భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

48. సప్తమీ కల్పమున ఆదిత్య మహాత్మ్య వర్ణనము

తా॥ శతానీకుడిట్లనెను. “మహాత్ముడైన భాస్కర దేవునికి సంబంధించిన మహాభాగ్యము వంటిదైన సప్తమి కల్పమును సవిస్తరముగా చెప్పుడు.” సుమంతుముని ఇట్లు చెప్పదొడంగెను. “రాజా! ఈ సందర్భముననే శ్రీ కృష్ణునకును, ఆయన పుత్రుడైన సాంబునకు మధ్య జరిగిన సూర్యదేవునకు సంబంధించిన సంవాదమును చెప్పుదురు. జగద్గురువైన వాసుదేవునకు యధావిధిగ భక్తితో నమస్కరించి, ఐహిక, పారలౌకికమగు నుత్తమ జ్ఞానమును గూర్చి, యాతని కుమారుడైన శాంబుడు (సాంబుడు) ఇట్లు ప్రశ్నించేను. “ప్రాణి యెట్లు పుట్టెను? పుట్టిన ప్రాణి ఈ లోకమున దుఃఖములచే బాధింపబడకుండు నుపాయమేమి? కోరికలన్నియు సఫలమగుటకు మార్గమేమి? తండ్రీ! నాకు తెలియజెప్పుము. ప్రాణి పరలోకమున స్వర్గమెట్లు పొందగలుగును? వివిధ సుఖములేట్లు పొందనేర్చును? సుఖానుభవము తరువాత పునరావృత్తిరహితమగు మోక్షమెట్లు పొందగలడు?. ఈ లోక శోకమును చూచి నాకు నిర్వేదము కలుగుచున్నది. మనస్సు వ్యాకుల పడుచున్నది. దీనింజూచి ఒక్క క్షణము కూడ, బ్రతుకవలెననెడి యాశ కలుగుట లేదు. ప్రయోజన రహితముగ నిట్టేలయుంటిని? ప్రాణములైనను పోవుగదా! ముసలితనము, వ్యాధులు మున్నగు దురవస్థలతో గూడిన యీ సంసారమున పడను. ఏ ఉపాయముచే నట్లు పతనము కాకుందునో అట్టి దానిని నాకనుగ్రహింపుడు. మానసిక వ్యధలు, శారీరక వ్యాధులు మొదలగు నుపద్రవముల బారి నుండి తప్పుకొనెడి మార్గమును నాకు చెప్పుడు”. సాంబుని యా మాటలు విని శ్రీ కృష్ణుడిట్లనెను. “వత్సా! ఇతరములన్నిటికంటెను ఈ విషయమున దేవతానుగ్రహమే శ్రేష్ఠమగు నుపాయమని చెప్పబడినది. అదియే నిత్యమైనది. శాశ్వతమైనది అది నా దృడ నిశ్చయము. అనుమానము, ఆగమము మొదలగు ప్రమాణములచేత నాచే నావిష్కరింపబడిన ఈ పద్ధతి కంటే భిన్నముగనెవడైనను, ఎప్పడైనను, ఏ కొంచెమైనను ఆచరించేనా?

