భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
36. పంచమీ కల్పాంతర్గత శ్రావణిక నాగపంచమీ వ్రత వర్ణనము
తా॥ గౌతముడిట్లనెను. “మగపాము. ఆడపాము, పిల్లపాము, తల్లిపాము. మగతనము లేని పాము, వ్యంతర సర్పము కాటువేసినప్పుడు, దష్టుని లక్షణము లేట్లుండునో విడివిడిగా నాకు తెలియఁజెప్పుడు”. కశ్యపుడిట్లనెను. “ఇప్పుడు నాగుల రూపలక్షణములు, అవి కాటువేసినప్పుడు మనుష్యునిలోనేర్పడు మార్పులు సాకల్యముగా వివరింతును. పాము కఱచిన వానికి పైచూపు, లేక క్రిందుచూపు ఏర్పడును. కన్యాసర్పము కఱచిన యెడల దృష్టి ఎడమవైపునకు, కుమార సర్పము కఱచినచో దృష్టి కుడివైపునకు మరలును. కడుపుతోనున్న పాము కఱచిన చెమటపట్టును, ప్రసవించిన పాము కఱచిన రోమాంచము, వణుకు పుట్టును. నపుంసక సర్పము కాటువేసిన శరీరము మర్దించినట్లుండును. మగ పాము పగలు, ఆడపాము రాత్రి, నపుంసకసర్పము సంధ్యాసమయమున, ఎక్కువ విషముతో కూడియుండును. ఇది కశ్యపవాక్యము. చీకటిలో గాని, నీటియందుగాని, దట్టమైన అడవిలో గాని, నిద్రించియున్నప్పుడుగాని, ప్రమత్తుడైయున్నప్పుడు కాటువేసినగాని, కాటువేసినపాము కనబడకున్నగాని, పాముకాటు లక్షణములు తెలియకుండును. అట్టితటి వైద్య చికిత్స ఎట్లు సాధ్యమగును?. కశ్యపప్రజాపతి సర్పములను నాలుగు విధములుగా వింగండించెను. దర్వీకరములు, మండలులు రాజిలములు, వ్యంతరములు, అనునది ఆ విభాగము. దర్వీకరములు వాత స్వభావ విషము, మండలులు పిత్తస్వభావ విషము రాజిలములు శ్లేష్మస్వభావ విషము, వ్యంతరములు సన్నిపాత స్వభావ విషము గలవిగా చెప్పబడినవి. ()
తా॥ ఈ సర్పముల రక్తమును విడివిడిగా పరీక్షింపవలెను. దర్వీకరముల రక్తము నలుపు వర్ణములో ఎక్కువ తక్కువలుగాక సమముగానుండును. మండలీజాతి సర్పముల రక్తము ఎఱ్ఱగను, గాఢముగను, ఎక్కువగను ఉండును. రాజిలముల, వ్యంతరముల రక్తము పేరినట్లుండును. తక్కువగా కూడ నుండును. సర్పములిట్లు నాలుగు విధములుగనుండును.ఐదవ విధము ఉండదు. వీనిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదముచే నాల్గేసి విధములుగనుండును. బ్రాహ్మణ సర్పము కలచిన వానికి తీపిని, క్షత్రియ సర్పదష్టునకు చేదును, వైశ్యసర్పముచే కాటువేయబడిన వానికి తాండ్రను, శూద్రసర్పముచే కటువబడినవానికి సొంటి, పిప్పలు, విరియాలును ఈయవలెను. బ్రాహ్మణసర్పము కఱచిన వానికి అవయములలో 'మంట'పుట్టును. ప్రబలమైన మూర్చకలిగి తనను తాను గుర్తింప జాలని స్థితి యేర్పడును. ముఖము నలుపు వారును. మజ్జస్తంభించును. ఇట్టి స్థితిలో రోగికీ సుఖము కలిగించు ప్రతిక్రియ చేయవలెను. పెన్నేరు (అశ్వగంధ) ఉత్తరేను, వావిలి, వీనిని నేతితో బాగుగా మర్దించి త్రాగింపవలేను. పొడిని నస్యముగా పీల్పించవలెను. ఈ ఉపచారము చేత సర్పదష్టుడు సుఖము పొందును. క్షత్రియ సర్పము"కఱచిన వానికి అంగములలో వణుకు పుట్టును. మెదడు స్తంభించి మూర్చకలిగి తనను తాను గుర్తింపజాలని స్థితి యేర్పడును. వేదన కలుగును. ఊర్ధ్వ దృష్టి యేర్పడును. అట్టివానికి సుఖము కలిగించు ప్రతిక్రియ చేయవలెను. జిల్లేడు వేరు, ఉత్తరేను, పిప్పలి, పెద్దపొఁపర, వీనిని నేతిలో బాగుగా మర్దించి పానముగా, నస్యముగా నీయవలెను. దీనితో రోగికి శాంతి కలుగును.
