భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

117. సప్తమీ కల్పమున ఉపలేపన స్నాపన మహాత్మ్య వర్ణనము

తా॥ అరుణుడిట్లనెను. “దేవేశా! దేవాలయములందు మిమ్ము పూజించుటకు బ్రాహ్మణాది వర్ణములుండగా వారు కాక మీకు భోజకుడే ప్రీతి పాత్రుడగుటకు కారణమేద్దీయో వచింపుడు. ఇంతకును ఈ భోజకుడననెవరు? ఎవని కుమారుడు? వాని ప్రత్యేకత యేమి? వాని వర్ణమేమి? వాని కర్మయెట్టిది? అంతయును నాకు వివరించి చెప్పుడు” . అని యరుణుడడుగ సూర్యభగవానుడిట్లు చెప్పఁదొడంగెను. “వైనతేయా! లెస్సగా ప్రశ్నించితివి. నీకు శుభమగుగాక! ఏకాగ్ర మనస్కుడవై వినుము చెప్పుచున్నాను. కశ్యపనందనా ! బ్రాహ్మణాది ఇతరవర్ణములవారును భక్తిశ్రద్ధలతో నన్ను పూజింపుచుందురనుట నిశ్చయమే . ఇక దేవాలయములలోను బ్రాహ్మణులే కాక వృత్తి జీవనులైన యితరులును నన్ను పూజింపుచున్నారు. ఈకారణమువలన నాకు భోజకుడే యెల్లప్పుడును ప్రియమైనవాడు-5. ఇతడు వర్ణముచే బ్రాహ్మణుడు. స్వీయానుష్టానపరుడైన యెడల బ్రాహ్మణుడు, అనుష్టాన పరుడు కానిచో నిస్సంశయముగ నరకమును పొందును. కాబట్టి భోజకులెప్పుడును తమ కర్మను వదలిపెట్టరాదు. నాతేజస్సుచే నీ భోజకుని నేనే సృష్టించితిని. ఇతని కర్మ నా పూజయే. శాకద్వీపమున ప్రియవ్రతుని సుతుడును బుద్ధిమంతుడును నగు నొకరాజుండేను. అతడు నాకొఱకొక విమానమును బోలిన మందిరమును నిర్మింపజేసెను, తన ద్వీపమగు శాక ద్వీపమున నతనిచే నిర్మింపజేయబడిన ఆ మందిరము శిలామయమైనది. దివ్యమైనది. అతడు నా బంగారపు ప్రతిమనొకదానిని చేయించి, దానిని నా మందిరమున ప్రతిష్టించుటకు నిశ్చయించెను.

తా॥ శ్రేష్ఠమైన ఆలయము నిర్మాణమయ్యెను. అందమైన సూర్యప్రతిమ కూడా సిద్దమయ్యెను, కాని ఆదేవాలయమున సువర్ణ ప్రతిమారూపమున నున్న సూర్యభగవానుని ప్రతిష్ఠింపగలవారెవరు?. ఇట్లు చింతించి యా భూపాలుడు పాలోవకునికి నన్నేశరణాందెను. ఆ పార్ధివునికి నా పైగల భక్తిని గమనించి. యతనీముందు సాక్షాత్కరించితిని, “రాజేంద్రా! ఏల చింతించుచుంటివి? ఈ చింత ఎటునుండి వచ్చినది?” అని సానునయముగ ప్రశ్నించితిని. “ఈగాఢమగు చింతకు కారణమేద్దియో నాకు చెప్పుము. అది యేదైనను నేను సమకూర్చి యిచ్చెదను, విచారింపవలదు. మిక్కిలి దుష్కరమైన దైనను సాధింతును. సందియము వలదు”. అని నేనతనికి ధైర్య వాక్యములు చెప్పగనే అతడిట్లనెను”. " దేవదేవా! ఈ ద్వీపమునందు మీకొక ఆలయమును నిర్మించితిని. జగన్నాధా! మా యందలి భక్తితో నీ ప్రతిమను కూడా సిద్దపఱచితిని. ఈ ద్వీపమునందు క్షత్రియాది వర్ణత్రయము వారు మాత్రమే యున్నారు. ఇక మి విగ్రహమును దేవాలయమున ప్రతిష్ఠింపగలవారెవరనునదే నాసమస్య. మి విగ్రహమును ప్రతిష్ఠింపగల బ్రాహ్మణుడిచటలేడు. తక్కిన వర్ణములవారేవరును విధివిధానముగ ప్రతిష్ఠింపజాలరుగదా!. ఆకారణముననే నేను చింతించుచున్నాను. ఆచింత హృదయశల్యమై నన్ను బాధించుచున్నది.” ఇట్లు వాపోవుచున్న రాజుతో నేనిట్లు శుభ వాక్యములు బలికితిని. “రాజా! నీవు చెప్పినట్టిది సందేహమేకాదు, ఈ ద్వీపమునందు క్షత్రియాది వర్ణత్రయము వారుండుటలోగూడ సంశయములేదు.

