భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
102. సప్తమీ కల్పమున నక్షత్ర పూజా విధి వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “బహు భార్యలలోనొక భార్యయందు ప్రత్యేకముగననురాగమున్నట్లు, దేవదేవుడైన భాస్కరునకీ సప్తమీతిథి ప్రియతరమైనది. సూర్యదేవునకన్ని తిథులు ప్రియములేయైనను సప్తమీనాడే మనుజుడు. సూర్యపూజ చేయవలెను." శతానీకుడిట్లనెను. “అన్ని తిథులకు సూర్యుడే అధిపతియని చెప్పబడినను సప్తమీనాడే బుధులు సూర్యయాగము చేయుచుందురు. కారణమేమి”?. సుమంతుముని యిట్లు ప్రత్యుత్తరము చెప్పెను”. పూర్వమిట్టి ప్రశ్ననే విష్ణుభగవానుడు సురజేష్టుడైన బ్రహ్మదేవు నడిగెను. బ్రహ్మదేవుడు విష్ణుదేవునకు చెప్పిన విషయమును నేను నీకు చెప్పెదను. ఏకాగ్రచిత్తుడవై వినుము. పూర్వమొకప్పుడు పితామహుడు, సురజ్యేష్ఠుడునైన బ్రహ్మదేవుడు సుఖాసీనుడైయుండగా విష్ణుభగవానుడతనికి శిరము వంచి నమస్కరించి యిట్లు పలికెను. ఓ బ్రహ్మదేవా! అన్ని తిథులకును భాస్కరదేవుడే అధిపతిగా పేర్కొనబడినను సప్తమీ దినముననే అతడు పూజింపబడుటకు కారణమేదియో నాకుఁతెలుపుడు”. విష్ణుదేవుని ప్రశ్నవిని బ్రహ్మదేవుడు నవ్వి యిట్లు సమాధానము చెప్పెను. మహాత్ముడైన సూర్యభగవానుడు సప్తమీని విడిచి తక్కిన తిథులన్నింటిని ఆయాదేవతల యారాధన కొఱకిచ్చివేసేను-8. ఏ దేవతకే, తిథి యీయఁ బడినదో ఆ దేవత ఆతిథికి అధిపతియగును. ఆ కారణమున నాదేవునా తిధియందతనికి సంబంధించిన మంత్రములతోనర్చించిన నతడు వరమిచ్చువాడగును”. బ్రహ్మవాక్యములు విని విష్ణుదేవుడిట్లనెను. మహాత్ముడైన సూర్యుడే దినమును ఏ దేవున కిచ్చెను? స్వదినమున స్వమంత్రములతోనర్చింపనాదేవుడు నిశ్చయముగననుగ్రహించునన్నమాట!.
తా॥ బ్రహ్మాదేవుడిట్లనెను. “అగ్నిహోత్రునకు ప్రతిపత్తు (పాడ్యమి), బ్రహ్మకు విదియ, కుబేరునకు తదియ, గణేశ్వరునకు చతుర్థి . నాగరాజుకు పంచమి, కుమారస్వామికి షష్ఠి సూర్యునిచే నీయబడెను. సప్తమీతిథిని సూర్య భగవానుడు తనయాధిపత్యముననేయుంచుకొనెను. అష్టమిని రుద్రునకు. నవమిని దుర్గాదేవికి, దశమినీ యమునకు, ఏకాదశిని విశ్వేదేవులకు. ద్వాదశిని విష్ణు భగవానునకు, త్రయోదశిని మన్మధ దేవునకు, చతుర్దశిని శంకరునకు, పూర్ణిమను చంద్రునకును, అమావాస్య పుణ్య తిథిని పితృ దేవతలకు ఇచ్చి వేసెను. ఈ పదునైదు తిథులును చంద్రునివిగా పేర్కొనబడినవి. కృష్ణ పక్షము నందు క్రమముగా నాయా దేవతలచే చంద్రకళ లొక్కొక్కటిగా పానము చేయబడును. శుక్ల పక్షమున పదునాఱవ కళతో గూడ క్రమముగనవి పూరింపబడును. షోడశీ కళ యొక్కటీయే అక్షయ మైయుందును. దాని యందు సాక్షాత్తుగ సూర్య భగవానుడే యుండును. ఇట్లాతడు వృద్ది క్షయములు చేయుచుండుటచే వాని యధిపతిగా పేర్కొనబడును. ధ్యాన మాత్రముననే యునికి గలిగి సూర్య భగవానుడు మహత్తరమైన గతి నీచ్చును. ఇతర దేవతలు కూడ సుఖముతో గూడ . కామములనెట్లోడ గూర్తురో సంక్షేపముగాఁజెప్పెదను వినుము. పాడ్యమినాడగ్నిదేవుని పూజించి అమృత రూప ఘృతమును హవనము చేసినచో నన్ని విధములైన ధాన్యములు, మిక్కుటమైన ధనము ప్రాప్తించును. ద్వితీయా తిథినాడు బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మచారి బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో మానవుడు సర్వ విద్యలలో పారంగతుడగును.
