భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
52. సప్తమీ కల్పమున సూర్యపూజా సృష్టి వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “శంఖము, చక్రము, గద ధరించియున్న భగవానుడగు శ్రీకృష్ణదేవుడిట్లు చెప్పి సాంబుడు చూచుచుండగనే యంతర్షితుడయ్యెను. సాంబుడు కూడ విధి ప్రకారముగ రథసప్తమి వ్రతము నాచరించి యాధివ్యాధులనుండి ముక్తుడై వెంటనే స్వీయమందిరమున కరిగెను.” శతానీకుడిట్లు పలికెను. “రథయాత్ర యెట్లు చేయవలెను? సూర్యరథమునెట్లు నిర్మింపవలెను? ఈ సూర్య రథయాత్రా విధానమును మానవలోకముననెవరు ప్రవర్తింపజేసిరి?. సుమంతుముని యిట్లు సమాధానము చెప్పెను. “పూర్వము కాంచన సర్వతము పై సుఖాసీనుడైయున్న పద్మసంభవుడగు బ్రహ్మదేవుని రుద్రుడిదే ప్రశ్నయడిగెను. తామర చూలి పద్మాసనమున సుఖముగ కూర్చుండి యుండిన వేళ రుద్రుడాతనికి శిరమువంచి నమస్కరించి యిట్లు పలికెను. "దేవా! లోకమునకంతటికిని వెలుగును ప్రసాదించు నీ సూర్యభగవానుడు ఎల్లప్పుడు స్వచ్చుడే రథము పైనెట్లుసంచరించుచుండును?. ఆప్రశ్న విని బ్రహ్మదేవుడిట్లు ప్రత్యుత్తరము చెప్పెను. “ఓ త్రిలోచనా! భాస్కరుడు రథారూఢుడై యాకాశమున నేట్లు తిరుగుచుండునో ఆతని రథమెట్టిదో వివరించెదను. ఒకే చక్రము, ఐదాకులు, మూడు నాభులు, కలిగి, సువర్ణమయమై, కాంతిమంతమై, అష్టబంధములు, ఒక కమ్మితోడి చక్రముగల. ప్రకాశవంతమైన రథమునందు విరాజమానుడై సూర్యుడంతరిక్షమునఁ దిరుగుచుండును. ఈ రథవైశాల్యము పదివేల యోజనములని చెప్పుదురు రథోపస్థ కంటే నీషాదండము మూడు రెట్లధికమైనది. దీని కాడి మిక్కిలి వెడల్పైనది. దాని పై రథసారధియగు అరుణుడు కూర్చుండును.
తా॥ రథమునకు గల దివ్యమైన బంగారపు కాడికి వాయువేగమున పరుగెత్తగల గుఱ్ఱములు అమర్చబడియుండును. ఛందస్సులే ఆ గుఱ్ఱముల రూపముననుండి చక్రమును త్రిప్పుచుండును. ప్రకాశవంతమైన ఇట్టి రథముతో సూర్యభగవానుడంతరిక్షమునఁ దిరుగుచుండును. ఇక చెప్పబోవునవి సూర్యరథ ప్రత్యంగములు. సంవత్సమునకుగల అవయవములే, క్రమముగా ఈ రథాంగములుగ కల్పింపబడినవి. చక్రమునకు గల నాభిత్రయమే మూడు కాలములు. బండికంటియాకుదును ఐదు ఋతువులు. నేమితో ఆజు ఋతువులు. తిన్నెలు రెండును దక్షిణోత్తరాయనములు. అమ్ములు ముహూర్తములు, చీలలు కళలు, కోణములు కాష్ఠలు, అక్షదండము క్షణములు. ఒరిపిడులు నిమేషములు, ఈషాదండము లవములు, రథము మీది కప్పురాత్రి, పైన ప్రతిష్ఠింపబడిన విల్లు ధ్వజము. కడియంచులు రెండును అర్థకామములు. అశ్వరూపములగు ఛందస్సులు సవ్యముగ భారము వహించును. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉషైక్ అనునవి యేడు ఛందములు. చక్రము అక్షమునకు బద్ధమైయుండును. అక్షము ధ్రువమునందమర్పబడియుండును. చక్రముతో కూడి అక్షము కూడ తిరుగుచుండును. ఈ అక్షముతో కూడిన చక్రము ధ్రువము పై తిరుగుచుండును. ధ్రువము నందు పొదగబడి అక్షము, చక్రమును కలుపుకొని తిరుగుచుండును ఇట్లు అక్షవశమున రధ సునివేశమేర్పడును. ఇట్లన్నింటిని కలుపుకొని రవీరథము సిద్ధమగును. అట్టిరథము పై సూర్యదేవుడాకాశమున తిరుగుచుండును.