తా॥ వారు ( బ్రాహ్మణేతర వర్ణములవారు) నాపూజకు గాని విగ్రహ ప్రతిష్ఠకుగాని ఎప్పుడును అర్హులుకారు. కాబట్టి రాజా! నీ శ్రేయస్సుకొఱకు, నా ప్రతిమను దేవాలయమున ప్రతిష్ఠింపజేయుటకై. నేను భగ సంజ్ఞకమైన సాటిలేని బ్రాహ్మణ వర్ణమును సృష్టించెదను,” అని నేనా రాజునకు చెప్పి. అతని కార్య సిద్ధికి సంబంధించిన చింతను పోఁద్రోలితిని, నే నాలోచించుచుండగనే నా శరీరము నుండి తెల్లని మొల్ల పువ్వులవంటి, చంద్రుని వంటి మేనిఛాయతో ప్రకాశించుచున్న యెనమండ్రు మహాబలశాలురు, చతుర్వేదములు, వేదాంగముల, ఉపపనిషత్తులు పఠించుచున్నవారవతరించిరి. అందఱును కాషాయవస్త్రములను ధరించి యుండిరి, చేతులలో సంపుటములు (బరిణలు) తామరపువ్వులు ధరించియుండిరి, ఫాల పట్టికనుండి యిరువురు, వక్షఃస్థలమునుండి - యిరువురు, కాళ్ల నుండి యిరువురు, పాదములనుండి యిరువురును ఉద్భవించిరి, ఈ మహాత్ములందును తలలువంచి. నన్ను తండ్రినిగా గౌరవించుచు నిట్లనిరి, “ తండ్రీ! మహాదేవా! లోకనాధా! జగత్పతీ! మమ్ము తమ దేహమునుండి యెందులకై సృజించితిరి? మీ ఉద్దేశమేమియో సెలవిండు మీ యాజ్ఞను పాటించుటకు సిద్దముగ నున్నారము. మీరు మాతండ్రి. మేము మీ పుత్రులము సంశయములేదు,” అని యిట్లు వినయముగ బలికిన వారితో నేనిట్లంటీని. “ఇతడు ప్రియవ్రతుని కుమారుడు, ఈ శాకద్వీపమునకు రాజు, అతని వాక్యమును మన్నింపుడు, అతడు కోరినది చేయుడు,” రాజుతో కూడా నేనిట్లు చెప్పితిని. “రాజా! వారు నా కుమారులు, నీకు పూజ్యులు, బ్రాహ్మణ సత్తములు, వీరందఱిచే నా విగ్రహ ప్రతిష్ఠ చేయబడును గాక. ప్రతిష్ఠ చేయించిన పిదప పూజకొఱకై దేవాలయమునుకూడా వీరికే యప్పగింపుము.

తా॥ వీరు నా పూజయందును, ప్రతిష్టల యుందును అన్ని విధముల యోగ్యులు, ఏది యైనను భోజకుల కిచ్చి తిరిగి తీసికొనకూడదు. నా మందిరము నిర్వహణ కొఱకేర్పరుపబడిన ఇండ్లు, పొలములు, ధనధాన్యాదులు, మందిరమున గల సామగ్రి. యంతయును సంశయింపక భోజకులకే యిచ్చివేయవలెను, ధనము, ధాన్యము, సువర్ణాద్యాభరణములు, ఇండ్లు, స్థలములు మొదలగునవి, ఇంకను నాకుసంబంధించిన యాస్తిపాస్తులు పల్లెలలోనివి గాని, పట్టణముల లోనివి గాని. అంతటను గల మత్సంబంధమగు వస్తువులకెల్లను . భోజకులే యధికారులు, ఇతరులెవరునుకారు. పితృ ద్రవ్యమునకు పుత్రుడే అధికారియైనట్లు నా యాస్తికంతటికిని భోజకులే అధికారులు, సందేహములేదు. రాజుకు నేనిట్లు చెప్పగా నాతడంతయునేను చెప్పినట్లే నడచుకొనెను, ప్రతిష్ఠ చేయించి నాసంబంధమగున దేల్లను భోజకులకు సమర్పించి మిక్కిలి సంతోషించెను. కాబట్టి గరుడాగ్రజా! ఈ భోజకులిట్లు నాచే సృష్టింపబడిరి. నేను వారి యాత్మను, దేవతలందఱు వారిని. నాపుత్రులతో సమానులుగా తెలియవలెను, అంతేకాక వారు నాకు హితులు, కావున ఏదైనను వారికిచ్చుటయే దప్ప వారినుండి యేదియును తీసికొనకూడదు.

