భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

12. స్త్రీ ధర్మ వర్ణనము

తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఎఱ్ఱవడ్ల ధాన్యములోను, అళ్లలోను ఉదారకమను (సస్యము) ధాన్యము శ్రేష్ఠ గుణము కలది. కొఱలు, ఆళ్ళలోను హంసజాతి ఐదుపాళ్ళుమేలైనది. ప్రియంగువు (కొఱ)లలో ఐదు భాగములను, వరిలో పదకొండు పాళ్ళు, సెనగలలో మూడవ భాగము ఈ మూడును సమానములని స్పష్టము చేయబడినదిగా నెఱుగుదురు. యవ గోధుమ పానీయములు: పెసర, మినుములు, నువ్వులు, యవలు అను ధాన్యముల పిండి, సమానమైనవిగా భావింపవలెను. విసరబడిన గోధుమలు (పిండి), పేలపు పిండ్లు ఐదుపాళ్ళు మొదలుకొని (ఆ పైన) సారముగలవి. అలచందలు (కారు మినుములు), పొడిగా చేయబడిన మాంసము సగము మొదలుకొని అంతకేక్కువగా మేలైనవి. పున్నాకములు, కారు మినుములు; కొర్రలు, ఆళ్ళు సెనగలు, ఉదారకములు అన్నములు రెండింతలు శ్రేష్ఠమైనవి. చీనకములలో రెండింతలు, ఎఱ్ఱధాన్యములో నాలుగింతలు, శాలిధాన్యములో ఐదింతలు సారముండును. ఇవి ప్రాతవియైననింకను హెచ్చుగానుండును. క్రియలు, పాకములు మొదలగు విశేషములు మూలమున గుణవృద్ధిచెప్పబడును. శ్రేష్ఠమైన వంటకము కారణముగా ఆవృద్ధి రెండింతలగును. దాని నుండి మఱల మొలకలెత్తిన గింజలకు నాల్గుపాళ్ళు గుణ వృద్ధియగును. నాను బియ్యము, బొరుగులు (ధనియాలు) గుండ్రని సెనగలు, వేఁచబడిన వానికంటే రెండింతలు గుణవృద్ది కలవి. అందువలన నిది ఇతర జాజుధాన్యముల కంటే ఐదింతలేక్కువ. చాపకములలో, పిండ్లలోను గుండ్రని సెనగలు. నాలుగవ వంతు తక్కువ. పెసర, మినుము, చిరు సెనగలతో ఎనిమిదవ వంతు కడపటిది. శ్రేష్ఠములైన వంటకములలో తడిసీనది (పాసిపోయినది) హాని కలిగించును. తడియారినది (ఎండినది) గుణ వృద్దికలది యగును.

తా ॥ ఆ విధముగనే ప్రయోజన దృష్టితో, కందితో పోల్చిపరిశోధింపదగిన పెసర మినప, చిరు సెనగలలో ఐదువంతులు గుణము తక్కువ యని తెలియవలెను. తెల్లఆవాల, వెలగ నూనెలలో అగి సెనూనె ఆరువంతులు, అదే విధముగ, వేప, ఆవనూనెలు మొదలగు వానియందు ఐదవభాగము తక్కువ మేలైనదీ. నువ్వులనూనె, గారనూనె, ఇప్పనూనె, కానుగునూనే, కుసుమ నూనెలలో నువ్వులనూనె నాల్గవ వంతు శ్రేష్టమైనది. మిగిలినవి అధమములని చెప్పుదురు. అవి పండిన క్షేత్రములు, కాలములు, పెంచిన విధానము మొదలైన వాని చేత పొరపాటువలన ఏర్పడిన తెగుళ్ళు, తరుగులు వినన్నిటిని చక్కగా ఊహించితెలిసికొని జాగరూకులైయుండవలెను. ఆవుల పాలలో నుండు దోషపుకొలదియు, గేదెలనేతిలోనుండు దోషపు కొలదియు (కంటె) మేకలు మొదలగు వాని పాడి ఉత్పత్తిలో దోషపుపాలు ఒక పాదభాగమధికమని అది తెలిసిన వారు తెలియుదుర. మంచిభూమి, అచట ఆపశువులు మేసిన తృణ విశేషములు, అవి మేసిన కాలము మొదలైన వాని వలన పాలు, నేయి మొదలైన వానీ వృద్ధియు, అటులే వాని ప్రయోజనమునుండి భూతృణ కాలాదులు నిశ్చయింపదగును. ఒక పక్షము, మాసము వ్యవధిలో పూనికతో ఇవి-గోవులు మొదలైన వాని పాలు మొదలైనవానిని పరిశీలించి ఉచితమైన నిర్ణయము చేయవలెను. పశువుల ఒంటిమీద దూది, కృమి కోశములు, ఉన్ని (బొచ్చు), సౌర మొదలగునవి కత్తిరించుటకు, ఈచబోయిన (వంకరైన) చేతులుగలవారిని, కుంటి, గ్రుడ్డి, వితంతు స్త్రీలను నియోగింపవలెను. తప్పకుండ చేయవలసిన పనులయందు బాలురను, వృద్ధులను, గ్రుడ్డివారిని, అల్పులను (దీనులను), వారికి అనుకూలములగు కానుకలిచ్చుచు నియోగింపవలెను. పనుల మధ్యగలు వ్యవధిలోను, భర్త దేశాంతర గతుఁడైనప్పుడును ఇల్లాలు స్వయముగా అట్టి నిత్యకార్యములను నిస్సంకోచముగ చేయవచ్చును.

