భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
135. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిష్ఠా స్నానవిధి వర్ణనము
తా. నారదుడిట్లనెను, “ఇక నీకు స్నాన కర్మ విధిని గూర్చి చెప్పెదను. స్నాపకుడు గొప్ప ప్రాజ్ఞుడు, వేదపారగుడు, అయిన బ్రాహ్మణుడు కావలెను. (1) ఓ సాంబా! అతడు సూర్య సంబంధ శాస్త్రములందు అరుణుని వంటి పండితుడైయుండవలెను భోజకుడై యుండి అనేకులగు భోజకులతోను, బ్రాహ్మణులతోను కూడి యుండవలెను (2) మండలమునకు ఈశాన్యభాగమున హస్త మాత్ర ప్రమాణముగల భద్రపీఠమును యధా శాస్త్రముగ నుంచవలెను. (3) ఏనుగును బూన్చిర శకటము పైన, బ్రాహ్మణులు లాగెడు రథము పైనను సూర్యదేవుని మంగళప్రదములైన వేదఘోషలతో సభక్తికముగ దేవ గృహమునకు కొని రావలయును (4) శుచియై యున్నవాడు, తెల్లని వస్త్రములను ధరించియున్నవాడునైన సూత్రధారుడనబడువాడు భద్రపీఠమును గొని దాని పై భద్రం కర్ణేభిః' మంత్రము చేత (5) కలశమును తీసికొని విభావసుడైన దేవదేవునికి స్నానము చేయింపవలెను సముద్ర జలము, గంగాజలము, యమునాతోయము (6) సరస్వతీ నదీజలము పుణ్యప్రదమైన చంద్రభాగా నదీ జలము, సింధునదీ జలముతో, శ్రేష్ఠమైన పుష్కర జలముతో, కొండలనుండి జాలువారిన శుద్దోదకము, (7) ఇతరములైన నదీనద తటాకముల నుండి యధాశక్తిగ కొనిరాబడిన స్వచ్చమైన జలముతో ఎనమండుగురు భోజకబ్రహ్మణులు బంగారు కలశములతో (8) సూర్యదేవు నభి షేకింతురు, అటుపిమ్మట మణిరత్నములు, సర్వవిధములైన బీజములుగల ఓషధులు (9) పరిమళముగల పుష్పములు, నేల మీదను నీటిలోనను పూచెడి పుష్పములు, ప్రసిద్ధములైన చందనములు, వివిధములైన సుగంధద్రవ్యములు, (10) పొన్నగంటి, సువర్చల (నింగిమిరి) నిడుముస్తే, విష్ణుక్రాంత, పిల్లపీ(చర, గరిక, శిబిపుష్పి, పిప్పలి, కోరింద, వస (11) ఇట్టి సంభారములనే కాక ముత్తవ పులగ, రావి, ఓ సేన చిగుళ్లు, దర్భలు (12) కలశము పైన నుంచి సూర్యదేవుని స్నానకర్మవిధి నెఱిగినవాడు బంగారు, వెండి, రాగి మట్టి పాత్రలతో సూర్యునకు అర్ఘ్యమియవలెను.
తా॥ అక్షతలతో, బంగారునాణెములతో, సర్వవిధములైన ఓషధులతోను - కూడి, గాయత్రీ మంత్రముచే పరిపూతములైన పదునాలు కలశములలోని జలములతో సూర్యదేవునికి అభిషేకము చేయవలెను, (14) అప్పుడు వేదికను పక్వమైన ఇటుకలతో నిర్మించిన దానిని పైభాగమున దర్భలు పరచి-దానిపై సూర్యమూర్తిని నిలిపి వస్త్రములను ధరింపజేసి (15) యిట్లు ఉపోషితుడైన యజమాని సూర్యమూర్తికి అభిషేక కార్యక్రమమును నిర్వహింపవలెను, స్నానము చేయించు సందర్భమున విగ్రహముయొక్క శిరోభాగమున ఓషధులను, అట్లే ఉసిరికాయలను (16) మృత్తికను ఆపై జలములను పడునట్లుగా మంత్రములతో నభిషేకింపవలెను. ఓమృత్తికా! నీవు సకల దేవతలచేత, రాక్షసులచేత స్తోత్రము చేయబడిన దేవివి (17) అందుచే సూర్యమూర్తి యొక్క శుద్ధి కొఱకునిన్ను విగ్రహ శిరస్సు భాగమున నుంచి అభిషేకించుచున్నాను. నీవు అన్ని విధములుగను సర్వభూతములకంటెను దేవతలకంటెను మొదటి దానవు. “(18) రసములన్నింటికీ పతివైన నిన్ను నేనాహ్వానించుట జరిగినది.” ఈ విధముగ వివిధములగు వైదిక పౌరాణిక మంత్రములచేత (19) సూర్యదేవునికి శుద్దోదక స్నానము చేయింపవలేను ఇట్లు ముఖ్యముగ వేదమంత్రములతో బాటు పౌరాణిక వాక్యములను కూడ ఉచ్చరించుచు విచక్షణుడైన వాడు సూర్యాభిషేకమును చేయవలెను.