తా॥ లోభము వలనగాని, ద్వేషము వలనగాని భోజకుని వస్తువును హరించువాడు తామిస్రమను ఘోర నరకమున బడి యచట పెక్కు సంవత్సరములు దుఃఖము ననుభవించును. కాబట్టి నాకు సంబంధించిన గృహ క్షేత్ర ద్రవ్యాదులన్నియును భోజకునకు తండ్రినుండి సంక్రమించిన సొంతమైన ఆస్తులు. భోజకుడన నెట్టివాడో చెప్పెదను వినుము. నా యాజ్ఞను పాలించుచు స్వానుష్ఠాన పరుడై. మొదట వేదాధ్యయనము చేసి, అటు పిమ్మట వివాహమాడి, నిత్యమును అభ్యంగముతో మూడు సవనములు ( ఉదయము మధ్యాహ్నము, సాయంకాలము లందు స్నానమాచరించుట) చేయవలేను. అన్నికాలము లందు, రాత్రింబవలు ఐదు పర్యాయములు నన్ను పూజింపవలెను, దేవతలను బ్రాహ్మణులను, వేదముల నెప్పుడును నిందింపరాదు. భోజకుడైనవాడితరదేవతల ప్రతిష్టలు చేయకూడదు, నా ప్రతిష్టనైనను ఏకాకి యైన భోజకుడు చేయకూడదు. దేవతకు నివేదింపదగిన, యహారపదార్ధమును భుజింపరాదు. శూద్రునియింట భుజింపరాదు. భోజకులు శూద్రోచ్చిష్టమును తప్పక త్యజింపవలెను. శూద్రగృహమున శూద్రాన్నమును భుజంచువారు. పూజా ఫలమునేట్లు పొందగలరు? అందుచే శూద్రగృహము నకుఁబోయిఅచటనెప్పుడును భోజనము చేయకూడదు. అట్లే ఇంటికి కొనిరాబడిన శూద్రాన్నమును కూడా భుజింపకూడదు, నాయెదుట నిత్యము శంఖమును పూరింపవలెను. 

 తా॥ ఒక్క మాఱు శంఖము పూరించిన యెడల నా కాలుమాసములు పురాణ శ్రవణము వలన కలిగినంత ప్రీతి కలుగును. సందేహములేదు. కాబట్టి భోజకుడగువాడు తప్పక శంఖమును పొయించవలేను, నాకు ఈ శంఖనాద నివేదనము చేయుట యతనికి శ్రేష్టమగు వృత్తి. అభక్ష్యభక్షణము చేయరు కావున వారు భోజకులని చెప్పబడుదురు. బ్రహ్మప్రాప్తినిగూర్చి యాలోచింతురు. గావున మాగధులని. నిత్యమును నన్ను భుజింపజేయుదురు గావున భోజకులనియు పిలువబడుదురు. వారు మిక్కిలి పవిత్రతను. కలిగించు నభ్యంగమును ధరింపవలెను. అభ్యంగహీనుడైన భోజకుడపవిత్రుడగుటలో సంశయములేదు. అభ్యంగహీనుడై నన్ను పూజించువానికీ . సంతానము కలుగదు, నాకు ప్రీతియు కలుగదు, శిరోముండనము చేయించుకొని శిఖ తప్పక యుంచుకొనవలెను. ఆదిత్యవారమునాడు, షష్ఠినాడును, నక్తవ్రత మాచరించి, సప్తమీ దినమునం దుపవసింపవలెను, సంక్రమణ దినమునందును ఉపవాస వ్రతమాచరింపవలెను. భోజకుడు నా ప్రీతి కొఱకు నా ముందు త్రికాలముల యందును గాయత్రీమంత్రమును వాచికముగ జపింపవలెను. క్రోధమును పూర్తిగవిడిచి, మౌనమునవలంబించి, భక్తిశ్రద్ధలతో నన్ను పూజింపవలెను. లోభము వలనగాని, కామము వలనగానీ నా నిర్మాల్యమును శూద్రులకు గాని వైశ్యులకు గానీ యిచ్చినవాడు తప్పక నరకమునకు బోవును.