తా ॥ శూద్రులలో స్థూల సూక్ష్మబహుత్వములను, వ్యయావ్యములను ఆలోచించి పశుప్రాప్తియందు విశేషమును చేయవలెను. తన కాపులైన పెద్దవారీ ఆశ్రయమున వస్త్ర ధాన్యాదులను చేయింపవలెను. పశుపాలకుల హెచ్చుతగ్గులను వారి జీతములను బాగుగసాలోచింపవలెను. నార, దూది మొదలగు పనులందు వానిలో ఐదవ భాగము కూలియిచ్చు ఏర్పాటు కలదు. దేశకాలములననుసరించి, ఇతరుల పద్దతిననుసరించియే ఇది నిర్ణయింపవలేను. కొట్టుట చేత, గాలివలన దూదికి ఇరువది వంతుల తగు ఏర్పడును, అటులే, కప్పబడినదైనను, వ్యాపించియుండినదైనను బొచ్చు (ఉన్ని)ని గురించి కూడ తగ్గుచెప్పుదురు. లక్షణమును బట్టీనూలునందు ఏబది వంతుల తఱుఁగును చేసికొనవలెను. అందునూనె (లేక గంజి ) కలయికతో ఇరువది యొక్కపాళ్ళు వృద్ధి కలుగును. జీవముల వెంట్రుకల మిక్కిలి సన్నగను లేక మధ్యమముగను ఉన్నచో వాని దారముల విలువ సగముకంటెను ఎక్కువకు తక్కువకాకుండనుండును. ఇక స్టూలముగనున్నయెడల నాల్గవ భాగము తగ్గిపోవును. పనితనపు భేదముల చేత, దేశకాలముల భేదముల చేతను, ఇంకను ఇట్టి అనేక భేదముల చేతను జంతువుల వెంట్రుకల విలువల నిర్ణయములను తెలిసికొనవలెను. స్థూలమైన దానిని శుద్ధిచేయుటకు మూడు దినములీయవలెను. మధ్యమమైన దానికి మూడు రాత్రులు సరిపడును. సూక్ష్మమైనది ఒక పక్షము వఱకు శుభ్రము చేయబడును. నెల దినములలో అది మొత్తముగా సంస్కరింపబడును. దాని సామాన్య క్షయ వృద్ధ్యాది విషయములిట చూపబడినవి. కాలము, కర్త మొదలగు భేదములచేత వానిలో మార్పులు కనబడుచుండును. పాన్పులు, ఆసనములు, కంబళములు మొదలగుననేక వస్తువులు అవి స్థిరపఱచు వారి నేర్పరి తనము నాశ్రయించియుండును. తలకు (మెడకు) చుట్టుకొనుటకు చిన్న శాలువలవంటివి, పెద్దకంబలములను నడిరకమైనదారముతో చేయబడినవి గురువులకు, వృద్ధులకు, బాలురు మొదలగువారికి, అభ్యాగత జనమునకును ఎక్కువగా ఇష్టమైనవియై యుండును.

