భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
19. ద్వితీయా కల్పము - శర్యాత్యాఖ్యానము - పుష్పద్వితీయావర్ణనము
“రాజేంద్రా! ద్వితీయనాడు చ్యవనమహర్షి తాను నిర్వహించిన యజ్ఞమునందు ఇంద్రుని సమక్షమున అశ్వినీ కుమారులచేత సోమపానము చేయించెను” -1. శతానీకుడిట్లనెను. “ఇంద్రుడు దేవతలు చూచుచుండగా చ్యవనుడు అశ్వినీ కుమారులచేత సోమపానమెటుల చేయించెనో నాకు తెలియజెప్పుడు -2. మహాత్ముడైన చ్యవనుని తపస్సు ఎంత గొప్పదో తత్ర్పభావమున ఇంద్రుని బలముచేతనే అశ్వినీ కుమారులిరువురు దేవత్వమును పొందిరికదా! -3. సుమంతముని ఇట్లనెను “పురాతన యుగమునందలి ఒక సంధి చివరి భాగమున చ్యవనుడు యోగ సమాధి నాశ్రయించి చిరకాలము గంగాతీరమున నుండెను -4. ఒక నాడచటికి స్నానార్ధమై తన అంతఃపుర పరివార జనముతో కూడి శర్యాతి మహారాజు వచ్చెను. అతడు స్నానము చేసి దేవతలను పితరులను అర్చించి తిరిగి పోవుటకు ఉద్యుక్తుడయ్యెను -5. అట్టి సమయమున అచటి దారిలో నొక గ్రామమున అతని సైనిక బలము విణ్మూత్రములు నిరోధింపబడి, దృష్టిని కోల్పోయి ఏమిచేయుటకును తోచక నిష్క్రయమై మూఢముగా అచ్చటచ్చటనే తిరుగుచుండెను. అట్టి తన సైన్యమును చూచి -6. శర్యాతి మహారాజు ముందుకు నడచుచుండిన తన అమాత్యులతో ఇట్లనెను. “ఇది చ్యవన మహర్షి ఆశ్రమము కదా! ఇచట ఎవరి చేతను ఏ అపచారము జరుగరాదు. (ఎవరు ఏ అపరాధము చేసిరి?) -7.రాజు ప్రశ్నకు ఎవరును ప్రత్యుత్తరమియకుండిరి. అప్పుడు రాజకుమారి సుకన్య తన తండ్రితో ఇట్లనెను -8. “నేను చెలికత్తెలతో నిట తిరుగుచుండ ఒక ఆసక్తికరమైన అద్భుతము జరిగినది. తండ్రీ! దానిని గుఱించి వివరింతును. వీనుడు -9. ఈ అరణ్యమునందు మేము. కాలిఅందియల సవ్వడులతోను, మొలనూలి చీరుమువ్వల సందడితోను ఆడుచు పొడుచు సంభాషించుకొనుచు తీరుగుచుంటిమి.
తా ॥ అంతలో “సుకన్యా! ఇటురమ్ము!” అనువాక్యము ఒక పుట్టనుండి వెలువడుచు, అస్పష్టముగ, క్షీణస్వరమున, కోకిల ధ్వని వలే మధురముగను మాకు వినిపించెను -11. ఆ ధ్వని వచ్చిన తావునకు వెడలి అచటనొక అద్భుతమును చూచితిమి. పుట్టలో నిశ్చలమగు దీపశిఖలవలె రెండు వెలుగుచున్న అగ్నికణములు కన్పట్టెను.” సుకన్య ఇంకను ఇట్లు చెప్పదొడగెను -12. “ అవి ఏవియో తెలియక దర్భకొనలతో వానిని పొడిచితిని, వెంటనే ఆ ప్రకాశము శమించెను.” -13. అది విని రాజు మిక్కిలి భీతిల్లి ఆలసింపక ఆ వల్మీకముగల అడవికి దారితీసెను, పుట్టలోపలి భాగమున భృగువంశీయుడగు చ్యవనుడు చిరకాలము నుండి తపోమగ్నుడై యుండెను -14. శర్యాతి, చ్యవనునకు నమస్కరించి ఇట్లనెను. "దేవా! మా