తా॥ వైశ్య సర్పము కఱచిన వాని లక్షణములను వినుము. కఫము ప్రకోపించును. చొంగకారును. ప్రాణమెగబట్టును. మూర్ఛప్రబలమై తన్నుతాను మచిపోవును. అట్టి స్థితిలో రోగికి సుఖము కలిగించు చికిత్స చేయవలెను. అశ్వగంధ, దిరిసెన, జిల్లేడు, గృహధూమము, గుగ్గులు, మోదుగు, తెల్లనిదింటెన- ఇవి ఆవు మూత్రములో మర్దన చేసి పానముగా, నస్యముగా నుపయోగింపవలెను. ఇది వైశ్య సర్ప దష్టున కీయవలసిన యౌషధము. గౌతమా! ఇక శూద్రసర్పముచే కాటు వేయబడిన వాని లక్షణములను వినుము, దుర్గంధము పెరిగిపోవును. వణుకుచుండును, చలిజ్వరము వచ్చును. అవయవములలో 'చిమచిమ' పుట్టును, ఇది శూద్ర సర్పదష్ట లక్షణము. రోగి శాంతించు నౌషధము చెప్పెదను. తామర, లొద్దుగు, తేనె, తామర అకరువు, ఇప్పమూలగ, కల్లు, తెల్లదింటెన. వీనిని సమభాగములుగ తీసికొని చల్లని నీటిలో కలిపి మర్దించవలెను. దీనిని త్రాగించుట, ఒంటికిపూయుట, కన్నులకాటుకగా పెట్టుట, నస్యముగా పీల్పించుట చేసినచో దష్టుడు బాధనుండి ముక్తుడగును. బ్రాహ్మణ సర్పము పూర్వాహ్లమున, క్షత్రియసర్పము మధ్యాహ్నమున, వైశ్యసర్పము మూడవజామున శూద్రసర్పము సాయంకాలమునచరించుచుండును. బ్రాహ్మణ సర్పములు గాలి, పుష్పములు, క్షత్రియ సర్పములు ఎలుకలను, వైశ్యసర్పములు కప్పలను శూద్ర సర్పములు అన్నింటిని ఆహారముగా తీసికొనును.
తా॥ బ్రాహ్మణ సర్పములు ముందు భాగమున, క్షత్రియ సర్పములు కుడివైపున, వైశ్యసర్పము లెప్పుడును ఎడమవైపున, శూద్ర సర్పములు వెనుకవైపున కాటు వేయుచుండును. మహావిష సర్పములు, మదించిన కాలమున, పీడ్యమానములై, మైధునేచ్చ మిక్కుటమగుటచేత అకాలమున కాటు వేయుచుండును. పుష్ప పరిమళము గలవి బ్రాహ్మణ సర్పములు. చందనపు సువాసన గలవి క్షత్రియ సర్పములు, నేతి వాసన గలవి వైశ్య సర్పములు. చేపల వాసన గలవి శూద్రజాతి సర్పములని తెలియవలెను. క్రమముగా వాని నివాస స్థానములను గుఱించి చెప్పెదను. పెద్దబావులయందు, చేదబావులయందు, చెఱువులందు, కొండలందలి సెలయేటి యూటలందును, గ్రామద్వారములందు, నలుత్రోవల కూడలులయందును బ్రాహ్మణ సర్పములు నివసించుచుండును. పవిత్రములైన తోటలయందు, శుభ్రమైన గృహములందు, గుడులలోను, తోరణముల పైన, సరస్సులలోనను క్షత్రియ సర్పములు వాసము చేయుచుండును. శ్మశానములందు, బూడిద కుప్పలయందు, వరి గడ్డి గల తావులందు, ఒడ్డులందు, ఆవులమందల దాపులలోను, దారులందును, చెట్ల పైనను వైశ్యసర్పములుండును. అపవిత్ర స్థలములందు, జనసంచారము లేని అడవులలోను, మనుష్యులుండని పాడుబడిన యిండ్లలోను, శ్మశానములందును శూద్రసర్పములు వసించుచుండును. తెల్లనివి, గోరోజనము వంటి వన్నెగలవి, అగ్నివలె ప్రకాశించునవి బ్రాహ్మణ సర్పములు. ఇవి సాత్వికమైన మంచి స్వభావము గలవిగా బుధులచే చెప్పబడును. ఎఱ్ఱనివి, బంగారు వన్నెగలవి, పగడపు వర్ణముగలవి, మణులవలె ప్రకాశించునవి, సూర్యుని తేజస్సువలె మెఱయునవి క్షత్రియ సర్పములు. వివిధములైన చిత్రరేఖలు గలవి, నూనెయగిసే వన్నెగలవి, నల్లగోరింట పువ్వు వన్నెవంటి వన్నె గలవి, వైశ్యసర్పములు.
