భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
24. చతుర్ధి కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
తా॥ శతానీకుడిట్లనెను.
“కార్తికేయుని చేత చెప్పబడిన స్త్రీ పురుషుల లక్షణములు-1, క్రోధముతో శివుడు సముద్రములో పడవేయగా, విష్ణుదేవుని వాక్యము వలన తిరిగి, సముద్రుడు వానిని అప్పగించేను కదా!-2. వానిని సముద్రుడు కార్తికేయున కప్పగించిన విధము, అతడు వానిని తిరిగి పొందిన విధము నాకు తెలియజెప్పుము”-3. సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “గుహుడు స్త్రీ పురుషుల లక్షణములేట్లు చెప్పెనో ఆవివరములు చెప్పెదను-4. శివ కుమారుడైన కార్తికేయుడు ఒకప్పుడు తన శక్తిపాతము చేత క్రౌంచ పర్వతమును ప్రయ్యలు చేసెను. దానిచే బ్రహ్మమిక్కిలి సంతోషించి కుమార స్వామిని వరము కోరుకొనుమనెను-5. తేజస్వియైన కుమార స్వామి తలవంచి బ్రహ్మకు నమస్కరించి "దేవా! నాకు స్త్రీపురుష లక్షణములను ఉపదేశింపుమ” ని అర్థించెను. “నాకీ లక్షణ శాస్త్రము నందాసక్తి మిక్కుటమై యున్నది. నేను గతమున రచించిన లక్షణ గ్రంధము ఉప్పు సముద్రమున వేయబడినది-7. నా తండ్రియగు నీశ్వరుడు నాపై కినుక వహించి ఇట్లు ఈ పనిచేసెను. మఱల లభించినను విషయమును మఱచిపోయితిని. దానిని సాకల్యముగ నాకుజెప్పుడు.” అనెను-8. బ్రహ్మ ఇట్లనెను. “కుమారా! లెస్సగా ప్రశ్నించితివి. శివున కానందము కలిగించువాడవు. మొదట పురుష లక్షణములను సాంతముగా చెప్పెదను తెలిసికొనుము. సముద్రుడు పొందిన నీగ్రంథమునందలి పురుషుల ఉత్తమ మధ్యమాధమ లక్షణములు వినుము. (9) విచక్షణుడైన వాడు శుభనక్షత్రమున, రవ్యాదిగ్రహములు (రవి బుధులు) శుభస్థితి యందుండు మంగళ కరమైన దినమున, పూర్వాహ్లామున లక్షణములను పరీక్షింపవలెను-10.
తా॥ బుద్ధిమంతుడు అవయవముల ప్రమాణము, వాని పొందిక, వర్ణము, వానిస్థితి (కదలిక) ఇట్లు అన్ని అంగముల లక్షణము, దంతములు, వెంట్రుకలు, గోళ్ళు, మాసములు గడ్డములు వీనినన్నింటినీ పరిశీలింపవలయును-11. మొదట ఆయువును పరీక్షించి పిమ్మట లక్షణములు వాని ఫలము చెప్పవలెను. మానవులకు ఆయుర్దాయము క్షీణించినచో వారి లక్షణములతో ప్రయోజనమేమి?-12. నూటయెనిమిది అంగుళముల పొడవున్నవాడు ఉత్తముడు. నూరంగుళములున్నవాడు మధ్యముడు. తొంబదీ యంగుళములవాడు అధమ లక్షణములుగలవాడు-13. పూర్వము సముద్రుడు నాకు శుభాశుభ ప్రమాణ లక్షణములు చెప్పియుండెను. వానినే నీకు చెప్పుచున్నాను -14. అటు పైన శరీరావయవముల లక్షణము చెప్పెదను. మాంసముతో కూడినవి, నును పైనవి, ఎఱుపుచేయలోనుండునవి, మృదువుగా అందముగా నుండునవి, ఎత్తైనవి,చెమట లేనివీ, నరములు కన్పట్టనివి అయిన పాదముల గలవాడు రాజగును-15. ఎవని పాదతలమందు అంకుశము వంటి రేఖ ప్రకాశించుచుండునోవానికి జీవితమంతయు సుఖముగా గడచుననుటకు సందేహము లేదు-16. చెమట పట్టనివి కోమలములు, తామరపువ్వుల వంటివి, వ్రేళ్లు ఒకదానికొకటి తగిలియుండునవి, రాగివలె ఎఱుపురంగు గోళ్ళుగలవి, చక్కని మడమలుగలవియైన పాదములు గలవాడు రాజగును-17. గూఢమైన చీలమండలు గలిగి, రక్తనాడులు కనపడకుండనుండి వెచ్చని, తాబేలువలే ఎత్తైన పాదములు గలవాడు రాజనుట ప్రసిద్దము-18. చేటలవలె ఆకృతి గల్గి గబుకై, తెల్లని గోళ్లు కలిగి, వంకరగా, నరములతోనిండియుండి, ఎండిపోయినట్లుండి, వంకరలు గల ప్రేళ్లతోనున్న పాదములు గలవాడు-19. దరిద్రుడు, దుఃఖము గలవాడుఅగును. వండిన మట్టి వంటి వర్ణము గల పాదములు గలుగువాడు బ్రహ్మహత్య వంటి పాపములు చేయును-20.
