భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

7. వివాహ ధర్మ వర్ణనము

తా॥ అసపిండురాలైన (ఏడు తరములనుండి తన వంశమునకు సంబంధింపని) తల్లిగలదియు, తన గోత్రమునకన్న భిన్నమగు గోత్రమునకు సంబంధించిన తండ్రి గలదియైన స్త్రీ బ్రాహ్మణులకు వివాహమునకును మైధునమునకును ప్రశస్తమైనది. ఏ కన్యకు సోదరుఁడు లేడో, తండ్రి ఎవరో తెలియదో అట్టి కన్యను బుద్ధిమంతుఁడు పుత్రికా ధర్మ శంకతో వివాహమాడరాదు. బ్రాహ్మణులకు వివాహ విషయమున సవర్ణురాలే ప్రశస్తమైనది: కామ పద్దతిని ప్రవృత్తిగలవారలకు క్రమముననుసరించి కడపటి జాతులవారు ప్రశస్తులు. ఓ బ్రాహ్మణులారా! క్షత్రియునకు కూడా సవర్ణురాలే ప్రాథమ్యము గలది. ధర్మవశమున కాదు కాని కామవశమున బ్రాహ్మణ క్షత్రియ లిరువురికినీ వెనుక జాతి స్త్రీలే యోగ్యురాండ్రుగ చెప్పబడినది. ధర్మము ననుసరించి వైశ్యునకును సవర్ణయే శ్రేష్ఠము. కామతః శూద్ర స్త్రీయు. ధర్మతః క్షత్రియ స్త్రీయు కూడదు. ధర్మముననుసరించి శూద్రునికి శూద్ర స్త్రీయే భార్యగా అరురాలని మనువు చెప్పెను. బ్రాహ్మణుఁడు నాలుగు వర్ణముల వారిని వివాహ మాడవచ్చును. బ్రహ్మక్షత్రియులిరువురకును. ఎట్టి ఆపత్కాలమున నున్నను, మథియెట్టి పరిస్థితియం దైనను శూద్ర స్త్రీని వివాహమాడుమని ఉపదేశింపబడదు. ద్విజాతులు మోహము వలన హీనజాతి స్త్రీని వివాహమాడిరేని వారు తమ సంతానముతో కూడ సత్వరమే శూద్రత్వమును పొందుదురు. వేదియందు శూద్రునారోపించి అత్రి పతితుఁడయ్యెను. ఉతథ్యుఁడు పుత్ర జననమువలన పతితత్వము పొందెను. శూద్ర పుత్రుని పొంది శౌనకుడు, శూద్రత్వము నందెను. భృగ్వాదులు కూడా ఇదే విధముగ పతితత్వమును పొందిరి.

తా ॥ శూద్ర స్త్రీని శయ్యారోహణ చేయించిన బ్రాహ్మణుడు అధోగతి పొందును. దానితో సంతానము కలిగిన యెడల బ్రాహ్మణ్యము నుండియే చ్యుతిపొందును. దైవ, పితృ, అతిథి సంబంధములైన కర్మలు ప్రథానముగా గలవాఁడట్టి శూద్ర స్త్రీ సంపర్కము కలిగి యుండెనేని అతఁడిచ్చు హవ్య కవ్యములను దేవతలు పితరులు స్వీకరింపరు. అతనికి స్వర్గ ప్రాప్తిలేదు. శూద్ర స్త్రీ ముఖామృతమును గ్రోలువాఁడు, ఆమె నిఃశ్వాసముతో కొట్టబడువాఁడు, ఆమెయందు సంతానము కనువాఁడు నిష్కృతి లేని వాఁడగునని శాస్త్రము చెప్పుచున్నది. ఓ బ్రాహ్మణోత్తములారా! చాతుర్వర్ణ్యముల వారికి ఇహ పరములలో హితాహితములను కల్గించు నెనిమిది విధములైన వివాహములను గూర్చి వివరముగా చెప్పెదను. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము అని వివాహమష్టవిధములు. ఇందు పైశాచిక వివాహమధమమైనది. ఏ వర్ణము వారికి ఏవి ధర్మములో, ఎవరికి ఏవి గుణ దోషములో, సంతాన విషయమున నేవి గుణగుణములో వానిని చెప్పెదను వినుడు. బ్రాహ్మణునకు మొదటి నాలుగు, క్షత్రియునకు తరువాతి నాలుగు, వైశ్యు శూద్రులకు అరాక్షసములగు మూడు విధముల వివాహములు విహితములని తెలియవలెను. బ్రాహ్మణునకు మొదటి నాలుగు, క్షత్రియునకు రాక్షసము, వైశ్య శూద్రులకు ఆసురము ప్రశస్తములని పండితులు చెప్పుదురు. క్షత్రియులకు మూడు పద్ధతులు ధర్మములు, రెండు అధర్మములు, పైశాచము, ఆసురము ఎప్పుడును కూడనివి. గాంధర్వ రాక్షసములు రెండును విడిగానైనను కలిపియైనను కతీయువకు దగుగములన పగనుమడియు చేసుఁబడుచుమని.