తా॥ కాడికన్ను అంచులకు కట్టబడిన రెండు పగ్గములు, రథమునకుండును. రెండు చక్రములందు కాక ఆ పగ్గములు రెండు ధ్రువములయందు తిరుగుచుండును. సూర్యరథము వలయములుగ తిరుగుచుండ సూర్యబింబమన్నిదిశలుగా కుమ్మరివాని చక్రమువలె (తనచుట్టుతాను) తిరుగుచుండును. ఉత్తరాయణమున, మండలావృత్తులయందు, రథమునకు గల దక్షిణ ధ్రువమునందలి కాడికన్నంచులకు గల పగ్గములను, ఋగ్వేద యజుర్వేదములచే గ్రహింపబడిన ఛందోరూప విచక్రాశ్వముప్రొస్వీకరించును. దక్షిణాయనమున అవి నిడుపులై వలయములు తిరుగుచుండును. రథము యొక్క యుగాక్ష కోటులురెండును, అంటియునంటనట్లన్ని దిశలుగ మండములుగా పరిభ్రమించుచుండును. ధ్రువముచేత నాకర్షింపబడినప్పుడు సూర్యబింబము సమముగ నుండును. ఆ సమయమున లోలోపలనే వలయములుగ తిరుగుచుండును, ధ్రువాకరణము నుండి విడివడి మఱల పగ్గములనుండియు విడిపోయినప్పుడు సూర్యుడు బాహిరముగనే వలయములు తిరుగుచుండును. రెండు కాష్ఠల కాలమున (పదునెనిమిది జెప్పపొట్లకాలము ఒక కాష్ఠ) రథముతో కూడ సూర్యుడు, దేవతాదృషులచేత నూట యెనుబది వలయములుగ తిరుగును. క్రమముగ నొక్కక్కరితో రెండేసి మాసముల చొప్పున సూర్యుడు, గంధర్వులతో, అప్సరలతో, సర్పములతో, రాక్షసులతోనుండును.
తా॥ ధాత, అర్యముడు అను ఆదిత్యులు; పులస్త్యుడు, పులహుడు అను బ్రహ్మమానస పుత్రులు; ఖండకుడు, వాసుకి యనేడు నాగులు; సకుడు, రశ్మి. తుంబురుడు, నారదుడు అను గాయక శ్రేష్ఠలగు గంధర్వులు; క్రతుస్థల, పుంజికస్థల యనునప్సరసలు. గ్రామణి (గంధర్వుడు) రధకృత్సుడు, రజుడు అనుయక్షులు, అశ్వతరుడు (నాగుడు) హేతి, ప్రతి యను పేళ్లుగల రాక్షసులు. వీరు చైత్రవైశాఖ మాసములలో సూర్యునియందుందురు. అటులే జ్యేష్ఠ, ఆషాడ మాసములలో మిత్రుడు వరుణుడు. అత్రి, వసిష్ఠుడు, అనుఋషులు తక్షకుడు, అనంతుడు; అనుసర్పవరులు, మేనక, సహజన్య, అను అప్సరసలు హాహాహూహూ అను గంధర్వులు. రథస్వనుడు, రథచిత్రుడను యక్షులు; పౌరుషేయుడు, వధుడు అను బలవంతులైన రాక్షసులు. సూర్యునితోనుందురు. ఇక శ్రావణ భాద్రపదములలో ఇంద్ర వివస్వతులను ఆదిత్యులు, అంగిరుడు, భృగుడు అనుఋషులు. ఏలాపర్ణుడు, శంఖపాలుడను సర్పములు, ప్రహ్లిచ, దుందుక అను పేర్లు గల అప్సరసలు, భాను, దుర్గురుడు అనుగంధర్వులు సర్పుడు, బ్రహ్మఅను రాక్షసులు, సూర్యునిలోనుందురు. ఆశ్వయుజ కార్తికమాసములలో పర్జన్యుడు, పూషుడు అను ఆదిత్యులు, భరద్వాజ గౌతమ ఋషులు.
