భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

56. సప్తమి కల్పమున ఆదిత్య మహిమ వర్ణనము వర్ణనము

తా॥ శ్రీ రుద్ర భగవానుడిట్లనెను. “బ్రహ్మదేవా! తమో వినాశకుడగు సూర్యదేవుని రథమునెట్లు నడిపింపవలెను? సూర్యుని వెంట నుండువారు క్రమముగా నెవరెవరు? వారి నెచ్చట నియోగింపవలెను?. సురశ్రేష్ఠా! మలమఱల నీ విషయములు వినుటకు నాకు మిక్కిలి కుతూహలమగుచున్నది. కావున సవిస్తరముగఁ దెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లనెను. “రథము విషమ మార్గమునఁబోవలసివచ్చినప్పుడు మెల్లగా, మిక్కిలి జాగరూకతతో, సమముగనున్న మార్గమును వెదకికొనుచు పోవలయును. మార్గమును పరిశుభ్రముగ జేయుట కొఱకు రథయానముకన్న ముందే ప్రతీహారిని బంపి సరిచేయింపవలేను. వాని యనంతరము. దండ నాయకుని బంపవలెను. వాని వెనుక పింగలుని బంపవలెను. రక్షకుడు, ద్వారకుడు అను నిరువురు రథము నెక్కి వెనుక భాగమున నుండవలెను. దిండీయనువాడు రథారూఢుడై ముందు భాగమున నుండవలెను. వానిముందు భాస్కరున కిష్టుడైన లేఖకుడుండవలయును. రథమును మెల్లమెల్లగా జాగ్రత్తగా నడుపవలెను. కాడి, అక్షము, చక్రము మున్నగునవి భంగము కాకుండునట్లు నడుపుచుండవలెను. ఏఁడికోల భంగమైనచో బ్రాహ్మణులకు భయము, అక్షము భంగమైనచో క్షత్రీయులకును, తులా భంగమైన వైశ్యులకు, శయ్యా భంగమైన శూద్రులకు వినాశము కలుగును. కాడి విరిగిన అనావృష్టి, పీఠము విరిగిన ప్రజలకు భయము, చక్రము విరిగిన యెడల శత్రు రథముల ఆగమనమును ఊహింపవలెను. ధ్వజము పతనమైనచో రాజున కరిష్టమని తెలియవలెను. ప్రతిమ భిన్నమైన యెడల. రాజునకు మరణముకలుగునని చెప్పవలెను. ఛత్రము భంగమైన యువరాజు మరణించునని సూచింపవలెను. ఇట్టి ఉత్పాతములు సంభవించిన యెడల చెప్పబోవు విధమున శాంతి జరిపింపవలెను.

తా॥ బలి కర్మను మఱల చేయవలెను. అటులే శాంతి హోమమును చేయవలెను. బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము చేయించి, తిరిగి దానములీయవలెను. రథమున కీశాన్య భాగమున కుండము నిర్మించి అగ్ని ప్రతిష్ఠ చేయవలెను. నేతితో తడీపీన సమిధలతో హోమము చేయవలెను. క్రమముననుసరించి ఆయా దేవతలకు, గ్రహములకు, ప్రజా పతులకు, వారి వారి నామములతో చక్కగా స్వాహాకారములు చెప్పుచు హవనము చేయవలెను. మొదట ‘అగ్నయస్వాహా', 'సోమాయస్వాహా', ప్రజా పతయేస్వాహా' అని మువ్వురికి క్రమముగా ఆహుతులీయవలెను. “బ్రాహ్మణులకు స్వస్తియగుగాక! రాజులకు స్వస్తియగుగాక! గోవులకు, ప్రజలకు శుభము కలుగుగాక! జగత్తునందు శాంతి నెలకోనుగాక!. మనుష్యులమైన మాకు సుఖముకలుగుగాక! చతుష్పాత్తులకు శాంతియగుగాక! ప్రజలకు సుఖము కల్గిడిని గాక! ఆత్మకేల్లప్పుడు సుఖము కల్గుగాక!. భూర్భువస్స్వర్లోకములకు, రవికి సర్వత్ర శాంతి కలుగుగాక!. ఓ దేవా! నీవు జగత్తును సృష్టించువాడవు. నీవే పోషించువాడవు. ప్రజలను పాలించువాడవు, గ్రహములకు ప్రభువువైన ఓ సూర్యదేవా! శాంతిని కలిగింపుము”. అని ప్రార్థింపవలెను. రథయాత్రకు కారణభూతుడైన పురుషుని జన్మమునకు సంబంధించియేర్పడు శాంతి కారణమును గుఱించి కూడ నీకు తెలియఁజేప్పెదను.