తా॥ తృతీయా తిథియందు కుబేరుని పూజించినవాడు నిశ్చయముగ ధనాఢ్యుడగును, క్రయ విక్రయాది వ్యవహారములందు ఎన్నో రెట్లధిక లాభము సమకూరును. చతుర్థి నాడే కాక ప్రతికర్మ యందును గణేశ్వరుని పూజించినచో విఘ్నములు తొలగిపోవును. శత్రువులకు విఘ్నములు కలుగును. సంశయము లేదు. పంచమి నాడు నాగ దేవతల నర్సించినచో, ఏష బాధయుండదు. లక్షణమైన భార్య, సత్సంతానము, అమితమైన సంపద కలుగును. షష్ఠి నాడు కార్తికేయుని పూజించువాడు శ్రేష్ఠుడు, మేధావి, రూప సంపన్నుడు, దీర్ఘాయుష్మంతుడు, కీర్తి మంతుడును అగును. సప్తమీ నాడు సూర్యుని, అష్టమి నాడు శివుని పూజించినచో విస్తృతమైన జ్ఞానమును, విపులమైన తేజస్సును సూర్యదేవుడీయగా, శివుడు మృత్యువును నివారించి, బంధమును తొలగించి జ్ఞానమునిచ్చువాడగును. నవమి నాడు దుర్గా పూజ చేసిన వాడు దుర్గమమైన సంసారమును స్వేచ్చగా దాటగలడు. అంతీయ కాక యుద్ధమునందును, వ్యవహారమునందును జయము పొందును. యముడు నిశ్చయముగ నన్నివ్యాధులను హరించివేయును. అతనిని దశమినాడు పూజింపవలెను. ఆ దేవుడు మానవుని నరకము నుండి, మృత్యువు నుండియును ఉద్దరించును. ఏకాదశి నాడు విశ్వ దేవతలను పూజించినచో వారు సంతానమును, పశుసంపదను, ధనమును, ధాన్యమును, భూమిని ప్రసాదింతురు. ద్వాదశినాడు విష్ణుదేవునర్చించిన విజయ మెల్లపుడు వరించుచుండును. విష్ణు భగవానునని పూజించువాడు సహస్ర కిరణుడగు సూర్య దేవుని వలె సర్వలోక పూజ్యుడగును .