తా॥ శూద్రసర్పములు కొన్ని కాకి కడుపు వర్ణమునను, కొన్ని కాటుక వన్నెలోను, మఱికొన్ని కాకి రంగులోను, ఇంకను కొన్ని పొగవన్నెలోను ఉండును. పాముకాట్లు అంగుళము మేరయున్నచో అది పిల్లపాముకాటనియు. రెండంగుళముల అంతరముతోనున్న యువకసర్పపు కాటనియు. రెండంగుళములు న్నర మేరలోనున్నచోనది వృద్ధసర్పపు కాటనియు కశ్యప వాక్యముననుసరించి గ్రహింపవలెను. అనంతుడు ముందుకు, వాసుకి ఎడమవైపు, తక్షకుడు కుడివైపు, కర్కోటకుడు వెనుకవైపు, దృష్టికలిగియుందురు. పద్ముడటునిటు తిరుగుచుండును. మహాపద్ముడు స్నానమాడుచుండును. శంఖపాలుడు మఱల మఱల సైగలు చేయుచుండును. కులికుడను పన్నగోత్తముఁడివియన్నియు చేయుచుండును. అనంతుడు తూర్పు, వాసుకి ఆగ్నేయము. తక్షకుడు దక్షిణము, కర్కోటకుడు నైరృతి, పద్ముడు పడమర, మహాపద్ముడు వాయవ్యము, శంఖపాలుడుత్తరము, కంబలుడు ఈశాన్యమునకును అధిపతులు. అనంతునికి పద్మము, వాసుకికి ఉత్పలము, తక్షకునకు స్వస్తికము, కర్కోటకునకు పంకజము. పద్మునకు పద్మము, మహాపద్మునకు శూలము, శంఖపాలునకు ఛత్రము, కులికునకు అర్ధచంద్రుడు చిహ్నములు.
తా॥ అనంతుడు, కపిలుడు బ్రాహ్మణులు; శంఖుడు, వాసుకి క్షత్రియులు; మహాపద్ముడు తక్షకుడు వైశ్యులు; పద్ముడు కర్కోటకుడు శూద్రులు. అని తెలియవలెను. అనంతకులికులు తెల్లనివారు, బ్రాహ్మసంభవులు వాసుకి, శంఖపాలుడు ఎఱ్ఱనివారు వీరు అగ్నిసంభవులు. తక్షకుడు, మహాపద్ముడు కొంచెము పసుపువన్నెగలవారు (ఇంద్రసంభవులు) పద్మకర్కోటకులు నల్లనివారు (యమసంభవులు). గుఱ్ఱము, రధము, ఎద్దు, గొడుగు, రాజు, అగ్ని, భూమి చిహ్నములను కల్పించి ధరించినచోనవి సిద్దిప్రదములని బుధుల అభిప్రాయము. పూర్ణకుంభ, ధ్వజ చిహ్నములు, బంగారము, మణులు, దిరిసేన, మాణిక్యము కంఠమునందు ధరించిన దీర్ఘాయువులగుదురు. వీని దర్శనము కూడా శ్రేష్టమైనది. సంతానమును కనగల కన్య లభించును. అరువది నాలుగు సర్పజాతులుండునని చెప్పబడినది. వానిలో ముప్పదియాఱు జాతులు కనపడకుండును. ఇరువది యెనిమిది జాతులు భూమి పై తిరుగుచుకనపడుచుండును. (ముప్పది యాంటీలో రెండు జాతులరుదుగ కనుబడుచుండును.). ఇందు దాదాపుగా నిరువది స్రగ్విణులు, ఏడు మండలులు, పది రాజిలములు, ఇరువది యొకటి దర్వీకరములుగా విభజింపనగును. దుందుభములు, డుండుభములు, చేటభములు, చంద్రవాహనములు, పొన్న పూవు వన్నెగలవి విషములేని సర్పములు, ఈ విధముగ పాములు నూట తొంబది రెండు, విధములుగ చెప్పబడినవి. వరాహకర్ణి, గజపిప్పలి, గంజాయి, పిప్పలి, దేవదారు, ఇప్ప(మధూకసారము), వావిలి, ఇంగువ-వీనిని మెత్తగా పిండిచేసి గుండ్రని మాత్రలుగా చేసియుంచుకొనవలెను (ఇది సర్పవిషమును హరించునౌషధము)”. సుమంతుముని యిట్లనెను. “ఈ విషయములన్నింటిని పూర్వము కశ్యపప్రజాపతి గౌతమునకు చెప్పి యుండెను అన్నివిధములైన సర్పముల లక్షణములు, రూపములు, వర్ణములు, విషములు, మొదలగు వివరములన్నింటిని వివరించియుండెను. అందువలన ఎల్లప్పుడును-ముఖ్యముగా పంచమితిథులలో పాలు, పాయసము నైవేద్యములతో నాగులను పూజింపవలెను. శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి దినమున ద్వారమున కిరువైపుల నావు పేడతో సర్పాకృతులను లిఖింపవలేను. పెరుగు, గణిక, అక్షతలు, దర్భ, గంధము, పుష్పములు, వివిధములైన ఉపహారములు, బ్రాహ్మణసంతర్పణలు మున్నగు వానిచే చిత్రీకృత సర్పములు గల ద్వారమును యధావిధిగ పూజింపవలేను. నాగపంచమి నాడు భక్తిపురస్సరముగ నాగులను పూజించువారికి ఎప్పుడును సర్పభీతియుండదు.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కల్పాంతర్గత " శ్రావణిక నాగపంచమి వ్రత వర్ణసమను పేరుగల ముప్పది యాఱవ అధ్యాయము సమాప్తము.
