భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

33. పంచమి కల్పమున సర్పదంష్ట్రా వర్ణనము

తా॥ శతానీకుడిట్లనెను. సర్పముల కెన్ని రూపములు గలవు? ఏయే వర్ణములలో నుండును? వాని లక్షణములేవి? వాని జాతి ఏది? కులములేవి?-1. సుమంతుముని ఇట్లు చెప్పెను. పూర్వ కాలమున మేరు పర్వత శ్రేష్ఠము పై, తపో నిధియగు కశ్యప మహర్షికి భక్తితో శిరసు వంచి నమస్కరించి గౌతముడతనితో నిట్లు ప్రశ్నించి యుండెను-2. “సర్పములకెన్ని రూపములున్నవి? ఏ చిహ్నములు ఏ లక్షణములున్నవి? వాని జాతి, కులము, వర్ణములు మొదలగు విషయములను గూర్చి నాకు చెప్పుడు-3. సర్పమెట్లు పుట్టును? విషము నేట్లు విడుదల చేయును? విష వేగములెన్ని విధములుగా చెప్పబడినవి? విషనాడులెన్ని? (4) పాముల కోఱలు ఎన్ని విధములు? విషము వచ్చుటయందు ప్రమాణమేమి? అవి ఎప్పుడు గర్భము ధరించును? ఎట్లు ప్రసవించును?-5. స్త్రీ ఎట్లుండును. పురుష సర్పమెట్లుండును? నపుంసక సర్పమెట్లుండును? కాటువేయుటయననేమి? ఈ వివరములు నాకు తెలియజెప్పుడు. గౌతముని ఈ ప్రశ్నలు విని కశ్యప ప్రజాపతి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “గౌతమా! సర్ప లక్షణములను తత్త్వతః చెప్పుచున్నాను. వినుము. సర్పములు జ్యేష్ఠ ఆషాఢ మాసములలో మదించును. అప్పుడు ఆడపాము మగపాము 'కలయిక' కుపక్రమించును. వర్షర్తువు నాలుగు మాసములు సరిణి గర్భము ధరించును. కార్తిక మాసమునందు గ్రుడ్లు పెట్టును. రెండు వందల నలుబది గ్రుడ్లు పెట్టును. తాను పెట్టిన గుడ్లను చాల వఱకు తిని వేసి ఒక భాగము ఇష్టపడక వదిలేయును.

తా॥  బంగారు వన్నెతో ప్రకాశించు అండమునుండి మగ పాము పుట్టును. వానినే సర్పము రాత్రింబవలు ఇరువదింటి వఱకు తినుచుండును. పచ్చని బంగారు పచ్చని మొగలిపూవు) వన్నెలో నుండునవి, పొడవైన తామర వంటివియైన గ్రుడ్ల నుండీ ఆడపాములు పుట్టును-, దిరిసెన పువ్వు వర్ణమున నుండు అండము నుండి నపుంసక సర్పము జన్మించును. గ్రుడ్లు పెట్టిన ఆడపాము ఆుమాసముల వఱకు పొదిగిన పిదప ఆ గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వచ్చును. పాము పిల్లలు తల్లితో, ప్రేమ స్నేహములతో నుండును. ఏడు రాత్రుల వఱకు సర్ప కిశోరము నల్లని వర్ణమునకు మారును. సర్పముల ఆయుః ప్రమాణము నూట యిరువది సంవత్సరములుండును. వాని మరణము ఎనిమిది విధములుగ నుండును. క్రమముగా వివరించు చున్నాను వినుము. నెమలి వలన, మనుష్యునివలన, చకోరపక్షివలన, ఆవు, గేదే మొదలగువాని గిట్టల వలన, పిల్లి వలన, ముంగిస వలన, పంది వలన, తేలు వలన సర్పములు చనిపోవుచుండును. వీని నుండి తప్పించుకొనగలిగినచో నూట యిరువది సంవత్సరములు జీవించును. పారము దినములకు కోఱలు పెరుగును. ఆ పిదప విషము వచ్చును. విషమును విడుదల చేసిన కొలదిగ మల మల చేరుచుండును. ఇది తెలిసి విష సంబంధ కర్మకు యత్నింపవలెను. ఇరువది యొక్క రాత్రుల వఱకు విషపు కోటలు బాగుగా పెరుగును. ఆడపాము ప్రక్కప్రక్కన తిరుగాడు పాము “బాల సర్ప 'మనబడును. ఇరువది. యైదు దినములలో, కాటు వేయగానే ప్రాణము తీయు సమర్థత వచ్చును. పుట్టిన ఆఱు మాసములకు కుబుసము వదిలి పెట్టును. పాము రెండువందల నలువది పాదములు కలిగియుండును. ఆ పాదములు ఆవు రోమమంత సూక్ష్మములై, అడుగువేయట, అడుగు తీసిదాటుట చేయగలవు.

