భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
31. చతుర్థీ కల్పమునందలి సుఖావహాంగారక చతుర్థీ వ్రత నిరూపణము
తా॥ సుమంతుముని యిట్లనెను. రాజా! శివా, శాంతా, సుఖా అని చతుర్ధి తిథి మూడు విధములుగ నున్నది. భాద్రపద శుక్ల చతుర్థి “శివ యను పేరుతో లోక పూజితమైనది-1. ఆ దినమున స్నానము, దానము, ఉపవాసము, జపము చేయువానిని విఘ్నేశ్వరుని అనుగ్రహము నూఱురెట్లు తోడై సహకరించును-2. బెల్లము, ఉప్పు, నేయి దానము చేయుట శుభకరము. బెల్లపు భక్ష్యములతో బ్రాహ్మణులకు అన్నదానము చేయుట పుణ్యప్రదము-3. ఆ దినమున బెల్లము, ఉప్పు, "భక్ష్యములతో గణపతిని పూజించుస్త్రీలు అత్తమామల ప్రేమను చూరగొందురు-4. ఆతని దయవలన వారందఱు సౌభాగ్యవతులగుదురు. ముఖ్యముగా కన్యలు ఆ దేవుని ఈ విధముగ పూజింపవలెను-5. ఇట్లు శివా కల్పమున గలదు) సుమంతుముని మఱల నీట్లనెను. మాఘమూసమునందలి శుక్ల చతుర్థి 'శాంత' యనబడును. ఎల్లప్పుడు శాంతి నిచ్చునదైయుండును-6. ఆ దినమున స్నానాదానాది కర్మలాచరించువారికి వినాయకుని ప్రసాదము చేత వేయి రెట్లు ఫలము లభించును-7. ఉపవసించి విఘ్ననాయకుని యథావిధిగ పూజించి హోమాదికము నిర్వర్తించుచో వేయింతలు ఫలము లభించును-8. ఉప్పు, బెల్లము, శాకము, బెల్లపు భక్ష్యములు బ్రాహ్మణులకు దానము చేసినచో వేయింతలు ఫలము కలుగును-9. ముఖ్యముగా స్త్రీలు గుడలవణ ఘృతములతో గురువును పూజించినచో వారు సౌభాగ్య వతులగుదురు-10. ఇట్లు శాంతా కల్పమునగలదు.
తా॥ మూడవ విధమైన చతుర్థి సుఖావహమైనది. మంచి సుఖములనిచ్చునది. సౌభాగ్యములు సమకూర్చునది-11. ఈ సుఖదాయకమైన చతుర్థి, రూప సౌభాగ్యముల నిచ్చునది. శుభములు గూర్చునది. సుఖాచతుర్థి వ్రతము మహాపుణ్యఫలము నిచ్చునది. అందమైన స్వరూపమును సంపదలను కలుగ జేయునదియునై యున్నది కురుశార్దూలా! చతుర్జీతిథి రూపసౌభాగ్యములనిచ్చునది. శుభంకరము-12. పుణ్యమును సుఖమును, ధన్యతను కలిగించు నీవ్రతము సుకరముగా చేయుటకు వీలైనది. సూక్ష్మమైనది. పరలోక ఫలమునిచ్చునది, ప్రకాశవంతమైన ఆకృతినిచ్చునది-13. మనోజ్ఞమైన నవ్వు, సుఖావహమైన ప్రవృత్తి, విలాసవంతమైన బాహువుల త్రుళ్లింత, నడక, హావభావములు సమకూర్చునది-14. సుఖా వ్రతము ననుష్ఠించు వారందఱికిని సుఖము కలుగును. శివ పార్వతుల కుమారుడైన విఘ్నేశ్వర దేవుని పూజా కార్యమువలన నీ ఫలము కలుగును-15. ఏమాసము నందైనను శుక్ల పక్షచతుర్ధి మంగళవారముతో కలిసి వచ్చినప్పుడు అట్టిదినము “సుఖదా' లేక 'సుఖా' అని తెలియవలెను-16. పూర్వకాలమున హిమాచలమున రతి కేళిలోనున్న ఉమామహేశ్వరుల నుండి రక్తబిందువొకటి నేల పై జారిపడెను-17. ఆబిందువును సుఖప్రయత్నముతో భూమి ధరించెను. ఆమెకు ఆరక్తము నుండి ఎఱ్ఱని వర్ణము గల కుజుడు జన్మించెను-18. నా అంగము నుండి యితడు జన్మించినందున అంగారకుడగును. అంగములనిచ్చువాడు, అంగములకు ఉపకారము చేయువాడు. మానవులకు అంగవైకల్యము కలుగకుండ కాపాడువాడు-19. సౌభాగ్యాదికములు కలిగించువాడు కావున అంగారకుడని చెప్పబడును. చతుర్దినాడు శ్రద్ధాభక్తులతో రాత్రి ఉపవసించి-20. అనన్య మనస్కుడైన పురుషుడైనను స్త్రీయైనను (ఉపవసింపక) ఎఱ్ఱని పుష్పములతో ఎఱ్ఱని విలేపనములతో కుజుని పూజింప వలెను.