తా॥ “బ్రహ్మ విష్ణు శివాదులైన దేవతలు ఆకాశగంగా జలముతో నిండిన రెండవ కలశముతో నిన్ను అభిషేకింతురు గాక. (21) ఇంద్రాది లోకపాలురు సరస్వతీనదీ జలముతో నిండియున్న మూడవ కలశముతో నిన్ను అభిషేకింతురుగాక (22) సముద్రజలములతో నిండియున్న నాలుగవ కలశముతో-పద్మపత్రముల పరిమళములతో నున్న నీటితో ఇతర దేవతలు నిన్ను అభిషేకింతురుగాక (23) బంగరు కొండ కొమ్ముల నుండి జాలారిన నీటితో నింపబడియున్న ఐదవ కలశముతో నాగులు నిన్నభిషేకింతురుగాక (24) నైరృతి దిశలో ప్రవహించెడు నదుల నుండి జలాశయములనుండి తేబడినవియు, శుద్ధమైనవియు తామర పుప్పొడి రేణువులతో సుగంధిలము చేయబడినవి యునైన జలములతో నింపబడిన ఆవ కలశముతోను (25) ఏడవ కలశముతోను సపరివరులు నిన్ను అభిషేకింతురుగాక. అష్ట మంగళములతో కూడిన ఎనిమిదవ కలశముతో వసువులు అభిషేకించెదరు గాక. (26) దేవదేవా! నీకు నమస్కారమగు గాక.” అని యిట్లు ప్రార్థించి దివ్యమైన కలశములతో స్నానకర్మను ప్రారంభింపవలెను. (27)"సముద్రం గచ్చ” యనెడు మంత్రమును, 'హిరణ్యగర్భ' యనెడు మంత్రమును పఠింపవలెను. (28) “సముద్ర జ్యేష్ణా'యను మంత్రముతో-మృత్తికతో కడుగవలెను. 'సినీవాల' మంత్రముతో పుట్టమట్టిని ప్రయోగింపవలయును, (29) జమ్మి, మేడి, రావి, మజ్లి, మోదుగు అను ఐదు ఓషధుల రసాయనమును 'యజ్ఞం యజ్ఞ' మంత్రముతో నుపయోగింపవలెను.
