భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
116. సత్రాజితోపాఖ్యానమున రవి పూజా విధి వర్ణనము
తా॥ కృష్ణా! పూర్వకాలమున “సత్రాజిత్తను' పేరుగల, యయాతి కుల సంభవుడైన చక్రవర్తి యుండెను. అతడు మహాబలవంతుడు. ప్రభావములచేత, తేజస్సుచేత, కాంతిచేత, క్షమచేత శక్తి సంపన్నుడైన ఆ మహారాజు ధైర్య గాంభీర్య సంపన్నుడై మిక్కిలి యివిగలవాడై యశస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. బుద్ధిచే పరాక్రమించుటలో సమర్థుడై, సంపదగలవాడై, బ్రాహ్మణుల నాదరించువాడై, నేర్పరియై, పండితుడై, శూరుడై యుండెను. కామ క్రోధాదులకు వశుడుకాక. ఎల్లవేళల ప్రాణులయందు ప్రేమ గలిగి యుండెను. ధనవంతులచే జయింపబడకుండెను. అయినను భోగసమూహముల యెడ విముఖుడై సాత్త్విక శ్రద్దా యుక్తుడై యుండెను. చంద్రసూర్యుల యొక్క, దత్తాత్రేయుని యొక్క, లక్ష్మీదేవి యొక్కయు ఆశీరభిమానములకు పాత్రుడై యుండెను. అతడు బలముచే కార్తికేయునితో సమానుడై, కుబేరునింబోలిన పూజాతపములు గలవాడై ప్రకాశించుచుండెను. కుమారస్వామి, బృహస్పతి, విష్ణువు. వాల్మీకి, వ్యాసుడు, జామదగ్ని. వీరిలోని యనేక గుణములతో నొప్పుచు సుందరాకారుడై, బ్రాహ్మణభక్తి కలిగి సత్రాజిత్తు భూమండలమును పరిపాలించుచుండెను. సప్తద్వీపమైన వసుంధర యెల్ల నా మహాబాహుని చేయుచుండిరి. ఎచ్చట సూర్యుడుదయించి, విహరించి ఎచట నస్తమించునో ఆ భూభాగమంతయు, సాత్రజితక్షేత్రమని పిలువబడుచుండెను.
తా॥ మహాబలుడైన ఆ చక్రవర్తి సర్వరత్న సంయుక్తము సప్తద్వీపవతియునైన భూమండలమును ధర్మబద్దముగ పరిపాలించెను. అన్యాయము చేయనివాడు, అశక్తుడు కానివాడు, వదాన్యుడు, బలవత్తరుడు, ధర్మశాసకుడైన సత్రాజిత్తు మహారాజునకు. నలుగురు మంత్రులుండిరి. అతిబలుడైన యా చక్రవర్తికా నలుగురు మంత్రుల ప్రతిహతులై యుండిరి. రక్తచందనము , వంటి కిరణములతో జగత్తును ప్రకాశింపఁజేయు సూర్యభగవానుని యందా భూపతికి సహజముగానే మీక్కుటమగు భక్తి యుండెను -14. అతని మహిమౌన్నత్యములను జూచి కేవలము ప్రజలకే గాక స్వయముగ నతనికే విస్మయము కలుగుచుండెను. తన యభివృద్ధికి తానే ఆశ్చర్యపడి ఒక సమయముననాత డిల్లాలోచింపసాగెను “మఱల రాబోవు జన్మలో కూడా నా కిట్టి యైశ్వర్యము, సంపద ఎట్లు లభింపగలవో కదా” (!లభించియున్న బాగుగనుండును కదా!). అని యిట్లనేక విధములుగ చింతించినను మహాయశుడైన సత్రాజిత్తునకు దానిమూలమంతుబట్టదయ్యేను. ఏదియు పాలుపోక ధర్మతత్వజ్ఞులైన బ్రాహ్మణులను రావించి. పొరలనందఅనేకాంతప్రదేశమున నంతఃపురమున సుఖాసీనులనుజేసి నమస్కరించి, వారి యాదేశములను పాటించుటకు సిద్ధపడి యిట్లు ప్రశ్నించెను. విద్వాంసులారా! నా యందు విశ్వాసమును అనుగ్రహ బుద్ధిని కలిగి నేనడుగబోవు చిన్న సందేహమును దీర్చి నన్ను కృతార్థునిఁజేయుడు.