తా॥ త్రయోదశి నాడు మన్మధుని పూజించినవాడు నిశ్చయముగా సుందర రూపుడగుటయే గాక ఇష్టమైన సౌందర్యవతిని భార్యగా పొంది యనేకములగు నీప్సితములఁబడయును . చతుర్దశి నాడు మహాదేవుని దర్శిం(పూజించినవాడు సర్వేశ్వర్య సమన్వితుగ ,బహుపుత్రవంతుడు, మిక్కుటమగు ధనము గలవాడగును. సంశయములేదు. పూర్ణిమనాడు భక్తియుక్తుడై చంద్రుని పూజించువాడు సర్వమును స్వాధీన పఱచుకొనగలుగును. అట్టి యాధిపత్యమెప్పటికిని సమసిపోక నిలిచి యుండును. తమ తిథియైన అమావాస్య నాడు పితృ దేవతలు పూజింపబడిన యెడల పోరు సంతాన వృద్దిని, ధనమును, రక్షణను, ఆయువును, బలమును ప్రసాదింతురు. ఈ తిథి దేవతలందఱును సభక్తిక జపహోమాదులతో మాత్రము తుష్టిఁజెంది ఉపవాసములతో నక్కరలేకయే ఆయా ఫలముల నిచ్చుచుందురు . ఈ దేవతలను పద్మ మధ్యమున ప్రతిష్ఠించి మూల మత్రములతోను, అంశ మంత్రములతోను, నామములతోను పూజింపవలెను. గంధ పుష్ప నైవేద్యములు యధాశక్తిగ సమర్పించి బాహ్య పూజా పద్దతిగా పూజించినను వీరు ఆయా ఫలములనిచ్చెదరు. ఆజ్యధారలు, సమిధలు, పెరుగు, పాలు, అన్నము, తేనె మున్నగువానితో యధోక్త ఫలదముగా హవనము, ఏకాగ్ర చిత్తముతో జపము చేయవలెను. మూల మంత్రములు, అంగ మంత్రములు, నామముతోను భక్తి పూర్వకముగ స్తుతించుచునిట్లు పన్నెండు యజ్ఞములు చేసినచో. చెప్పబడిన ఫలములు యధాతధముగా లభించుటయే గాక, అదనపు ఫలములు కూడ లభించును. ఇహమునందేట్లో పరమునందును అటులే నిత్యమును సుఖియై యుండును. మంత్రజ్ఞుడైన యజ్ఞకర్త, ఆయా దేవతల తిథి దేవమానమున నేంత వఱకుఉండునో అంత వఱకు వారి వారి లోకములలో నానందించును. అతని యరిష్టములన్నియు భస్మీపటలములై పోగా నతడా దేవతా స్వరూపమునందును. సౌందర్యవంతుడును, ధర్మ సంపన్నుడును, అణచివేయబడిన శత్రువులు గలవాడును, రాజును అగును. స్త్రీయైనను, నపుంసకుడైనను పురుషోత్తముడగును.
తా॥ “విష్ణు భగవానుడా! తిథుల గుఱించిన వివరములన్నియు నీకుఁదెలిపితినీ. ఇక నక్షత్రదేవతలు ఆయా నక్షత్రములందు వ్యవస్థితులైయుందురు. వారు పూజలందుకొని యభీప్సితముల నెట్లను గ్రహింతురో చెప్పుచున్నాను. చంద్రుడే నక్షత్రమున నుదయించి చరించుచుండునో అప్పుడు. చెప్పబడిన దేవతా పూజవలన నా దేవత ఫలమిచ్చునదియగును. ఇప్పుడు నక్షత్రముల దేవతలను గుఱించి క్రమముగా చెప్పుచున్నాను వినుము. ఆయా నక్షత్రములను, వానియందు పూజింపదగిన దేవతలను వేజ్వేజుగ పేర్కొందును. అశ్వినీ నక్షత్రమునందశ్వినీ దేవతలను పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడగును. మిక్కుటమగు వ్యాధితో పీడింపఁబడువాడు శీఘ్రముగ రోగ ముక్తుడై ఆరోగ్యవంతుడగును. భరణీ నక్షత్రమునాడు శుభ ప్రదములైన నల్లని పూవులతో - యముని పూజించవలెను. గంధము మొదలగు శుద్దమగు పూజా ద్రవ్యములతో నా దేవుని పూజింపనాతడు అప మృత్యువు నుండి విమోచనము కలిగించును. కృత్తికా నక్షత్రమున నగ్నిదేవుని ఎఱ్ఱని పుష్పములు మొదలగు వానితో పూజించి, హవనము చేయ నా దేవుడు నిశ్చయముగ ఫలమిచ్చును. రోహిణి నక్షత్రమందు ప్రజాపతిని పూజింపనాతడు ప్రీతుడై పశు సంపదనిచ్చును. మృగశిర యందు చంద్రుని పూజించి ఆరోగ్యము, జ్ఞానము పొందనగును , ఆర్ఘ యందు శివారాధన చేసినచో అంతిమ విజయము కలుగును. దివ్యమైన పద్మములతో నర్చింప నా మహాదేవుడు సుఖము నిచ్చును. పునర్వసు నక్షత్రము నాడు స్వర్గమున బృహస్పతి చేత అదితి పూజింపబడును. ఆ దినమున నా దేవతను పూజించి తృప్తి పఱచినచో నామె తల్లి వలె కాపాడును.
