భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
92. ఆదిత్య వార కల్పమున మహాశ్వేత వార వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “సూర్య గ్రహణమునాడాదివారమగునేని అది మిక్కిలి ప్రశస్తమైనది. చెప్పుటకు, వినుటకును అలంకార ప్రాయమైనది. లోకమున ప్రసిద్ధమైనది. ఆ దినమున గంధ పుష్పోపహారములతో సూర్యభగవానుని పూజించువాడు సూర్యలోకమునకుఁబోవును. సూర్య గ్రహణమున నుపవాసవ్రతుడై, శుచిర్భూతుడై, మహాశ్వేతను, లేక సూర్యదేవుని, లేక శివపంచాక్షరిని జపించుచుండవలెను. చీకట్లను పారద్రోలువాడు, వేగముగ పయనించుచుండువాడునైన జగదీశ్వరుని, అనగా సూర్య భగవానుని ముందు పూజించిన పిమ్మట మహాశ్వేతను జపింపవలెను. మహాశ్వేతను పూజించి సూర్యార్చన పూర్తిచేయవలెను. మహాశ్వేత ఛండిలమును బయట సిద్ధము చేసి, సుసమాహితుడై యా దేవిని ప్రతిష్టించి గంధపుష్పములతో పూజింపవలెను. పవిత్రమైన ప్రదేశమునందు సూర్య భగవానుని స్థాపించి పూజింపవలెను, . స్నానమాచరించి నువ్వులచేత, ముఖ్యముగా నేతితో హోమము చేయవలెను. గ్రహణ సమయమున మహాశ్వేతా జపము చేయుచుండవలయును. గ్రహణము విడిచిన పిదప శ్రద్దా మనస్కుడై స్నానము చేసి మహాశ్వేతను, సూర్య భగవానుని పూజింపవలెను. సూర్య గ్రహణ యుక్తమైన ఈ ఆదివారమునాడు సూర్య పూజానంతరము బ్రాహ్మణులచేత పురాణ ప్రవచనముగావింపజేసి, వారి భోజన దక్షిణాదులు పూర్తి చేసి వాజ్నియమముగలవాడై తాను భుజింపవలెను.
తా॥ ఆ దినమునఏ పుణ్య కర్మ చేసినను అది శుభ ఫలమునిచ్చును. స్నానము, దానము, జపము మొదలగు కర్మల కన్నింటిని శుభ ఫలము లభించును. నిస్సంశయముగ ఈ నాటి కర్మల కనంతమైన ఫలము కలుగునని భాస్కర దేవుడే స్వయముగ వచించియుండెను.. కాబట్టి విచక్షణులు, బ్రాహ్మణులు, ఒకేపూట భోజనము, రాత్రి ఉపవాసము మున్నగు పుణ్య కర్మ చేయవలెను . ఆదిత్య వారమునాడీట్లు పుణ్య కర్మాచరణము చేయువారు సద్గతిని పొందేదరు. ఇది ధర్మ సమ్మతము, పుణ్య ప్రదము, కీర్తి కరము, సంతాన ప్రదము, వాంఛిత ఫలదాయకమైనది. ఈ సందర్భముగ చేసిన భక్ష్య దానము గోదానముతో సమానమగును. దిండిన్! ఇవి మహాత్ముడు, ప్రతాప వంతుడునై సూర్య భగవానుని పన్నెండు వారములు. సర్వ పాపములను, భయములను పోగొట్టునవి, సంతోషమునిచ్చునవియునైన వీనిని గూర్చి నీకుఁదెలిపితిని, వీనిని చదువువారికి, వినువారికి, అంతకంటెను చేయువారికీఫలముకలును. వీనిలో నొక్క వారమునైనను యథావిధిగ నాచరించినచో ధర్మార్థ కామములు సిద్ధించుటయేగాక అచంచలమైన సంపదను పొంది. చంద్రుని కాంతి వంటి కాంతి కలిగి, సూర్యుని తేజస్సువంటి తేజస్సుతో ప్రకాశించుచు. ఇంద్రుని పరాక్రమముతో సమానమైన పరాక్రమముతో వెలుగుచు తేజస్సుచే పద్మ సన్నిభుడై, వీర్యమున వజ్రాయుధసముడై, కాంతిచేత చంద్రుని వలె వెలుగుచు పరమున శివలోకమునకుఁబోవును.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమునందు, ఆదిత్య వారకల్పమున మహాశ్వేత వార వర్ణనమను తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.
