భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
78. సూర్య మహీహా వర్ణనము
తా॥ నారదుడిట్లనెను. “వేయి యుగములకు సమానమైన రాత్రి కాలమును గడిపి, ఉదయ కాలమున నతడు సృష్టి చేయుట కొఱకు బ్రహ్మత్వమును పొందును. నీట మునిగియున్న భూమిని చూచి, చేయదగు కార్యమును గూర్చి ఆలోచించి ప్రభువైన ఆ పరమ పురుషుడు వరాహరూపమును ధరించి నీటిలోనికి ప్రవేశించును-2. భూమినుద్దరించుటకు సమర్థుడైన ఆ దేవేశుడు బాగుగనాలోచించి నీట మునిగియున్న భూమినుద్ధరించుటకు పూనుకొనెను-3. భూమిని ధరించి జలగర్భమునుండి భూమిని పైకెత్తుచున్న వేదమయుడగు నా మహావరాహుని శరీరము కంపితమగుచుండగా రోమములలో నుండిన మునులాతనిని స్తుతించుచుండిరి-4. నీట మునిగి యుండిన భూమిని ఉద్దరించి అతడు ప్రజా సృష్టిచేసెను. మొదట తనతో సమానులైన పుత్రులను మనస్సుతో జనియింపజేసెను-5. భృగువు, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మరీచి, దక్షుడు, తొమ్మిదవవాడు. వసిష్టుడు-6 ఆ పురుషోత్తముడిట్లు తొమ్మండుగురు ప్రజాపతులను మానస పుత్రులుగా సృష్టించి తాను ప్రజా హితమును గోరి అదితి పుత్రుడుగా నవతరించెను-7. బ్రహ్మతో సమానమగు తేజస్సు గల కశ్యపుడు, ప్రజాపతులలో పదవవాడయ్యెను. అతడు మరీచి కుమారుడు-8. దక్ష ప్రజాపతి పుత్రికయగు అదితి, కశ్యపుని భార్యయయ్యెను. ఆమె, భూర్బువస్వగ్త్ కములతో కూడిన అండమును ప్రసవించెను-9. అందుండియే ద్వాదశాత్ముడగు సూర్య భగవానుడు సహస్రకిరణుడై ప్రకటమయ్యెను. ఈ మహాత్ముని దైర్ఘ్యము తొమ్మిది వేల యోజనములు, వైశాల్యము దానికి మూడురెట్లధికమై యుండును-10.
తా॥ కడిమి పువ్వు అంతటను కేసరములతో నావరింపబడి యుండునట్లు సూర్యుని తేజస్సుల గోళము చుట్టును కిరణములతో నాపరింపబడియుండెను-11, సహస్ర శీరుడైన పురుషుడు బ్రహ్మ పదార్థమనబడువాడు ఈ తేజో గోళము మధ్య భాగమున వ్యవస్థితుడై యుండును--12. తన సహస్ర కిరణములచేత అంతటనున్న జలములను, నదులనుండి, సముద్రముల నుండీ, హ్రదముల నుండి. బావులనుండి గ్రహించుచుండును-13. సూర్యుడస్తమించినప్పుడతని కాంతి అగ్నిని చేరును. అందువలననే రాత్రి సమయమున అగ్ని, దూరమునుండియు ప్రకాశించుట కన్పట్టును-14. సూర్యుడుదయింపగనే తిరిగి ఆ ప్రకాశమగ్నినుండి సూర్యునిలోనికి ప్రవేశించును, ఆగ్నేయమగు నా తేజః కరణములాతనిలో చేరుటవలననే అతడు ప్రకాశించుచుండును-15. ఉష్ణత్వ ప్రకాశత్వములు రెండును అగ్నిలోను, సూర్యునిలోను ఉండును. రాత్రింబవలు వీనిని పరస్పరము ఇచ్చిపుచ్చుకొనుట ద్వారా ఒకరినొకరు తృప్తి పచుచుందురు-16. సూర్య కిరణముల వ్యాపకత్వము, వాని నామములును చెప్పుచున్నాను వినుము, హేతి, కిరణ, గౌరశ్మి, గభస్తి-17. అభీషు,ఘన, ఉగ్ర, వసు, మరీచి, నాడి, దీధితి, సాధ్య, మయూఖ, భాను, అంశు-18. సప్తార్చి, సుపర్ణ, కర, పాద నామములతో సూర్యకిరణములకు ఇరువది పర్యాయపదములు చెప్పబడినవి-19.
