భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

120. సప్తమీ కల్పమున ఆదిత్య పూజా వర్ణనము

తా॥ విష్ణు భగవానుడిట్లనెను. “బ్రహ్మదేవా! ప్రాణులందఱును విషరోగములు, దుష్టగ్రహ పీడలు మున్నగునుపద్రవములచే నన్ని కాలముల యందును బాధపడుతున్నారు. అభిచార హోమాదులచే పంపబడిన దేవతల చేతను, క్రూరములైన అంటురోగముల చేతను ఎప్పుడును పీడింపబడుచుందురు. ఈ విషరోగాద్యుప్రదములు ఏకర్మపరిణామముగ మనుష్యులకు కలుగుచున్నవో యధార్థముగ నాకుఁతెలుపుడు”. అని విష్ణుదేవుడడిగిన సందేహములకు బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “దేవశార్దూలా! తమ పూర్వజన్మలో ప్రతోపవాసాదులచేత సూర్యభగవానుని సంతోషింపచేయని వారు గ్రహరోగాదుల పాలఁబడి బాధపడుచుందురు. కృష్ణా! ఎవరి చిత్తమెల్ల వేళల సూర్యుభగవానునాశ్రయించి యుండునట్లు చేయబడదో వారు విష, గ్రహ, జ్వరాదుల బారినఁ బడెదరు. సూర్యభగవానుని సంతోషింపఁజేయుటవలన నారోగ్యము, ఉత్తమమగునభివృద్ధి, ఇంకను, మనస్సున కోరినదెల్లయును లభించును. చీకట్లను పారద్రోలు సూర్యని తృప్తిపఱచినచో మనోవ్యధలు, శారీరక జాడ్యములు, చేతబడి శక్తులు, గ్రహముల తాకిడిమున్నగు భయములేవియునుండవు. దేవతలందఱికిని పూజ్యుడగుదివాకరుడెవని యెడ తుష్టిఁజేందియుండునో వానిని దుష్టగ్రహములుగానీ సమగ్రహములు గాని సౌమ్యగ్రహములు గాని ఎప్పుడును బాధింపవు. దుష్టగ్రహములు సమములగును, సౌమ్యములగును, తనను వలె యితరుని, సర్వభూతములను సమభావముతోఁజూచుచు నుపవాసాది వ్రతములచే సూర్యభగవానుని సంతుష్టిపఱచు వానినాదేవునుగ్రహించును. జగత్ర్పభువగు దివాకరుని ప్రసన్నునిఁజేసికొనువారు సఫల మనోరథులు, ఆరోగ్య వంతులు, సుఖజీవనులు, నిత్యమును వివిధ ధర్మముల మూలమునలభించు సౌఖ్యములు గలవారగుదురు. వారికి శత్రువులు గాని, అభిచార దోషములుగాని, గ్రహరోగాదిపీడలుగాని యుండనేరువు. పాపకారిత్వము కలుగదు. శ్వేతాధిపుడైన సూర్యభగవాను నర్చించువానిని, ఆ దేవ దేవుని సంపత్సమూహములు, సర్వకాలములందు, అన్నియాపదలందును రక్షించును”.