తా॥ రాగిపాత్రతో పవిత్రమైన పంచగవ్యమును ప్రాశసము చేయవలెను. గాయత్రీ మంత్రముతో గోమూత్రమును, 'గంధద్వారాం’ మంత్రముతో గోమయమును, (31) ‘ఆప్యాయస్వ' మంత్రముతో ఆవుపాలను, 'దధిక్రావణో' మంత్రముతో ఆవు పెరుగును, "తేజోసి' మంత్రముతో ఆవునేయిని, అదేవిధముగ దేవస్యత్వా' మంత్రముతో కుశోదకమును స్వీకరింపవలెను (32) ఈ విధానముతో పంచగవ్యప్రాశన చెప్పబడినది. 'యాఓషధీ' మంత్రముతో క్రమముగా ఓషధీస్నాపము చేయింపవలెను, (33) ద్రుపదాదులచే నలుఁగు పెట్టవలెను మానస్తోకాభి మంత్రితముగ శిరఃస్నానము నిర్వర్తింపవలెను, (34) 'విష్ణోరరాట'మంత్రముచే శుభప్రదమైన గంధోదకమును సమర్పింపవలెను. అటు పిమ్మట శుద్ధమైన నదీ జలముతో శుభ్రముగ కడిగివేయవలెను. (35) ‘జాతవేదసే' మంత్రము నుచ్చరింపుచు వడబోసిన నీటితో స్నానము చేయింపవలెను. అప్పుడు ఎఱ్ఱని పుష్పములు, సుగంధద్రవ్యములతో సూర్యదేవుని ఆవాహనము చేయవలెను. (36) హే భగవన్! భానుదేవా! లోకములనను గ్రహించుచుండెడు నో దేవదేవా! రమ్ము! ఇటకేతెంచుము! యజ్ఞ భాగమైన ఈ అర్ఘ్యమును స్వీకరింపుము సూర్యదేవా! నీకు నమస్కారమగుగాక” (37) అని ప్రార్ధించుచు సువర్ణకలశముతో ఆదేవున కర్ఘ్యమియవలెను. "ఇదం విష్ణుర్విచక్ర' యను మంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. (38) మొదట మట్టి పాత్రలతోను, తదుపరి రాగి కలశములతోను, అనంతరము వెండి బిందెలతోను సూర్యదేవునభిషేకింపవలెను. (39) ఓ యదునందనా! అటు తరువాత బంగారు కలశములతో-సర్వపుణ్యతీర్థముల జలములతో, అన్నివిధముల ఓ. ఎల యుక్తముగా అభిషేకింపవలయును .
తా॥ ఓ సాంబా! పిదప ఒక శంఖమును గొని అందలిజలములతో సూర్యమూర్తి యొక్క శిరస్సు పైన అభిషేకము చేయవలెను. దానికి ముందు సూర్యమూర్తి శిరస్సు పై పుష్పములుంచవలెను. (41)ఆపై నీటిని ఎగజిమ్ముచు స్నానమాచరింపజేయవలెను. మొదట నీటితోను (42) ఆపై పాలతోను, పిమ్మట పాయసముతోడను, తదుపరి నేతితోను, తరువాత తేనెతోను, అటు పైన చెఱకు రసము తోను అభి షేకింపవలెను. (43) అగ్నిష్టోమ, గోమేధ, జ్యోతిష్ణోమ, వాజపేయ (44) రాజసూయ, అశ్వమేధయాగముల ఫలము ఈ ఘృతాదుల అభి షేకముల వలన లభించును. స్నానము చేయించువాడు, భక్తితో దీనిని చూచువాడు, చేయువాడును (45) క్రమముగా ఈ చెప్పబడిన యజ్ఞముల ఫలములను పొందెదరు. ఓ కురుశార్దూలా! అభిషేకింపబడు సూర్యమూర్తిని దర్శించిన మాత్రమునను ఆయాఫలములు లభించును. (46) అందుచే ఓ సుప్రతా! సూర్యదేవుని స్నాన కార్యక్రమము పూనికతో చేయవలయును. ఆదేవదేవుని స్నానజలమును ఎవరును దాటి పోవలదు (47) ఆ స్నాన తీర్థమునుగాని, పాలనుగాని లోకవిగర్హితములైన కాకులు త్రాగ కుండునట్లు చూడవలేను. (48) ఓ యదునందనా! నేల పైనొలికిన నీరుద్రావిన 'కర్త', తాను రోగ గ్రస్తుడగుటయేకాక తన వారికిని దుఃఖమును కలగించువాడగును. (49) అందుచేత సూర్యదేవుని స్నపనమును మిక్కిలి జాగ్రత్తగా నిర్వహింపవలయును.