తా॥ సూర్యదేవుని కిరణముల చందనాది నామములను వేజ్వేజుగ చెప్పుచున్నాను. ఒక వేయిగా చెప్పబడు నిట్టి కిరణములు శీతోష్ణ వర్షప్రదములని వినుచున్నాము-20. వానిలో నాలుగు వందల కిరణములు చందన, మంద, కేతు, అమృత నామములతో పిలువబడునవి వర్షకారణములై జగత్తునకు వరము నిచ్చుచున్నవి-21. మూడు వందల కిరణములు. మంచుతో గూడి యున్నవిగ చెప్పబడినవి. ఇవి పసుపు వన్నెకలిగి చంద్రకిరణములుగ పేర్కొనఁబడుచున్నది-22. ఇవి సౌమ్యముగ ప్రకాశించుచు, రుచిరములై, ఆహ్లాదజనకములై, మంచును కురిపించునవియై, తెల్లని వన్నె కలిగి, దిక్కులకు వ్యాపించుచు విశ్వమునంతయును భరించుండు రశ్ములు-23. వర్ణముననుసరించి వాని పేరు శుక్లములు. సంఖ్యచేనివి మూడువందలై ధర్మమును వర్షించుచు దేవతలను మనుష్యులను సమానముగ భరించుచుండును-24. మనుష్యులనోషధుల చేత, పితరులను స్వధలచేత, దేవతలనమృతము చేత ఈ మువ్వురిని మూడించిచేత నివి తృప్తి పఱచుచుండును-25. వసంత గ్రీష్మర్తువులందు సూర్యభగవానుడు మూడు వందల కిరణముల చేత ప్రకాశించుచుండును. వర్షాశరత్తులందును మూడువందల కిరణములతో తపించుచు వర్షించుచునుండును
హేమంత శిశిర ఋతువులలోను మూడువందల కిరణములతో వెలుగుచు మచును ముగించుచుండును. ఓషదులకు బలమును శ్రీ పితృదేవతల హవిస్సులకు స్వధాత్వమును, దేవతలకొఱకైన అమృతమున కమృతత్వమును- మూటిచే మూటికి- ఇచ్చుచుండును-27. ద్వాదశాత్ముడైన ప్రజాపతి అయన, ఋతువులతో గూడిన కాలస్వరూపుడుగను, అగ్నిరూపుడగను చరాచరములతో గూడిన మూడు లోకములను తన ఉష్ణప్రకాశములచే తనియించుచుండును-28. అతడే బ్రహ్మ అతడే విష్ణువు, అతడే మహేశ్వరుడు. ఋగ్యజుస్సామ వేదములు కూడ అతడే. ఇందు సంశయమెంతమాత్రమును లేదు-29. మహేశ్వరాదుల రూపముననితనిని ప్రాతస్సంధ్యా సమయమున ఋక్కులతోను, మధ్యాహ్న కాలమున యజస్సులతోను, అపరాష్ట్రమున సామములతోను స్తుతించుచు పూజింతురు.