 తా॥ దుష్మాత్ముడైన భోజకుడెవడైనను నా కొఱకుద్దేశింపబడిన పుష్పములను లోభ వశుడై నాకు వినియోగింపకముందే యెవరికైన నిచ్చినచో. అట్టివాడు నాకు పరమ శత్రువని తెలయవలెను. అట్టివాడు నాపూజచేయుట కరుడు కాడు, నానిర్మాల్యమును బ్రాహ్మణాదులకు మాత్రమే యీయవలెను. భోజకుడు హవిష్యాన్న తుల్యమైన నా నైవేద్యము నారగింపవలెను, దానితో సౌతడు శుద్దుడగును. నా శరీరము నుండి తీసిన పుష్పమేనియు నితరుల కీయ కూడదు, నాకు నివేదింపబడిన వేనివైనను మరుక్షణమున నీటిలో వేయవలెను. నా శరీర స్పర్శ కలిగిన గంధ పుష్పాదులేవేనియు పంచగవ్యముతో సమానమైనవని యభిప్రాయము. అందుచే వాని నెప్పుడును వైశ్యునకుగాని, శూద్రునకుగాని యిచ్చుట కూడదు. తాను స్వీకరంపవలెనే కానీ ధనమునకై విక్రయింపరాదు. పుష్పములు గానీ, అవ్యంగములుగాని నాపైనలంకరింపక నపహరించువాడు తప్పక నరకప్రాప్తినందు ను. నా స్నాన జలమును, నిర్మాల్యమును, అగ్నిని దాటువాడు భయంకరమగు రౌరవమను నరకమును పొందును. భోజకుడు నిత్యము నన్ను అభిషేకముతోఁ దనుపు చుండవలెను, నాకు నివేదింపబడిన వస్తువుల పైనుండి దాటుట నిషేధమగు నట్లుగనే, వానిని శునకము భక్షించుటయు నిషేధమే. పూనికతో నన్నభిషేకింపకున్నను, నియమాతిక్రమణ బుద్దీగలవాడై భక్షించినను. భోజకుడు భీకరమైన తామిస్రమను నరకమున (బడును. ఒక పూట భోజనము, మూడు పర్యాయములు స్నానము భోజకునకు ప్రతిదిన కర్తవ్యములు.

తా॥ ప్రతి దినము మూడు మారులు శుభ్రమగు వస్త్రములను మార్చుకొనవలెను, ప్రయత్నపూర్వకముగ పూజాది సమయము లందు క్రోధమును విడిచి పెట్టియుండవలెను. అశుభమును బలుక రాదు, మంగళ ప్రదములైన వాక్యములనే మాట్లాలడవలెను. ఈ విధమగు భోజకుడు నాకు ప్రియమైన పూజకుడు. అట్టివాడు బ్రాహ్మణాదులకు గౌరవపాత్రుడు, నావలెనే పూజనీయుడు, భోజక వృత్తిలో నున్నవాని నెవరేని యవమానించినచో. నట్టివాని యెడ నేను తక్షణమే క్రోధమునొంది వాని కులమునంతటిని నశింపజేయుదును, వినతా పుత్రా! నీ వెట్లు నాకిష్టుడవో భోజకుడును నాకటులెల్లవేళలయందు ప్రియమైనవాడు. అతడు నామందిరము నెల్లప్పుడు సంమార్జనము, ఉపలేపనము మున్నగు కార్యములు చేయుచుండుటచేనతడు నాకిష్టుగ-” పరావసువిట్లనెను."రాజా! ఈ విషయములన్నియు నరుణునకుఁజెప్పి సూర్యభగవానుడు రధారూఢుడై తన భ్రమణమును సాగించేను. అరుణుడా విషయములనన్నింటిని విని మిక్కిలి ప్రసన్న చిత్తుడయ్యెను, మహారాజా! ఆ విధముగ భోజకుడు పూజ్యత్వమును సంతరించుకొనెను. మానవుడు ప్రతిరెండవ భోజనమును వాచకునకు సమర్పించవలెను. బ్రహ్మదేవుడిట్లు పలికేను, “మహాముని యగు పరావసువు ముఖతః ఈ తన కర్మఫల వివరములన్నియు విని సత్రాజిత్తు మహారాజు మిక్కిలి. ప్రసన్నుడయ్యెను సూర్యదేవాలయములీ పుడమియందెచ్చట కన్పట్టినను వానిలో భక్తితో నాతడుపలేపనము లాదిగ చేయించుచుండెను సుందర శ్రేణియగు నతని భార్య కూడా భాను దేవుని మందిరమున, వాచకునకు వేతన మిచ్చి భక్తిశ్రద్ధలతో పుణ్యకథాశ్రవణములుచేయించుచుండెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీకల్పమునందుపలేపన స్నాపన మాహాత్మ్యవర్ణనమను నూట పదునేడవ అధ్యాయము సమాప్తము-సత్రాజితోపాఖ్యానము సమాప్తము.