తా॥ రథయాత్రా నిర్వాహకుని జన్మకుండలిననుసరించి (గోచారముననుసరించియు) దుష్ట స్థానములందున్న గ్రహములను తెలిసికొని వానికి శాంతి జరిపింపవలెను. సమిధలను ప్రాదేశ మాత్రముగ (చూపుడు వ్రేలిని బొట్టన వ్రేలిని చాఁచి పట్టిన కొలత) సిద్ధము చేసికొనవలెను. సూర్యునకు జిల్లేడు, చంద్రునకు మోదుగు, అంగారకునకు చండ్ర, బుధునకు ఉత్తరేను. గురువునకు రావి, శుక్రునకు మేడి, శనైశ్చరునకు జమ్మి, రాహువునకు గణిక. కేతువునకు దర్భ సమిధలుపయోగింపవలెను. ఇక ఆయా గ్రహముల కీయవలసిన దానములను గూర్చి చెప్పెదను వినుము. సూర్యుని ప్రీత్యర్థము సుందరమైన గోవును, చంద్రుని కొఱకు శంఖమును. అంగారకునకు ఎఱ్ఱని వృషభమును, బుధునికి బంగారము, బృహస్పతి కొఱకు బట్టలజత, శుక్రుని ప్రీతి కొఱకు తెల్లని గుట్టము. శనైశ్చరునకు నల్లని యావును, రాహువు కొఱకు పాయస భాండమును, కేతువు కొఱకు మేక పోతును దానము చేయవలెను. ఇఁక నీ గ్రహములకు సమర్పింపవలసిన నైవేద్యములను గూర్చి వినుము. సూర్యునకు గుడాన్నము, చంద్రునకు నేతితో వండిన పాయసము, కుజునకు హవిష్యాన్నము, బుధునకు క్షీరాన్నము,. బృహస్పతికి పెరుగన్నము, శుక్రునకు ఘృతాన్నము, శనైశ్చరునకు నూవుల పిండి, మినుములు. రాహువునకు మాంసము, కేతువునకు చిత్రాన్నము, రేగుపండ్లు, కలి (పులియబెట్టిన కడుగునీరు) పచ్చితామర గింజలు) నైవేద్యము పెట్టవలెను. బాణపు దెబ్బలను కవచమెట్లు నివారించునో విధివశాత్తుగ నేర్పడిన యాపదలను శాంతి కర్మలట్లు నివారించును.

