భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
77. సూర్య వర్ణనము
తా॥ నారదుడిట్లనెను. “మొదట సూర్య భగవానుని గూర్చి విపులముగను, క్రమానుసారముగను చేప్పెదను వినుము. ఆ దేవ దేవునికి నమస్కరించి మిగిలిన విషయములను తదుపరి చేప్పెదను-1. అవ్యక్తము, కారణము, నిత్యము, సద సదాత్మకము, ప్రధానము, ప్రకృతి అని తత్త్వచింతకులు దేనిని గూర్చి చెప్పుదురో-2. అట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ రహితమగు సనాతన పరబ్రహ్మమే మహద్భూతమనియు జగద్యోనియనియు చెప్పబడుచున్నది-3. సర్వభూత సృష్టికి అవ్యక్తమే మూలము. ఇది అనాది. అనంతము. అజము. సూక్ష్మము, త్రిగుణాత్మకమై జగత్తునకు హేతువైనది-4. ఆ కృతిలేనివాడు, తెలియరానివాడునైన వానిని పరమ పురుషుడందురు. అట్టి మహాత్ముని చేతనే ఈ సర్వ జగత్తు వ్యాప్తమై యున్నది-5. అట్టి ఈశ్వరుని స్వరూపము జ్ఞాన వైరాగ్య లక్షణముగలది. అతని యభిమానులకు ధర్మప్రాభవముతో గూడిన బ్రాహ్మీ బుద్ధి కలుగును-6. అతడు తన మనస్సుచే నేది సంకల్పించునో అది అతని అవ్యక్తము నుండి ఆవిర్భవించును. అతడే బ్రహ్మగా సృష్టించును. కాలుడై అంతమొందించును-7. స్వయం భువు, సహస్ర శీర్థుడునగు ఆ పురుషునకు మూడవస్థలు గలవు. బ్రహ్మత్వమున సత్వరజస్సులు, కాలత్వమున రజస్తమములును ఉండును-8. ఆ స్వయం భువునకు కేవల పురుషత్వ స్వరూపమున సత్త్వగుణము మాత్రమే ఉండును. బ్రహ్మత్వమున సృష్టించును. కాలత్వమున లయింపజేయును-9. కేవల పురుషుడు ఉదాసీనముగ నుండును. ఇట్లు ప్రజాపతికి మూడవస్థలు గలవు. మూడు కాలములందాతడు తన్ను తాను మూడు భాగములుగా విభజించుకొని ప్రవర్తించుచుండును-10.
తా॥ గుణ సంబంధమగు నీ మూడవస్థలతో నతడు సృష్టి ప్రళయములు చేయుచుండును. రెంటి మధ్యగల స్థితిని చక్కఁ జూచుచుండును. ఈ స్వయం భువగు పరబ్రహ్మమునుండి మొదట సూర్య భగవానుడు ప్రాదుర్భవించేను-11. ఆది యందు దేవతగా నవతరించుటచే నాదిత్యుడని, పుట్టుక లేందువలన అజుడనియు అతడు చెప్పబడును. దేవతలందజీలోను పెద్దపోడగుటచేత మహాదేవుడనబడును-12. సర్వలోకముల కీశ్వరుడగుటవలన ప్రభువులకు ప్రభువగుటచేత ఈశ్వరుడనబడును. బృహత్త వలన బ్రహ్మయనియు, భవత్వమువలన భవుడనియు చెప్పబడును-13. ప్రజలను పాలించుటచేత ప్రజాపతియనియు, పురము (శరీరము) నందుండు వాడయినందున పురుషడనియు పేర్కొనబడును-14. ఉత్పాద్యుడుకానందున, అపూర్వుడయినందునను స్వయంభువుగా ప్రసిద్దినందేను-15. బంగారు గ్రుడ్డునందుండియుండుటచేత నా దివాకరుడు హిరణ్య గర్భుడని పేరు వడ సేను-16. తత్త్వదర్శులైన ఋషులు నీటిని నారములందరు. నారములే అయనముగా (మార్గముగా) కలిగిన వాడగుటచే నాతడు నారాయణుడనబడును-17. ‘అర' అను శబ్దము పండితులచేత శీఘ్ర మను నర్థమున నిపతింపబడెను. నీరే సముద్రమై వానికి శీఘ్ర గమనములేనందుననవీ నారములయ్యెను-18. పూర్వము స్థావర జంగమాత్మకమగు జగత్తునకు ప్రళయమేర్పడగా సముద్రమొక్కటి మాత్రము మిగిలెను. ఆ సముద్ర జలమునందు నారాయణుడను పేరుగల పురుషుడు శయించి యుండెను. అతడు 'వేయి' శిరస్సులు, 'వేయి' కన్నులు, వేయి పాదములు గలవాడు-19. వేయి బాహువులు గల ఈ పురుషుడు మొదటి ప్రజాపతి. వేదములలో నితడు 'పురుషు'డని చెప్పబడును. ఇతడు మొదటి దేవత, ప్రకాశ రూపుడు, జగద్రక్షకుడు, అపూర్వుడు, ఒక్కడు. పురాణ పురుషుడు-20. మహాత్ముడైన ఆ హిరణ్య గర్భ పురుషుడు తమస్సు కంటే భిన్నుడు.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున సూర్య వర్ణనమను డెబ్బదియేడవ అధ్యాయము సమాప్తము.