తా ॥ భర్త, తన సుఖము కొఱకు భార్యను వెంబడించి యుండును. అతనికి వివిధములైన ఆనుకూల్యములను చేయవలెను. అత్తమామలకు కూడ పడకలనమర్చుట మొదలగు సేవలు చేయవలెను. ముఖ్యముగా భర్తకు సంబంధించిన పనులను ఇతరులచేత చేయింపకూడదు. మఱఁదులు మొదలగు వారు ధరించి విడిచిన వస్త్రములు, పుష్ప (హారములు, అలంకారములు. తాను ధరింపకూడదు. వారి శయ్యలు మొదలగునవి ఆక్రమింపకూడదు. తెలిక (గానుగ)పిండి, దంటు ముక్కలు, కాలము వలన మార్పునందిన వస్తువులు. అస్వీకార్య పదార్థములు, చలి(పాసిన) అన్నము మొదలగు వానినీ పశువుల ఆహారమునందు వినియోగింపవలెను. వివిధములైన ఆవులు మొదలగువానికి, పసుల కాపరులకు లేక పసులమందలోని జీవులకు. దూడలకు లేగలకు ఆహారపదార్థములుగా నుపయోగింపవలెను. పెరుగు నుండి వెన్న, నేయి తీయవలెను. పాలుపితుకవలెను. కాని దూడలను పీడింపకూడదు. వర్షరుపునందు, శరత్కాలమున, వసంతర్తువునందును, రెండు పర్యాయములు, ఇతర ఋతువులందు ఒకసారి పితుకవలెను కుక్కలు పందులు వాని పోషణకొఱకు, మజ్జిగవంటివి ఉపయోగింపవలెను. మజ్జిగ మొదలగువానిని గానుగ పిండిని తడుపుటకు ఉపయోగింపవచ్చును. అమ్ముటకు సిద్ధము చేయవచ్చును. పసుల కాపరులకు ధాన్య రూపముగా, లేక ధన రూపముగ జీతముల నేర్పాటు చేయదగును. వారే పాలకు (పాడికి) సంబంధించిన వ్యవహారములను నడి పెడి నీయమము గలవారు, కాని లోభము వలన ఆ వృత్తులను కట్టి పెట్టిరి. ఆవుల పాలు పితుకువాడు, పితుకుకాలమును అతిక్రమింపరాదు. గోపొలకులు కాయుటకు, నీళ్ళు పెట్టుటకును, చిలుకు వారు చిలుకుటకును సమయమును పాటింపవలెను. ఒక మాసము రెండు ఒక స్తనములు మఱియొక మాసము మజీ రెండు స్తనములను దూడ పాలు త్రాగుటకై వదలవలేను. గానుగ (నువ్వుల) పిండి ఉండలచేతను లేత గటికలచేతను, ఉప్పుచే, నీటిచేతను వలసినంత కాలము వఱకు లేగలను పోషింపు చుండవలెను.