తా॥ శ్రద్దాన్వితుడై మొదట గణేశ్వరుని భక్తితో పూజించినచో అతడుసంతుష్టుడై సౌభాగ్యమును, రూపసంపదను ఇచ్చును-22. యధావిధిగ స్నానముచేసి, మొదట సంకల్పము చేసి కొంత మట్టిని తీసికొని ఈ మంత్రముతో దానికి నమస్కారము చేయవలెను-23. పూర్వము నీవు విష్ణుదేవునిచేత ఉద్దరింపబడి గౌరవము పొందితివట. నా పూర్వ సంచితమైన పాపము దహించి వేయుము”-24. ఈ మంత్రమును చదివి ఆమృత్తికను సూర్యునకు చూపవలెను. సూర్యరశ్మిచేత పవిత్రమైన ఆ మృత్తికపై గంగా జలమును చల్లి-25. దానిని తల పైనను అవయవములన్నింటి పైనను రాచుకొనవలెను. ఆపిదప మంత్ర పూతమైన జలముతో స్నానము చేయవలెను-26. ఓ ఉదకములారా! మీరు దేవదైత్య దానవాదులకు, స్వేదజ, అండజ, ఉద్భిజుముల కును, సర్వజీవకోటికిని జన్మకారణములు. రసాధిపతులైన మీకు నమస్కారము"-27. నేను అన్ని పుణ్యతీర్ధములలోను, సెలయేళ్ళలోను, చెఱువులలోను, మానసాది సరోవరములలోను-28. నదులలోను, దేవతల పుష్కరుణులలోను, స్వచ్ఛమైన జలముగల మడుగులలోను స్నానము చేసిన వాడనగుచున్నాను.” ఇట్లుధ్యానించుచు పై మంత్రమును పఠించుచు స్నానముచేయవలెను-29. స్నానమాడి శుచియై, గృహమునకేతెంచి దూర్వాదులను స్పృశింపవలెను. గజిక, రావిచెట్టు, జమ్మిచెట్టు, ఆవు వీనిని సమంత్రకముగా ముట్టుకొన వలెను.