తా॥ విష్ణుదేవుడిట్లనెను. " సూర్యభగవానునారాధింపకుండుటచే దుఃఖముల పాలైన మానవులు రోగరహితులు, జ్వరరహితులు, పాపముక్తులునుకాగలుగుట యెట్లు?. బ్రహ్మదేవుడిట్లు చెప్పెను “దేవేశ్వరుడు, నిరుపముడు, జగన్నాథుడు, సర్వదేవతల గురువు, శ్రేష్టుడు నగు భాస్కరుని ఒక్క పుష్పముతోనైన వారు పూజింతురుగాక, దానితో వారు నీరుజులు, గత కల్మషులు నయ్యేదరు.”. మటల విష్ణుభగవానుడిట్లు ప్రశ్నించెను. “భగవాన్! దోషములచే తెగడబడిన దేహములు గల వారు సూర్యునెట్లారాధింపవలయును? అట్టివారి కర్తవ్యమేమి? నాశ్రేయస్సు కొఱకు దయయుంచి చేప్పుడు. నేననుగ్రహింపదగిన వాడనేని 'వీడు సూర్యభక్తిగలవాడ'ని యెంచి సూర్యభగవానుని మహదారాధనమును గుఱించి నాకుపదేశింపుడు. అనంతుడు, నిర్జరుడు, దుష్టసందేహనాశకుడునయిన సూర్యదేవుని ఆరాధించి నేను మీ దయవలన నమిత విక్రముడ నయ్యెదను”. బ్రహ్మదేవుడిట్లునుడివెను. 'విష్ణు దేవా! నీవనుగ్రహింపదగినవాడవే. అవ్యక్తజన్ముడైన యా సూర్యునారాధించుటకు నీ మనస్సు తహతహలాడుటయే దానికి కారణము. దేవపతి, భగవంతుడు, అనోద్యుడైన భానుదేవునారాధించుట కిచ్చయించినచో మొదట నీవు వైవస్వతుడవు (సూర్యభక్తుడవు) కావలెను. వైవస్వతులు కానివారు సూర్యభగవానుని తెలిసికొనుటకు గాని, స్తుతించుటకు గాని సమర్థులుకారు. మూడులైన వారికి సూర్యుని చూచుటకు కూడా సాధ్యము కాదనినచో నికనతని లోకమున ప్రవేశించుట మాట చెప్పనేల?. సూర్యభక్తి మనస్సున ప్రవేశించినవారు, తద్భక్తిచే పునీతులైన వారు, మనస్సునిండుగ సూర్యభక్తియే కలవాట్లు వైవస్వతులై వివస్వంతుని చేరుకొందురు. అనేక జన్మములందలి సంసార పరంపరల పాపసమూహములు నశించిపోగా పురుషులకప్పుడు సూర్యభగవానుని యెడ మనస్సుకలుగును.

తా॥ ఏ మానవుడు సూర్యదేవుని యందు విద్వేషము పూనియుండునో, ఎవడు వేదములను బ్రాహ్మణులను నిందించునో అట్టివాడు రాక్షసాంశ సంభూతుడని తెలియవలేను. దురాత్ములకు, మాయాపంకజలమునఁబడినవారికి, దాంభికులకు, వేదబాహ్యులగు నాస్తికుల యందపేక్ష, హేతువాదానుకూలమైన మనఃప్రవృత్తియు కలుగును. పురుషులకు పాపము నశించినపుడు వేదములయందు, బ్రాహ్మణులయందు, యజ్ఞపురుషుడైన భానుదేవునియందును నిష్టాపూర్వకమైన శ్రద్దయేర్పడును. పాపసంచయమునకొంత శేషముండిన మనుష్యులు భోజక బ్రాహ్మణులను, సూర్యదేవుని పూజింతురు. కర్మలచే దుర్గమమైన సంసారము నందిటభ్రమించుచున్న మానవులకు, తమభక్తితో ప్రీతినందీన సూర్యభగవానుడే చేయూత నిచ్చి తరింపజేయును. నిజమైన వైవస్వతుడవై సర్వపాపహరుడగు సూర్యదేవునారాధింపుము ఆతడు ప్రీతినొందును”. బ్రహ్మదేవుని వాక్యములు విని విష్ణుభగవానుడిట్లనెను. “దేవా! గుణముల చేత వైవస్వతులను వారెట్టి లక్షణములను గలిగియుందురు? వైవస్వత కార్యమేమి? ఆ వివరము నాకు దెలుపుడు.” బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడగెను. “మనోవాక్కాయములచే ప్రాణిహింస చేయనివాడు, సూర్యదేవుని యందు మనః పూర్వకమైన భక్తి గలవాడు వైవస్వతుం డనఁబడును.

