతకాలము అతడు సూర్యలోకమున సమ్మానింపబడును. (72) సూర్యస్థాపన చేసిన వాడు అన్ని లోకములయందును పూజింపబడునను మంత్రమేచెప్పబడినది. స్వర్గలోకము, భూలోకము, ఈ విశ్వమంతయు యజమానుని శ్రేయస్సు కొఱకే నిరంతరము నిలుకడగానుండును. సాంబా! అట్లే నీవును ఇట్టేపుణ్యకార్యము చేసి శాశ్వతత్వమును పొందుము (73) శాస్త్ర దృష్టమైన కర్మలవిధానముగ భక్తితో సూర్య స్థాపన చేసిన యెడల ప్రతి మాసమునందును ఆ క్రతుఫలమును పొందుదురనుటలో ఎట్టి సంశయములేదు (74) ఒక్కదినమైనను సూర్యపూజచేయుటచేత పొందేడి మహత్పలము నూరు క్రతువులుచేయుట చేతనైనను మానవులు పొందజాలరు (75) మహాపాపము చేసినవాడైనను, తదుపరి రవి దేవుని సేవించెనేని పాపములన్నియు పటాపంచలుగా ఆతడు సూర్యలోకమునకు బోవును (76) సూర్య మందిరము యొక్క ఇటుకలు చూర్ణము కానంత వఱకు మందిర నిర్మాత స్వర్గ సౌఖ్యములను అనుభవించుచుండును (77) జీర్ణాలయమును సంస్కరించి ఉద్ధరించువాడు పొందు ఉత్తమ ఫలము వేయిక్రడువులు చేయుట చేత కూడా లభింపదు (78) ఇసుకలో సూర్యాలయమును కట్టించిన వాడైనను-అది సూర్యదేవునకు ప్రియ సభా భవనమగుటచేత సూర్యానుగ్రహమును పొందగలడు (79) ఇట్లు ప్రాణుల సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన, దేవతాశ్రేష్ఠుడైన సూర్యభగవానుని ఆలయమును నిర్మించువాడు నూరు కల్పముల వఱకు సూర్యలోకమున నివసింపగలడు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున, సప్తమీ కల్పాంతర్గత సాంబోపాఖ్యానమున సూర్య ప్రతిష్టా వర్ణన మనెడు నూట ముప్పది యాఱవ అధ్యాయము సమాప్తము.