తా॥ పరిశుద్ధమైన ప్రదేశమున మొలచిన గజికకు నమస్కరింపవలెను “ఓ దూర్వా! నీవు అమృతస్వరూపిణివి. అందజిదేవతల నమస్కారము లందుకొనుదానవు-31. నేను నీకు నమస్కరించున్నాను. నాచేత చేయబడిన పాపమును దహించివేయుము”-32. రాజా! ఇక శమీ మంత్రమును చెప్పుచున్నాను వినుము. ఓ శమీ వృక్షమా!) నీవు పవిత్రులలో పవిత్రమైన దానవు. శ్రుతి యందు కాశ్యపియని ప్రఖ్యాతి నందిన దానవు. నా పాపమును శమింప జేయుము. కొండలన్నియు నీకుతెలియును."-33. ఇక రావి చెట్టును స్పృశించు మంత్రమును చెప్పుచున్నాను తెలిసికొనుము. నా కన్నులదరుటచే కలుగ బోవు దుఃఖమును చెడుకలను, చెడు ఆలోచనను, నాయెడ శక్తుల దుష్ర్పయోగములను నీవు సహించుకొనుము"-34. ఈ మంత్రమును పఠింపుచు రావి చెట్టును స్పృశింపవలెను. అప్పుడు గోమాతకు ప్రదక్షిణముచేసి స్పర్శచేయవలెను. చేతితో స్పృశించి ఈ మంత్రమును ఉచ్చరింపవలెను-35. “ఓదేవీ! నీవు సర్వదేవతా స్వరూపిణివి. మునులచే కూడ పూజింపబడినదానవు. అందువలన నేను కూడ నిన్ను సృశించుచున్నాను. నీకు నమస్కరించుచున్న నా పాపములను నాశమొనరించుదానవు కమ్ము"-36. ఈ మంత్రమును పఠించుచు శ్రద్దాభక్తులతో ఆవుకు ప్రదక్షిణము చేసిన వానికి భూప్రదక్షిణ చేసిన ఫలము కలుగును. సందేహము లేదు-37. ఈ విధముగ గోప్రదక్షిణాంతరము అగ్న్యాగారమునకు పోవలెను. పాదప్రక్షాళనము చేసికొని ఆచమనము చేసియే అగ్నిగృహమున ప్రవేశింపవలెను. అచట ఈ మంత్రపదములతో హోమము చేయవలెను-38. శర్వాయ, శర్వపుత్రాయ, క్షోణ్యుత్సంగభవాయ, కుజాయ, లలితాంగాయ, లోహితాంగాయ”-39. ఈ మంత్రములను ఓంకారపూర్వకముగ, స్వాహాకారయుక్తముగ నూటయెనిమిది పర్యాయములుగాని, అందుసగము గానీ, ఆసగములో సగముకానీ, పఠింపుచు ఆహుతులీయవలేను.
సుమంతురువాచ :
తా॥ ఈ మంత్రములతో, శక్తిననుసరించి, కోరికననుసరించి, చంద్రసమిధలు నేయి, పాలు, యవలు, తిలలతో-41. వివిధములైన భక్ష్యములు, ఇంకను ఇతరములైన ఖాద్యములతో ఆహుతులనిచ్చి దేవునిని భూమిపై స్థాపింపవలెను-42. బంగారముతోగాని వెండితోగాని లేక శక్తి కొలది దేవదారు కం తో గాని లేక ఇతరమైన కణతోగాని చందనపు కమల తోని కుజుని విగ్రహము చేయింపవలేను-43. దానిని రాగి పాత్రలోగాని వెండి పాత్రలోగాని ఉంచి, నేయి, కుంకుమపువ్వు అకరువులు ఇతరమైన ఎఱ్ఱని వస్తువవులు, పుష్పములు, పత్రములు, ఎఱ్ఱని పండ్లు, మొదలైన వస్తువులతో శక్త్యనుసారము పూజింపవలెను-44. ధనవంతుడు ఎంత ధనమును వ్యవము చేయునో అంతపుణ్యము వృద్ధియగును. దాతయొక్క దాతృత్వమునకు వందవేల రెట్లు పుణ్యము లభించును-45. కొందఱు రాగిపాత్రయందు, వెదురు పాత్రయందు మట్టిపాత్రయందు శక్తికొలదిగ కుంకుమకేసరములతో పురుషాకృతిని చేసి పూజించుచున్నారు. కుజుని ఈ మంత్రములతో పూజింపవలెను. “అగ్నిర్మూర్థా..” అను మంత్రముచేత గంధపుష్పాదులు ధూపదీపాదులు సమర్పించి, పూజించి, విధిపూర్వకముగా విగ్రహమును బ్రాహ్మణునకు నీయవలెను-46. దరిద్రుడైనను ధనవంతుడైనను తమ శక్తిని చూచి గుడాన్నము నేయి, పాలు, గోధుమలు, శాలిబియ్యము, దానమీయవలెను-47. ధనము వలసినంత కలిగియున్నప్పుడు లుబ్దత్వము కూడదు. విత్తశాఠ్యముచేయువానికి పరలోక ఫలములుండజాలవు”-48. శతానీకుడిట్లనెను. మంగళవారముతో కూడిన చతుర్థి దినమున రాత్రిభోజనములతో ఉపవసింపవలెను కదా! ఇడ్లాన్ని పర్యాయములు ఏక భుక్తముతో నుండలేను”-49. సుమంతుముని ఇట్లనెను. ఇచట చతుర్దాయనగా మంగళవారముతో కూడినదేయని గ్రహింపవలెను. ఆయా చతుర్దులయందు ఉపవాసము చేసి విధిననుసరించి బెల్లము దానమీయవలెను.
