భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
55. రథ సప్తమి కల్పమున రథయాత్రా వర్ణనము
తా॥ రుద్రుడిట్లనెను. “భూలోకమునందలి మానవులు సూర్యుని రథయాత్రనేట్లు నిర్వహింపవలెను. అది నిర్వహించిన వారికెట్టి ఫలము కలుగును. దాని విధానమేమి? ఏకాలమున చేయవలెను? రథారూఢుడైన సూర్యదేవుని నేట్టూరేగింపవలెను?. సూర్యరథమును త్రిప్పువారికి, లాగెడివారికి, రథయాత్రలో నృత్యము చేయువారికిని, రథముతోఁబాటు నడచువారికి, నాట్యములాడెడువారికి, పాటలుపాడువారికి, భక్తిశ్రద్ధలతో జాగరణ చేయువారి కేట్టి ఫలములు కలుగును?. రథమునిచ్చువారికి, బలి, ఆహారము, దైనందిన నైవేద్యములిచ్చువారికే ఫలములు కలుగును?. ఈ విషయములను గూర్చి నాకు సవిస్తరముగ చెప్పుడు. నాకు మిక్కిలి కుతూహలముగనున్నది. అంతీయగాక దానివలన లోకోపకారము కూడా జరుగును.” బ్రహ్మదేవుడిట్లు పలికెను. “భూతేశా! లెస్సగ ప్రశ్నించితివి. త్రిలోచనా! నీవు భూతగణముల కీశ్వరుడవు కదా! నీవడిగిన విషయములనన్నింటినీ క్రమముగ వివరింతును. సావధాన మనస్కుడవై వినుము. మహాత్ముడైన భాస్కరదేవుని రథయాత్ర, ఇంద్రోత్సవము ఈ రెండును నాచే కీర్తింపబడినవి. ఈ రెండును మర్త్యలోకమున శాంతి కలుగుటకు ప్రవర్తింపజేయబడినవి. సూర్యదేవుని రథయాత్ర, ఇంద్రోత్సవము ఏ దేశమునందు జరుపబడుచుండునో. అచట రాజులకు సంబంధించిన యుపద్రవములు, దొంగలవలని భయము ప్రజలకు కలుగకుండును. కాబట్టి దుర్భిక్షశాంతికై ప్రజాజీవనము సుఖమయమగుటకై ఇవి రెండును చేయవలెను.
తా॥ భాద్రపదమాస శుక్లపక్ష సప్తమి దినమున సూర్యదేవునకు నేతితో నభ్యంగనము చేయవలెను. పంచగవ్యముతోను. ఆవాలతోను, గ్రహేశ్వరుడు, జగన్నాథుడు, బంగారుఛాయతో నుదయించెడువాడునైన సూర్యదేవునకు ప్రతిదినము శ్రద్దతో అభ్యంగనము చేయువాడు. కింకిణీయుక్తమగు బంగారపు రథమునెక్కి, గంధర్వాప్సర శోభితము, దీవ్యమునగు అగ్నిలోకమునకుఁ బోవును. చక్కెరతో కలిపిన శాల్యన్నము, శొంఠితోకూడిన ఉసిరిక, చిత్రాన్నము ప్రతిదినము సూర్యునకు నైవేద్యమిడువాడు. వెలుగులు విరజిమ్ము దివ్య విమానము నెక్కి, మహరులతో కొనియాడబడుచు నాలోకమునకు పోవును. అందుచే పూనికతో సూర్యదేవునకు చిత్రాన్నమును నివేదింపవలెను. ఘృత పక్వము, శర్కతో చేసిన పక్వాన్నము, మెత్తని లడ్డువములు, పాలు, దధ్యోదనము, పాయసము, సారెసత్తులు, బెల్లపు భక్ష్యములు సూర్యునకు సమర్పించినవారు నిస్సందేహముగ నా లోకమునకు బోవుదురు. ప్రతిదినము భక్తితో సూర్యదేవుని యభ్యంగమునకై ఘృతము నిచ్చువాడు పరమగతిని పొందును. అటులే నిత్యమును భక్తితో చిత్రాన్న నివేదనము చేయువాడు ఐహిక భోగములన్నింటిననుభవించి శివలోకమునకుఁబోవును.