తా॥ అధ్యయన సంపన్నుడు, శీల వంతుఁడైన వరుని ఆహ్వానించి, అతనిని ఉత్తరీయాదులతో సత్కరించి, పూజించి స్వయముగా కన్యాదానము చేయుట బ్రాహ్మధర్మమని చెప్పఁబడును. విస్తారమైన యజ్ఞమున ఋత్విక్కుగా కర్మనాచరింపుచున్న వాని నలంకరించి అతనికి కుమార్తెనిచ్చి వివాహముచేయుట దైవ వివాహముగా పేర్కొనబడును. ఒకటి లేక రెండు ఆవుల జంటలను వరుని నుండి విధ్యుక్తముగ తీసికొని అతనికి కన్యనిచ్చి వివాహముచేయుట ఆర్షమని చెప్పబడును. మిరలిద్దఱు కలిసి గృహస్థ ధర్మమును పాలింపుడు' అని వాక్కుతో చెప్పి వరునర్చించి కన్యా ప్రదానము చేయుట ప్రాజాపత్యవిధిగా తెలియబడును. కన్య తండ్రి మొదలగు వారికిని, కన్యకును యథాశక్తిగా ధనాదికములిచ్చి స్వచ్ఛందముగా కన్యను స్వీకరించుట ‘ఆసుర'మని చెప్పబడును. వధూవరుల పరస్పర ప్రేమానుసారముగ నేర్పడు సంయోగము గాంధర్వమని తెలియఁదగును. ఇది యిరువుర కోరికతో సంభవించు కలయిక. ఎదురువచ్చిన వారిని కొట్టుచు మోదుచు నరుకుచు - ఏడ్చుచు ఆక్రోశించుచున్న కన్యను బలాత్కారముగ ఇంటి నుండి అపహరించుకొని పోవుట రాక్షసమని చెప్పబడును. నిదురించుదానిని, మత్తులో నున్న దానిని, మనో వైకల్యముగల దానిని రహస్యముగ ఎత్తుకొని పోవుట పైశాచమని చెప్పబడును. ఈ ఎనిమిదవ వివాహ పద్ధతి పాపిష్ఠమైనది. బ్రాహ్మణులకు ధారాపూర్వకముగ కన్యాదానము చేయుటయే ప్రశస్తవిధి. ఇతర వర్ణముల వారికి ఆయా కామ్యములను బట్టి ఆయా వివాహ పద్ధతులు శ్రేష్ఠములు. ఎవరికి ఏయే వివాహ పద్ధతుల మూలమున ఏ గుణము కలదో నేను స్పష్టము చేసెదను. తెలిసికొనుడు.