తా॥ భోజక ద్విజులకు నిత్యము నమస్కరించువాడు, పరద్రవ్యమును భుజింపనివాడు. దేవతలందఱిని సూర్యభగవానునిగ తెలియువాడు, సూర్యదేవుడే సర్వలోకములని యెఱుంగువాడు, తనను తాను వానికంటే నన్యుడుగ భావింపని వాడు వైవస్వతుడని తెలియవలెను. దేవతను, మనుష్యునీ, ఇతర ప్రాణిని, పశువులు, పక్షిని, చీమను, చెట్టును, జయిని, కఱ్ఱను, భూమిని, సముద్రమును, ఆకాశమును. తనను, దేవేశ్వరుడగు దివాకరుని కంటే భిన్నముగ భావింపని వానిని వైవస్వతుడని గుర్తింపవలెను. గతము, వర్తమానము, (భావి) అంతయును సూర్యభగవానుని యంశమని భావించునరుడు వైవస్వతుడు. భక్తి భావమున భావించినచో భానుదేవుడు భవ భయమును భంజించునను భావముగలవాడు వైవస్వతుడు. సర్వభూతము లందును త్రికరణ శుద్ధిగ, పాపభావమునుంచక సద్భావము కలిగియుండు వాడు వైవస్వతుడు. బాహ్యార్థములన పేక్షింపక భక్తితో సూర్యభగవానుని పూజాదిక్రియలను నిర్వర్తించువాడు వైవస్వతుడని చెప్పనగును. శత్రువులుగాని, స్నేహితులుగాని లేనివాడు, భేదవర్తనము లేకుండ సర్వమును సమబుద్ధితో సూర్యభగవానునిగ దర్శించువాడు వైవస్వతుడని తెలియనగును. బహుక్లేశములకోర్చి చేసిన గొప్పతపస్సుచే గాని, భూరి దక్షిణలతో సంపన్నము చేసిన యజ్ఞములచే గాని, వైవస్వతునకు. లభించునుత్తమగతి లభింపదు

తా॥ సర్వాత్మనా భానుదేవుని యందే తన భక్తి భావమునుంచువాడు కృతార్థుడు. అందుచే శ్లాఘింపదగినవాడు. అట్టివాడే వైవస్వతుడు. భాస్కరుని భక్తి భావముతో పూజించువాడు కులమునందు, తాను ధన్యుడగుటయేగాక కులమునం తను పావనమొనర్చును. మనః పూర్వకముగ సూర్యదేవుని పూజచేయించువాడు లోక ధారణకై నిరంతరము సంచరించుచుండు సూర్యభగవానుని యనుపమస్థానమున జేరును. భానుదేవునకు స్థిరమైన దేవాలయమును నిర్మింపజేయు మానవుడేడుతరముల పురుషులను సూర్యలోకమునకుఁజేర్చును. సూర్యదేవాలయముననెన్ని సంవత్సరముల వఱకు సూర్యపూజ జరుగుచుండునో అన్నివేల సంవత్సరములు సూర్యలోకమున నివసించును. ఎవని యింట లక్షణ యుక్తమైన దేవతార్చన సంతత విధిగనుండునో,  ఎవని మనస్సు నిష్కామముగనుండునో వాడు బ్రహ్మసమానుడగును. సుందరములు, మిక్కిలి పరిమళము గలవియైన పుష్పములను సప్తాశ్యుడు జగన్నాథుడైన సూర్యభగవానునకు సమర్పించువాడు సనాతన జ్యోతిఃస్థానమగు శ్రేష్ఠమగు సూర్యలోకమునకుఁబోవును. ఏయే దేశమున నేయవి తఱచుగ లభింపవో అట్టి వివిధములైన ధూపములను, పరిమళభరిత ములైన విలేపన ద్రవ్యములను . దీపములను తన కిష్టములైన యుపహారములను సమర్పించుచు ప్రతిదినము సూర్యభగవానుని పూజారూపమునయజించుచుండు మానవుని యెడ. ప్రీతిఁజెందునట్లు యజ్ఞేశ్వరుడైన ఆ దేవ దేవుడు యజ్ఞయాగాదులతో గూడ సంతోషింపడు యజ్ఞములకనేకములగు నుపకరణములు కావలెను. నానా సంభారములు కావలెను. మిక్కిలి ధనవంతులైనవారికి మాత్రమే యవి చేయుటకు సాధ్యమగును.