తా॥ పుష్యమి నక్షత్రము నాడు బృహస్పతిని పూజించిన నాతడు మంగళకరము, విపులమునైన బుద్ధినిచ్చును. ఆశ్లేషా నక్షత్రమున గంధాదులతోను, గీతములతోను నాగ దేవతలను పూజింపవలేను . విధ్యుక్తముగ భక్ష్యాది పదార్థములతోను, తీపి వస్తువులతోను, పాలతోను, ఎఱ్ఱని భోగ్య పదార్థములతోను ఆ నాగ దేవతలకు తృప్తి కలిగించినచో వారు ప్రీతిని కలిగింతురు. మఘా నక్షత్రమున హవ్య కవ్వములతో పితృదేవతలనారాధించిన యెడ వారు ధనమును, ధాన్యమును, భృత్యులను, పుత్రులను, పశు సంపదనిత్తురు. పూర్వ ఫల్గుని యందు పూషుని, ఉత్తర ఫల్గుని యందు భగుని పుష్పాదులతో పూజించిన వారు విజయమునిత్తురు. కన్యకు కోరిన భర్తను, యువకునకు కోరిన భార్యను సమకూర్తురు. ఇహ జన్మమున చక్కని రూపమును, వలసిన ధనమును గూర్చెదరు. హస్త నక్షత్రమున విశ్వ తేజో నిధియైన సవితృదేవుని, గంధ పుష్పాదులతో పూజించిన నా దేవదేవుడు విస్తృతమైన ధనమునే కాక సర్వమునిచ్చును. చిత్తానక్షత్రము నందు త్వష్టను పూజించిన నిష్కంటకమైన రాజ్యమునిచ్చును. స్వాతి నక్షత్రమున వాయుదేవుని పూజించి యాతని సంతృప్తి పచిన ప్రీతుడై శ్రేష్ఠమగు బలమునిచ్చును, విశాఖా నక్షత్రమున నేఱ్ఱని పుష్పములతో నింద్రాగ్నులను పూజించువాడు ధన ధాన్యములు పొంది సదా తేజస్విగనుండును.