అపరాధమును క్షమింపుడు. మీకు నమస్కారము.” -15. చ్యవనుడా మాటలువిని, “రాజా! నాకీదంతయు తెలియును, గృహస్థాశ్రమము నపేక్షించు నాకు నీ పుత్రికయగు సుకన్యనిమ్ము! జరుగుచున్న కార్యముల వరుసలోనే సుకన్యను నాకిచ్చి సుఖముగా నుండుము.” -16. శర్యాతి, ఋషి మాటలు విని మారుమాటాడక సుకన్యనతనికిచ్చివేసెను. అట్లు సుకన్యను చ్యవనునకిచ్చి వివాహము చేసి) తన రాజధానికి పోయి చిరకాలము సుఖముగా నుండెను -17. సుకన్య కూడ పతిని పొంది సంతోషముతో అతనిని ఆరాధించుచుండెను. ఆమె రాజభోగములను
విడిచినారచీరలు గట్టుచు భర్తను సేవించుచుండెను -18. ఇట్లు చాలదినములు గడిచిపోగా ఒక వసంతర్తువు వచ్చిన వేళ, తపస్సుచేత ప్రకాశించెడు సర్వాంగములుగలది, చక్కని రూపగుణములతో నొప్పియున్నది, ఋతు స్నాతయునైన తన భార్యతో చ్యవనుడు అనురాగముతో నిట్లనెను -19.
తా ॥ “కల్యాణీ! నీకు శుభమగుగాక! ఇటురమ్మ! సెజ్జనలంకరింపుము. రెండు వంశములను వృద్ధి చేయు సంతానమునుబడయుము” -20. ఆ మాటలు విని సుకన్య అంజలిఘటించి భర్తతోనిట్లనెను. “స్వామీ! ఈ ఎత్తుపల్లముల దర్భశయ్యమీద నేడు సంభోగము కుదురుపడదు -21. మా పుట్టింట ఎట్టి సుందర సుసంస్కృత శయ్య పై నేను పరుండుచుండియుంటినో అట్టి ప్రియమైన శయ్యను సమకూర్చి అప్పుడు నన్నాహ్వానింపుడు -22. సుందరమైన వస్త్రములు, అలంకారములు, గంధ పుష్పాదులు, అనేకములుగా బంగారు వన్నెగలవి. తెల్లనివి, పచ్చనివి, ఎఱ్ఱనివి అయిన రత్నాభరణములు సంపాదింపుడు -23. మీరు కూడ బోవన సౌందర్యశోభితులై, వస్త్రాలంకార గంథాదులతో అలంకరింపబడిన వర్చస్విగా నా వైపు ప్రేమతో చూడుడు” -24. సుకన్య మాటలు వినిన చ్యవనుడు కలతపడిన మనస్సుతో ఇట్లనెను”. కల్యాణీ! నీ తండ్రి కున్నట్లుగా, ఈ వనమందు నివసించు నాకు ధనములేదు. -25. అట్టినేను ఎట్లు అలంకరింపగలను. సుందర రూపునిగా ఎట్లు కాగలనో చెప్పుము?”, ఆమె మఱల అంజలి ఘటించుచునే నవ్వుచు భర్తతోనిట్లనెనే. 'కుబేరుడు ధనమును, బలి, రూపమును మీ ప్రయత్నమున ఇచ్చిరనుకొనుడు” -26. చ్యవనుడు " నేను తపస్సును వ్యయపరుపజాలను”. అని భార్యకు చెప్పి చిరకాలము ఉగ్రమైన తపస్సులో మునిగిపోయెను -27. ఇట్లుండ కాలవశమున నొకనాడు వీరులైన అశ్వినీ కుమారులు అచ్చటి కేతెంచిరి. దేవతవలె ప్రకాశించుచున్న సుకన్యను గాంచిరి -28. ఆమెను సమీపించి “సుందర రూపిణివైన నీవెవరు? ఇచట ఏకాంతముగ నేల యుంటివీ? నీకు ఆశ్రయుడెవడు?” అని వారు ప్రశ్నించిరి -29. ఆమె వారి ప్రశ్నలు విని “ నేను శర్యాతిరాజు కూతురును. చ్యవనుడు నాభర్త. ఇంతకును మీరెవరో చెప్పుడు.” అనెను -30.
