భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
76. నారద సాంబ సంవాదమునందు సూర్య పరివార వర్ణనము
తా॥ నారదుడిట్లనెను. “ఒకప్పుడు లోకములు పర్యటించుచు నేను సూర్య లోకమును చేరితిని. అచట దేవతలందఱిచే పరి పేష్టింపబడి విరాజమానుడైన సూర్య భగవానుని దర్శించితిని-1. అతడు గంధర్వులు అప్సరలు, నాగులు, యక్షులు, రాక్షసులు మున్నగువారితో చుట్టుముట్టబడియుండెను. గంధర్వులు గానములాలపించుచుండిరి. అప్సర స్త్రీలు నాట్యము చేయుచుండిరి-2. యక్షులు, రాక్షసులు, నాగులు సాయుధులై యాతని రక్షించుచుండిరి. ఋక్కులు, యజుస్సులు, సామములు మూర్తిమంతములై అంతటను విహరించుచుండెను. ఋషులు వేదత్రయ కృతస్తోత్రములతో సూర్య దేవుననేక విధములుగ కీర్తించుచుండిరి-3. ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలు మూడును మనోజ్ఞ వదనములతో నటనుండెను. వజ్రాయుధములు, బాణములు ధరించి సూర్యదేవునుద్వేష్టించి యుండెను-4. ఉదయ సంధ్య అరుణ వర్ణమునను, మధ్యాహ్న సంధ్య చంద్ర వర్ణమునను మూడవదగు సాయం సంధ్య మెట్ట తామర వన్నెగలిగియు లేక కుజ 'వర్ణముతో ప్రకాశించుచుండెను-5. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, ఇంకను ఇతర దేవతలు మూడు సంధ్యలలోను సూర్యుని పూజించుచుందురు-6. 'జయ' శబ్దమును వెలువరించుచు ఇంద్రుడచటనే ఉండును. శుక్రుడు, శివుడు మూడు సంధ్యలలో పూజించుచుందురు-7. దిన ప్రారంభమున సూర్య దేవుని పద్మాకారునిగను, మధ్యాహ్నమున చక్రరూపునిగను, పూజింపవలెను. ప్రకాశ స్వరూపుడగు నా దేవుని ఎల్లవేళల పూజింపవలేను-8. రాత్రి సమయమున విపులమైన కాంతిగలుగు నా దేవుని సపరివారముగ పూజింపవలెను. చంద్ర శేఖరుడాతని నెల్లవేళల భక్తితో పూజించుచుండును-9. గరుడుని యగ్రజుడగు అరుణుడు కాలావయవ నిర్మితమగు దివ్య సూర్య రథమును సారధియై నడిపించుచుండును-10. ఛందోరూపములగు ఏడు హరితాశ్వములు పూన్చబడిన ఆ రథమున కతడు సారధి-11.
తా॥ సూర్యుని యిద్దఱు భార్యలగు రాజై, నిక్షుభ అనువారతనికి ఇరుప్రక్కల విరాజమానలై యుందురు. అటులే వేజ్వేజు నామములు గల దేవతలు అతననిని పరివేష్టించి యుందురు-12. పింగలుడచట లేఖకుడుగా నుండును. ఇంకొకడు దండనాయకుడుండును. రాజా శ్రేషులు అను చిత్రవర్ణ పక్షులు రెండు, రెండు ద్వారములకడ కాపలా కాయుచుండును-13. ఆ మందు మేరు పర్వతముతో సమానములైన నాలుగు కొమ్ములుగల వ్యోమముండును. దానికి ముందు భాగమున దిండి, ఇతర దిక్కులలో దేవతలుందురు-14. ఇట్లు సర్వగతుడు, జగత్రకాశకుడు, బ్రహ్మాదిదేవతలచే స్తుతింపబడువాడు, ఋషభోత్తముడు, గ్రహేశ్వరుడు, సకల భువనములకు ప్రభువు అయిన ఆదిత్యదేవుని శరణువేడుము”-15. సాంబుడిట్లనెను. Jమహరీ! సూర్యుడు సర్వగతుడెట్లు?-16. అతని కెన్ని రశ్ములు? ఎన్ని మూర్తులు గలవు? రాజై, నిక్షుభయనువారెవరు? ఈ దండనాయకుడెవరు?17. పింగలుడెవరు? అతడా సూర్యమండలమున నుండి ఎల్లప్పుడును ఏమి వ్రాయుచుండును? రాజాశ్రోషులెవరు? కల్మాష పక్షులెవరు?-18. మేరు సదృశ లక్షణముగల ఆవ్యోమము ఏ దేవతా స్వరూపము? ముందు భాగమున నుండు దిండి యెవరు? ఆయా దిక్కులలో నుండు దేవతలెవరు?-19. ఈ విషయములనన్నింటిని తత్త్వతః వినగోరుచున్నాను. తత్వ పరముగను, వేద పరముగను నాకీ యంశములను వివరించి చెప్పడు. తత్వము తెలిసికొని నేనా దేవ దేవుని శరణువేడెదను-20.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబో పాఖ్యానమున, నోరధ సాంబ సంవాదమునందు సూర్య పరివార వర్ణనమను డెబ్బది యాఱవ అధ్యాయము సమాప్తము.