తా॥ సూర్యదేవునకు నలుగుపిండి నిచ్చినవాడు పరమస్థానమైన సూర్యలోకమునకుఁబోవును. పుష్యమాసశుక్లపక్ష సప్తమినాడాదేవదేవునకు విధి పూర్వకముగ అభిషేకము చేయవలెను. అది యెట్లు చేయవలెనో చెప్పెదను. సావధానుడవై వినుము. వేదోక్త విధానముగ సూర్యప్రతిమను స్థాపింపవలెను. పుణ్యతీర్దోదకము లేక ఏదేని పవిత్రజలాశయమునుండీ స్వచ్చమైన జలముఁ గొని రావలెను. పుణ్యతీర్ధముల నామములను మనస్సున సంస్మరించుచు తెచ్చిన ఉదకమునందు తత్తత్తీర్ధజలభావన చేయవలెను. ప్రయాగ, పుష్కరము, కురుక్షేత్రము, నైమిశము. పృథూదకము, చంద్రభాగ, శోణ, గోకర్ణము, బ్రహ్మావర్తము, కుశావర్తము, బిల్వకము, నీలపర్వతము. గంగాద్వారము, గంగాసాగరము, కాలప్రియము, మిత్రవనము, శుండీరక్షేత్రము. చక్రతీర్ధము, రామతీర్థము, వితస్త, హర్షపంథ, దేవిక. గంగ, సరస్వతి, సింధు, నర్మద, విపాశ, యమున, తాపీ, శివ, వేత్రవతి. గోదావరి, పయోష్టి, కృష్ణ, వేణ్యా, శతరుద్ర, పుష్కరిణి, కౌశికి, సరయు. మొదలగు పుణ్యతీర్ధములు, సముద్రములు, పుణ్యాశ్రమములు, క్షేత్రములు-వీటినన్నింటిని సన్నిధిలోనున్నట్లు భావన చేయవలెను.
తా॥ ఇట్లు స్నాన విధిని నిర్వర్తించి పూజించి, నమస్కరించి, ధూపము, అర్ఘ్యమునిచ్చి, మూడురాత్రులుగాని, ఏడురాత్రులుగాని, ఒక మాసము వఱకుగాని, మాసార్థము వఱకు గాని సూర్యప్రతిమను అభిషేక స్థలమున నధివాసము చేయింపవలెను. అట్లు స్నానగృహమున నుంచబడిన సూర్యమూర్తిని భక్తితో పూజింపవలేను. ముంగిట వేదికను చతురస్రముగనమర్చి, శుభ్రముగా నలికి ముగ్గులు పెట్టి, నలువైపుల రజిత కుంభములనలంకరించిన మేలుకట్టును నిర్మింపవలెను మాఘమాస కృష్ణపక్ష సప్తమినాడు యథావిధిగ నగ్నికార్యము చేసి బ్రాహ్మణులకన్న దానము చేయవలెను. శంఖ భేరీ నినాదములతో, వేద ఘోషలతో, పుష్కలమైన పుణ్యాహవాచన మంత్రఘోషలతో బ్రాహ్మణులచే స్వస్తివాచనము చేయింపవలెను, అప్పుడు పరమాత్ముడైన సూర్యభగవానుని యందలి భక్తిత్పార్యములతో, చీటుగంటల తోరణములతో సుందరముగ నలంకరింపబడిన అందమైన రథముపై సూర్యదేవుని నిలిపి మహోత్సవ పురస్పరముగ నూరేగింపవలయును. మాఘమాస శుక్లపక్షమున కూడ యథావిధిగ హవనాదులు నిర్వర్తించి బ్రాహ్మణ భోజన సంతర్పణల యనంతరము సూర్యరథయాత్ర చేయనగును. సర్వజనులను భోజన దక్షిణాదికములతో సంతృప్తిపఱచి, దేవతలను వాక్శుద్దిగల బ్రాహ్మణులను పూజించి ఇతిహాసపురాణ ప్రవక్తయైన బ్రాహ్మణోత్తముని, ఇష్టదైవమును భక్తి శ్రద్ధలతో పూజించి రథయాత్రకుపక్రమింపవలెను. మాఘశుక్ల పంచమినాడు ఒక పూట భోజనము చేయవలెను. చతుర్థినాడు ఆయాచిత భోజనము, షష్ఠినాడు రాత్రి భోజనము చేయవలెను.