తా॥ పసుపు వన్నె పాదములవాడు అగమ్యగమన దోషమునకు పాల్పడును. నల్లని పాదములవాడు మద్యపానరతుడగును. తెల్లని పాదములవాడు తినగూడని పదార్థములు తినువాడగును-21. బొట్టన వ్రేళ్ళు పెద్దవిగను పొడవుగను ఉన్నవారు భాగ్యహీనులగుదురు. వికృతమైన బొటన వ్రేళ్లవారు కష్టములనుభవింతురు. వాహన యోగము లేనివారై కాలినడక ప్రయాణము గలవారైయుందురు-22. పెద్దవియై అణగియున్నట్లుండునవి, వికారమైనవి, పగిలినట్లుండినవియైన బొట్టనవ్రేళ్లు గలవారు మిక్కిలి నిందితులగుదురు. వంకరగను, పగుళ్లు గలిగి పొట్టివిగను ఉండువారు కష్టములనుభవింతురు-23. పాదములు చేటలవలె వీకారముగ, పగుళ్లు గలిగి వంకరగా, నరములు తేలి చెమట గలిగి, పేలవమైన వర్ణము కలిగి గబుకుగా నుండువారు మిక్కిలి నిందితులగుదురు-24. చూపుడు వ్రేలు, బొట్టన వ్రేలికంటె నిడివిగనున్నవాడు నిత్యము స్త్రీభోగమునుభవించును. సంశమములేదు. చిటికెన వ్రేలు నిడివిగనున్నవాడు బంగారము కలిగి యుండును-25. అడుకులవలె చట్టపడి, వంకరటింకరగా నుండి, ఎండిపోయినట్లుండు వ్రేళ్లు గలవాడు దుఃఖితుడును, ధనహీనుడును అగును-26. గోళ్లు తెల్లగను, కఱుకుగను ఉన్నవాడు దుఖః జీవియగును. చెడు గోళ్లు కలవారు శీలహీనులు, కామ సుఖములు లేని వారగుదురని గ్రహింపవలెను. వికృతములు, పగుళ్లుగలవి, కఱుకైనవి అయిన గోళ్లుగలవారు దరిద్రులగుదురు-27. ఆకుపచ్చ వన్నెగల గోళ్లుగలవారు బ్రహ్మహత్య చేయుదురు. బంధువులచేత విడువబడినవారు, కులనాశకులును అగుదురు-28. ఆరుద్రపురుగువలె ఎఱ్ఱగా ప్రకాశించెడు నఖములు గలవారు భూపాలురయ్యేదరు. శంఖపుసుడి వలె మెటీ సెడి గోళ్లుగలవారు రాజులగుదురు-29. రాగివన్నె గోళ్లవారు ఐశ్వర్యవంతులును, తామరవన్నె గోళ్లవారు ధన్యులును అయ్యెదరు. ఎఱ్ఱని గోళ్లవారు ఐశ్వర్యమును, వికసించిన గోళ్లవారు సౌభాగ్యమును పొందుదురు. సన్నగను, పొడవుగను, ఎఱుపుగను గోళ్లుగలిగినవారు రాజులగుదురు-30.
తా ॥ రోమములతో కూడిన పిక్కలుగలవారు దుఃఖము, దారిద్ర్యమును అనుభవింతురు. పిక్కలు పొట్టిగానున్న ఐశ్వర్యము, బంధనము చెప్పవలెను-31. జింక పిక్కలవంటి పిక్కలు కలిగియుండెనేని రాజగును. సంశయములేదు. లావుగను, పొడవుగను ఉన్నవారు భాగ్యహీనులగుదురు-32, నక్కపిక్కల వంటి పిక్కలు గల పురుషులు భాగ్యహీనులగుదురు. కాకిదొండ వంటి పిక్కలు గలవారు దుఃఖముననుభవింతురు-33. బలిష్టములైన జంఘలుగలవారు ఐశ్వర్యవంతులగుదురు. సింహము, పులి పీక్కలవంటి పిక్కలుగలవారు ధనవంతులగుదురు-34. ఒక్కొక్క రోమకూపమున నొక్కొక్క రోమమే యుండిన వారు రాజులగుదురు. శ్రోత్రియులు, పండితులునైన వారికి ఒక్కొక్క రోమకూపమున రెండేసి రోమములుండును-35. మూడేసి మూడేసి రోమములున్నవారికీ నిఃస్వయోగము కలిగి దుఃఖితులగుదురు. వెంట్రుకల తీరును బట్టియే మానవుడు పూజ్యుడో నింద్యుడో అగును-36. మాంసములేని మోకాళ్లు గలవాడు దూరదేశమున మరణించును-37. అల్పములైన మోకాళ్లవలన సౌభాగ్యము, వికటమైన వాని వలన దారిద్ర్యము చెప్పబడినది. లోతైన మోకాళ్లవలన భార్యచే జయింపబడువాడు, మాంసలములైనవానివలన రాచఱికము పొందువాడును అగునని తెలియవలెను -38. హంస, కోడి, చిలుకల నడకల వంటి నడకలు గలవాడు రాజు, పూజ్యుడు అగునని సముద్రుని వాక్యము-39. ఇతర శ్రేష్ఠములైన పక్షుల నడకవంటి నడక కూడా శుభప్రదమైనదే. ఎదు, సింహము, ఏనుగు నడకవంటి నడక భోగములను పెంచును -40. నీటి తరంగములవంటిది, కాకి, గ్రుడ్లగూబనడక వంటిది అయిన నడక దరిద్రులకుండును. అది భయంకరమగు దుఃఖము కలిగించును-41. కుక్క, ఒంటె, దున్న, గాడిద, పంది, మేక నడకలు గలవారు భాగ్యహీనులగుదురు-42.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహా పురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధి కల్పము నందు పురుషలక్షణ వర్ణనమను ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