తా॥ బ్రహ్మ వివాహము వలన కలిగిన పుత్రుఁడు పుణ్యమూర్తియై పదితరముల తన పూర్వలను, పదితరములు తరువాతివారిని, తన తరము వారితో సహా నిక్కముగ తరింపఁజేయును. దైవ వివాహము చేసికొనిన స్త్రీ కుమారుని గుఱించి వినుడు. ద్విజులారా ! అతఁడు అటు ఏడు తరముల వారిని, ఇటు ఏడు తరముల వారిని ఉద్దరింపగలుగును. అర్హ వివాహము చేసికొనిన స్త్రీ కుమారుఁడు మూడు మూడు తరముల వారిని తరింపఁజేయును. బ్రాహ్మము మొదలుకొని నాల్గింటిలో ఏ వివాహము చేసికొనిన వారికైనను బ్రహ్మవర్చస్వులు, శిష్టసమ్మతులునైన పుత్రులు జన్మింతురు. వారు రూపము, బలము, గుణము, గలవారై, ధనవంతులు, కీర్తిమంతులు, పుత్రవంతులు, ధర్మిషులునై నూరుసంవత్సరములు జీవింతురు. ఇతరములైన దుర్వివాహముల మూలమున క్రూరులు, అసత్యవాదులు, వేదధర్మదూరులైనవారు జన్మింతురు. నింద్యములైన వివాహమువలన నింద్యమైన సంతానమే కలుగును. అనిందిత వివాహము వలన సత్సంతానము కలుగును. కాబట్టి నింద్య వివాహ పద్ధతులను విడువవలెను. పాణిగ్రహణ సంస్కారములు సవర్ణులలోనే జరుగును. అసవర్ణ పరిగ్రహము స్వయముగా తెలియవలెను. క్షత్రియ స్త్రీ నుంచే బాణము, వైశ్యకన్యనుంచే మలుగోల, శూద్రకన్యనుంచే వస్త్రము యొక్క అంచు వివాహసమయమున గ్రహింపదగినవి అనునది శ్రేష్ఠుల అనుభవమందలిది. విద్వాంసుడైన కన్యతండ్రి అణుమాత్ర శుల్కమునైనను గ్రహింపరాదు. ఒకవేళ లోభము వలన తీసికొనినచో అతఁడు సంతానము అమ్మినవాఁడగును. బాంధవులెవరైనను మోహవశాత్తుగ స్త్రీధనములనుగాని వాహనములనుగాని, వస్త్రములనుగానీ తీసికొనినచో వారు పాపులై అధోగతి పాలగుదురు.

తా॥ ఆర్ష వివాహమున ఆవుల జంటను శుల్కముగా తీసికొనుట కూడ సరికాదని కొందఱందురు. ఏలయన అల్పము తీసికొనినను, అధికము తీసికొనినను అది కన్యావిక్రయమేయగును. కన్యానిమిత్తముగ పరపక్షీయులిచ్చిన వస్త్రభూషణాదికములను కన్యతండ్రి, సోదరుడు- అవి-కన్యకే ఇత్తురుగావున-తీసికొనవచ్చును. అది కన్యా విక్రయముగా పరిగణింపఁబడదు. ఇది "కన్యాపూజనమే కాని దోషము కాదు. ఇట్లు "ఉత్తమ వివాహము చేసికొని ఉత్తమ దేశమందు నివసింపవలెను. బ్రాహ్మణుడు విపులమైన కీర్తి నాశించినచో అటుల చేయవలెను. బ్రహ్మదేవుని ఈ వాక్యములు.విని ఋషులిట్లనిరి. బ్రహ్మదేవా! ఏ దేశము శ్రేష్ఠమైనది? ఎట్టి దేశము.మీ అభిప్రాయమున-పుణ్యప్రదమైనది? ఎట్టి ప్రదేశమున నివసించుటచేత కీర్తికలుగును? బ్రహ్మ ఇట్లు:సమాధానము చెప్పెను. బ్రాహ్మణోత్తములారా! సకలమైన ధర్మము ,ఎచట నాలుగు పాదములుగా నుండి క్షీణత లేక యుండునో అది శ్రేష్ఠమైన పుణ్యదేశమని నా ఉద్దేశము. శాస్త్రోక్తమైన ధర్మము. ఏ దేశమున విద్వాంసులచే సేవింపఁబడుచుండునో అది ఉత్తమమైన దేశము. ఋషులు (మరల) ఇట్లనీరీ, “సురశ్రేషా! విద్వాంసులచేత సేవింపబడు శాస్తోక ధర్మమెట్టిదో మాకు చెప్పుడు. వినుటకు కుతూహలముగానున్నది”. బ్రహ్మ ఇట్లు చెప్పెను. రాగద్వేష రహితులైన సత్పురుషులు, విద్వాంసులు తమ హృదయముతో ఆదేశింపబడి సేవించు ధర్మమెట్టిదో తెలిసికొనుడు. కోరిక కలిగి ఉండుట ప్రశస్తముకాదు. కాని దానికి కూడ అకామతలేదు కదా! వేదాధ్యయనము. వైదిక కర్మయోగము కూడ కామ్యమే. సంకల్పము నుండియే కామన జనించును. యజ్ఞాదులు, నియమములు, ధర్మములుగల వ్రతములు అన్నియును సంకల్పమువలన కలిగినవే.