తా॥ హింసచేయని వానియెడ, తపః క్లేశాదుల నోర్చువానియెడ, ధర్మబద్ధముగ సంపాదించిన ధనముననుభవించు వానియెడ, ఎల్లప్పుడు నియమమునకు కట్టుబడి యుండువాని యెడను గ్రహము లనుగ్రహము చూపుచుండును. విపులమైన కీర్తిని కోరువాడు, ధనమును, శాంతిని కోరువాడు గ్రహ యజ్ఞము చేయుచుండవలెను. వర్షము, ఆయువు, బలము కావలసినను, చేతబడులు మున్నగునవి చేయబడినను, సంతానమును గోరు స్త్రీయును, దుష్ట సంతానము గలదియును. పుట్టిన బిడ్డలు మరణించుచున్నను, స్త్రీ సంతానము మాత్రమే కలుగుచున్నను, గ్రహశాంతి చేయవలెను. రాజ్య భ్రష్టుడైన రాజు, రాజ్య ప్రాప్తి కొఱకు, వ్యాధి గ్రస్తుడారోగ్యము కొఱకును. గ్రహ యజ్ఞము చేయవలెనని, గ్రహానుగ్రహ సంపాదనము బాధానివారకమని విజ్ఞులు తెలిపిరి. అందువలన శ్రేయస్సు కొఱకా విషయములు తెలిసికొని ఆయా గ్రహములను ప్రసన్నులను చేసి కొనవలేను. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు. ఈ గ్రహములే విద్వాంనుల చేత పూజింపబడుచుండును. ఈ గ్రహముల విగ్రహములను రాగి, స్పటికము, రక్త చందనము, బంగారము. వెండి, ఇనుము, సీసము మొదలగువానీతో చేయింపదగును. లేక బంగారపు రేకు మీదగాని, వస్త్రము మీదగాని ఆయా గ్రహముల చిత్రములు యథా శాస్త్రముగ వ్రాసి పూజింపవచ్చును. ఆయా గ్రహముల వర్ణములను బట్టి ఆయా వర్ణముల వస్త్రములు, పుష్పములు, గంథములు, నైవేద్యములు, గుగులు ధూపము సమర్పింపవలెను-39. ప్రతి గ్రహమునకును ఆయా గ్రహమంత్రములతో హవ్యములను సిద్ధముచేసికొనవలెను. “ఆ కృష్ణన రజసా', 'ఇమందేవా', 'అగ్ని ర్మూర్థాదివఃకకుత్". 'ఉద్బుధ్యస్వ', 'బ్రహస్పతే అత్యదర్యః', 'అన్నాత్పరిస్రుతః'. 'శంనోదేవీ', 'కాండాతో, కేతుం కృణ్వన్', ఆదిగా గలవి క్రమముగా నవగ్రహ మంత్రములు. ఈ మంత్రములతో పూర్వోత్తములైన సమిధలతో యధాశాస్త్రముగ నొక్కొక్క గ్రహ దేవత కాహుతులీయవలెను.

            తా॥ పూర్వోదాహృత మంత్రములతో ఒక్కొక్క గ్రహమునకు నూటయెనిమిది, లేక ఇరువది యెనిమిది పర్యాయములు సమిధలు, ఆజ్యము, తేనె, పెరుగులతో ఆహుతులీయవలెను. పూర్వోక్త విధిచేత బ్రాహ్మణులకు భోజనము నివేదింపవలెను. వారికి యథాశక్తిగ, యథాలాభముగ దక్షిణలీయవలెను. ఏ గ్రహము, ఎవనికి ఎప్పుడు దుష్ట స్థానమునందుండునో ఆ గ్రహము నాతడప్పుడు పూజింపవలెను. పూజింపబడిఅను గ్రహింపుడని నేనే వీరికి వరమొసంగితిని. రాజుల ఔన్నత్యముగాని పతనముగానీ గ్రహముల కథనమై యున్నవి. జగత్తునందలి కలిమిలేములు కూడా గ్రహములపై ఆధారపడియున్నవి. అందుచేత నా దేవతలు పూజ్యతములు. గ్రహములు, ఆవులు, రాజులు, గురువులు, బ్రాహ్మణులు పూజింపబడుచునే అనుగ్రహించుచుందురు. అవమానింపబడిన యెడల దహించివేయుదురు. యంత్రము చేతనే యంత్రము పైకెత్తబడుటయు, కొట్టబడుటయు జరిగినట్లు, గ్రహముల వలన కలిగిన పీడ గ్రహ శాంతి వలననే శమించును. యజ్ఞములు చేయువారికి, సత్య వాక్పరిపాలకులకు, నిత్యోపవాసులకు, జపహోమ తత్పరులకు ఎట్టి పీడయైనను తొలగిపోవును. కావున నిట్లు శాంతి ప్రక్రియ జరుపుటద్వారా ప్రజాశాంతిని చేసి, స్వస్తివాచనముచేసి, రథమును మఱల నలంకరించి యాత్ర సాగింపవలెను. మిగిలిన మార్గమున రథయాత్ర పూర్తిగావించి, పూర్వోక్త రథ దేవతలను పూజించి సూర్య ప్రతిమను దేవాలయమునకు చేర్పవలెను. ఉత్పాత సమయములందు గ్రహములను పూజించునట్లు సూర్య రథము నాశ్రయించి యుండు రథ దేవతలను పూజింపవలెను.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమున ఆదిత్య మహిమ వర్ణనమను ఏబదియాఱవ అధ్యాయము సమాప్తము.