తా ॥ “రాజకుమారీ! మేము దేవతలమని తెలిసికొనుము. జీర్ణించి కృశించిపోయియున్న అతనితో నీవెట్లు కాపురము చేయుదువు? మా ఇరువురిలో నీకిష్టమైన ఒకనిని భర్తగా వరింపుము.” అని అశ్వినీ కుమారులు పలికిరి -31. ఆమె ఇట్లనెను. “దేవతలు నాతో నిట్లు పలుకదగునా? స్వాహాదేవి అగ్నిదేవునియందెట్లు బడ్డానురాగయై యుండునో అటులే నేనుకూడ నా భర్తకు అనువ్రతనై యుందును”-32. అశ్వినులిట్లనిరి. “నీ భర్తయగు చ్యవనుడు వచ్చి (మాతో బాటు) ఈ గంగలో ప్రవేశింపనిమ్ము. ఆ పైన మా ముగ్గురిలో నిష్టమైన వానిని వరింపుము -33. పోయి నీ భర్తనడుగుము. అడిగి తిరిగి మావద్దకు రమ్ము -34. నీవు వచ్చువఱకు మేమిచ్చటనే వేచి యుందుము.” వారిమాటననుసరించి ఆమె తన భర్తవద్దకుపోయి అశ్వినులు చెప్పిన ప్రకారమును వివరించెను -35. " నీభర్తను రూపవంతుని చేయుదుము. అప్పుడు నీవు మా ముగ్గురిలో నిష్టమైన వానిని భర్తగా వరింపుము" -36. చ్యవనుడాసక్తుడై “అటులే కానిమ్మనెను. సుకన్య భర్త అంగీకరించిన తక్షణమే అతనిని ఆ దేవ వైద్యులున్న కడకు గొనిపోయెను -37. చ్యవనుడు, వారి సూచనకు అంగీకారము తెలుపుచు, సుకన్య కోరినట్లు సత్వరమే చేయుడని వారితోననేను -38. వారిరువురు చ్యవనుని వెంటనిడుకొని గంగ వద్దకుపోయి అతనితోసహా గంగలో ప్రవేశించిరి. ఒక ముహుర్తకాలముననే వారు సౌందర్య శోభతో ప్రకాశించిరి -39. శతానీకా! నీటి నుండి వెలువడుటతోడనే వారు మువ్వురును. కల్పాదియందు జలరాశి నుండి వెలువడిన విష్ణు వ్యోమ బ్రహ్మలవలె తపోయుక్తులై గోచరించిరి. గంగలో మునిగి లేచుటతోడనే వారు ముగ్గురు సమానమైన రూపముగలవారైరి.-40.
తా ॥ సుకన్య, దేవరూపము ధరించిన తన భర్తను చూచి మిక్కిలి సంతోషించెను. కాని అతనిని తెలిసికొనలేకపోయెను -41. “ఓ దేవతలారా! నాభర్త వికారస్వరూపుడై యున్నప్పుడు అతనిని విడిచి పెట్టియుండలేదు. ఇప్పుడు మీ చేత సుందరరూపునిగా చేయబడిన అతని విడిచి యన్యునెట్లు వరింపగలను?” ఆమె చింతాక్రాంతయగుచు అశ్వినీ దేవతలతో పలికెను -43. ముగ్గురు ఒకే విధమైన శరీరములతో, సమాన వయస్కులై, ఒకే తీరైన రూపము, తేజము, సమాన వస్త్రాద్యలంకారముతో నొప్పుచున్న వారిని చూచుచు చాలా సేపు చింతలో మునిగియుండెను -42. “అశ్వినీ కుమారులారా! మీరు సుందరునిగా చేసిన నాభర్తను విడిచి పెట్టి ఇతరుని వరింజాలను. కావునా నా భర్తనే నాకు ప్రసాదింపుడు.” అని సుకన్య ప్రార్ధనగా బలికెను -44, ఆమె వారిని పూజ్యభావముతో సమ్మానించుచు అంజలి ఘటించి ప్రార్థింపగానే వారు తమ దేవ చిహ్నములను ధరించిరి -45. సుకన్య వారిని చక్కగా పరీక్షించి ఆశ్చర్యమునందెను. వారు స్వేదమాలిన్యములేక,కనురెప్పలు వేయక, నేల పై పాదము లాన్చక యుండిరి -46. ఆకారణమున “ఇదిగో ఇతడు స్వేదమాలిన్యాదులచే వాడినట్లున్నవాడు. పాదములు భూమిపై మోపియున్నాడు. కనురెప్పలు వేయుచున్నాడు.” అని తన భర్తను గుర్తించి అతనినే వరించెను -47. సుకన్య, చ్యవనుని తన భర్తగా వరించుటతోడనే పుష్పవృష్టి గురిసెను. అనేక విధములుగా దేవదుందుభులు మ్రోగెను -48. దివ్యరూపధరుడైన చ్యవనుడు సంతుష్టుడయ్యెను. మిక్కిలి హర్షముతో అశ్వినులతో, మీకు " నేనేమి ప్రత్యుపకారము చేయవలెను? -49. భార్యనిచ్చితిరి, దేవతలకు కూడ దుర్లభమైన రూపమునిచ్చితిరి. ఉపకారము చేసిన వారికి ఎవడు శ్రేష్టమైన ప్రత్యుపకారము చేయడో -50. వాడు క్రమముగా నిరువదియొక్క నరకములను పొందును. అందువలన మీకు నేను ఏదేని ఒక మహోపకారము చేసెదను -51.
తా ॥ మీ కొఱకు నేను సునిశ్చితమైన ఉపకారము చేయవలెను. దేవతలకు దుర్లభమైన యజ్ఞభాగ ఫలమును మికిచ్చెదను” -52. ఇట్లు చెప్పి చ్యవన ముని దేవతలను వీడ్కొనెను. సంతోషముతో భార్యతో కూడి తన పుణ్యాశ్రమమునకు వచ్చెను -53. తన అల్లుడగు చ్యవనుడు దేవరూపుడుగ సుందరుడైన వార్త శర్యాతి రాజు వినెను. విని అతనిని చూచుటకు మహా తేజుడైన శర్యాతి (సభార్యుడై) చ్యవనాశ్రమమునకు వచ్చెను -54. చ్యవనున కభివాదనము చేసి యథోచితముగా అతనిని పూజించెను. ఆపిదప కుమార్తెయగు సుకన్యను చూచి కుశల ప్రశ్నాదులతో పలుకరించి ఆమెను అభినందించెను -55. శిరస్సు మూర్కొని అక్కున చేర్చికొనెను.సుకన్య తల్లి కూడ ఆమెను ప్రేమతో కౌగిలించుకొనుచు ఆనంద బాష్పములురాల్చెను. శర్యాతి భార్యతో సహా మిక్కిలి సంతోషించుచు సుకన్యను తమ దగ్గర కూర్చుండబెట్టుకొనిరీ -56. పిమ్మట చ్యవనుడు సంతుష్టుడైన శర్యాతిని గాంచి ఇట్లనెను. “రాజా! నేను మీతో ఒక యజ్ఞము చేయింపదలచితిని. దాని కొఱకు మీరు సామగ్రినంతయును సమకూర్పుడు” -57. ఈ మాట విని రాజు (అంగీకారముగా) చ్యవనమునికి నమస్కరించి, యజ్ఞసంభారములు సమకూర్చుటకొఱకుగాను సంతోషముతో రాజధానికి ప్రయాణమైపోయెను -58. వెంటనే యజ్ఞద్రవ్యములను సేకరించి తెచ్చుటకై ఆయా ప్రదేశములకు మనుష్యులను బం పెను, యజ్ఞము నిర్విఘ్న పరిసమాప్తినొందుటకై సమాలోచనలు జరుపుటకు మంత్రులను, పురోహితులను, గురువులను సమావేశపరచేను -59. ఆయావస్తు సంభారములన్నియు సమకూడినంతనే విశుద్ధాత్ముడైన చ్యవనుడు సుకన్యతో గూడి అచటికేతెంచెను -60.