ప్రత్యక్షేణోపలభ్యంతే న సర్వాదేవతాః క్వచిత్ అనుమానగమైర్గమ్యాః సంతిచాన్యాః సహస్రశః

తా॥ విధానము తెలిసిన వాడా దేవతనుద్దేశించి చక్కగా నారాధనము చేసినచో నతనికా దేవతా ప్రసాదము లభించును. విశిష్టమైన వ్యక్తిచేత విశిష్టమైన దేవత విశిష్టముగ పూజింపబడినచో ఆదేవత, కోరిన ఫలమునిచ్చును”. సాంబుడిట్లనెను. “ఏ దేవత గుణించియైనను తదస్తిత్వశంకలేదు. కాని కొందబీ దృష్టిలో “ఆ దేవత' లేదనియే నిశ్చయము. ఆ వివరములను స్పష్టము చేయుడు”. వాసుదేవుడిట్లు సమాధానము చెప్పెను. “అనేకములైన ఆగమముల ప్రమాణములననుసరించి 'దేవత' ఉనికి సిద్దమే కదా! అయినచో నాగమములు ప్రామాణికములని భావించువానికి మాత్రము ఆ 'దేవతాస్తిత్వము' ఉండగలదు. అనుమాన ప్రమాణము చేత కూడ ఇపుడు తదస్తిత్వమును సాధింపవచ్చును. ఏలయన ఎవనికి 'ఉనికి' కలదో వానికి ఆ ప్రమాణము కూడ కలదు. (స్వీయాస్తిత్వమే దేవతాస్తిత్వమునకు ప్రమాణము). అట్లే ప్రత్యక్ష ప్రమాణము చేత కూడ దేవతాస్తిత్వము సాధింపనగును. సకల ప్రాణికోటి కనబడుచుండుటయే దేవతాస్తిత్వమునకు ప్రమాణమై తీరును. ఒక వేళ పశుపక్ష్యాదులు యథాస్థితిగ పూర్వమునుండి ఉన్నవి అనినచో అప్పుడు అస్తి-నాస్తి విచికిత్పయే ఉతృస్నముకాదు. వాసుదేవుని ఈ మాటలు విని సాంబుడిట్లనెను. "తండ్రీ! దేవతలందఱును ప్రత్యక్షముగనే లభ్యమగుచుండ, అనుమానాగమ ప్రమాణముల ప్రయోజనముండదు గదా! వాసుదేవుడిట్లనెను. “ప్రత్యక్షముగ దేవతలందఱును ఎప్పుడును లభింపరు. అనుమానాగమ ప్రమాణములచేత మాత్రమే తెలిసికొనదగు దేవతలు వేలకొలదిగ కలరు,”. సాంబుడిట్లనెను. "దేవా! మొట్టమెదట దృగ్గోచరమగు దేవతల గుంచి నాకు చేప్పుడు. ఆ పిమ్మట నితరమైన దాని గూర్చి చెప్పవచ్చును.

తా॥ వాసుదేవుడిట్లనెను. “జగచ్చక్షువు, దివాకరుడునైన సూర్యుడే ప్రత్యక్ష దేవత. ఆతనికంటెనధికమైనది, శాశ్వతమైనదియునైన దేవత మణియెవరు లేరు. ఆయన నుండియే యీ జగత్తు పుట్టుచున్నది. ఆయన యందే లయమగుచున్నది. కృతయుగాది లక్షణములుగల కాలస్వరూపము సాక్షాత్తుగ నా దివాకరుడే. గ్రహములు, నక్షత్రములు, యోగములు, కరణములు, మేషాదిరాళులు, ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, అశ్వినులు, వాయువులు, అగ్ని. ఇంద్రుడు, బ్రహ్మ, భూలోక భువర్లోక సువర్లోకాది సర్వలోకములు, పర్వతములు, వృక్షములు, నదులు, సముద్రములు, సర్వప్రాణి ప్రపంచము-వీని యన్నింటికిని సూర్యుడే కారణము. అతని యిచ్చచేతనే చరాచర జగత్తు పుట్టినది. అతని యిచ్చ చేతనే స్థితి కలిగియున్నది. అతని యిచ్చచేతనే జగద్వస్తులన్నియు తమతమ కార్యములందు ప్రవర్తించుచున్నవి. అతనియనుగ్రహము వలననే లోకమంతయు చైతన్యమయముగ కన్పట్టుచున్నది. అతని యుదయముతో నుదయించుచున్నది. అతని అస్తమయముతో అస్తమించుచున్నది. దీనినంతయు నేందుకు చెప్పుచుంటినో గ్రహించితివా? కావుననాతని కంటే శ్రేష్ఠుడు లేడు. ఉండలేదు. ఉండబోడు. వేదములన్నింటియందును అతడు పరమాత్మునిగా గానము చేయబడును. (కీర్తింపబడును). ఇతిహాసములందు, పురాణములందతడంతరాత్మగా కీర్తింపబడును. సుషుమ్నానాడియందును, జాగ్రత్స్వప్న సుషుప్తులయందును బాహ్యాత్మగానుండును. కనబడకుండఁబోయి కనబడకుండఁ జేయును. ఇది యంతయు నేనేందుకు చెప్పుచుంటినో తెలిసకొంటివా? ఆయనకన్న శ్రేష్ఠుడు లేదు. ఉండలేడు. ఉండబోడు. సర్వమును వహించువాడని ప్రఖ్యాతి గలవాడు, ప్రాణులన్నింటికి ప్రేరణ నిచ్చువాడు; చరాచర భూతములలో నతడు ప్రసరింపని వస్తువు లేదు.

