భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
69. సప్తమి కల్పమున స్వప్న దర్శస వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “యాజ్ఞవల్క్య! సప్తమినాడు ఉపవసించి, విధి పూర్వకముగ సూర్యదేవునర్చించి, జహోమాదులు నిర్వర్తించి, రాత్రి సమయమున సూర్యుని ధ్యానింపుచు నిదురించి, ఆ నిద్రలో గాంచు స్వప్నముల ఫలములను చెప్పుచున్నాను-1, 2. తన విభవముననుసరించి నియమవ్రతుడై సూర్యక్రతువు సంపన్నము చేసి అతనిని గుఱించి చింతన చేయుచు రాత్రి సమయమున పడక పై పరుండిన ఉపాసకునకు స్వప్నమందు, ఉదయించుచున్న సూర్యుడు-3. ఇంద్రధ్వజునుడు, చంద్రుడు కాన్పించేనేని సర్వ సమృద్దులు కలుగును. పూలదండ ధరించినవాడు, గోవు, వేణు నాదములు-4. తెల్లని కమలములు, చామరములు, అద్దము, బంగారము, ఖడ్గము, పుత్రోదయము, రక్తస్రావము, రక్తముతో తడయుట, పానము చేయుట - ఇవి కన్పట్టిన ఐశ్వర్యము కలుగును.-5. పంచ పూతమైన వెండి కనబడుట వృద్ధి కారకము. ఘృతాక్ష ప్రజాపతి దర్శనమున పుత్ర ప్రాప్తి కలుగునని చెప్పబడినది-6. స్వప్నమునందు తాను ప్రశస్తమగు వృక్షమునెక్కినట్లు కనబడినచో సత్వరమే ఐశ్వర్యము కలుగును. గేదె, సింహము, ఆవు పాలను తన ముఖమునందే పితికినట్లు కాంచినచో-7. ధనుర్మధ్యముల నుండి వేగవంతములై వెలువడు బాణములు కనబడినను, తాను స్వయముగ సింహములను, ఎద్దులను, పాములను చంపినట్లు తినినట్లు చూచినను-8. తన శరీరము, తల అగ్నిలోబడినట్లు కలగాంచినచో ధనలక్ష్మి ముందున్నట్లు భావింపవలెను. బంగారు పాత్రలో పాయసము తినినట్లు-9. లేక తామరాకులోగాని తినినట్లు స్వప్నమైనచో నతనికి బలము ప్రాప్తించును. జూదమునందుగాని, వాదమునందుగాని యుద్దమునందుగాని విజయము కలిగినట్లు కలగాంచినచో సుఖము లభించును.
తా॥ అగ్నిని త్రావినట్లు (తినినట్లు) కలగాంచినచో జఠరాగ్ని వృద్ధియగును. శరీరముజ్వలించిపోవుచున్నట్లు స్వప్నమైన అది శిరోబాధకు సూచకమగును-11. తెల్లని పూలు, వస్త్రములు ధరించినట్లు, ప్రశస్తమైన తెల్లని పక్షులు (హంసలు) కనపడినగాని, మలమును ఒంటికి పూసీకోనునట్లుగాని కలలో చూచినచో లాభము కలుగుటకు సూచనయగులు-12. తన శరీరమును కత్తిరించుచున్నట్లు గాని, చిమ్ముచున్నట్లుగాని, రథము పై ప్రయాణము చేయుచున్నట్లు గానీ కలలో దర్శించినచో సంతతి కలుగును. తలలు, భుజములు, హస్తములు తనకనేకములుగనున్నట్లు కలలో కన్నించినచో ధన వృద్ధియగును-13. అగమ్య గమసము చేయుట, శోకించుట, చదువుట కూడ సిరిని బెంచును. కలలో దేవతలు, బ్రాహ్మణులు, ఆచార్య పురుషులు, గురుజనము, వృద్ధులు, తపస్వులు-14. ఏది చేప్పినను అది సత్యమగునని నిర్దేశింపవలెను. ప్రశస్తుల దర్శనము, అభిషేకము, రాజవైభములకు సూచకము-15. తన శిరస్సు ఖండింపబడినట్లు, గాయపఱచబడినట్లు కలగాంచిన రాజ్యలాభము కలుగును. శోకించుట, రాబోవుహర్షమునకు సూచన. తాను నిగళములతో బంధింపడినట్లు కలగాంచిన రాజ్యప్రాప్తికి నిర్దేశము-16. గుఱ్ఱము, ఎద్దు, తామరపువ్వు, రాజు, తెల్లని ఏనుగు కనపడినచో గొప్ప ఐశ్వర్యము కలుగును. నిర్భీకుడై యేనుగునెక్కినట్లు కలగాంచినచో అదేఫలము కలుగును-17. గ్రహములను, తారకలను మ్రింగునట్లు, భూగోళము తలక్రిందులు చేసినట్లు, పర్వతములను పెకిలించినట్లు కలగాంచినచో రాజ్యలాభమును పొందును-18. దేహమునుండి ప్రేవులు వెలువడినట్లు, వానిని చెట్టుకు చుట్టివేసినట్లు, తాను సముద్రములో గాని నదిలో గాని పడినట్లు స్వప్నము కలిగినచో నైశ్వర్యములు, సుఖములు కలుగును-19. సముద్రమును గాని, నదినిగాని దాటి ఆవలితీరము చేరినట్లు, పర్వతము పై నుండి దూకినట్లు స్వప్నమైనచో ధనము, జయము, ఆయుర్వర్ధి కలుగును-20. సుందరమైన స్త్రీ ఒడిలో ప్రవేశించినట్లుగాని, స్త్రీలనేకులశీర్వదించినట్లుగాని, తాను కీటకములతో తినబడినట్లుగాని కన్పట్టినచో ధనలాభము కలుగును-21. స్వప్నమున స్వప్నజ్ఞానము కలిగెనేని, ఇష్టమైన విషయములు చెప్పబడుట, వినబడుట జరిగెనేని, అందజికిని శుభము జరుగును. శుభవస్తు దర్శనమగును-22. శుభవస్తు సంయోగము, ఆరోగ్య, ధనలాభములు చేకూరును. ఐశ్వర్యము, రాజ్యలాభము ప్రాప్తించును-23. అట్టి స్వప్నములు కలిగిన వారు రోగులు రోగ ముక్తులగుదురనుటలో సంశయములేదు. సుస్వప్నమును దర్శించి ఉదయమున మఱల నిద్రింపకూడదు. స్నానాదులతో శుచియై రాత్రి తనకు కలిగిన స్వప్న విశేషములను ప్రాతఃకాలమున రాజు, భోజకుడు, బ్రాహ్మణుడు మొదలగు పవిత్రులకు వినిపింపవలెను.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు స్వప్న దర్శన వర్ణనమను అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
