భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
20. పుష్ప ద్వితీయా వర్ణనము
తా ॥ శతానీకుడిట్లనెను.
బ్రాహ్మణోత్తమా! ఏ దినమున ఉపవసించి నరుడు సతీ వియోగమును పొందడో అట్టి ఫల సంజ్లిక ద్వితీయాతిథిని గూర్చి నాకు చెప్పుడు-1. ఓ ముని శ్రేష్టా! పురుషుడు భార్యతో గూడి, స్త్రీ పతీతో కూడి దేని వలన చిరకాలముందురో స్త్రీ ఎప్పుడును వైధవ్యము పొందకుండునో, ఏ తిథియందుపవసించుటచేత పురుషుడు ఎల్లకాలము భార్యాసహితుడైయుండునో అట్టి 'ఫలద్వీతీయ' గుణించి వినగోరుచున్నాను-2. స్త్రీ పురుషులకు శ్రేయోదాయకమగు అట్టి వ్రతమును గూర్చి నాకు తెలుపుడు. ... అది వినుటకు పూర్వము నాలో కుతూహలము కదలుచునేయుండును”-3. సుమంతుముని ఇట్లనెను. 'అశూన్యశయన' అను పేరు గల ద్వితీయను గుళించి వినుము. అట్టి ద్వితీయనాడు ఉపవాస విధినాచరించు స్త్రీ, వైధవ్యము పొందదు. పురుషుడాచరించుచో ఎన్నడును పత్నీ వియోగము పొందడు-4. రాజా! జగత్పతి యైన విష్ణుదేవుడు తన భార్యయగు శ్రీ లక్ష్మితో శయనించు దినమే అశూన్యశయన ద్వితీయగా తెలియవలెను-5. శ్రావణ మాస కృష్ణపక్ష ద్వితీయనాడు స్నానమాచరించి, జగత్పతి, శ్రీవత్సలాంఛనుడు అయిన విష్ణుదేవుని భక్తితో పూజించి, అతనికి నమస్కరించుచు ఇట్లు ప్రార్థింపవలెను-6. " హే శ్రీ వత్సధారీ! శ్రీకాంతా! శ్రీవత్సా! శ్రీపతీ! అవ్యయా! ధర్మార్థకామముల నిచ్చు నాగృహస్థాశ్రమము నష్టపడకుండుగాక!-7. మా గోవులు సురక్షితముగ నుండుగాక. మా జనులు సురక్షితముగ నుందురుగాక-8. నా తోడబుట్టిన స్త్రీలు, మా దాంపత్యములోని కలతల వలన నష్టపడకుందురుగాక, ఎప్పుడును నీవు లక్ష్మితో నెట్లు కలిసియేయుందువో అటులే నేను కూడ ఎల్లప్పుడును ధన ధాన్యాది సంపదలతో విడువబడక ఉందునుగాక-9. అటులే నాభార్య(లు)కూడ నన్ను పాయకుండుదురు)గాక. హే వరదాయకా! ఎల్లప్పుడును లక్ష్మిలేకుండ నీవు శయనింపనటు-10. నాశయ్యకూడ ఎప్పుడును భార్యారహితముగ నుండకుండుగాక”. ఇట్లు స్తుతించి, లక్ష్మీనారాయణుల పూజచేసి-11. ప్రదోషకాలమున శ్రీ హరి కిష్టమైన వివిధ ఫలములను నివేదించి, రాత్రి సమయమున ఆలయమునందలి దేవునికి నమస్కరించి వాజీయముము కలవాడై ఆ ఫలములను భుజింపవలెను. (12)
తా ॥ రెండవ దినమున బ్రాహ్మణునకు యదాశక్తి దక్షిణనీయవలెను-13. శతానీకుడిట్లనెను. “విష్ణుదేవున కిష్టమైన ఫలములెవ్వి? ఆ దేవుని శయన కాలమున వేనిని సమర్పింపవలయునో నెలవిండు-14. రెండవ దినమున భక్తులేదానమును బ్రాహ్మణునకీయవలెను? శక్తి కొలదిగ దేవునకు సమర్పింవలసినవేవి?” -15. సుమంతుముని ఇట్లు చెప్పెను. “ఆ ఋతువునందేయే ఫలములు లభ్యములగునో పోనీలో మిక్కిలి తీయనివీ పుష్కలముగ సమర్పింపవలెను. కానీ పక్వముకానీ, రుచిలేనివి, అతిగా పండినవి, శ్రేష్టములు కానివి సమర్పింపకూడదు-16. దేవుని శయనకాలమున శక్తిననుసరించి