తా॥ భక్తిగలిగి గడ్డి పరకలతో పూజించినను భానుదేవుడు సర్వయజ్ఞములచే కూడ లభింపజాలని ఉత్తమ ఫలమునిచ్చును. అందమైన పూవులు, ధూపము, గంధానులేపనములు, ఆదేవునకిష్టమైన యాభరణములు, ఎఱ్ఱని వస్త్రముల జత. వివిధములగు నాహారపదార్థములు, భక్ష్యములు, ఫలములు సూర్యదేవునకు సమర్పింపుము. అతనినే మనస్సున భావింపుము. ఆద్యుడు, యజ్ఞపురుషుడునైన ఆ దేవుని భక్తితో ప్రసన్నుని చేసికొనుము. అతనినారాధించినవాడు పరబ్రహ్మమును పొందునని చెప్పబడినది. పుణ్యతీర్థములందలి జలముల చేతను, పుష్పములచేతను, తేనె, నేయి, పాలుమున్నగువాని చేతను జగత్పతియైన. సూర్యభగవానునకభిషేకము చేయవలెను. విష్ణుదేవా! సూర్యభగవానునకట్లు స్నానము చేయించినచో దధి క్షీరహద్రములు, గల పుణ్యలోకములను, ఐశ్వర్య సుఖమునా మధుచ్యుతుడిచ్చును. హృద్యములైన స్తోత్రములచేతను, నృత్యగీతవాద్యములచేతను, బ్రాహ్మణ సంతర్పణములచేతను సూర్యదేవునేకాగ్రచిత్తముతో నారాధింపుము. అతనినారాధించియే మహాదేవుడు మహచ్చబ్దమును పొందెను. ఆ వివస్వంతునారాధించియే-అతని యనుగ్రహముతో నేను సమస్త లోకములకు సృష్టికర్తనైతిని, ఓ హృషీకేశా! నీవు కూడ ఆ దేవదేవునారాధింపుము, అతని యనుగ్రహముతో. నిస్సంశయముగ దేవతలకు శత్రువులగు రాక్షసులను నాశనము చేయుటయందు సమర్థుడవయ్యెదవు.

            తా॥ దేవదేవుడగు వివస్వంతుని కుడివైపున గల కిరణమునుండి వేదవేదాంగ స్వరూపడనగు నేను జన్మించితిని. ఆతని యెడమ భాగమునందలి వెలుగుల సమూహములతో నిండిన కిరణము నుండి పార్వతీ వల్లభుడగు శంకరుడుదయించెను. ఆ దేవుని వక్షః స్థలము నుండి శంఖచక్ర గదా ధరుడవైన నీవు, పద్మహస్తయయిన లక్ష్మీదేవియును జన్మించితిరి. ఆ సూర్యదేవునారాధించియే నేను బలమును, కీర్తిని, సంపదను పొందగలిగితిని. రాజా! నీవుకూడ ఆ దివాకరు నారాధించి కోరిన కోరికలన్నియు పొందగలవు-. ఈ బ్రహ్మ విష్ణు సంవాదరూపమైన సూర్యప్రశంస వినినవాడు కూడ సఫల మనోరథుడై యాపిమ్మట సూర్యలోకమును జేరును. తేజస్సుచేత పద్మసన్నిభుడై, ప్రభచేత సూర్యసంకాశుడై కాంతిచేత చంద్రసమానుడై, దేవతల స్వభావము గలవాడై, గంధర్వులగానముతో, అప్సరస్సమూహములనాట్యములతో, ఏనుగులు గుఱ్ఱములు కట్టబడిన బంగారపురథము నధిరోహించి సూర్యలోకమును జేరుకొనును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్యపూజా వర్ణనమను నూట యిరువదియవ అధ్యాయము సమాప్తము.