భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

82. ఆదిత్య వారకల్పమందు నంద విధి వర్ణనము

తా॥ దిండి యిట్లనెను. “భాను వారమునాడు సూర్యదేవుని పూజించు వారికిని, స్నానదానాదులు చేయువారికిని ఏఏ ఫలములు కలుగునో నాకుఁ దెలుపుడు. ఆదివారముతోఁగూడిన సప్తమీ పుణ్యాసప్తమీ యని చెప్పబడినది. విజయ యనికూడ పేర్కొనబడినది. దీని పుణ్యత్వమెట్టిదో వివరింపగోరుచున్నాను”. బ్రహ్మయిట్లు నుడివెను. “ఆదిత్వ దినమున శ్రాద్ధము పెట్టు మానవులు ఏడు జన్మలలోను రోగ రహితులై ఆరోగ్యముగ నుందురు. ఆ దినమున స్థిర చిత్తులై నక్త భోజనము మాత్రము చేసి, తత్పూర్వము శ్రేష్ఠమైనదగు ఆదిత్యహృదయమును జపించు మానవులు. ఇహమున నారోగ్యవంతులై ఆ పిదప సూర్యలోకమును చేరుకొందురు. ఎల్లప్పుడును ఆదివారములయందు ఉపవాసము చేయువారు, ‘మహాశ్వేత'ను జపించువారును ఈప్సితార్థములను పొందుదురు. అహోరాత్రములు నక్త నియమముచేగాని, త్రిరాత్ర నియమమునగాని. మహాశ్వేతను జపించుచుండినచో కోరిన కోరికలను సఫలము చేసికొందురు. ప్రత్యేకముగ సూర్యదినమున. సూర్య షడక్షరిని, మహాశ్వేతను జపించువాడు సూర్యలోకమునకుబోవును. ఆదిత్యుని వారములు పన్నెండు చెప్పబడినవి.

తా॥  నంద, భద్ర, సౌమ్య, కామద, పుత్రద, జయ, జయంత, విజయ, ఆదిత్యాభిముఖ. హృదయ, రోగహ, మహాశ్వేతాప్రియ ఇవియే పన్నెండు సూర్యవారములు, మాఘమాసమునందు శుక్లపక్ష షష్ఠినాడు అనగా. నందపంజ్ఞగల యీ దినమున సూర్య వ్రతమాచరించువాడు సర్వపాపములనుండి, భయములనుండీ ముక్తుడై రాజగును. ఈ సందర్భమున సూర్యదేవునకు ఘృత స్నానము చేయించుట, నక చతమాచరించుట పుణ్యప్రదమని చెప్పబడినదీ. అగీసే పలు సూరంభగవామనడు శ్వేతచందనము, సుగంధవిలేపనముగా శ్రేష్ఠమైనది. ధూపమునకు గుగ్గులు, నైవేద్యమునకు భక్ష్యము ఉత్తమములైనవి. వాజ్నియమము గలవాడై బ్రాహ్మణునకు భక్ష్యవాయన మిచ్చి, తాను భుజింపవలేను. నక్షత్ర దర్శనముతో నక్తమని కొందఱు, ఒక ముహూర్తకాలము తక్కువ కాగల దినాంత భాగము నక్తమని మణికొందఱు చెప్పుచున్నారు. నక్షత్ర దర్శనముననే నక్తమని నాయభిప్రాయము. గోధుమ లేక. జవ్వల పిండి, బెల్లము, నేయితో కుంచెడు కొలదిగ భక్ష్యము చేయవలెను. పౌరాణికుడైన బ్రాహ్మణునకు భక్ష్యదానముతో దక్షిణ ఈయవలెను. స్వచ్చమైన స్వర్ణ (లోహ)పాత్రయందు గాని సూర్యదేవుని ముందుంచిగాని ఈ క్రింది మంత్రములతో ఈయవలెను బ్రాహ్మణుడు స్వీకరింపవలెను. “సూర్యుని చేతఁబుట్టి, సూర్యుని తేజస్సువలన రూపొంది, రాజ్ఞచేతులతో చేయబడిన ఈ భక్ష్యమును సూర్యునకు భక్తితో నమస్కరించి నాశ్రేయస్సు కొఱకు మీకిచ్చుచున్నాను. ఓ విప్రోత్తమా! దీనిని స్వీకరిపుడు.” (ఇది యిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము). కామదము, సుఖదము, ధర్మ్యము, ధనదము, పుత్రదమై ఈ భక్ష్యము నిన్ను కాపాడుగాక! భాస్కరదేవునకు ప్రియమైన దీనిని నేను స్వీకరించుచున్నాను. (ఇది స్వీకరించువాడు పఠింపవలసిన మంత్రము). ఇవి రెండును భక్ష్య దాన ప్రతిగ్రహణ మంత్రములు. సూర్య దేవునకు ప్రీతికరములైనవి. అందు సందేహము ' లేదు.

తా॥  గణాధిపా! మానవుల శ్రేయస్సు కొఱకేర్పరుపబడిన ‘నందవిధి' యిదియే. ఈ విధిననుసంరించి సూర్యుని పూజించువాడు సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమున వెలుగొందును. అట్టి మహాత్ముని కులమున దారిద్ర్యముగాని రోగములు కాని ఉండవు. ఈ విధానమున రవిని పూజించువానీ సంతానము నష్టము కాకుండును. సూర్యలోకము నుండి విడివడిన పిదపనాతడు భూలోకమున రాజుగ జన్మించును. రత్నరాశులతో యుక్తుడై సూర్యుని వలె తేజస్వియై ప్రకాశించును. ఈ విధానమును చదువు వారికిని విను వారికిని సుఖమును, అచంచలమైన లక్ష్మిని అసూర్యదేవుడొసంగును.

శతార్థ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యపార కల్పమునందు నందవిధి వర్ణనమను ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.