తా ॥ కామనలేని క్రియా కారిత్వమెచ్చటను కనుపింపదు. ఏది చేసినను అది కామ చేష్టితమే యగును. శ్రుతి, స్మృతి శీలములు, ఆచారము, ఆత్మసంతుష్టి అనునవియే సత్పురుషులకు ధర్మమూలములు. విద్వాంసుఁడు జ్ఞాన చక్షువుతో అంతయును పరిశీలింపవలెను. శ్రుతి ప్రధానముగ స్వధర్మమున నుండవలెను. మానవుఁడెల్లవేళల శ్రుతి స్మృతులలో చెప్పఁ బడిన ధర్మము ననుష్ఠించుచు ఇహపరములయందు కీర్తినంది స్వర్గమును పొందును. శ్రుతిని వేదముగాను, ధర్మశాస్త్రమును స్మృతిగను తెలియవలెను. అవి అన్ని ప్రయోజనములందు వివేచింపఁదగినవి. వానినుండియే ధర్మము ప్రకాశితమైనది. ఎవడు హేతుశాస్త్రమునాశ్రయించి వానిని (శ్రుతిస్మృతులను) అవమానించునో వాడు వేదనిందకుడు. నాస్తికుడు. సజ్జనులచేత బహిష్కరింపదగినవాడు. వేదము, స్మృతి, సదాచారము, తనకు ప్రియమైనది అను ఈ నాలుగు కలిసి సాక్షాత్తుగ ధర్మలక్షణమగుచున్నది. విప్రులారా ! అర్థకామసాధనలందు ధర్మజ్ఞానమొక రక్షణ కవచమగుచున్నది. ధర్మజిజ్ఞాసువులకు వేదమే పరమప్రమాణము. ఎవనికి మంత్రముల ద్వారా ని షేకము మొదలుకొని శ్మశాన పర్యంతము సంస్కారవిధి చెప్పఁ బడినదో వానికే వేదమునందు, జపమునందు, అధికారము కలదు. సరస్వతి, "దృషద్వతి అనుదేవనదుల మధ్యన గల ప్రదేశము 'బ్రహ్మావర్త'మని పిలువఁబడును.

తా॥ ఏదేశమున ఏ ఆచారము వర్ణోపవర్ణములవారికి పారంపర్య క్రమమున వచ్చుచున్నదో అది వారికి సదాచారమని చెప్పబడును. కురుక్షేత్రము, మత్స్యదేశములు, పాంచాలములు, శూరసేనదేశములు కలిసి బ్రహ్మర్షిదేశము. ఇది బ్రహ్మావర్తము తరువాతిది. ఈ దేశమున జన్మించిన బ్రాహ్మణులనుండియే అన్నిదేశములవారు తమతమ ఆచారములను నేర్చుకొందురు. హిమాలయము, వింధ్య పర్వతముల మధ్య వినశనకు కురుక్షేత్రమునకు తూర్పున ప్రయాగకు పశ్చిమమున గల ప్రదేశము పశ్చిమ సముద్రము వఱకు గల దేశమును ఆర్యావర్తముగా పండితులు గుర్తింతురు. ఎచట కృష్ణసారమృగము స్వాభావికముగా ఎప్పుడును తిరుగాడుచుండునో అది యాజ్ఞిక దేశము. ఆ తరువాత గలది మేచ్ఛదేశము. బ్రాహ్మణుఁడు వీనిలో శుభదేశములనాశ్రయించి యుండవలెను. శూద్రుడు తన వృత్తిని బట్టి ఏ దేశముననైన నివసింపవచ్చును. మునీశ్వరులారా! ఇట్లు విద్వన్మూలమైన ధర్మ సర్వస్వమును విస్తరించికాక సంక్షేపముగాఁ జెప్పితిని.

ఇది శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున వివాహ ధర్మవర్ణనమను ఏడవ అధ్యాయము.