తా ॥ అతడు; అత్రి, అంగిరసుడు, భార్గవుడు మొదలగు పెక్కురు మహర్పులతో సహా పూజింపబడగానే, ఉత్సాహవంతమై అతిశయముతోగూడిన యజ్ఞధ్వానము (హవిర్షాన మంత్రములు) వినెను-61. శర్యాతి మహారాజు యజమానుడుగా నిర్వహింపబడు ఆమహాయజ్ఞమునందు ఋత్విక్కులు తమతమ కర్మలలో నిమగ్నులై అగ్నిహోత్రమునందు స్వాహాకారపూర్వకముగ వ్రేల్చుచుండగా దేవతలందఱును తమతమ యజ్ఞభాగములను స్వీకరించుటకై అచటికేతెంచిరి-62. శాస్త్రోక్త విధానము చేత యజ్ఞభాగములు ప్రవృత్తములగుచుండగా చ్యవన మహర్షిచేత ఆహ్వానింపబడి అశ్వినీ కుమారులు కూడ అచటికి వచ్చిరి-63. అశ్వినులు ఆహ్వానింపబడగానే చ్యవనునితో ఇంద్రుడిట్లనెను. “ఋషివర్యా! వీరిని యజ్ఞభాగాన్వితులనుగా చేయకుము. వీరు దేవవైద్యులేకాని దేవతలు కారు. అందుచే భాగమునకరులుకారు"-64. చ్యవనుడు ఇంద్రునికిట్లు సమాధానము చెప్పెను. "వీరిరువురును దేవతలే, నాకు వీరు ఉపకారము చేసినవారు, వీరికి నిస్సంశముగ యజ్ఞభాగమునిత్తును”-65. అప్పుడింద్రుడు కోపముతో చ్యవనునితో నిట్లనెను. "బ్రహ్మర్షీ! యజ్ఞభాగము వారలకిచ్చితివేని వజ్రాయుధముతో నొక్క వేటు వేసెదను"-66. ఈ రోష వాక్యము విని చ్యవనుడు ఏమియు పలుకక మౌనముగనుండెను. స్రువము లేవనెత్తి సమంత్రకముగ నశ్విను లిరువురుకును హవిర్భాగముల నిచ్చేను-67. అప్పుడింద్రుడు వజ్రాయుధము నెత్తి వదలుటకుద్యమించెను, కాని వజ్రాయుధముతో కూడ, ఎత్తినవాడెత్తినట్లుగనే, చ్యవనుని చేత ఇంద్రుడు, స్తంభింపజేయబడెను-68. వశియైన చ్యవనుడిట్లు ఇంద్రుని స్తంభింపజేసి, అశ్వినులకు భాగములనిచ్చి యజ్ఞకర్మలను ఫలవంతముగా సమాప్తిచే సెను-69. వెంటనే బ్రహ్మదేవుడచటికేతెంచి చ్యవనునితో నిట్లునుడివెను. “ఇక నుండి అశ్వినులకు యజ్ఞభాగము ఉండును. ఈ ఇంధ్ర స్తంభన చిత్రమును ఉపసంహరింపుము"-70.
తా ॥ అప్పుడీంద్రుడు హృష్టమనస్కుడై చ్యవనునితో నిట్లనెను. “చ్యవన మహర్షీ! ఉత్తమమైన నీ తపశ్శక్తిని నేనెఱఁగుదును-71. నీ ఈ తపశ్శక్తిని ప్రసిద్దము చేయుటకే నేనిదంతయు చేసితిని. నేటినుండి మొదలుకొని అశ్వినీ కుమారులకు దేవత్వముతో బాటు యజ్ఞభాగముకూడ ఉండుగాక.72 ఏ శుద్దాత్ముడు ఈ నీ తపఃప్రఖ్యాతిని గుఱించి చదువునో లేక వినునో వాని పుణ్యఫలమును వినుము-73. సూర్యలోకమునకు వెడలి అటునుండి చంద్రలోకమునకుఁబోయి, ఆపై శివలోకము, అటుపిమ్మట విష్ణులోకము చేరి నిత్యయౌవనుడై క్రీడించుచుండును. ఇందు సంశయము లేదు-74”. ఇట్లు చెప్పి ఇంద్రుడు సత్వరమే స్వర్గమునకు వెడలిపోయేను. చ్యవనుడు భార్యతోడను శర్యాతి తోడను గూడి ఆశ్రమమునకు పోయెను-75. ఆశ్చర్యకరముగా నచట దేవనిర్మితమైన చక్రవర్తి సౌధము వంటి సౌధమును చూచేను. ఆభవన రాజము శ్రేష్టములైన శయ్యాసనములతో సకలవాంఛసిద్ధిదములైన సర్వవస్తువులతో నిండియుండెను-76. ఉద్యాన వనములు, నడబావులు దేవేంద్రునిచే సమకూర్పబడియుండెను. ఆ గృహము భూమియందలి స్వర్గము వలె ప్రకాశించుచుండెను-77. వివిధ మణి మాణిక్యఖచితములైన దివ్యాభరణములు, విలువైన శుద్ధ వస్త్రములు, దివ్యములైన ఉత్తరీయములు, (మేలిముసుగులు) అట విలసిల్లుచెండెను-78. చ్యవనమహర్షి భార్యతో సహా వాని నన్నింటిని సాకల్యముగా చూచి పరమానందభరితుడై ఇంద్రుని మెచ్చుకొనెను-79. ఈ విధముగా విదియ అశ్వినుల కిష్టమైన తిథి. ఈ దినముననే వారు దేవత్వము పొంది యజ్ఞభాగమునకరులైరి-80.