తా॥ ముసలి ఆవు, కట్టినది (గర్బిణి) పాలిచ్చునది, లేగదూడగలది, రెండవ వయస్సు ఇంచుక కలిగిన కోడే గలది. ఆయిన ఈ ఐదింటిని సమానముగా లేత పచ్చికను సమకూర్చవలెను. మూడు వందలకు ఒకడు లేక ఇద్దరు గోపాలురు, ఐదింటికి ఒక బాలుడు విడివిడిగా శ్రేష్ఠులు, తప్పిపోయిన ఎద్దును. (ఆవును) గుర్తించి తీసికొనివచ్చుటకు, సర్పాదులను భయపెట్టుటకు వాని కంఠములందు గంటలను కట్టవలెను. అవి వాని అందమునకు, రక్షణమునకును ఉపయోగపడును. పశువులకు కలిగెడి రోగాదులు కలుగకుండెడివి. పాములు లేకుండెడివి, పచ్చిక, నీరు సమృద్ధిగా దొరికెడివి, దుష్టభూతములు లేనివియయిన అడవులలోనే ఎప్పుడును పసుల మందలను ఉంచుచుండవలెను. గొఱ్ఱలు, మేకలు మొదలగువాని-మందలను గుప్తమగు. అడవులయందే ఉంచవలెను. వాని నుండి ప్రతి సంవత్సరము రెండు పర్యాయములు, చైత్ర, ఆశ్వయుజమాసములలో ఉన్ని (బోచ్చు) తీయవలెను. వీనీ మందలో పది మేక, గొళె)పోతులు, ఆలమంద ఒకటికి నాలుగైదు ఆబోతులు ఉండునట్లు చూడవలెను. అటులే గుఱ్ఱముల, ఒంటెల, గేదెల గుంపులలోను. వానికనుకూలమైన రీతిగ వీర్యవృద్దిగల పోతులనుంచవలెను. రైతులు (పాలేరులు మొదలగువారు తమతమ పనులు. చక్కగా చేయుచున్నదీ లేనిదీ తెలిసికొనుచుండవలెను. వారికి తిండి, జీతము వారివారి పనిని బట్టి, కాలమును. బట్టి ఏర్పాటు చేయవలెను. పొలములలోను, వరిమడులలోను, కూరతోటలలోను పనివారీ పనులు సాగుచుండవలెను, దుష్టుల విషయమున, వారు పనిచేయుచున్నది లేనిది. ప్రతిక్షణము. గమనించుచుండవలెను. పని వారిలో నెవరేని తన పనిలో ఎక్కువ కౌశలమును కనబఱచుచుండిన అట్టివారికి ప్రత్యేకముగా ఆహారపదార్థములు, కప్పుకొనుటకు బట్టలు, తలంటునూనెలు ఇచ్చుచుండవలెను. తామర, శాకములు మొదలగువాని విత్తనములు, గడ్డలు, దుంపలు మొదలగు వాని బీజములు, ఇంకను అనేక విధములైన విత్తనములను ఆయా కాలములలో సంగ్రహించి వానిని తగిన ఋతువులలో తగిన భూములలో విత్తుచుండవలెను.

తా ॥ పుట్టిన వానిని కాపాడుట, కాపాడిన వానిని చక్కగా సంగ్రహించియుంచుట, అట్లు సంగ్రహించిన వానిని సమయాను కూలముగ విత్తుట చేయుచుండవలెను. గృహమునకు మూలము స్త్రీ, గృహస్థాశ్రమము ధాన్యమే మూలముగా గలది. అందువలన స్త్రీలు ఆహార ధాన్యముల విషయమున మితవ్యవమును పాటింపవలేను. ధాన్యమును నిత్యమును సేకరించుచుండవలెను. వినియోగమున పొదుపు పాటింపవలెను. అన్నాదుల విషయమున స్త్రీలు 'దుబారా' చేయకూడదు. తేనె ఎట్లు కణకణముగా క్రమవృద్ధినొందునో, పుట్ట, ఎట్లు రేణువురేణువుగా పెరుగునో, కాటుక ఎట్లు కొంచెము కొంచెముగా వాడుచున్నను తరిగిపోవునో గమనించి ఆహారపదార్థముల విషయమునను అల్పమని నిర్లక్ష్యము చేయక సంగ్రహవ్యయములను జాగ్రత్తగా చేయవలెను. పురుషోచితములైన వ్యాపారములు నిర్దేశింపబడిన వారైనను వస్తుధనాదుల వినియోగ ప్రసంగమున మాత్రము భార్యాభర్తల ఐకమత్యమును పాటింపవలెను. లోకమునందు స్త్రీ ప్రాధాన్యముగల పురుషులెందఱో కలరు. వారియందు స్త్రీల ప్రయోక్తృత్వము దోషము కాదని గ్రహింపవలేను. ఈ విధముగ యోగ్యతతోకూడి, సుభగత్వము తోడను, కార్యనిర్వహణోద్యమము తోడను స్త్రీ తన భర్తను వశపఱచుకొనవలెను.

ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మ వర్ణనమను పన్నెండవ అధ్యాయము.