తా॥ సప్తమినాడు ఉపవసించి రథమునలంకరించి దానిముందు హవన కార్యక్రమమును నిర్వర్తింపవలేను. షష్ఠినాడు రాత్రిసమయముననే రథమును రథశాల నుండి తీసి నిలిపియుంచవలెను. దానికి ముందే దేవ బ్రాహ్మణ వాచకాది పూజా భోజనములు పూర్తిచేసి యుండవలెను. మాఘశుద్ధసప్తమినాడు భూత భావనుడైన సూర్యభగవానుని మూర్తిని రథము పైనధిరోహింపజేసి ఆ రథమునాదినమంతయును దేవాలయము ముందటి భాగమున నిలిపియుంచవలెను. రథస్టుడైన యా దేవుని సమక్షమున వివిధ నృత్యవాద్యగీతములతో, దీపమూలికలతోను, అలంకరణలతోను రాత్రియంతయు జాగరణము చేయవలెను. శంఖతూర్యాది నినాదములతో, పుష్కలమైన వేదఘోషలతోను, భక్తిప్రపత్తులతోను, మేలుకొని యుండవలెను. అష్టమినాడు రథస్థుడైన సూర్యదేవుని శంఖభేరి నినాదముల యుక్తముగ నగరము యొక్క ఉత్తర ద్వారము వఱకు అటుమీదట తూర్పు, దక్షిణములమీదుగ పశ్చిమోత్తరములు ఊరేగించి యథాస్థానము చేర్పవలెను. ఇట్లు ఒక సంవత్సరము వఱకు రథయాత్ర సాగించినచో. మానవులు సుఖముగ జీవింతురు. రాజు, శత్రువులను జయించును. ప్రజలారోగ్యవంతులైయుందురు. పుడమిపై శాంతి నెలకొనియుండును. రథయాత్ర చేసినవారు స్వర్గభాజనులగుదురు. తేరు నడుపువారు సూర్యలోకమునకుఁబోవుదురు. ఈ రథయాత్రా విధానమును విని రుద్రుడిట్లు ప్రశ్నించెను. “ ఓ బ్రహ్మదేవా! ఒకసారి స్థాపించిన ప్రతిమను ఎట్లు కదలింపనగును? నా యీ సందేహమును దీర్పుడు”.
తా॥ బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “మహాత్ముడైన సహస్రకిరణుని ప్రయాణము కొఱకు సంవత్సరావయవములతో ఈ రథము పూర్వమే నేను కల్పించితిని. రథములన్నింటిలోనిది మొట్టమొదటిదిగా చెప్పబడినది. దీనిని చూచియే విశ్వకర్మ ఆయాదేవతల కొఱకు వేజ్వేజు రథములను. నిర్మించేను. చంద్రుడు మొదలగు నెందతో దేవతలకెన్నియో రథములనాతడు నిర్మించేను. విశ్వకర్మ తన కొఱకు సిద్ధపఱచిన రథమును సూర్యదేవుడు పూజార్థమై మనువుకిచ్చెను. మనువు ఇక్ష్వాకునకిచ్చెను. అప్పటినుండియే సూర్యరథము మర్త్యులచేత పూజింపబడునాచార మేర్పడినది. అందువలన రథయాత్రరూపమున సూర్యునకు చాలనము విహితమైనది. కాబట్టి సూర్యదేవుని ప్రతిమను) చలింపచేయుట దోషముకాదు. ఏలయన నాతడు నిరంతర చలనశీలియేకదా!. భాస్కరుడు తన రథముతో నీ భూమినంతయును చుట్టి వేయుచుండును. కాని ఆ రథగమనము, సూర్యమండలము కదలిపోవుచుండుట మానవులకు కన్పట్టదు. అటుల కనబడకుండ కదలుచుండు కారణమున ఆ దేవునిని రథయాత్రల ద్వారమున బుద్ధిమంతులు దర్శించుచుందురు. బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు నితర దేవతలను విధివిధానముగ స్థాపించిన పిదప స్టానాంతరమునకు వారిని కదలించుట సరికాదు. కావున సూర్యరథయాత్ర యథావిధిగ చేయవలెను. ప్రతి సంవత్సరము ప్రజాక్షేమము కొఱకు చేయవలెను. బంగారముతోగాని, వెండితోగాని లేక దృఢమైన కట్టతోగాని, అక్షములు, చక్రములు దృఢముగ నుండునట్లు, సులభముగ తిరుగగలుగునట్లు రథమును నిర్మింపవలెను.