తా॥ ఇతనిని గుజించి వివరించి చెప్పుటకు వేదములకుగాని, వేదవేత్తలకుగాని వందల సంవత్సరములకైనను సాధ్యముకాదు. అట్టిది నేను సంక్షేపముగఁజెప్పితిని. అందువలన నితడు గుణాకరుడని పేరువడసి యున్నాడు. సర్వస్థలములకును నితడు దివాకరుడైయున్నాడు. సర్వేశ్వరుడు, సర్వకర్త, సర్వభర్తయయినట్టి యీ సూర్యదేవుడవ్యయుడు. గతిశీలములై మత్స్యాదులు మహేశ్వరుని వలన నావిర్భవించినవి. ఇవి సూర్యమండలమునుండి వేఱయిపోయినవిగ పరమార్థతః నాకు తెలియును. సూర్యుని మండలా కృతిగఁజేసి త్రికాలములయందు ఉపాసించు వాడు ఉత్తమ గతిని పొందును. ఇక నాకాశమున బింబస్టుడైయున్న నాదేవుని యుపాసించువాని విషయమున చేప్పవలసినదేమి? అతనికి వివిధములైన సిద్దులు లభించుటలో సాశ్చర్యము లేదు. సూర్య మండలాంతర్గతుడైన యా పరమాత్ముడే దేహమునందును వ్యవస్థితుడై యున్నవాడని స్వబుద్దితో దర్శీంపగలవాడే నిజమైన ద్రష్ట. ఆ విధముగ ధ్యానించి పూజించువాడు, జపించుపోడు, యజించువాడు తన కోరికలన్నింటిని సఫలముచేసికొనగలడు. ధర్మధ్వజమును పొందగలడు. కావున నీవీలోకమునందలి దుఃఖములనంతముచేసికొనగోరినచో, ఐహికాముష్మిక భోగములనందగోరినచో, భుక్తిని, శాశ్వతమైన ముక్తిని పొందగోరినచో. ఏకాగ్రచిత్తుడవై నీలో నున్న సూర్యుని మంత్రములచే పూజింపుము. లేక శాస్త్రము చేత శోధింపబడిన వానిలో నీవు వరించిన స్థానమునందలి దేహ విశిష్టుడైన సూర్యమూర్తిని పూజింపుము. అన్ని వైపుల నుండి రాగల శస్త్రాస్త్రములనుండి రక్షింపగల కవచ పఠనముచే పూజింపుము. ఇట్టి ప్రయత్నముతో నెప్పడైనను కోరిన ఫలమును పొందగలవు.

తా॥ సూర్యభగవానుని శరణము పొందిన వారికి ఆధ్యాతిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన దుఃఖములెప్పుడును కలుగనేరవు. వారికెట్టి భయమునుండదు. అంతేకాక ఐహికాముష్మిక సుఖములవిచ్చిన్నముగ కలుగును. ఈ ఉత్తమమైన జ్ఞానము సాక్షాత్తుగ సూర్యదేవునిచే నాకు చెప్పబడినది. బహుకాలము యథావిధిగ సూర్యారాధన చేయుటచేత ధర్మధ్వజుడుగల యుత్తమ పదము ప్రాప్తించును. త్వరగా సిద్ధింపగల శ్రేష్ఠమగునీ సూర్యోపాసన గూర్చి సంక్షేపముగఁజెప్పబడినది. దీనికి మించినది మఱియొకటి లేదని స్వయముగా సూర్యుని చేతనే చెప్పబడినది. ఈ ఉపాయమునే నేను నీకు సంక్షిప్తముగ చెప్పితిని. మానవుల కింతకంటే శ్రేయస్కరమగునుపాయము మఱియొకటి లేదు.

శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమికల్పమునందు ఆదిత్యమాహాత్మ్య వర్ణనమను నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.