భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

8. వివాహ ధర్మములందు స్త్రీ విషయమున నరవృత్త వర్ణనము

తా॥ బ్రహ్మదేవుఁడిట్లనెను శాస్త్రవిధిననుసరించి గృహస్థుడు చేయవలసిన కర్తవ్యమునిప్పుడు విపులముగా చెప్పెదను. తెలిసికొనుడు శుభదేశమునాశ్రయించి విధివత్పాణిగ్రహణము చేసిన భార్యతో గృహమున నివసించుచు, వైవాహికాగ్నియందు యథావిధిగ గృహ్యకర్మలను నిర్వర్తించుచుండవలెను. స్వకీయమైన గృహములేకుండ ధనములను స్త్రీలను రక్షించుట మొదలగునవి సాధ్యముకాదు. కాబట్టి ఆవిధీ చెప్పబడుచున్నది. ధనము, స్త్రీ త్రివర్గసాధనకు కారణములు కావున వానిని తప్పక రక్షింపవలెను. రక్షింపకున్న విపరీతములు సంభవించును. గుణదోషములను విచారించుచు, స్వాభావికముగా పురుషునియందలి అసంతుష్టినుండియు, దుష్టసంసర్గమునుండియు స్త్రీలను రక్షింపుచునే యుండవలయును. ధనముల రక్షణ కొఱకును, ధర్మసాధన కొఱకునునైన ఆశ్రయము పురుషుఁడు, స్థానము, గృహము అని మూడు విధములు, కులీనుఁడు, నీతిమంతుడు, ప్రాజ్ఞుఁడు, సత్యసంధుఁడు, దృఢవ్రతుఁడు, వినీతుఁడు, ధార్మికుడు, త్యాగియగువానిని 'పురుషాశ్రయము'గా నెఱుంగవలెను. నగరమునకాని, కొండదొననాశ్రయించియుండు పల్లెలోగాని, పంటకాపులు, వర్తకులుండెడి పల్లెలో గానీ, తన పూర్వులు నివసించుచువచ్చుచున్న గ్రామమందుగాని, యాత్రావశమున తానుచూచిన ధార్మిక జసులుండు గ్రామమున గాని నివసింపవలెను. గుర్వాజ్ఞతో లేక గ్రామముఖ్యులు మొదలగు వారీ ఆజ్ఞతో ఇరుగుపొరుగు ఇండ్లనుండి ఏ బాధయు లేకుండునట్లుగా తన యింటినీ శుద్దమొనర్చుకొనవలెను. ద్వారములు, ముంగిటీయిండ్లు (అగ్నిశాలలు) కంసాలులు, సాలె, మంగలి, చాకల, ముచ్చి మొదలగు వారి యిండ్లు, జూదగృహములు, వథస్థానములు, మద్యశాలలు, నటులు, రాజోద్యోగులుండుచోట్లు. నాస్తికుల వసతులు, దేవస్థాన వీధులు, రాజమార్గములు, రాజగృహములు మొదలగు వానికి దూరముగా, సుగుప్తముగా, విభవములతో కూడినదిగా గృహమును నిర్మించుకొనవలెను.

తా ॥ గృహము మఱుఁగుతో కూడిన తెల్లు కసవులేనిదిగను (ధనము దాచు గుప్తస్థలము గలదిగను) వెనుక భాగమంతటను పరిశుద్దముగా నుండునదిగను, సచ్చరిత్రులు, ఆప్తులుగలదిగను, సత్ర్పవర్తకులైన పొరుగువారు గలదియును అయియుండలేను. వాస్తుశాస్త్ర పద్ధతిగ తూర్పు, ఉత్తరము పల్లముగా నుండు ప్రదేశమున ఆయక్రియల కాయా విభాగములుండునట్లు అన్ని ఋతువులలోను మనోహరముగా నుండునట్లు నిర్మింపవలెను. పూజామందిరము, స్నానశాల, ఉదకారము, పశుశాల, పాకశాల, అశ్వశాల మొదలగువానితో గూడి దాసదాసీజనముతో నిండియుండవలెను, అంతఃపురస్త్రీలుండుటకు (బహిష్టులుండుటకును) వేర్వేరు విభాగములుండవలెను. సకలమైన సాధన సంపత్తితో కూడియుండవలెను. శయనాగారము విడిగానుండవలెను. ఆప్తులు, వృద్ధులు ఇంటనుండవలెను. స్త్రీలకు సరియైన రక్షణలేకుండినయెడల వర్ణ సంకరులు పుట్టుట మొదలగు దోషములెన్నియో కనబడుచున్నవి. కావున స్త్రీలనెల్లవేళల రక్షింపుచుండవలెను. వీరికి అతిశయించిన సంతోష స్వాతంత్ర్యములనీయరాదు. విశ్వసించుచున్నట్లు ప్రవర్తింపవలెనే కాని విశ్వసింపరాదు. న్యాయమైన బెదురులోనుంచవలెను. పాకాది కర్మలలో తప్ప ఎట్టి అధికారము నీయరాదు. పాకాది కర్మలో నియుక్తము చేయవలెను. స్త్రీలకు గ్రామీణత్వమే భోగమునకు చాలును. చక్కగాశాసింపబడినవారై నిత్యమును వారు ఏదో ఒక పనిలో నిమగ్నమై యుండవలెను. ఇట్లేప్పుడును వారు కర్మయోగముననున్నయెడల అవిద్య నిరాశ్రయముగనుండదు. మిక్కిలి సౌందర్యము, దుష్ట జన సహవాసము, స్వేచ్ఛ, తినుట, త్రాగుట, కథా గోష్టులయందిచ్ఛ, పనిలేకుండుట అనునవి దుర్గతిని కలిగించునవి.

తా ॥ మోసకారి, వేల్పుసాని, బోడితలగలది, బిచ్చగత్తె, బాలెంతరాలు మొదలగువారితోను సైగలు చేయువారు (నేత్రభాష మాటాడువారు), దుష్టులు, తాగటదమ్ములు (జీవనార్థము సన్యాసి వేషము ధరించినవారు), యాచకులు, శిల్పులు (నటాదికళాకారులు) మొదలగువారితోను. అంగమర్దనాది క్రియలకైపోవుట, యాత్రలు, ఉద్యానవనములకు పోవుట, బంధువులనాలింగనాదులచే సంతోషపరచుట, (వీడుకోట్లు), తీర్థయాత్రాప్రసంగము చేయుట, బాహాటముగ ధార్మిక స్థలములయందు తిరుగుట. దీర్ఘకాలము భర్తకు దూరముగనుండుట, భర్తృసంబంధమైన వారిని దూరీకరించియుండుట, కటువుగ ప్రవర్తించుట, పిసినారితనము, పురుషులతో అతిమాత్రముగ మాట్లాడుట. మిక్కిలి క్రూరత్వము, మిక్కిలి ఓర్పు కలిగి యుండుట మిక్కిలి నిర్భయత్వము, ఏ స్త్రీలకైనను అత్యంతముగా వశమైపోవుట, ఇవియన్నియు స్త్రీవిషయమున దోషములు. స్త్రీలకు పురుషుఁడధీనమగుటవలన పురుషుడే నిందింపదగినవాఁడగును. భృత్యుల అయోగ్యతకు కూడ యజమాని జాడ్యమే కారణము. అందువలన స్త్రీలను, భృత్యులను శాసన తాడనములచేత రక్షింపుచుండవలెను. తాడనాదులు ఎంతకాలము ఎట్లు అవశ్యకమో అంతకాము అట్లు ఆచరింపుచుండవలెను.  పురుషుడు బహుభార్యలను పరిగ్రహించుటచేత ఉచితమగు క్రమమున, కర్మము, దానము, సత్కారము, వస్త్రము (నీరాజనము) మొదలగు ఉపచారములతో సంపూర్ణుడగును. మొదట కులము, ఆ పై ధర్మము, ఆపిదప యోగ్యత, ఆ మీదట సుపుత్రులు కలుగుట, దానికితోడు ధనముకూడ చేరిన పక్షమున స్త్రీలకు ఔన్నత్యము సమకూరును. అది దాని కట్లు కారణమగుచున్నది. అందువలన మొదటనే కొలఁదులు తూచుట హేయము. అట్లేవరును చేయలేదు. చేయకూడదు. గురుత్వలఘుత్వములెట్లున్నను మంచితనమ ప్రమాణముగా సంబంధము ఏర్పాటు చేసికొనవలయును. బుద్ధిమంతుడైవడైన అకస్మాత్తుగనే గురుత్వ లసుతనుల వేంచెవేని ఏదో ఒకటి అనాలోచితముగా చేసినవాడగుటచేత అతడే ఎమునందుకు సాగుకు

