భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

74. సూర్య ద్వాదశ మూర్తి వర్ణనము

తా॥ శతానీకుడిట్లనెను. “చంద్రభాగానదీ తటమున సాంబుడొకవేళ సూర్య భగవానుని స్థాపించియున్నను అది ఆది కాలమునుండి లేదు కదా! కాని మిరది మొదటిస్థానముగా పేర్కొనుచున్నారు” శతానీకుని యీ సందేహము తీర్చుచు సుమంతుముని యిట్లనెను. “అది సూర్య భగవానుని ఆద్య స్థానమే. సాంబుడా స్థానమునందు తరువాతి కాలమున సూర్య మూర్తిని ప్రతిష్ఠించెను. ఆ విషయములు విస్తరించి చెప్పెదను. వినుము-2. ఆద్యుడు, లోకనాథుడు, జగత్పతియైన సూర్యుడిచ్చట పూర్వ కాలమున తన 'మిత్ర' రూపమున నుండి తపస్సు చేసెను-3. ఆనాది నిధనుడు, నిత్యుడు, అక్షయుడు, బ్రహ్మయు, స్రష్టయునైన సూర్యదేవుడు మొదట ప్రజాపతులను, ఆ పిదప వివిధ ప్రాణులను సృష్టించెను -4. అతడు పూర్వము తన ముఖము నుండి అంబుజ సన్నిభుడైన దేవుని సృష్టించేను. 'అతడు బ్రహ్మ, తరువాత వక్షఃస్థలము నుండి ఒక దేవుని సృజించెను. అతడు విష్ణువు-5. ఫాల భాగము నుండి తామరలవంటి కన్నులు గల శివుని సృజించెను. పాదతలము నుండి దేవతలందఱును ఆ మహాత్మునిచే సృష్టింపబడిరి-6. అప్పుడు అనంత సంఖ్యాకములగు తేజః కిరణములతో నొప్పుచున్న ఆ అవ్యక్త పురుషుడు తనను ద్వాదశాదిత్యులుగ నవతరించెను-7. ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు-8. ఆదిత్యుడీ తన పన్నెండు రూపములచేత 'ఈ సర్వ జగత్తునందు వ్యాపించెను-9. అతనీ మొదటి మూర్తియగు నింద్ర సంజ్ఞుడు దేవ రాజ పదవి నంలంకరించి రాక్షస సంహార మొనర్చుచుండెను.

తా॥ ఆదిత్యుని రెండవ మూర్తియగు ధాత ప్రజాపతిత్వమున నుండి ప్రాణి సృష్టి చేయుచుండెను-11. పర్జన్య నామమున బరుగు నాతని మూడవ స్వరూపము . కిరణములందే యుండి అమృతమును వర్షించుచుండును-12. పూషుడును పేరనుండు నాల్గవ మూర్తి మంత్రము లందుండి ప్రజలను పోషించు చుండును-13. ఆతని ఐదవ రూపమగు త్వష్ట వనస్పతులయందు, ఓషధులయందును సదా నివసించుచుండును-14. అర్యముడుగా ప్రసిద్ధినందిన యాతని యాఱవ మూర్తి ప్రజలనావరించి యుండుటకై పురములందుండును-15. భగుడను ఏడవ మూర్తి భూమి యందు పర్వతములందు నివసింపుచుండును-16. వివస్వంతుడను సంజ్ఞగల ఎనిమిదవ రూపము అగ్నియందు వ్యవస్థితమైయుండి శరీరధారుల ఆహారము వచనము - చేయుచుండును-17. సూర్య భగవానుని తొమ్మిదవ మూర్తియగు అంశుమంతుడు చంద్రుని యందువసించుచు జనులను ఆహ్లాదింప జేయుచు వారికి తృప్తినిచ్చుచుండును-18. విష్ణువనెడు పదవమూర్తి నిత్యమావిర్భవించుచు రాక్షసులను సంహరించుచుండును-19. పదునొకండవ మూర్తియగు వరుణుడు జగత్తునాశ్రయించి సమృద్దిగ జలమునిచ్చుచుండును-20. నీటికి స్థానము సముద్రము. వరుణుడీదటనే నివసించియుండును. కావుననే సముద్రమును వరుణాలయమని చెప్పుదురు-21. మిత్ర సంజ్ఞగల పన్నెండవ మూర్తి లోకహితార్థమై చంద్రభాగా నదీ తటమునందు నివసించుచుండును.

తా॥ ఇచట నాదిత్యుడు మిత్ర రూపమున నుండి వాయుభక్షణ మాత్రము చేయుచు తపమాచరించేను. ఆతడు భక్తుల ననుగ్రహించుచు నానా విధములగు వరములిచ్చుచు నెల్లప్పుడీ స్థలమున వసించుచుండును-23. పుణ్య ప్రదమైన ఈ స్థానమిట్లు సూర్యుని కాద్యము. దీనిని మిత్ర పదమని యందురు. ఇచ్చట మిత్ర నామముతో నాదిత్యుడు నివసించుచుండుటచే మిత్ర పదమని చెప్పబడెను-24. సాంబుడీ ప్రదేశముననే సూర్యు నారాధించి యాతని యనుగ్రహమునకు పాత్రుడై ఆతని యాదేశముచేతనే ఇచట సూర్య ప్రతిష్ట చేసేను-25. తన ఈ పన్నండు మూర్తులతో సూర్య భగవానుడు జగత్తునందంతటను వ్యాపించి యుండును-26. అందువలన నీ ద్వాదశాదిత్య మూర్తులును ననుసరింపదగినవి. పూజింపదగినవి. భక్తి సమన్వితులై ఆదిత్య దేవునికి నమస్కరించువారు-27. పరమ స్థానమగు నతని లోకమునే చేరుకొందురు. ఇట్లు ద్వాదశాదిత్యులను పూజించువాడు-28. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్య లోకమునకు బోవును.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు సూర్య ద్వాదశమూర్తీ వర్ణనమను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.