భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
67. సూర్యమహిమ వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “నేనొక ప్రాతఃకాల సమయమున సూర్యదేవుని ప్రత్యక్షము చేసికొనుట కొఱకు ఆతనిని స్తోత్రముచేసితిని. ఆతడు భక్తి నమ్రుడై ఏ దేవునినో పూజించు స్థితిలో ప్రత్యక్షమయ్యెను. అటుల ప్రత్యక్షమైన భానుదేవుని చూచి నేను కొంత సందేహముతో ప్రశ్నింపగా నాతడు నాకు రహస్యమును చెప్పెను-1, 2. "ఓ సూర్య భగవానుడా! సాంగోపాంగములగు వేదములందు, పురాణములందు నీవజుడవని, శాశ్వతుడవని, ధాతవని, మహాభూతుడవని, ఉత్తములలో నుత్తముడవనియు కొనియాడబడి యున్నావు-3. మూడు కాలములయందీ సర్వ జగత్తు నీ యందే ప్రతిష్ఠింపబడియుండును. గృహస్థాశ్రమమే మూలముగాగల-4. నాలుగాశ్రమములలో నుండువారును ప్రతి దీనము నీ వివిధ స్వరూపములను పూజించుచున్నారు. అందఱికిని నీవే తల్లివి, తండ్రివి, శాశ్వతమైన దైవతమవు-5. అట్టినీవు ఏదేవు నారాధించుచుంటివో తెలియజాలకున్నాను. తెలిసికొనుటకు నాకు మిక్కిలి కుతూహలముగనున్నది. కావున చెప్పుమని కోరుచున్నాను"-6. నేనిట్లడుగగా నా సూర్యదేవుడిట్లని పలికెను. “ఓ బ్రహ్మదేవా! ఇది నాకు సంబంధించిన సనాతన రహస్య విషయము. ప్రకటము చేయరానిదీ-7. నీవు భక్తిగలవాడవు కావున ఉన్నది యున్నట్లుగ నీకు చెప్పుచున్నాను. సూక్ష్మమైనది, తెలియరానిది, ప్రకటముకానిది, చలింపనిది, శాశ్వతమైనది-8. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, సర్వభూతముల చేతను రహితమైనది, అయిన పరమాత్మ సర్వ భూతముల కంతరాత్మ. అతనిని క్షేత్రజ్ఞుడందురు-9. అతడు త్రిగుణముల కతీతుడు. పురుషుడని కూడా అతడు చెప్పబడును. హిరణ్య గర్భుడని, భగవానుడని బుద్ది యనియును చేప్పబడును.
తా॥ యోగశాస్త్రములందు 'మహాన్' అని, ప్రథానమనియు చెప్పబడును. సాంఖ్య శాస్త్రమునందనేక నామములతో పఠింపబడుచున్నాడు-11. అతడు విశ్వమును పొందియుండువాడు. విశ్వభూతాత్ముడు, విశ్వమున కాత్మయైనవాడు. విశ్వసంభవుడు. ఈ త్రైలోక్యమునంతను తనదిగా తాను ధరించుచున్నాడు-12. శరీరములన్నింటియందతడ శరీరిగనున్నాడు. కర్మలచే లిపుడుకాడు, నా లోనను, నీ లోనను, దేహ సంజ్ఞగల అన్నింటియందును అంతరాత్మగా-13. సాక్షీభూతుడుగానున్నాడు. నిష్కియుడుగావున కర్మసంగత లేనివాడగును. (కర్మలచేనంటుకొనబడడు). అతడు సగుణ రూపమునను, నిర్గుణుడగును, సర్వవ్యాపియై, జ్ఞానము చేతనే తెలిసికొనబడదగినవాడని చెప్పబడును-14. అన్నివైపులయందును కాళ్లు, చేతులు, శిరస్సులు, ముఖములు, చెవులు, గలిగి అతడు సర్వము నావరించియుండును-15. విశ్వమే శిరస్సుగను, భుజములుగను, పాదములుగను, కన్నులుగను, ముక్కులుగను కలవాడు. అతడొక్కడే సర్వ క్షేత్రములందును స్వేచ్చగా, సుఖముగను తిరుగుచుండును-16. క్షేత్రములు, శుభాశుభ బీజములు అతని శరీరములే. వాని నన్నింటిని ఆ యోగాత్ముడెలుంగును గావున నాతడు క్షేత్రజ్ఞుడనబడును. అ వ్యక్తమైన పురమునందు ... శయనించును గావున పురుషుడని చెప్పబడును-17. విశ్వమనేక విధములుగ తెలియబడును. అన్నింట ఆతడుండును. అనేక రూపములుగ నతడుండుటచే విశ్వ రూపుడని చెప్పబడును-18. సనాతనుడైన ఆతడు 'మహాపురుషుడ'ను నామమును కూడ ధరించియున్నాడు. అతడు వికారము చెందియే తనతో తాను సృష్టి రచన చేయుచున్నాడు -19. ఆకాశము నుండి పడిన నీరు ఆయా భూములయందలి రస విశేషములచేత వేర్వేరు రుచులను పొందునట్లు - ఆ పరమ పురుషుడు కూడ వేర్వేరు గుణములుగల ఉపాధులను పొంది వేర్వేరు విధములుగ రూపొందుచున్నాడు.