తా॥ ఇట్లు నిర్నిమిత్తముగ గురుత్వలఘుత్వములనెన్నినచో తదాశ్రితులును అవే కారణములుగలవారై ఏకాంతమందు వానినే తిరిగి ప్రచురము చేయుటకు పూనుకొందురు. ఇదియే వారి సంతానముల యోగ్యతాయోగ్యతల నిర్ణయించు. కారణమగును. ఏలయనగా తమతమ పిల్లల వివాహాదుల గుణించిన విచారణలందు కులము, యోగ్యత రెండును ప్రధానములగును గదా!. అవిరెండును కలిసియుండుటయే మనుష్యులకు సుఖదాయకమగును. రెంటిలో ఏ ఒకటియైనను చెడి వేరైపోయినను గొప్పదుఃఖము కలిగించును. కాబట్టి స్వార్థము కొఱకే అట్టి దుఃఖము ప్రాప్తింపకుండ నిరోధింపవలెను. ఇష్టమైనవియైనను అట్టి వదంతులను అడ్డుకొనవలెను. స్వార్థమునందే నిష్ఠగల లోకము సర్వము నెఱుంగును. 'అస్తమానము' (అస్తమించిన మాసము) భ్రమలను కలిగించునను ప్రసిద్ధి కలదుకదా!. అందువలన మునుముందు ఇహపరములనుగాని శ్రేయఃప్రాప్తికొఱకుగాని భార్యమొదలగు స్త్రీలను, సేవకులను శాసించి అదుపులోనుంచవలెను. ధర్మార్థకామ విషయములందు స్త్రీలకు మోసము చేయరాదు. అట్లు త్రివర్గ విషయములందు వారితో కపటవర్తనము చేసినందువలన తననుండి తాను వేరైన వాఁడగును. ధర్మాదీసాధనమునందు మనుష్యులకు భార్య యనునదీ అర్థశరీరము. అందువలన ఆయా కర్మలయందు ఆమెకు వ్యధ కలిగింపరాదు. ఎంతమాత్రమైనను ప్రతికూల వర్తనము పనికిరాదు. యజ్ఞములు, ఉత్సవములు మొదలగు వాని యందు వారితో అకస్మాత్తుగా విభేదింపరాదు. వస్త్రతాంబూలదానాదికమందు గౌరవమునందు తాను సమానుడేయగును. కామము వలన ఏకాంతమునందేర్పడిన భేదము, ప్రియాప్రియత్వములను, ఉపచారములతోను, అనునయ వాక్యములతోను పోగొట్టి తుల్యవృత్తిననుసరించుట ప్రశస్తమైనది. ఋతుకాలమందైననో అందఱను ప్రియులవలెనే అంగీకరింపవలెను. స్త్రీ, మొట్టమొదట ధర్మార్థములను, పిమ్మట పుత్రులనుబడసి కామపురుషార్థము సాధింపఁదగియున్నది.

