భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

94. సప్తమీ కల్పమున పుణ్యశ్రవణ మాహాత్మ్య వర్ణనము

తాII ఈ సందర్భముగ శుభంకరము, పుణ్యప్రదము, పాపహరమునైన బ్రహ్మ-కుమారుల సంవాదమును చెప్పనిచ్చగింతురు. ఒకప్పుడు సర్వలోక సృష్టికర్తయగు బ్రహ్మదేవుని వద్దకు కుమారస్వామి యేతెంచి, సుఖాసీనుడైయున్న యా పితామహునకు ప్రదక్షిణ మాచరించి పూజించితిని. మిక్కిలి శ్రద్దతోను భక్తితోడను శిరసు వంచి నమస్కరించి. అతని యాజ్ఞమేరకు సుఖముగ నాసీనుడనైయుంటిని. అటుల కూర్చుండియున్న నేను ఆశ్చర్యకరము, అద్భుతమునైన ఒక సన్నివేశమచట చూచితిని. చిరుగంటల వరుసలతోను, మణులు, ముత్యములతోను, వైడూర్యములు పొదిగిన సుందరమైన వేదికతోను. అలంకరింపబడియున్న ఒక విమానము నుండి దిగి వచ్చిన యొక పురుషునిఁజూచి సూర్యదేవుడు సంభ్రమముతో తన యాసనమునుండి లేచి. అతనికెదురేగి తన కుడి చేత యాతనిని తన ముందుకు స్వాగతించి కొని వచ్చి, అతని శిరస్సును మూర్కొని ఆదరించెను. అతడాసీనుడైన పిదప అతనితో సూర్యభగవానుడిట్లనెను.“భద్రా! నీకు సుస్వాగతము. నీ (ఆగమనము)చే మేము మిక్కిలి సంతోషించితిమి. మోద మానసులమైతిమి. ప్రళయము వఱకును నీవు మాచెంతనే యుండుము. తదుపరి సృష్టిలో మల బ్రహ్మలోకమునకుఁబోయెదవు అచట చిరకాలముండేదవు”.

తా॥ అంతలోననే ఒక శ్రేష్ఠమైన విమానమునెక్కి మజియొక పురుషుడు సూర్యుడుండు స్థానమునకు వచ్చెను. అతడు కూడ సూర్య భగవానునిచేత పూజింపబడెను. ఆత్మీయమైన వాక్కులతో సూర్య దేవుడాతని ననునయింప నాతడు వినమ్రుడై కూర్చుండెను . సూర్యదేవుడా యిరువురిని పూజించుటఁజూచి నాకు కుతూహలము కలిగెను. ఆ దేవ దేవుని యిట్లు ప్రశ్నించితిని. “దేవా! నీ వలెనే వెలుగొందుచు నిన్ను మిక్కిలి సంతుష్టుని జేయగలిగిన ఈ పురుషుడే పుణ్య కర్మఫలముగ నిటకు వచ్చెను?. ఈతనిని మీరు స్వయముగ పూజించియుండుటంజేసి నాకు మిక్కుటమైన ఆశ్చర్యము, ఆసక్తియు కలిగినవి. రెండవ మనుష్యునకు గూడ నటులే సత్కారముచేసితిరి. ఈ మానవోత్తము లిరువురును అన్ని విధములుగ పుణ్యకర్ములు. ఓ బ్రహ్మదేవా! భగవానుడైన సూర్యుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలందచేతను పూజింపబడును. అట్టి సూర్యదేవుడే వీరిద్దఱిని చాల ఆదరముతో పూజించెను. “ఓ సూర్యదేవా! వీరిరువురును ఇట్టి మహత్తరమైన పుణ్య ఫలము నందుట కే పుణ్య కర్మచేసిరో నాకుఁ దెలుపుడు'' అని నేనా దేవదేవునడిగితిని. నా ఈ మాట విని సూర్యుడిట్లు బదులు పలికెను. (సూర్యుఁడిట్లనెను) “కర్మ నిర్ణయమును గూర్చి లెస్సగా ప్రశ్నించితివి. సూర్య లోకమునకు రాదగిన కర్మ ఇతడేమి చేసెనో ఆ వివరములు చెప్పుచున్నాను వినుము.