తా॥ ఎల్లప్పుడును పూజింపబడుచు, తేజోరాశియైన సూర్యదేవుడు సర్వలోక పరివ్యాప్తుడై దీపించుచు తపించుచునుండును-31. నలుప్రక్కలలోను, పైభాగమునను, క్రిందుభాగమునను-అంతటను ఇతడు తన వేడిమిని, వెలుగులను ప్రసరింపజేయుచుండును. త్రిమూర్తుల పూజలందుకొనుచు ప్రకాశించుచుండును-32. గంధవాహుడైన వాయువెట్లు సర్వగతుడో సహస్రకిరణుడైన గ్రహరాజు కూడ నటులే సర్వవ్యాపకుడైయుండును-33 అతడు తన కిరణ సహస్రముచే నశేష జగత్తును ప్రకాశింపజేయుచుండును. అందు మూడు వందల కిరణములు మాత్రమే భూలోకమును కాంతిమంతము చేయుచుండును-34. భువర్లోక సువర్లోకములను ఇతరములైన మూడేసి వందల కిరణములు ద్యోతనము చేయుచుండును. నూఱు కిరణములు అధోలోకమగు పాతాళమునకు ప్రసరించుచుండును-35. తెల్లని కాంతులతో ప్రకాశించు నీ సూర్యమండలము “హేలి' యనుసంజ్ఞగలది. నక్షత్ర, గ్రహ, చంద్రమండలములన్నింటియునికికి మూలమైనది. అనగా చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు సూర్యుని నుండి పుట్టినవని గ్రహింపవలెను-36. పూర్వము నాచే చెప్పబడిన సూర్యభగవానుని వేయి కిరణములలో ఏడు 'గ్రహ'సంజ్ఞగల కాంతి పుంజములు శ్రేష్ఠములైనవి-37. అవి సుషుమ్ల హరికేశ, విశ్వకర్మ, సూర్య, రశ్మి, విష్ణు-38. సర్వబంధు నామములు గలవి. అవి జగత్తును చైతన్యవంతమొనచ్చుచుండును. మొదటి రశ్మి సప్తజము, రెండవది కంజజము-39. మూడవది తారేయము, నాల్గవది దేవతల గురువు, ఐదవది ఉగ్రనామముగలది, ఆవది విష్ణుజము, ఏడవ రశ్మి ‘కః' అనుబడునది. ఇవియే సప్తరశ్ములు.
తా॥ స్థావర జంగమాత్మమగు లోకత్రయమున కంతటికిని సూర్యుడే మూలము. దేవతలు, రాక్షసులు, మానవులతో గూడిన జగత్తంతయు నతని నుండియే పుట్టినది-41. రుద్రుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు, విప్రేంద్రులు, స్వర్గమునందలి దేవతలు మున్నగువారందఱికిని ఈ సార్వభౌకికమైన తేజ స్సే తేజస్సునిచ్చుచున్నది-42. సూర్యదేవుడే సర్వాత్ముడు, లోకేశ్వరుడు, " దేవదేవుడు, ప్రజాపతి, పరమదైవతము, ముల్లోకములకు మూలకారణము-43. అగ్నియందు వేయబడిన యాహుతులాదిత్యునిఁ జేరును. ఆదిత్యుని నుండి వర్షము, వరము నుండి అన్నము, అన్నము నుండి ప్రజలును పుట్టుదురు-44. అంతయును సూర్యుని నుండీయే పుట్టి అతని యందే లీనమగును. లోకములలోని సదసత్పదార్థ మంతయు పూర్వమతనినుండియే వెలువడినది-45. అతడే ధ్యానము చేయువారికి లక్ష్యము. మోక్షమునందు వారికి గమ్యము. అతని యందే నిర్వాణము పొంది ప్రజలు తిరిగి అతని నుండియే పుట్టుచుందురు-46. క్షణములు, ముహూర్తములు, దినములు, రాత్రులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, ఋతువులు, యగములు సూర్యునివలననే గణింపబడుచున్నవి. సూర్యుడు లేకున్నచో వీనికి కాలసంఖ్యాగణనము లేదు-47. కాలమును విడిచి నియమములేవియునుండవు. అగ్నికి ఆహుతులను స్వీకరించుట ఉండదు. ఋతువుల విభాగము లేనప్పుడిక పూలు పండ్లు ఎక్కడివి?-48. జగత్తునకు వేడి వెలుగులిచ్చు వారితస్కరుడైన భాస్కరుడులేకున్నచో దేవలోకమునందును, మనుష్య లోకమునందును ప్రాణుల కెట్టి వ్యవహారములును ఉండవు-49. వృష్టిలేకున్న సూర్యుడు తపింపడు. కాంతిమండలమునొందడు. సూర్యుని సామాన్యమైన నామములు పన్నెండుగలవు.