తా॥ ఈ వీధి చేతనే 'సమాన వృత్తి' ఎంతకాలముండునో అంతకాలము తమతమ నివాసములను ఒక్కటిగా చేయుచు ఎప్పుడును ఋతుకాలాభిగమనము చేయవలెను. నిత్యము పర్యాయముగానుపయుక్తములగు వసతి స్థలములను “అసువుల'నుగా ప్రాణములుగా తెలియుదురు. ఋతుదుఃఖమును గాని సంతోషమునుగాని అటుల పూర్వము వచ్చియుండినదానిని. మంచిదైనను చేడుదైనను అన్యస్త్రీ తోడి ఏకాంతమునందలి దుఃఖముగాని, ఉత్కంఠగాని భార్యలతోడునందు ప్రస్తావింపరాదు. ఇతరస్త్రీ సంబంధమైన ఏకాంతము ఏ కొంచెమైనను 'అన్యథా'గా చెప్పఁబడును. దానికి బాధపడక తనకు తానే విచారించుకొనవలెను. పరస్పర క్రోథవాక్యముల సందర్భమున వారిని మాటలతోనైన బెదరింపరాదు. గుణదోషములను తెలిసికొని తమను తాము నిస్తేజులుగా చేసి కొనరాదు. వస్త్రములు, అలంకారములు, భోజ్యపదార్థములు, ఆమె సంతానము-వీనియందు తల్లిదోషములెంచక, తండ్రి సమాన దృష్టిగలవాడగును. ఒకరి దోషములను మఱియొకరికి చెప్పుచు దూషించుట నీతికాదు. ఇది వారివారి సంతాన విషయమునందును ఉభయపక్షములకు సమానముగ వర్తించును. ప్రీతిని, ద్వేషమును, అభిప్రాయమును, శౌచాశౌచములను, రాకపోకలను, ఇంట, బయట ఎప్పుడును. భృత్యులమూలమున గూఢచారులమూలమున నెఱుంగుచుండవలెను. అదుపులేని తన చిత్తవృత్తిని తెలిసికూడ, అన్ని అవినయములకు నిలయములైన స్త్రీల చిత్తవృత్తులయందు విశ్వాసముంచుట ఎట్లు?. వృద్ధురాండ్రైనదాసీ స్త్రీలు, ఎప్పుడును వచ్చుచుండు దాదులు, పరిచారికలు, వారితల్లిదండ్రులు, పేడివారు, ముసలివారు, చోరులుగా తేలియవలెను.

తా ॥ వారల శీలములవంటి శీలములతో, దయలవంటి దయలతో కూడిన వివిధములైన కాలోచితములైన కథలతో, ఆఖ్యానములతో వారి మనోవృత్తులలోనికి ప్రవేశించి, వారి యాంతరభిప్రాయముల నెఱిఁగికొనవలెను. ఆయా కధార్థములను చెప్పుచున్నప్పుడు, వారి ముఖభంగిమల చేతను, భావద్యోతక చిహ్నములతోను, వారి మనోగతాభిప్రాయమును పసికట్టవలెను. సీత, అరుంధతి, శకుంతల మొదలగు వారి కథలతోడను, అటులే దుష్టచారిత్రులైన వారి కథలతోడను ప్రవృత్తిననుసరించినను తెలిసికొనవలెను. దుషులలో మంచివారు, సాధువులలో దుషులు అయిన పురుషులయందు, కథా, ప్రబంధముల యందును, ప్రీతి సఖ్యము కలుగును. ఇట్టి ఆగమ దుష్టుల నుండి, తత్త్వతః స్త్రీల అభిప్రాయమును అను మానము చేతెలిసికొని సత్వరమే యధోచిత వర్తనమునకు పూనుకొనవలెనె. కలహించిన లేక విరోధపడిన స్త్రీలవలన రాజునకు ప్రాణాపాయము కూడ చరిత్రలో చూడబడినది. అందుచే అట్టి స్థితినుండి ప్రయత్నపూర్వకముగ రక్షణ పొందవలెను. జడలో రహస్యముగ దాచబడిన శస్త్రముచేత శుభధ్వజుడను రాజు హతుడయ్యెను. సౌవీర రాజ్యాధిపతి రాణియొక్క మొలనూలుకు గల మణిచేత చంపబడెను. భద్రసేనుడను రాజును అతని రాణి తన సోదరునితో కలిసి సంహరించెను. అటులే కారూషుడను రాజు తనకొడుకు చేత, కత్తివంటీ అద్దపుముక్కచేత చంపబడెను. వంద్యులును, ఉత్తములైన ఇద్దఱు కాశీరాజులను, ఆనందాపుర స్త్రీ విషము ప్రయోగించి చంపెను. ఈ విధముగ రాజులు, బ్రాహ్మణులును స్త్రీలచేత చంపబడిరనగా నిక నితరుల కథ యేమి చెప్పవలెను ?.