తా॥ స్నానకర్మ విధానమును తెలిసిన భక్తుడీ క్రమమున సూర్యదేవునకు స్నానము చేయించి, ఆపై వర్జనిక (నీటిని ధారగా పోయుటకు అనువైన పాత్రవిశేషము)ను గొని సూర్యమూర్తి పై నీటినిధారగా వదలవలెను. (51) సూర్యుని ముందుభాగమున ముమ్మారు 'ఆచమస్వ'యని పలుకుచు ఆచమనీయమును సమర్పించి, 'వేదోసి' మంత్రముతో యజ్ఞోపవీతమును సమర్పింప వలెను (52) 'బృహప్పతే' మంత్రముతో వస్త్రద్వయమును ఈయవలెను ఇట్లు ప్రయత్న పూర్వకమైన క్రమముతో స్నానాది పూజా కార్యములు నిర్వహించుచు వస్త్ర యుగ్మము తరువాత పూలమాలను సమర్పింపవలెను (53) ‘ధూరసి' మంత్రముతో గుగ్గిములతో కూడినధూపము వేయవలెను. “సమిదోంజన' మంత్రముతో కాటుక పెట్టవలెను (54) యుంజాని' మంత్రముతో సూర్యదేవునకు కంపిల్లము (కాంపిల్యము అనుఓషధి) నీయవలెను దీర్ఘాయుష్ట్యాయ వర్చసే మంత్రముతో నీరాజన మీయవలెను. (55) భాస్కరదేవుని స్నానకర్మవిధి యీ విధముగ చెప్పబడినది. ఈ కార్యక్రమ మంతయు భోజక బ్రాహ్మణులు నిర్వర్తింప వలెను. (56) వీరు ఋగధర్వణ యజుర్వేదులైయుండవలెను. (56) సూర్యమూర్తి ధరులయొక్కయు సూర్య స్నాపకుల యొక్కయు (57) లక్షణములను చెప్పుచున్నాను. ఏకాగ్రమనస్కుడవై వినుము, సంపూర్ణ శరీరముగలవాడు (వికలాంగుడు కాని వాడు) బుద్ధిమంతుడు, శాస్త్రజ్ఞుడు, ప్రియముగ కనబడువాడు (58) మంచి కులమున బుట్టినవాడు, శ్రద్దగల వాడు, ఆర్యులదేశమున బుట్టినవాడు, అస్థూల శరీరుడు, కృశింపనివాడు, పొడుగు పొట్టియుకానివాడు సూర్యశాస్త్రములు తెలిసినవాడు (59) యోగి, నిగ్రహముగలవాడు, గురుభక్తి గలవాడు, జితేంద్రియుడు పంచవింశతి తత్వములను గూర్చి తెలిసినవాడు, స్థాపకుడని చెప్పబడెను .
తా॥ సూర్య సంబంధమగు కర్మ విషయమున ని ఫేధింపదగిన వారిని గుఱించి చెప్పుచున్నాను. వినుము, అంగవికలురు, అధికంగులు, పొట్టివారు, వికారమైనరూపముగలవారు (61) మిక్కిలి తెల్లని వారు, మిక్కిలి నల్లని వారు, నాస్తికులు, యజ్ఞాదులు చేయించుచు జీవించువారు, అమాయకులుగా కనబడు పంచకులు, డాంబికులు (62) అపరిశుద్ధమైన అలవాట్లు గల వారు, నల్లని పలువరుసలుగలవారు, గర్వము గలవారు, కోప స్వభావులు, దుష్టమైన గుణశీలములు గలవారు, నవయువకులు, అతివృద్దులు, (63) బొల్లి మచ్చల వ్యాధి గలవారు. కుష్టురోగ పీడితులు, ఒంటి కంటీవారు, దుర్మతులు, సంకరజాతివారు, జాతి చేత హీనులు, శూద్రులు (పాపాత్ములు) (64) కుబ్జరూపులు, గ్రుడ్డివారు, కొనటులు, బట్టతలవారు వికలేంద్రీయులు, నీతి లేని వారు, దురాత్ములు, వికలురు, కుంటివారు (65) తిధి నక్షత్రవార, యోగ, కరణాదులను చెప్పుచు పొట్టపోసికొనువారు, ధన మును గొని పాఠములను బోధించువారు (66) మొదలగు నిట్టి వారిని సూర్య స్నాపన విధుల విషయమున వర్జింప వలెను. అందువలన పండితులు సూర్యస్నాపకులను అన్ని విధములుగ పరీక్షింపవలెను.
భవిష్యమహాపురాణాంతర్గత బ్రహ్మపర్వమునందలి సప్తమీ కల్పమున, సాంబో పొఖ్యానమునందలి సూర్య ప్రతిష్టాస్నాన విధి వర్ణనమను నూటముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
