భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

32. పంచమీ కల్పమున నాగపంచమీ వ్రత వర్ణనము

తా॥ సుమంతుముని యిట్లనెను. పంచమితిధి నాగులకు ప్రియమైనది. ఆనందమును వృద్ధి చేయునది. ఈ తిథినాడు నాగులకు ఒక గొప్ప ఉత్సవము జరుగునట-1. వాసుకి, తక్షకుడు, కాలియుడు, మణిభద్రుడు, ఐరావతుడు, ధృత రాష్ట్రుడు, కర్కోటకుడు, ధనంజయుడు, ఈ మహా సర్పములు ప్రాణులకభయ మిచ్చును-2. పంచమినాడు నాగులకు క్షీరాభిషేకము చేయువారి కులమున నేవరికి సర్పభీతి కలుగకుండ అభయమును, భద్రతను, ధనమును ఇత్తురు-3. మాతృశాపముచేత నహర్నిశలును దహించుకొని పోవుచుండిన సర్పములకు గోక్షీర మిశ్రితమైన జలముతో స్నానము చేయించిన యెడల వానికి దాహశాంతి కలుగును-4. భక్తి శ్రద్ధలతో నాగులకు స్నానము చేయించినవారి కులమున సర్ప భయముండదని నిశ్చయము"-5. శతానీకుడిట్లనెను. నాగులు తల్లి శాపము నెట్లుపొందిరి. ఏకారణము నుద్దేశించి శపింపబడిరి? ఎవరి అనుగ్రహమున శాపమునుండి ముక్తులైరి”-6. సుమంతుముని ఇట్లనెను. దేవదానవులు సముద్ర మధనము చేయగా అందుండి అమృతముతోబాటు ఉచ్చైశ్రవముఅను పేరుగల తెల్లని అశ్వరత్నము పుట్టెను. దానిని చూచి నాగమాతయైన కద్రువ, తన సపత్నియైన వినతతో నిట్లనెను-7. సముద్రము నుండి పుట్టిన ఈ అశ్వశ్రేష్ఠము తెల్లనిదిగా కన్పట్టుచున్నది. కాని చూచితివా! దానితోక వెంట్రుకలు నల్లగా నున్నవి”-8. వినత యిట్లనెను. ఈ అశ్వరాజము మొత్తము తెలుపు వన్నెలోనే యున్నది. నలుపుగాని ఎఱుపుగాని లేదు. నీవు ఈ తెల్ల గుజ్జమున నలుపు నేట్లు చూచుచుంటివి?” అని వినత యనగానే-9. కద్రువ ఇట్లు బదులు పలికెను. నేను ఒంటి కంటితోనే ఈ గుఱ్ఱమును నల్లని తోకతోనున్నట్లు చూచుచుంటిని రెండు కండ్లతో చూచెడు నీకు తోక నలుపు కనుబడుటలేదా? అటులైన పందెము వేయుము.

తా॥ వినత యిట్లనెను. గుఱ్ఱపు తోకకు నల్లని వెంట్రుకలు చూపినచో నేను నీకు దాసినగుదును. లేనిచో - అనగా నల్లని వెంట్రుకలు చూపజాలనిచో కద్రువా! నీవు నాకు దాసివి కావలయును-11. ఇట్లు వారు పందెము కాచి కోపముతో తమ స్థానములకు వెడలిపోయిరి. వినత నిదురించియున్న సమయమున కద్రువ ఒక కపటోపాయమును ఆలోచించెను -12. తన పుత్రులైన నాగులను పిలిచి కద్రువ వారితో నిట్లనెను. పుత్రులారా! మీరు శ్వేతాశ్వవాలమున నల్లని వెంట్రుకల రూపముననుండుడు. అట్లు చేసితిరేని, నేను, విజయము నందిచగల వీనతను పందెమున నోడింతును”-13. తన తల్లి పన్నిన కపటోపాయమును గ్రహించి వారు తల్లితో, “ఇది అధర్మము. మేము నీ మాటను పాటింప జాల” మనిరి-14. వారి మాటలు విని కద్రువ కోపముతో “మిమ్ము అగ్ని దహించివేయునుగాక ” అని శపించెను. బహుదినములు కాలము గడచిన పిమ్మట పాండవ వంశీయుడైన జనమేజయుడు-15.ఇతరుల సాయముతో, భూలోకమున దుష్కరమగు సర్పయాగము చేయును. ఆ యాగమునందు తీర్ఘమైన తేజస్సుగల అగ్నిదేవుడు మిమ్ము మ్రింగివేయగలడు”-16. ఇట్లు శపించి, క్రుదురాలైన కద్రువ మిన్నకుండెను. అట్లు తల్లిచేత శపింపబడిన నాగులు కర్తవ్యము తోచక దుఃఖితులైరి-17. వాసుకి దుఃఖమును గమనించి బ్రహ్మదేవుడని ననునయించేను. వాసుకీ! మిక్కిలిగా దుః ఖింపకుము. నేను చెప్పెడి మంచి మాటనొకదానిని వినుము-18. యాయావర (యాచక) కులమున జన్మించిన జరత్కారువనునొక బ్రాహ్మణుడు కలడు. అతను తేజస్వి, తపోనిధీయును కాగలడు-19. మీ సోదరియగు జరత్కారువు నాతని కిచ్చి పెండ్లిచేసిన వారికి ఆస్తీకుడను పేరుగల ప్రఖ్యాతుడగు పుత్రుడు కలుగును-20. ఆతడు నాగులకు భయమును కలిగించునా సర్పయాగమును తన వాక్చతురతతో నిరోధించి ప్రశంసలందుకొనును.