తా॥ కాఁబట్టి ఎల్లప్పుడును జాగరూకతతో భార్యలను కాపాడుచుండవలెను. గుణదోషముల ననుసరించి యధోచితముగ వారికి ఉపచారములు చేయుచుండవలెను. ఉపచారములలోని ఎగుడుదిగుడులచేత, అకారణముగ కలిగిన వికారములచేత, ముఖ్యముగా సవతుల సంబంధమైన ఈర్ష్యల చేత, హఠాత్తుగ కలగిన వేదనలచేత. పక్షపాతమునందు, అసందర్భముగ కఠినమైన మాటలనుట, తీవ్రముగ దండించుట మొదలగు కారణముల వలన భర్త పై స్త్రీలకు విశేషమైన కోపము ద్వేషము పుట్టును. అట్లు శత్రుత్వమును లేవనెత్తెడు ద్వేషము నుండి ముసలితనము వచ్చును. కాబట్టి భార్యల వినాశమునకు కారణములగు నట్టి దోషములను చేయరాదు. పీడితులైన ఈ భార్యలు, అధర్మమేమైనను, తమ కులాచారమును వెంటనే వదలి పెట్టకుందురా ? సహజముగనే తమ సద్గుణములను ఉపేక్షింపకుందురా ? స్త్రీల పాతివ్రత్యమునకు ప్రాయికముగ మూడు కారణములు కనబడుచున్నవి. ఒకటి పరపురుషులయందు ప్రీతి లేకుండుట. రెండు తన భర్తయందు ప్రేమ ఉండుట. మూడు తన రక్షణ. అందువలన ఆమె నెల్లప్పుడును యథోచితమైన ఉపచారములతో చక్కగా రక్షింపు చుండవలెను. స్త్రీలు నిత్యోపచారములతో మంచి భార్యలుగా మలచదగిన వారు. ఉత్తమ స్త్రీని సామదానములచేత, మధ్యమ స్త్రీని దానభేదములచేత, అధమురాలిని భేద దండములచేత సాధించి లోబరచుకొనవలెను. అధమ స్త్రీ యెడ మొదట భేద దండములను ప్రయోగించియు తత్సంతానా పేక్ష చేత సామదానములను కూడ పిదప ప్రయోగించుట స్త్రీ ప్రసాధనలో శిష్టులకు కర్తవ్యము. హీన చరిత్రలై భర్తకు అపకారము చేసెడి స్త్రీలు కాలకూట విషముతో సమానమైనవారు. అట్టి స్త్రీలను సజ్జనులు విడిచి పెట్టవలెను. ఇష్టులు,కులమునకు కీర్తిదెచ్చువారు, సాధ్వీమణులు, పవిత్ర చరిత్రలు, భర్తృ ప్రేమ గలవారు అయిన స్త్రీలు ఎప్పుడును ఉత్తరోత్తర సంప్రదాయములచేత ఆదరింపదగినవారు. ఇట్లుద్దేశింపబడిన స్త్రీవృత్తము ననుసరించి ఎవడు మెలగునో వాడు ఇహలోక సంబంధములగు ధర్మార్థకామములను సంపూర్ణముగా పొందును.

ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున వివాహ ధర్మముల యందలి స్త్రీ విషయ సంబంధమున నరవృత్తవర్ణనమను ఎనిమిదవ అధ్యాయము.