తా ॥ రాజా! ద్వితీయనాడు పాటింపవలసి ఉపవాసాది వ్రత విధానమును గూర్చి వినుము. సుందరమైన రూపమును గోరువాడీ వ్రతమాచరింపవలేను-81. కార్తీక శుక్లపక్ష ద్వితీయనాడు మొదలుకొని నియమవంతుడై ఒక సంవత్సరము వఱకు పుష్పములను మాత్రమే ఆహారముగా స్వీకరింపుచుండవలెను-82. ఆయా ఋతువులయందు లభించు ఖాద్య పుష్పములను బ్రాహ్మణుల కిచ్చి తాను భుజింపవలెను-83. ఆవ్రత సమాప్తియందు బంగారము లేక వెండి పూలు లేక తామర పూలు బ్రాహ్మణులకు దానమీయవలెను. దానితో నాశ్వినులు తృప్తినందుదురు-84. ఇష్టమైన చోటికి ప్రయాణము చేయగల మిక్కిలి తేజోవంతమైన దివ్యవిమానము నిచ్చెదరు. చిరకాలము స్వర్గమున స్త్రీలతో రమించుచుండవచ్చును-85. వ్రతమాచరించిన వాడీట్లు సర్వభోగము లనుభవించి కల్పాంతమున ఇహలోకమున పూజ్యుడగు బ్రాహ్మణుడుగా జన్మించును. ఏడు జన్మములలోను ఇతడు వేద వేదాంగములలో విద్వాంసుడైయుండును-86. ప్రతి జన్మలోను విద్వాంసుడుగనుండుటయే కాక కృతయుగమునందు గొప్పదాతయై, యజ్ఞములు చేయువాడై చక్కని వక్తయై, మనోవ్యధలు శారీరక రుగ్మతలులేనివాడై-87. పుత్ర పౌత్రులతో గూడి, భార్యతో కలిసి చిరంజీవియై వర్ధిల్లును. లేక మధ్యదేశమునందలి ఒక మహానగరము రాజధానిగ గొప్ప రాజ్యమునుకు రాజగును-88. ఇట్లు పుష్పద్వితీయగా పేరొందిన వ్రతమును నీకు తెలియజెప్పితిని, ఫలద్వితీయ మఱియొకటి కలదు. అది విష్ణువుపవళించు దినమున నారంభమగును-89. ఈ వ్రతము మిక్కిలి పుణ్యప్రదమైనది. పాపసంహారకమైనది. విష్ణువునకు ప్రియమైనది. కురునందనా! 'అశూన్యశయన' అను పేరుతో కూడ ఈ వ్రతము లోకమున ప్రఖ్యాతినందినది-90. శ్రద్ధాభక్తుల పూర్వకముగ ఈ దినమున ఉపవసించిన మానవుడు సర్వవస్తు సమృద్ధిగల ఐశ్వర్యము నంది భార్యతో సుఖ జీవనము చేయును-91.
శతార్థ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ద్వితీయా కల్పమునందు శర్యాత్యాఖ్యానము, పుష్పద్వితీయా వర్ణనమను పందొమ్మిదవ అధ్యాయము.