తా॥ అందువలన ఓ వాసుకీ! ఆ జరత్కారునకు మీ సోదరియగు జరత్కారువును ఇమ్ము, ఏమియు విచారింపక ఇచ్చెదవు గాక-22. ఆ అరణ్యమున అతడేమి కావలెనని కోరునో, ఏది చెప్పునో అది అంతయును నిస్సందేహముగ నెరవేర్పవలెను. మా శ్రేయమునందిచ్చ యున్నచో నట్లు తప్పక చేయవలెను''-23. బ్రహ్మదేవుని ఈ వాక్యములు విని వాసుకి అతనికి ప్రణమిల్లి, గట్టిపూనికతో నతడు చెప్పినయట్లు చేసెను -24. బ్రహ్మదేవుని మాటలు విన్న సర్పములన్నియు, సంతోషముతో వికసించిన నేత్రములు గలవియై తమకు పునర్జన్మ కలిగినయట్లు తలచేను-25. రాజా! నీ తండ్రియగు జనమేజయుడు సర్పయాగమును ప్రారంభించెను. లోకమున నెవరికిని చేయుటకు సాధ్యముకానీ ఆ మహాయాగమునాతడు ప్రవర్తింపజేసెను-26. సర్పములకు భయకారకమగు సర్పయాగమొకటి యవశ్యముగా జరుగునని పూర్వము శ్రీ కృష్ణుడు ధర్మ రాజుతో చెప్పియుండెను-27. అందువలన నాగులకు భయము కలిగించు దారుణమైన సర్పయాగము, నూడు సంవత్సరముల అనంతర కాలమున జరుగును-28. తల్లిమాట పెడచెవినిబెట్టి అధర్మమాచరించినట్టి విష భరిత సర్పములు కోట్ల కొలదిగ రాత్రింబగలు హోమ కుండములలో పడగలరు-29. అపూర్వము, ఘోరమునై, భగభగమండుచున్న అగ్ని సముద్రమున మునిగిపోవుచుండెడు నాగుల పాలిట నౌక వలె ఆస్తీకుడచటికి రాగలడు.

తా॥  “సర్పయాగ విషయము నంతయును విని ఆస్తీకుడు తన హజ్నెపుణ్యముచేత అగ్నిని, యజమానియగు జనమేజయుని, ఆ పిదప ఋత్విక్కులను తమ ఉద్యమము నుండి విరమింపజేయగలడు” అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో(జెప్పెను)” అట్లునాగులను నాశనముచేయు యాగమును ఆపివేయగలడు" -31. పంచమితిధియందే బ్రహ్మ దేవుడు సర్పములకు ఆస్తీకుని విషయమును చెప్పెను. అందువలన ఈ తిధి వానికిచాల ప్రియమైనది. ఇట్లు బ్రహ్మచేత, నాగులకానందము కలిగించునీ పంచమి నాగపంచమిగా నీయబడినది-32. ఆ దినమున మొదట బ్రాహ్మణులకు భోజనము పెట్టి, పుచ్చి, నాగులను ఇట్లు ప్రార్థింపవలేను. పృధివీతలమందు-33. సూర్య కిరణములందు, అంతరిక్షమునందు, నదులయందు, ప్రవాహములయందు, బావుల యందు, చేరువులయందును గల మహా సర్పములకు నమస్కారము. అవి యన్నియును నా యెడ ప్రసన్నములగుగాక”-34. నాగులను, బ్రాహ్మణులను యథావిధిగా పూజించి సంతృప్తి చేయవలెను. అప్పుడు తాను తన అనుచరవర్గముతో కూడ భుజింపవలెను-35. మొదట తీపి పదార్థమును తిని ఆపై తన యిష్టమైన పదార్థములు తినవలయును. ఇట్లు పంచమితిథినియమము నాచరించిన వానికి గలుగు ఫలమెట్టియో చెప్పెదను తెలిసికొనుము-36. మరణించిన పిదప నాతడు అప్సరసలతో పూజింపబడి నాగ లోకమునకుఁ బోవును. విమానము నధిరోహించి తన యిష్టమైనంత కాలము క్రీడించును-37. ఈ లోకమునకు వచ్చి పదివేల మంది రాజన్యులలో రాజశ్రేష్ఠుడగును. వజ్రవైడూర్యమణి మాణిక్యాది సమృద్ధి కలిగి, వాహన యోగము కలిగియుండున-38. ప్రతి ద్వాపరయుగమున ఐదేసి పర్యాయములు రాజుగా జన్మించును. శారీరక మానసిక వ్యాధులు లేకుండగ భార్యాపుత్రుల సేవలందుచు సుఖముగ జీవించును. కాబట్టి ఆ దినమున సర్పములను పూజింపవలెను. ఘృతము, పాయసము, గుగ్గులు మున్నగువానిచే పోషింపవలెను”-39. శతానీకుడిట్లనెను. బ్రాహ్మణోత్తమా! క్రోధముతో సర్పములు కాటువేసిన మనుష్యున కేమగునో వివరించి చెప్పుడు.