తా॥ అనూరాధా నక్షత్రమున నిటైజ్ఞాని పూలతో మిత్రుని భక్తితో పూజించువారందకి సంపదలు కలుగుటయేగాక వారు చిరకాలము జీవింతురు. జ్యేష్ఠానక్షత్రమున శక్రుని (ఇంద్రుని పూజించి పుష్టిని పొందనగును. గుణములచేత, కర్మచేత, ధనము చేతను అందజిలోనను ఉత్తముడు కానగును మూలా నక్షత్రదినమున పితరులనందఱును భక్తితో నర్చించిన పూర్వోక్త ఫలము కలుగును. స్వర్గస్థాన నివాసము నిశ్చయమై యుండును . పూర్వము చెప్పినట్లే పూర్వాషాఢ దీనమున జలములను పూజించి, పూర్వోక్తవీధిగా హవనము చేసినవాడు శారీరక మానసిక సంతాపముల నుండి ముక్తుడగును. ఉత్తరాషాడయందు విశ్వేదేవులను, విశ్వేశ్వరుని పుష్పాదులతో నర్చించిన మానవుడు సర్వమును పొందును. శ్రవణ నక్షత్రమున తెలుపు, పసుపు, నీల వర్ణములు గల పుష్పములతో విష్ణు దేవుని సభక్తికముగ పూజింప సంపద, విజయము ప్రాప్తించును. ధనిష్టా నక్షత్రము నందు శుభ ప్రదములైన గంధ పుష్పాదులతో వస్తువులను పూజించినచో మహద్బయములు దూరమై నిర్భయముగ, నిశ్చింతగ జీవనము గడచును. శతభిషానక్షత్రమున నింద్రుని పూజింప వ్యాధుల నుండి నిశ్చయముగ ముక్తుడగును. రోగి ఆరోగ్యమును బలమును ఐశ్వర్యమును పొందును. పూర్వా భాద్రయందు శుద్ధస్ఫటిక సంకాశుడగు నజుని పూజించుచో భక్తి, విజయము కలుగును. ఉత్తరాభాద్ర యందహిర్భుధ్యుని పూజించిన పరమశాంతి కలుగును. రేవతీ నక్షత్రము నందు తెల్లని పువ్వులతో పూషుని పూజింపనాతడు ఎల్లవేళల శుభమును, చక్కని జీవితమును, ధైర్యమును, విజయమును ప్రసాదించును.
తా. సంక్షేపముగ నీకే ఈ నక్షత్ర దేవతల పూజా విధానములను సాధకుల మేలు గోరి చెప్పితిని భక్తిననుసరించి, వ్యయము - చేయు ధనముననుసరించి యివి ఫలముల నొసంగును ప్రయాణము చేయుటకు గాని, ఏదేని కార్యమును ప్రారంభించుటకు గాని యిచ్చగించినచో ముందు నక్షత్ర దేవతా పూజ పూర్తి గావించిన పిమ్మట నాయా పనులను చేయవలెను. ఇట్లు నక్షత్రదేవతా పూజ చేసిననే యాత్రాదుల ఫలము సమకూరును. ఇతర క్రియల ఫలితములు కూడ అనుకూలముగా నుండునని సూర్య దేవుడే స్వయముగా నుడివెను. పూజవలననే కోరినట్లుగ క్రియా సాఫల్యమును విజయమును ఆ దేవుడు సమకూర్చును. రాశి చక్రమునందు కలాత్మకముగ, కాలచక్రమునందు సమగ్రముగను. విశ్వ తేజోనిధియైన సూర్య భగవానుని ధ్యానించి, కోరిన ఏ క్రీయనైనను యధేచ్చగ చేయనగును. అప్పుడే ఆయా క్రియలచే సుద్దిష్టమైన ఫలము సంపన్నమై చేకూరును. ఇది నిశ్చయము. ఆయా ఫలముల నుద్దేశించి చేయు కర్మలచే మోక్ష ఫలము - ఇతర ఫలయోగ ప్రయత్నముచే మాత్రమే సాధింపబడును. కాని సూర్యారాధన - వలన నేరుగా మోక్షమే లభించును. అందువలననో మధు సూదనా! ఆ సూర్య దేవునే భక్తితో నారాధింపుము. రాత్రింబవలు యజ్ఞము, పూజ, నమస్కారము, సేవ, వ్రతము, ఉపవాసము, బ్రాహ్మణ తర్పణము మొదలగు వివిధ విధానములతో నా దేవదేవునారాధింపుము. సూర్య ప్రీత్యర్థముగనెవడు దేవతా పూజ జరిపించునో వాడు పాపరహితుడై సూర్యలోక ప్రాప్తినందును.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు నక్షత్ర పూజా విధి వర్ణనమను నూట రెండవ అధ్యాయము సమాప్తము.