తా॥ ఈ పన్నెండు నామములే పృథక్యముతో ననేకములైనవి. వాని వివరములు చెప్పెదను. ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, మిహిరుడు, అర్కుడు, ప్రతాపరుడు-51 మార్తాండుడు, భాస్కరుడు, భాను, చిత్రభాను, దివాకరుడు. ఈ పన్నెండు సాధారణమైన నామములచేత రవి పేర్కొన బడుచుండును-52. విష్ణువు, ధాత, భగుడు, పూష, మిత్రుడు, ఇంద్రుడు, వరుణుడు, అర్యముడు, వివస్వంతుడు, అంశుమంతుడు, త్వష్ట, పర్జన్యుడు, ఈ పన్నెండును-53 ద్వాదశాదిత్యుల నామములుగా చెప్పబడినవి. వీరు పన్నెండుమాసములలో క్రమముగానుదయించుచుందురు-54. విష్ణువు, చైత్రమున, అర్యముడు వైశాఖమున, వివస్వంతుడు జ్యేష్ఠమాసము, అంశుమంతుడాషాఢమున-55. పర్జన్యుడు శ్రావణమున, వరుణుడు భాద్రపదమున ఇంద్రుడాశ్వయజమున, ధాత కార్తీకమున-56. మీత్రనాముడు మార్గశీర్షమున, పూషసంజ్ఞుడు పుష్యమున, భగుడు మాఘమున, త్వష్టఫాల్గునమున వేడి వెలుగుల నిచ్చుచుందురు-57. ఈ ద్వాదశాదిత్యులలో విష్ణువను పేరుగల వాడు ఎల్పప్పుడు వేయికిరణములతో ప్రకాశించుచుండును అర్యముడు మూడువందల కిరణములచే వెలుగుచుండును-58. వివస్వంతుడు పదునాలుగు, అంశుమంతుడు పదునైదురశ్ములచే ప్రకాశింతురు. పర్జన్యుడు, వివస్వంతునీవలే పదునాల్గింటిచేత, వరుణుడర్యముని వలె మున్నూజు కిరణములచేత ప్రకాశింతురు-59. ఇంద్రుడు పన్నెండు కిరణములతో, ధాత పదునొకండు వందల కిరణములతో, త్వష్ట, మిత్రభగులవలె వేయి, వందకిరణములతోను ప్రకాశించుచుందురు.
తా॥ సూర్యుడు ఉత్తరాయణ పరాయణుడైనప్పుడు కిరణములు దీర్ఘములగును. దక్షిణ దిక్కునకు ప్రయాణము ప్రారంభించునప్పుడు హ్రస్వములగును-61. ఇట్లులోక ప్రయోజనములను సాధించునట్టి సూర్యకిరణ సహస్రము ఆయా ఋతువులలో, మాసములలో పెక్కు విధములుగ భేదించుచుండును-62. ఈ ఇరువది నాలుగు నామములితనివేయయియును మఱల వేయి నామములు విస్తరించి చెప్పబడినవి-63. వేయింటిలోను, తామస బుద్ధిగల భిన్న దర్శనులు కొందఱు కొన్నింటిని మాత్రమే జగత్కారణములని మిక్కిలి పూనికతో, దృష్టాంతములతోను చెప్పుచుందురు-64. బ్రహ్మను కారణమని కొందఱు, దివాకరుని కారణమని కొందఱు శివుడు కారణమని కొందఱు, విష్ణువని కొందఱు చెప్పుచుందురు-65. నానా ప్రయోజనముల సందర్భములలో నానా దేవతలు కారణమని చెప్పబడుచుందురు. కాని స్వయంభువుగా ప్రసిద్దినందిన ఒక్క సూర్యదేవుడే వేజ్వేలు నామరూప క్రియాదులతో నెఱుంగదగియుండును-66. వనమాలి, ఉగ్రేశుడు, యుముని వలే దివ్యచక్షువు, సాటిలేనివాడు, సౌపర్ణినాముడైన సూర్యుడే స్వయంభువని చెప్పబడును-67. స్ఫటిక మణి వివిధ వర్ణములతో ప్రకాశించునట్లు ఈ స్వయంభువు తన గుణముల కారణముగ వివిధములుగ ప్రకాశించుచుండును-68. ఒకే మేఘము వేజ్వేజుగ విడిపోయి, వేజ్వేలు రూపములు, వర్ణములు పొందినట్లు సూర్యదేవుడు కూడ తన గుణముల మూలమున వేజ్వేయుగ ప్రకాశించుచుండును-69. ఆకాశమునుండి క్రిందపడిన ఒకే విధమగు నీరు భూమికి సంబంధించిన రస విశేషముల చేత వేజ్వేలు రుచులను పొందినట్లు భాస్కరుడు తన గుణముల వలన వివిధములుగ వెలుగునట్లు తోచుచుండును.