తా॥ ఒకే వాయువు దేహమునందైదు విధములుగ నుండునట్లు, పరమాత్మకు ఏకత్వము, భిన్నత్వము రెండును గలవు-21. భిన్న భిన్న స్థానములలో నుండేడు ఒకే అగ్నికి, దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని వంటి వేజ్వేలు సంజ్ఞలున్నట్లాతనికి కూడ వేజ్వేజు స్థితులలో వేజ్వేలు నామరూప క్రియాదులు వ్యవహరింపబడును-22. ఒకే దీపమనేక దీపములకు జన్మనిచ్చునట్లాతడొక్కడే యయ్యుననేకములకు సృష్టి హేతువగును-23. అతడు తనను తానెఱుంగు వేళ కేవలుడై యుండును. ప్రళయమునందొక్కడుగను, ప్రవృత్తి సమయమున సృష్టి రూప బహుత్వమునను ఉండును-24. ఈశానుడు, పురుషుడు, బీజ సంజ్ఞకుడైన అతడు తప్ప జగత్తునందలి స్థావర జంగమములలో నిత్యమైనది మణి వేజేదియులేదు-25. అతడక్షయుడని, అప్రమేయుడని, సర్వగతుడని చెప్పబడును. అతనినుండియే సర్వ సృష్టికిని కారణమగు త్రిగుణాత్మకమైన అవ్యక్తము జనించెను-26. అప్రకటిత స్థితిలో నున్న అవ్యక్తమే ప్రకృతి యనబడును. సదసద్రూపమైన ఈ ప్రకృతియే బ్రహ్మమునకు సృష్టి ద్వారముగ నెఱుంగుము-27. అందుచేనతని కంటే నితరుడు మఱియొకడు లేడు. అతడే తండ్రి. అతడే ప్రజాపతి. అతడే నా ఆత్మయని తెలిసికొనవలెను. అతనినే నేను పూజించుచున్నాను-28. దేహధారులెవరైనను స్వర్గమునకుఁబోయినను వారాతనికే నమస్కరింతురు. అతని యనుగ్రహము వలననే, అతనిచే నాదేశింపబడి వారు సద్గతిని పొందుదురు-29. దేవతలు, రాక్షసులు, నానా మతములనాశ్రయించిన వారు కూడ నాద్యుడైన పరమ పురుషునే పూజింతురు. ఈతడే వారికీ సద్గతినిచ్చుచుండును-30. అతడు సర్వగతుడు, నిర్గుణుడనియు చెప్పబడును. ఇట్లు తెలిసికొని నేను సనాతనుడైన ఆ పరమాత్మను పూజించుచున్నాను. అతడు భాస్కరుడు, దేవ దేవేశ్వరుడు, సర్వ భూతేశుడు. అచ్యుతుడు. అతనినే నేను ఉపాసించుచున్నాను-31.” బ్రహ్మదేవుడిట్లనెను. “నేనడిగిన మీదట సూర్య భగవానుడు నాకీ పరతత్త్వమును బోధించెను. విపులమైన తపస్సుతో తపించుచున్న ఆ మహాత్ముని నీవు పూజింపుము.
శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మయాజ్ఞవల్క్య సంవాదమున సప్తమి కల్పమున సూర్య మహిమ వర్ణనమను అణువది యేడవ అధ్యాయము సమాప్తము.