తా॥ సంధులు, వ్రేల్లును వీనికి రెండు వందల నలుబది యుండును. అకాలమునందు పుట్టిన సర్పములకు విషముండదని చెప్పనగును. వీనికి డెబ్బదియైదు సంవత్సరములు మాత్రమే జీవితకాలముండును. ఎఱుపు, తెలుపు, పసుపు వన్నె దంతములుగల సర్పములకు విషముండదు. ఇవి అల్పమైన వేగముగలవి. అల్పాయుర్దాయముగలవి. వీనిలో కొన్ని పిటీకివి కూడనైయుండును. పాములకు ఒక ముఖము, రెండు నాల్కలు, ముప్పది రెండు దంతములునుండును. సంశయములేదు . ఈ దంతముల మధ్య నాలుగు దంష్టలు విషపూరితములు. మకరి, కరాలి, కాలరాత్రి, యమదూతి, అని ఆ నాలుగు దంతముల పేళ్లు. ఈ నాల్గు దంతములకు దేవతలు అధిపతులుగా చెప్పబడియున్నారు. 'మకరి' యనునది బ్రహ్మదేవత్యము. రెండవదియగు ‘కరాలి' విష్ణు దేవతాకము. 'కాలరాత్రి' యనునది రుద్ర దేవత్యము. నాలుగవ దంతమగు 'యమదూతి'కి అధిపతియముడు. ఈ యమదూతి యను కోట తక్కిన కోఱల కన్న ప్రమాణమున చిన్నది. ఇది సర్పము యొక్క ఎడమ కంటిని ఆశ్రయించి యుండును. దీని కాటు పడినచో మంత్రములు గాని, మందుగాని, చికిత్సగాని నిరుపయోగములు. ఈ దంతపు కాటు గుర్తు గమనించియే వైద్యుడు పరాజ్ముఖుడగును. చికిత్స, ఔషధము దీనికి లేవని, అది వాని జీవిత సమాప్తియని తెలిసినవారు ఇకనట్టి ప్రయత్నములు చేయరు. ఒక మాసమునకు 'మకరి', రెండు మాసములకు కరాలి, మూడు మాసములకు కాలరాత్రి, నాలుగు మాసములకు 'యమదూతి'యును సర్పమునకు ఏర్పడును. 'మకరి’ కాటుకు గుడాన్నము, 'కరాలి' కాటుకు కషాయాన్నము, 'కాలరాత్రి' కాటుకు కారముతో కూడిన ఆహారము, 'యమదూతి' కాటుకు సంనిపాతమునకిచ్చు ఆహారము దడ్డున కీయవలెను.