ఇట్టి మంచి పండ్లను నివేదింపవలెను. తీయని పండ్లు సమర్పించిన మనుష్యుడు భార్య(ల)కు ప్రేమపాత్రుడగును-17. స్త్రీ సమర్పించినచో భర్త ప్రేమను చూరగొనును. అందువలన మిక్కిలిగా చెడినవి, స్త్రీలింగమున చెప్పబడునవి విడిచి పెట్టవలెను-18. స్వచ్చములు, తొడిమలుగలవి అయిన ఖర్జూరములు, మాదీఫలములు (ఇంకను ఇట్టివి) దేవదేవుడైన విష్ణువునకు . అతని శయన కాలమున సమర్పింపవలెను-19. స్వశక్తిననుసరించి విష్ణువున కిచ్చిన ఫలములువంటి ఫలములే బ్రాహ్మణునకు కూడ నారికేళములతో సువర్ణముతో కూడ-20. భక్తితో శక్తి కొలదిగ రెండవదినమున, సమర్పింపవలెను. ఇంకను నూతన వస్త్రములు, ధాన్యము, వివిధములైన ఫలములు, దానమీయవలెను. ధాన్యముతోబాటు సువర్ణదానమిచ్చుట విశేషమని చెప్పుదురు-21.
తా॥ ఇట్లు నాలుగు మాసములు ఈ వ్రతమును చక్కగానాచరించు వానికి మూడు జన్మలు గృహభంగముకాదు-22. ధర్మార్థకామములు సాధింపగలుగు నీ అశూన్యశయన వ్రతమాచరించువాడు అవ్యాహతమగునైశ్వర్యము గలవాడగుననుటలో సందేహము లేదు-23. ఈ వ్రతమును యధావిధిగ నాచరించు స్త్రీ ధర్మజ్ఞురాలై బంధు వియోగ సంబంధమైన దుఃఖము లేక హాయిగ నుండును-24. వైధవ్యముగాని, భర్తచేత నిరాదరింపబడుటగాని, విడిచి పెట్టబడుట గాని లేకుండ మూడుజన్మలు సుఖముగ జీవించును-25. ఖర్జూరములు, మాదీఫలములు మొదలగు శ్రేష్ఠమైన ఫలములు, చెడనివి, అపక్వములు కానివి, క్రుళ్ళిపోనివి అయిన మంచి పండ్లిచ్చుట చేత మాత్రమే ఈ సత్ఫలము కలుగును-26. రాజేంద్రా! బ్రాహ్మణులకు శక్తికొలదిగ మధురములైన శ్రేష్ఠములైన, స్వచ్చమైన ఫలములే దానము చేయవలెను-27. ఇట్లు కృష్ణద్వితీయ అనెడి ఉత్తమమైన తిథిని గూర్చి చెప్పబడినది. ఈ తిథియందుపవాస వ్రతము నాచరించు మానవుడు సకల వస్తు సమృద్ధిని పొందును”-28. శతానీకుడిట్లనెను. “మీరు ఈ ఉత్తమమైన విదియ తిథి గూర్చి వివరించి చెప్పితిరి. కాని అశ్వినీ కుమారుల కొఱకు ఉత్తమమైన ఈ తిథియందు విష్ణువేట్లు-29. పూజ్యుడయ్యెను? ఫల సంజ్ఞతోనొప్పెడు నీ తిథినాడు లక్ష్మీదేవితో సహా విష్ణువు పూజింపబడుటెట్లు? తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలము కలుగు చన్నది-30. సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “ ఇది సందేహింపవలసిన విషయము కాకున్నను నీ వట్లడుగుచుంటివి. ఇది అశ్వినుల తీథియే. కాని నేను చెప్పునది తెలసికొనుము-31. ఏమన అమిత తేజస్వియైన విష్ణుదేవునకు, అతని ప్రీతికొఱకై, అశ్వినీ కుమారులు ‘అశూన్య శయన'నతని కిచ్చిరి-32. సత్యవ్రతులైన వారే అతినినాదినమున పూజించుకొందురు, భగవానుడైన విష్ణువునకు ఆనాడు లక్ష్మీ ఈయబడినట్లు భావింపబడుచున్నది-33.
శతార్ధ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ద్వితీయా కల్ప మాప్తియను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.