తా॥ అట్టి సుందరమైన రథశ్రేష్ఠము నందు సూర్యప్రతిమను నిలిపి, ఆ రథమునకు శుభలక్షణములు గల గుఱ్ఱములను బూనుపవలయును. పచ్చని వన్నెతో ప్రకాశించునవి, మంచి ముఖములు గలవి, సారథివశమై నడచునవి, కుంకుమముచే పూయబడినవి, చామరములు, పూదండలు మున్నగువానిచేనలంకరింపబడినవియునైన అశ్వశ్రేష్ఠములను బూన్చి రథమున కర్ష్యమిచ్చి, ధూపములు, పుష్పములు, గంథములు మున్నగువానిచే దేవతలను పూజించి వివిధములైన ఆహార పదార్థములతో బ్రాహ్మణోత్తములను, దీనులు, కుంటివారు, గ్రుడ్డివారు మొదలగువారిని, అచటనున్న జనులందని యథాశక్తిగ తృప్తిపఱచి రథయాత్రకుపక్రమింపవలెను. చక్కగా జరుపబడు సూర్యక్రతువునందు ఉత్తమ, మధ్యమ, అధములలో సెవరినైనను, ఏ కొంచెమైనను విముఖము చేయకూడదు. ఇది విజ్ఞులు చెప్పినమాట. రథయాత్రారూపమగు నీ సూర్య యజ్ఞమునందు, ఆకలి, దప్పి, చలి మున్నగు వానితో హతాశుడై బాధపడిన యెడల నిట్టి దుష్కార్యముచేత స్వర్గమున నున్న యజమాని యొక్క పితృదేవతలును పతితులగుదురు. ఈ సవితృయజ్ఞము దక్షిణల నీయనిదే ప్రశస్తముకాదు. ఫలవంతముకాదు. కావున చతుర్విధాహారములతో షడ్రసోపేతములైన భోజనములు పెట్టి దక్షిణలతో సంతృప్తులను చేయవలెను. ఇట్లు సర్వ జనులను పూజించి ఈ మంత్రమునుచ్చరింపవలెను. “నా యీ బలిని ఆదిత్యులు, వస్తువులు. మరుత్తులు, అశ్వినులు, రుద్రులు, సుపర్ణులు, సర్పములు, గ్రహములు, అసురులు, యాతుధానులు, మొదలగు రథస్థ దేవతలు స్వీకరింతురుగాక!. దిక్పాలురు, లోకపాలురు, విఘ్న వినాయకులు, దివ్యులు, మహర్షులు - వీరందఱును బలిని స్వీకరించి జగత్తునకు శుభము నిత్తురుగాక!. నాకు ఏకార్యమందేనియు విఘ్నము లేకుండుగాక! పాపమంటకుండుగాక! శత్రువులు లేకుందురుగాక! దేవతలు, భూతగణములు తృప్తులై ప్రసన్నులయ్యెదరుగాక!”.
తా॥ వామదేవ, దేవతాకములు, పవిత్రములునగు మంత్రములను మానస్తోక, రథంతర మంత్రములతోను ‘ఆకృష్ణన రజసా' అనునోక్కబచను పఠింపవలేను. అటు మిమ్మట పుణ్యాహవాచనము చేసి మంగళవాద్య ధ్వనులతో రథము నడుచుట మొదలు పెట్టవలెను. ఎగుడుదిగుడులేని మార్గము నుండి రథయాత్ర సాగింపవలెను. సూర్యునియందు భక్తిగల పురుషుల చేతగానీ. లేక బలిష్ఠములు, శ్రమ కోర్చునవి, పగ్గములతో కట్టబడినవియునైన ఎద్దులచేగాని రథమును లాగింపవలెను. ముఖ్యముగా ఎగుడుదిగుడు మార్గమున రథము పోవలసివచ్చినచో ఎద్దులతో లాగింపవలేను. నిష్టాపరులు, ఉత్తములు, ఉపవసించియున్న వారునైన ముప్పది మంది లేక పదునారుగురు సద్రాహ్మణులచేత స్థాపిత సూర్యప్రతిమను కదిలింపజేసీ. రథము పై పదిలముగా ప్రతిష్ఠింపజేయవలెను. సూర్యునకు నిక్షుభ, రాజ్డ్ (ఛాయ, సంజ్ఞ) అని ఇద్దజు భార్యలు కదా!. వారిరువురిని కూడా రథమునందు సూర్యునకిరుపక్కల జాగ్రత్తగా స్థాపింపవలెను. నిక్షుభను దక్షిణ పార్శ్వమున, సంజ్ఞను ఉత్తర పార్శ్వమున నిలుపవలెను. రథమునందొరుప్రక్కల ఇద్దఱు బ్రాహ్మణులు మాత్రమే ఉండవలయును. ఒక బ్రాహ్మణుడు నొగపై కూర్చుండవలెను. సూర్యమూర్తికి వెనుక ప్రక్కగా నెగురుచున్న గరుడుని యలంకరింపవలెను. పై భాగమున సువర్ణ దండముతోఁ గూడిన శ్వేతచ్ఛత్రము సమర్పవలయును. అది మణులు, ముత్యములు మున్నగువానితో నుజ్జ్వలముగ ప్రకాశించుచున్నదై బంగారు చుక్కల చిత్రములతో మెఱయునదైయుండవలెను. సప్తవర్ణ పతాకములతో నలంకరింపబడిన సువర్ణదండ ధ్వజమును. పైన నమర్పవలెను. ఆపతాకములు ఏడేసి వర్ణములుగల విగనెన్నియేని సప్తకములుండవచ్చును.