తా॥ 'మకరి' కాటు గుర్తు శస్త్ర మువలెను, “కరాలి' యను దంతపు కాటు గుర్తు కాకి పాదమువలెను, 'కాలరాత్రి' యను దంష్ట్ర యొక్క కాటు గుర్తు చేయి మాడ్కియును, 'యమ దూతిక' గుర్తు తాబేలును పోలియుండునని చెప్పబడినది. 'మకరి' వాతస్వభావము, 'కరాలి' పిత్త స్వభావము, 'కాలరాత్రి' శ్లేష్మ లక్షణము, 'యమదూతి' సన్నిపాత లక్షణము కలిగియుండును. మకరి తెలుపు వర్ణమునను, “కరాలి' ఎఱ్ఱని వన్నెలోను, 'కాలరాత్రి' పసుపు చాయలోను, 'యమదూతిక' నల్లగను ఉండును. తెల్లనిది, నల్లనిది ఎడమ వైపునను, ఎఱ్ఱనిదీ, పచ్చనీది కుడివైపునను ఉండును. వాని వర్ణములును చెప్పుచున్నాను వినుము. తెల్లనిది బ్రాహ్మణియని, ఎఱ్ఱనిది క్షత్రియయని, పచ్చనిది వైశ్యయనియు, నల్లనిది శూద్రయనియు చెప్పబడును. ఆ మీదట సర్పదంష్ట్రలకుగల విష లక్షణమును గూర్చి చెప్పెదను. పాము కోఱలలో ఎప్పుడును విషముండదు. కుడి కన్ను సమీపమున విష స్థానముండును. కోపించిన సర్పమనకు అచటి నుండి విషము నెత్తికెక్కును. అట నుడి నరములోనికి ప్రాకును. అట నుండీ నాడులలోనికి ప్రవహించును. నాడుల నుండి కోటలలోనికి వచ్చి కాటుతోబాటు, విడుదల చేయబడును. సర్పము ఎందుకు కాటువేయునో వివరముగా చెప్పెదను. పాము ఎనిమిది కారణముల చేత కాటువేయును. సంశయములేదు. ఒకటి; తనను ఆక్రమించినపుడు రెండు పూర్వ వైరముచేత. మూడు భయపడినప్పుడు, నాలుగు మదించినపుడు, ఐదు ఆకలిగొనియున్నప్పుడు, ఆు విషమతిశయించినప్పుడు, ఏడు తన సంతానమును రక్షించుకొనుటకు, ఎనిమిది కొలచోదితమై సర్పము కాటువేయును.

తా॥  దంతము వంకరయగుట, కాటు వేసిన పిదప ఉదర భాగమును పైకీ చేసీ వెల్లికిల బడుటయనునవి, ఆక్రమించుటచేత కాటు వేసిన సర్పలక్షణములుగా చెప్పవలెను. కాటువేయబడిన వానికి లోతైన గాయమేర్పడిన యెడల అది పగబట్టిన పాముకాటుగా గుర్తింపవలెనని కశ్యపుడు చేప్పెను. ఒకే దంతపు చిహ్నము అస్పష్టముగా నుండెనేని అది భయపడిన పాముకాటుగా తెలిసికొనవలెనని కశ్యపుని వాక్యము. కఱచిన తావున దంతపు గుర్తు ఒక రేఖవలె ఎర్పడినచో అది మదించిన పాము కాటుగా నెన్నవలెనని ప్రజాపతి చేప్పెను. రెండు దంతముల చిహ్నములతో నతిమాత్రమైన గాయమేర్పడిన యెడల అది ఆకలిగొన్న పాముకాటుగా భావింపవలెను. రెండు పలుగాట్లు నెత్తురోడుచు కన్పట్టినచో నట్టిది విషమతిశయించిన సర్పము వేసిన కాటుగా తెలియవలెను. అచట సందేహమేమియులేదు. మూడు దంతములతో నేర్పడిన కాకపొద చిహ్నము వంటి 'గాటు' పాము తన సంతాన రక్షణ కొఱకు వేసిన కాటు అని యెంచవలెను.  కాక పాద చిహ్నము కాలచోదితమైన మహానాగము వేసిన కాటుగా కూడా నిర్దేశింపనగును. ఇట్టి పాము కాట్లు మూడు విధములు. కశ్యపవాక్యముననుసరించి, సర్పము యొక్క విషభాగమునుండి కాటువేసిన తావున మూడు పంతులు విడదల ఐనచో అది 'దష్టానుపీతము'. కాటువేసి కడుపు పైకి చేసి వెల్లికిలబడినచో అది “ఉద్దత'మని నిర్దేశింపవలెను. విషవేగముచేత, సర్పము విషము క్రక్కి అది నిర్విషమయ్యేనేని అది 'ఛర్దిత'మనబడును. పాము తన నాలుగు దంతములతో కాటువేసిన యెడల చికిత్సకు అసాధ్యమగును. పీడితుని మెడ విష ప్రభావము చేత నించుక వంగిపోవును. ఇటు కాటువేయనటు శుద్ధముగనున్న 'వ్యంతర' మనబడును.

శతార్ధ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహా పురుణమునందలి బ్రహ్మపర్వమున, పంచమీకల్పమునందు సర్పదంష్ట్రా వర్ణనమను ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.