తా॥ చిత్రసేనుడు, వరరుచియను గంధర్వులు, పుణ్యలక్షణములుగల విశ్వాచి, ఘృతాచి యనునప్సరసలు. ఐరావతుడు, ప్రసిద్ధుడైన ధనంజయుడు అను నిద్దజు నాగులు; సేనజిత్తు, సుషేణుడు అను యక్షులు. ఆపుడు, వాతుడు అను నిరువురు రాక్షసులు సూర్యునిలోనుందురు. ఇక మార్గశీర్ష, పుష్యమాసములలో అంశువు, భగుడు అనునాదిత్యులు; కశ్యపుడు, క్రతువు అను ఋషులు. మహాపద్ముడు, కర్కోటకుడు అను సర్పశ్రేషులు, ఆపుడు వాతుడునను రాక్షసులు. చిత్రాంగదుడు, అరుణాయువు అనుగంధర్వులు, సహా, సహస్యా అను పేరుగల యప్సరసలు. తార్య అరిష్టనేమియను యక్షులు, సూర్యునందుందురు. ఇంకను మందేహులను రాక్షసులు, సూర్యదేవుని, దేవ రహస్యమును కాపాడుటకు, నేను మొదలుకొని యందు దేవతలచే నియమింపబడిన వారు సూర్యునియందుందురు. మాఘ పాలున మాసములలో పూష, జిష్ణు అను నాదిత్యులు, జమదగ్ని విశ్వామిత్ర ఋషులు, కంబలుడు, అశ్వతరువు అను మహానాగులు. ధృతరాష్ట్రుడు, సూర్యవర్చయను గంధర్వులు, సర్వలోక ప్రసిద్ధలగు తిలోత్తమ, రంభయనునప్సరసలు. సేనజిత్తు, సత్యజిత్తు అనుయక్షులు, బ్రహ్మోపేతుడు, యజ్ఞో పేతుడునను రాక్షసులు సూర్యునాశ్రయించియుందురు. వారిని గూర్చి నీకు చెప్పెదను.
తా॥ రుద్రుడిట్లనెను. “ఓ బ్రహ్మదేవా! నేను ఏ దివ్యకథను గుఱించి మిమ్ముఅడుగుటకు వచ్చితినో యద్దానిని నాకు త్వరగా చెప్పుడు. ఆకాశము నందున్న సూర్యదేవునిఁజూచి, యే విధానముగా నమస్కరింపవలెను ఆకర్మ పరిసమాప్తిలో నెట్టి ఫలము కలుగును. దానికి బ్రహ్మయిట్లు సమాధానము చెప్పెను. “రుద్రదేవా సూర్య నమస్కారమును గుఱించి సాకల్యముగఁ జెప్పెదను వినుము. సూర్యనమస్ర్కియచేయు రోగదుఃఖార్తులు తమ రోగరూప పాపకోశమునుండి ముక్తులగుదురు. అప్పుడే వేసిన ఆవు పేడతో అలికిన నేల పై స్థండిలము వేసి, దానిపై మండలము చేసి, దానిమీదనే సూర్యదేవునివాహనము చేయవలెను. శ్రీ గణేశ్వరునాదిగ, వాసుదేవుడు, సాత్యకి, సత్యభామ, లక్ష్మి, ఉమ, శంకరుడు. మండలస్థులైన పూర్వోక్తదేవతలు మున్నగువారిని వేదమంత్రవేత్తయే పూజింపవలెను.అప్పుడు ప్రదక్షిణము చేసి ఒక పర్యాయము సాష్టాంగ నమస్కారము చేయవలెను ఏకాగ్రచిత్తుడై, తనశక్తిని చూచుకొని, తనపాపరాశిననుసరించి, వంద, వేయి, పదివేలు, లక్షపర్యాయములు సూర్యునకు నమస్కారములు చేయవలెను. ఉచ్చ్వాస తీసికొనకుండ, సమాహితుడై బ్రాహ్మణునకు నూఱు బంగారు నాణెములు, వేయి రాగి నాణెములు దక్షిణనీయవలెను. సోలుగు మాషలు (మాష=ఐదుగురి గింజలయెత్తు) లేక పదివేలు లేక దానికి పదిరెట్లు శక్తికొలదిగనీయవలెను. రోగవిముక్తి కొఱకు సమర్థుడైన వాడు పదిరెట్లు ఈయవలెనని చెప్పబడినది. ఓ విరూపాక్షా! ఇట్లుచేసినచో సర్వరోగముల నుండి ముక్తులగుదురు. ఈ విధానము శ్రేష్ఠమైనది. రహస్యమైనది. దీనిని శ్రద్దగా వినెడి మానవునకును. సూర్యభగవానుని యనుగ్రహమువలన రోగములన్నియు నశించిపోవును. సూర్యరధరక్షణము చేయువారి నియామకమును గణించియు, ఇంకను నీవడిగిన ఇతర విషయముల గుణించియు చెప్పెదను వినుము.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యపూజావర్ణనమను ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