తా॥ మంగళవారముతో కూడిన నాలుగు చతుర్థి తిథులయందు రాత్రి వినా ఉపవసించి, అట్టి ప్రతి చతుర్థియందును ఆచరింపవలసిన విధానమును వినుము-51. బంగారముతో అంగారక, వినాయక మూర్తులను చేయవలెను, ముఖ్యముగా పది, లేక అందులో సగము, లేక ఆ సగములో సగము కొలదుల బంగారముతో అట్టి విగ్రహములను చేయవలెను-52. బంగారు పాత్రలోగాని, వెండిపాత్రలో గాని, రాగి పాత్రలోగాని ఆ విగ్రహములను ప్రతిష్టింపవలెను. ఆ పాత్ర ఇరువది పలముల, లేక పది పలముల తూకము కలిగియుండవలెను-53. లేక ఇరువది కరములు, లేక అందు సగము, కాకున్న ఆసగమున సగము తూకము కలిగియుండలేను. (పలము అనగా నాలుగు కరముల యెత్తు, కరమనగా పదునాఱు మాషముల యెత్తు, పలమునందు మూడవ భాగము తులము) వెండియైనచో పలములలో చేయింపవలెను. కాన పలముగానీ, అందుసగము గాని, అందుసగముగానీ తూకము కలిగియుండవలెను-54. శక్త్యనుసారముగ, భక్తిననుసరించి రాగిపాత్రయందైనను కుజుని ప్రతిష్ఠించి నూతన వస్త్రములతో ఆగ్రహేశుని అలంకరింపవలెను. వివిధములైన ఎఱ్ఱని వస్తువులుతోను, పుష్పములతోను పూజింపవలెను-55. ఆ పిదప గుణవంతుడు, పండితుడునైన బ్రాహ్మణునకు దక్షిణతో సహా ఆ విగ్రహములను, పాత్రను (గుడమును) దానమీయవలెను. ఇది యజమాని శ్రేయస్సుకొఱకు చేయవలెను-56. ఇట్లు తిథులలో నుత్తమ తిథియగు చతుర్థి గుఱించి నీకు చెప్పితిని. ఈ తిథియందుపవాసాదులు చేసిన వారికి దివ్యమైన రూపము కలుగును-57. కాంతి విషయమున చంద్రునితోను, తేజస్సు విషయమున సూర్యునితోడను సమానమైన వాడగును. ఇట్లు రవి ప్రభుడు, వాయుబలుడును అగును-58. రాజా! ఇట్టి రూపమునంది, పిదప కుజలోకమునకుఁ బోవును. గణనాయకుని ప్రసాదము వలన రూపసౌభాగ్యము, కుజలోక ప్రాప్తియును ఘటించును-59. ఇది చదివిన వారికి, వినిన వారికి, ముఖ్యముగా చేసిన వారికి బ్రహ్మహత్యాది పాపములు నశించుననుటలో సందేహములేదు. అంతీయకాక సర్వసంపత్సమృద్ధియు, ఐశ్వర్యమును కలుగును.
శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పమునందలి సుఖావహాంగారక చతుర్థి వ్రత నిరూపణమను ముప్పదియెకటవ అధ్యాయము సమాప్తము. (చతుర్ధికల్పము కూడనిట సమాప్తమైనది)