తా॥ సుమంతుముని యిట్లనెను. పాముచే కాటు వేయబడిన మనుష్యుడు మరణించి పాతాళ లోకమునకుఁబోవును. అచటికిబోయి విషములేనీ సర్పముగ మారును. సందేహములేదు-41. శతానీకుడిట్లనెను. సర్పదష్టుడైన వాని తండ్రిగాని, అన్నగాని, కూతురుగాని, తల్లిగాని, కొడుకుగాని, భార్యగాని ఏమి చేయవలెనో నాకు తెలుపుడు. అట్లు మరణించిన వాని మోక్షము కొఱకు చేయవలసిన దానము, వ్రతము, ఉపోషణముల గూర్చి చేప్పుడు. నేను కూడా దానినే అనుసరించెదను”-43. సుమంతుముని యిట్లనెను. నాగులకు పుష్టివర్ధిని యైన పంచమినాడు ఉపవసింపవలెను. ఆనాడు అనుష్టింపవలసిన ఒక విధానమును గుజించి వినుము-44. భాద్రపద కృష్ణ వక్షమునందలి పంచమి మిక్కిలి పుణ్యప్రదమైనదిగా చెప్పబడినది. దానినట్లు గ్రహింపవలేను-45. సంవత్సరమున పన్నెండు పంచమి తిథులును పవిత్రములైనవిగా తెలియవలెను. చతుర్టీనాడు ఒకే పూట రాత్రి భోజనము చేయవలేనని చెప్పబడినది-46. నేల పై నాగుల చిత్రములను చిత్రించిగాని, లేక వెండి (బంగారము) కట్టి, మట్టితోగాని ఐదు నాగ ప్రతిమలను చేయించి-47. పంచమినాడు భక్తి శ్రద్దలతో, గన్నేరు, తామర, మల్లెపూలతోను-48. గంధ ధూపాదులచేతను నాగ పంచకమును పూజింపవలెను. ఆ పిమ్మటనేయి, పాయసము, లడ్డువములతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను-49. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు,కంబలుడు,కర్కోటకుడు,అశ్వతరుడు,ధ్రుృతరాష్ట్రుడు,శంఖపాలుడు కాలియుడు, తక్షకుడు, పింగలుడు - ఈ పన్నెండుగురు నాగ శ్రేష్టులను పన్నెండు మాసములలో క్రమముగా పూజింపవలెను-51. సంవత్సరాంతమునందు పారణ (ఉపవాస దీక్షా నంతరము భోజనము) ఉండును. ఆ దినమున చాలామంది బ్రాహ్మణులకు భోజన సంతర్పణ చేయవలెను. ఇతి హాస విదుడు, వక్తయునైన బ్రాహ్మణునర్పించి అతనికి సువర్ణనాగ ప్రతిమను దానము చేయవలెను.

 తా॥ ఇది బుధుల చేత చెప్పబడిన నాగపంచమి వ్రత విధానము. మీ తండ్రి కూడా దీనిని తన తండ్రికి ముక్తి కలిగించుటకు జేసెను-53. నీవు కూడా ప్రతి పంచమికిని ఒక్కొక్క సువర్ణ నాగ ప్రతిమను, గోవును-54. జ్ఞాన వృద్ధుడైన బ్రాహ్మణునకిచ్చి పితౄణము నుండి ముక్తుడవుకావచ్చును. రాజా! నీ తండ్రి కూడ నిటులే పంచమ్యుపాసన చేసియుండెను-55. నీ తాతయగు పరీక్షిత్తు సర్పరూపమును విడిచి, చంద్రలోక సూర్య లోకములు, ఆ మీద స్వర్గలోకము ఆ పిదప కైలాసము, ఆపై విష్ణు లోకమునకుఁ బోయి తరువాత బ్రహ్మ పదమునందెను-57. ఇతరులెవరైనను ఈ శ్రేష్ఠమగు వ్రతమునాచరించిరేని, వారికి సంబంధించిన వారెవరైనను సర్పదష్టులై మృతి చెందినయెడల నట్టివారు సర్పత్వమునుండి ముక్తులై ఉత్తమ గతిని పొందుదురు-58. శ్రద్దాయుక్తుడై ఇది నిత్యమును వినువాని కులమున నెప్పుడును సర్పభయముండదు.

శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య పురాణము నందలి బ్రహ్మ పర్వమున, పంచమి కల్పమునందు నాగ పంచమి వ్రత వర్ణనమును ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.