తా॥ ధ్వజము పై భాగమున - అరుణునధిష్టింప జేయవలెను. సూర్య రథపు మొగము చివర బ్రాహ్మణులుండునట్లు చూడవలెను. రథ సారథ్యము చేయుట తన శ్రేయస్సు కొఱకని యెంచి చేయవలెను. శ్రేయము కోరువారు, భక్తి శ్రద్దలు లేనివారిని రథము నెక్కుట కనుమతింపరాదు. ఏలయన నట్టి శ్రద్ధాహీనులు రధారోహణ చేసినచో వారి సంతానము నశించును. ఎప్పుడును ఆ దేవ దేవుని రథము సాధారణముగ బ్రాహ్మణులే లాగుచుండవలెను. క్షత్రియులు, వైశ్యులు కూడ లాగవచ్చును. కాని శూద్రులెప్పుడును లాగ కూడదు. అన్యదేవతా భక్తులుగానీ మద్యము సేవించువారుగాని. శూద్రులు, ఇతరులుగానీ లాగరాదు. లాగువారు ఉపవాసవ్రతమున నుండిన వారు కావలెను. స్థానమునుండి కదలిన రథము మొదట గ్రామపు తూర్పు వాకిట నిలుపవలెను. రోజు మొదలగు ప్రముఖుల పూజాదులతో నాదినమంతయు నచటనే నిలిపియుంచవలెను. అచట నృత్యగీతాది వివిధ కార్యక్రమములు, పురాణ ప్రవచనములు, వేద పఠనములు, బ్రాహ్మణ సంతర్పణలు నిర్వహింపవలెను. అచటీ నుండి అష్టమి తిథి దాటిన మీదట నవమినాడు రథమును మఱల నడుపవలేను. దక్షిణ ద్వారము చేర్చవలెను. అచట కూడ ఒక దినము నిలుపవలేను. రాజప్రముఖుల, ప్రజల పూజాదికములు నిర్వర్తింపవలేను.
తా॥ అచటి నుండి రథము పశ్చిమ ద్వారము కడకు, అటు మిదట ఉత్తర ద్వారము వఱకును నడచును. అచట విధి విధానముగ సూర్య భగవానుడు శూద్రులచే పూజలందుకొనును. అటునుండి కదలి రథము గ్రామ మధ్యమునకు బోవును. అచట నిలిచిన సూర్యదేవుని భక్తి శ్రద్దా సమన్వితులై బ్రాహ్మణులు పూజింతురు. అచట శంఖాది వాద్యధ్వనులతో, నృత్య గీతాది దృశ్య కార్యక్రమములతోను, నానా విధములైన వేద ఘోషలతోను, అంతటను వెలుగుచుండు దీపమాలికలతోను కోలాహలముగ నుండ సూర్యదేవుడు బ్రాహ్మణ పూజలందుకొనును. ధనాదికముల దానములు, బ్రాహ్మణులకు, దీనులకు, అంధులకు పేదలకు అన్న వస్త్ర దాన సంతర్పణలు మున్నగువానితో నాతని పూజలు సాగవలేను. పురమధ్యము నుండి కదిలి రథము స్వీయ మందిరపు ముంద భాగమున నిలుపవలెను. అచట పౌర జనముచే నా దేవదేవుడఖండ పూజలనందవలెను. అహోరాత్రము పూజింపబడుచు నాతడు రథారూఢుడయియే యుండును-96. మరుసటి దినమున - అనగా త్రయోదశి గడచిపోయి చతుర్దశి రాగానే రథమును, సూర్యమూర్తిని యథా స్థానమునకు చేర్చవలెను. పాప సంహారకుడు, గ్రహేశ్వరుడైన సూర్య భగవానుని, సపరివారముగ, నిదేవిధముగ ప్రతివత్సరము రథము పై నూరేగింపు చుండవలయును”.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున రథసప్తమి కల్పమునందు రథయాత్రా వర్ణనమును ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.