తా॥  "నా అంశచేత జన్మించిన రాజులచే పరిపాలింపబడుచుండిన అయోధ్య యను పేరుగల పట్టణము భూ మండలమున ప్రసిద్ధమైనది. ధనపాలుడని పిలువబడు ఈ వైశ్య జాతీయుడు అచ్చటివాడే. అతడా నగరమున నొక శ్రేష్ఠమైన దేవాలయమును నిర్మించెను. ఆ దివ్యమైన దేవాలయమునందు పురాణ కథా ప్రవచనములను జరిపింపగోరి యాతడు శిష్టులైన బ్రాహ్మణ సమూహమునాశ్రయించి వారిని పూజించేను. ఇతిహాస పురాణములను ప్రవచించు మునిశ్రేష్ఠుడు మహామునియునైన బ్రాహ్మణశ్రేషుని ముఖ్యంగా పూజించి. గంధ పుష్పోపహారములతో పుస్తకమును పూజించి, బ్రాహ్మణ సమూహములోనిపురాణ ప్రవాచకులలో వాచకుడైన ఒక ద్విజశ్రేషునుద్దేశించి యిట్లు ప్రార్థించెను. “ఈ దేవాలయమున సహస్రకిరణుడైన సూర్య భగవానుడున్నాడు. ఈ పురమందలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల సమూహమంతయు పురాణమును వినగోరుచున్నది. ఓ బ్రాహ్మణోత్తమా! తామిచ్చటనే ఉండి నిత్యము పురాణ పుస్తక వాచనము చేయుడు. దానితో నేడు జన్మల వఱకును సూర్య భగవానుడు నన్నను గ్రహించును. ఒక సంవత్సరము వఱకును తామి పవిత్ర వృత్తి స్వీకరించియుండుడు. సమాప్తియైన పిమ్మట మిమ్ము ఒక వంద బంగారు మాడలతో సత్కరింతును. మహాత్మా! నా శ్రేయస్సు నిమిత్తమై పూర్తి సంవత్సర మీ కార్యము నిర్వహింపుడు”. ఈ విధముగ పుణ్య ప్రదమైన పురాణ ప్రవచనము ప్రారంభమై జరుగుచుండగా, ఆు మాసములైనను కాకమునుపే ధనపాలుడు మరణించెను. పురాణ శ్రవణ వ్రతమును చేయుచు మరణించిన ఈ వైశ్యోత్తముని కొఱకు నేను విమానమును పంపితిని. ఇట్లు పుణ్య కథా శ్రవణములచే నన్నర్చించిన నాకు మిక్కిలి సంతోషమగును.

తా॥ దేవవరులలో శ్రేష్ఠుడవైన ఓ కుమారా! పురాణ శ్రవణముల వలన కలుగునంత ప్రీతి, గంధ పుష్పోపహారములతో నాకు చేయు పూజవలన కూడ నాకు కలుగదు. ఆవులు, బంగారము, పెల్లుగా వస్త్రములు, గ్రామములు, నగరములు - వీనిని దానము చేయుట నాకు సంతోషదాయకమే. కాని ఇతిహాస పురాణాది శ్రవణములతో నైనంత కాదు. వివిధములైన భక్ష్య భోజ్యాది పదార్థములతో నా కొఱకు శ్రద్దగా చేయు పూజా సంతర్పణాది పుణ్య కార్యక్రమములు కూడ పుస్తక వాచనము కలిగించునంత తృప్తి కలిగింపవు. కుమారా! భోజన సంతర్పణము కంటెను శ్రవణ సంతర్పణమే ఎక్కువ ప్రీతి కరము.. వేయి మాటలేల? పుణ్య కథలను చెప్పుట, వినుట కంటెను నాకు సంతృప్తి నిచ్చునది మఱియొకటిలేదు. ఈ రహస్యము నీకుఁదెలిపితిని. ఇటకు వచ్చిన ఈ రెండవ వ్యక్తి ఆ పట్టణముననే నివసించు బ్రాహ్మణోత్తముడు. ఇతడొకసారి మిక్కిలి శ్రద్ధాభక్తులతో పుణ్యప్రదమైన పురాణమును వినుటకుఁబోయెను. ఆ ఉత్తమమైన పురాణమునంతయువిని, మహాత్ముడైన పౌరాణికునకు ప్రదక్షిణ మాచరించి యతనికి ఒక బంగారు మాషము (ఐదు గురిజలయెత్తు) నిచ్చెను. అంతీయకాక మిక్కిలి తేజస్వియైన ఆ పౌరాణికునకు దక్షిణ సమర్పించెను. సువర్ణము, దక్షిణ స్వీకరించి ఆ బ్రాహ్మణ ప్రవరుడు మిక్కిలి యానందించెను. ఇట్లు వాచకునకు చేసిన పూజా సత్కారము కాక ఇతడింకేమియు చేయలేదు. అంత మాత్రముచేతనే ఇతడు ఈ సత్ఫలమునందెను. ఆ మాత్రపు పుణ్య కర్మవలననే ఇతడు నా చేత పూజింపబడెను.