తా॥ ఒకే అగ్ని వేజ్వేలు ఇంధనముల వలన వేజ్వేజు వర్ణములను, రూపములను పొందినట్లు సూర్యభగవానుడొక్కడే తన గుణముల కారణముగ భిన్నభిన్న రూపములను దాల్చు చుండును-71. గాలి యొక్కటియే యైనను అది ప్రసరించు ద్రవ్య విశేషములవలన, సుగంధ, దుర్గంధ వ్యవహారము పొందినట్లు సూర్యదేవుడొక్కడే తన గుణ మహిమచే వివిధ రూపములతో తోచుచుండును-72. ఒకే గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని యను నామాంతరములను పొందునట్లు సూర్యుడు కూడ బ్రహ్మాది భిన్ననామములను పొందుచుండును-73. ఏకత్వ పృథక్య విషయమున నిట్లు నిదర్శనము చెప్పబడినది. కావున దేవతలందఱికిని మూలమైన సూర్యదేవుని భక్తితో సేవింపవలెను-74. మార్తాండుడు మూలదేవత. ఇతడే శివుడు. ఇతడే సత్వరజస్తమోగుణములు-75. ఇతడే వేదములు, ఇతడే యజ్ఞములు. ఇతడే సర్వము. సంశయములేదు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతయు సూర్యునిచే పరి వ్యాప్తమైయున్నది-76. ఇతడే యజింపబడును. ఇతడే పూజింపబడును, నిరంతర ప్రయాణ శీలియైన ఈ రవి సుప్తజగత్ర్పేరకుడు-భిన్న భిన్న శరీరములతో, భిన్న భిన్న నామములతో నీతడంతట ప్రకాశించుచున్నాడు-77. అగ్నియందు, గాలిలోను, ఆకాశమందును, జలమునందును సర్వత్ర ఇతడే వ్యాపించి యున్నాడు. సూర్యదేవుడిట్లు సర్వవ్యాపకుడగు పరమాత్మ జ్ఞానముగల వాడీదేవునెల్లప్పుడు పూజించుచుండవలెను-78. ఇట్లా సూర్యదేవునెఱుంగు వాడతనియందే లీనమగును. ధాత్వర్ధములు, వేదములు ప్రమాణములుగా నాదిత్యునేకైక దేవునిగా తెలియువాడును-79. రోగములులేనివాడై తత్క్షణమే సర్వపాపములనుండి విముక్తుడగును. సాంబా! పాపములు చేయువానికి సూర్యుని పై భక్తి కలుగదు.
తా॥ కావున నీవు పరాభక్తితో దివాకరభగవానుని శరణుపొందుము. దానివలన నీవు సర్వరోగములనుండి ముక్తుడవై కోరికల నన్నింటిని సఫలము చేసికొందువు-81. నీ తండ్రియగు విష్ణుదేవుడు, బ్రహ్మ శివుడు స్వయంభువగు నా సూర్యదేవుని గుణ మహిమావిలసితులే-82. ఒకే మేఘము వివిధ వర్ణములతో రూపములతో పృథక్వము చెందునట్లు భాస్కరుడును తన గుణ గరిమచే వివిధ దేవతలుగా భాసించుచుండును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మపపర్వమున సప్తమీ కల్పమునందు సూర్య మహిమా వర్ణనమను డెబ్బది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