తా ॥ భక్తి శ్రద్ధలతో పౌరాణికుని పూజించినవాడు నన్ను పూజించినవాడగును. ఇక విష్ణువు, శివుడును ఎవరు?. శ్రేష్ఠమగు భోజ్య పదార్థములతో వాచకునకు భక్తితో విందునారగింపజేసినచో పదునైదు సంవత్సరములు నన్నే పూజించినట్లగును. నాకు పురాణ వాచకుడైనట్లు యముడుగానీ, యమిగాని, శనైశ్చరుడుగాని, మనువుగానీ, తపతికాని ఇష్టులు కారు. పురాణ ప్రవాచకుడు భోజన సత్కారములతో తృప్తి నందగా రెండు వందల సంవత్సరముల వఱకు నాకు సంతృప్తి కలిగియుండును. వాచకుడు భుజింపగా కేవలము నాకు మాత్రమే సంతుష్టి కల్గుటకాక ఇంద్రాది దేవతలందఱికిని అటులే సంతృప్తి కలుగును. బ్రహ్మ విష్ణు రుద్రాదుల చేష్టా రూపమే వాచకుడని నా అభిప్రాయము. వాచకుడు ప్రీతుడైనచో దేవతలందఱు ప్రీతులగుటలో నెట్టి సంశయములేదు, కుమారా! ఇట్లు వీరిద్దజీ కర్మ గుణించి నీకు వివరించితి. వీరింతకంటే వేటేమియు చేసియుండలేదు. ఇంక నేమి విన గోరుచున్నావు?” అని సూర్యదేవుడు ముగించెను. 'ఓ బ్రహ్మదేవా! ఇది యంతయు చూచి నాకు చాల ఆశ్చర్యము కలిగి మి వైపున కిటులేతెంచితిని. దేవా! ఇందు సత్యమేమి? వినవలెనని కుతూహలపడుచున్నాను. చెప్పుడు. మూ! శ్రుత్వాకుమార వచవం సర్వలోకపితామహః

తా॥ సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు కార్తికేయుని మాటలు విని యిట్లనెను. “భళి! చాల బాగుగనున్నది. పుణ్యాత్ముడ వయితివి. నీ వంటివాడు మఱియొకడులేడు. ఆ ఇరువురు పుణ్యపురుషులను దర్శించి ధన్యుడనైతివి. వత్సా! సూర్య భగవానుడు చెప్పిన దంతయును వాస్తవము. యథార్థము. అన్యథాకాదు. కుమారా! లోక పూజితమైన నా మొదటి ముఖము. నుండీయే ఇవి యన్నియు - ఇతిహాస పురాణములు- వెలువడి వ్యాప్తినొందినవి. ఇవి లోకమునకు మేలు చేయుటకునుద్దేశించినవి. ఈ పురాణేతిహాసములిష్టములైనట్లు నాకు నాలుగు వేదములుగానీ, షడంగములు కాని కావు. వీనిని నిత్యమును భక్తిశ్రద్ధా సమన్వితులై, వాచకునకు జీవనవృత్తి కల్పించి వినుచుండరుత్తమ గతి నందెదరు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనెడి పురుషార్ధముల స్వరూపమును స్పష్టము చేయుట ఉత్తమమైన పుణ్యకర్మము. ఇతిహాస పురాణములు నా చేతనే సృష్టింపబడినవి. ఈ నాలుగు వేదములును ఎప్పుడును రహస్యమైన అర్థములుగలవిగా నున్నవి. వీని యర్థములను సుబోధము చేయుట కొఱకే నేనీ ఇతి హాస పురాణములను సృష్టించితిని. నిత్యమును ఉత్తమమైన పురాణ శ్రవణము చేయించువాడు సూర్య భగవానుని యనుగ్రహమున జ్ఞాన తేజస్సును పొంది యతని యుత్తమ లోకమునకుఁబోవును. వాచకునకు దక్షిణ నిచ్చువాడు సూర్యలోకమును చేరును. అందాశ్చర్యమేమి? వాచకునకన్న దాన పాత్రుడెవడు?.

 తా ॥ దేవతా శ్రేష్ఠులలో నింద్రుడు, ఆయుధములలో వజ్రాయుధ మేటులో బ్రాహ్మణులలో పురాణ వాచకుడట్లు శ్రేష్ఠుడైయున్నాడు. సంశయములేదు. తేజస్సులలో సూర్య కిరణము, జలాశయములలో సముద్రమెట్లో పౌరాణికుడు ప్రవరుడని చెప్పబడును. భక్తి పురస్పరముగ నే మనుష్యుడు వాచకుని పూజించునో వాడు సర్వ జగత్తును పూజించినవాడగుచున్నాడు. ఇట సంశయమేమియులేదు - . సూర్య భగవానుడు నిస్సందేహముగ సత్యమునే చెప్పెను. పురాణ వాచకుని కన్న యోగ్యుడేప్పుడెవడునులేడు”. బ్రహ్మ దేవుడు చెప్పిన దంతయువిని కుమారుడిట్లనెను. “ఆహా! పురాణ శ్రవణము చేయించువానిదియు, వాచకునకు పుష్కలముగ ద్రవ్య మిచ్చువానిదియు ధన్యత్వ పుణ్యత్వములెంత గొప్పవి”!. బ్రహ్మ దేవుడిట్లనెను. “దిండీ! ఇట్లు సూర్య దేవుని మందిరమున పురాణ శ్రవణము చేయించువాడు ఉత్తమగతి పొందును...

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు పుణ్య శ్రవణ మహాత్మ్యవర్ణనమను తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.