తా॥ “ఓ వేదవిత్తములారా! సద్విద్యతోను, అశేష విజ్ఞానముతోను పవిత్రములైన అంతరాత్మలుగల మీచేత నేననుగ్రహిం దగిన వాడనగుదును గాక. విద్వాంసులారా! మీరందఱకును ఉపకారము చేయువారు. నేనే విషయమునడిగెదనో నన్ననుగ్రహించి యా విషయమును గూర్చి చెప్పుడు”. అని సత్రాజిత్తు వినయముగఁబలుకగనే బ్రాహ్మణులిట్లనిరి. “రాజా! నీ మనస్సున గల సందేహమును గూర్చి యడుగుము. నీ మనోగతమైన సందేహమునకు యథా న్యాయముగ సమాధానమును చెప్పెదము. చక్కగా ప్రజలను పరిపాలించువాడవు, అన్నదాతవు, అయిన నీచే మేము సంతుష్టులమై యున్నాము . సంతుష్టుడగు బ్రాహ్మణుడు చక్కగా భుజింపవలెను. థర్మసంశయములను దీర్పవలెను. ఇది బ్రాహ్మణుని కర్తవ్యము” . అని యిట్లు బ్రాహ్మణులు చెప్పబోవు చుండగనే ధీమంతుడగు నా రాజు భార్య యచటి కే తెంచి వారికి నమస్కరించి, (బ్రాహ్మణుల యెడ) వినయముగను, తన భర్త యేడ) ప్రేమగను ఇట్లనెను . “స్త్రీలీ విధముగ మాట్లాడుట తగదు. అయినను సాహసించి యీ సభలో నేనుమాటాడుచుంటిని. రాజా! మీరు మీసంశయముల నెప్పుడైన నీ ఋషుల నడిగి తెలిసికొనవచ్చును. మేమెప్పుడు నంతః పురమున నుండువారము గదా! 128. కావున నోప్రభూ! నన్ననుగ్రహింతురేని నా సందేహమునీ ఋషుల నడుగుటకనుమతింపుడు”. సత్రాజితుడు తన పట్టపురాణి మాటలు విని యిట్లనెను. “సుందరీ! ఈ భూసురవరులను నేనడుగదగిన నీ సందేహమును గూర్చి తెలుపుము, పిమ్మట నా సంశయమును గూర్చి వీరల ప్రశ్నింతును.
తా॥ విమలవతి యిట్లనెను. “పూర్వకాలపు రాజులను గూర్చి వినుచుందుము. భూపాలా! వారికి కూడా మికీ నాడు లభించిన సంపద వంటి సంపదయే లభించి యుండెనట!. కానీ యంతకంటెను మికిట్టి యశేష సంపదలు కలుగుట యే కర్మవిపాకము చేతనో యీ మహరులు వివరింతురుగాక. నేను స్త్రీలలో కెల్ల నుత్తమురాలినై మీకు రాజైనగు భాగ్యమును పొందగలిగితిని. దీనికేగొప్ప కర్మకారణమో తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలము కలుగుచున్నది. ఇట్టి సంపత్సమృద్ధి యితరులు కొందఱ యెడ కూడా కాననగుచున్నది. అది యనల్పమగు కర్మాతిశయత్వము చేతనే యగుట నిశ్చయము. కాబట్టి యితరులు జన్మచరిత్రము, మీ స్వీయ జన్మముల చరిత్రమును గుఱించి మునుల నడిగి తెలిసికొనుడు. అట్టి మీ ప్రశ్నలచే నేనును నాపురాకృత సుకృత మెర్షియో తెలిసికొనగలుగుదును”. బ్రహ్మదేవుడిట్లు పలికెను. “విష్ణుదేవా! తన భార్యయగు విమల 'వతి మాటలు విని సత్రాజిత్తు విస్మిత మానసుడై మునుల ముందు తన భార్యను ప్రశంసించుచు నామెతో నిట్లనెను. “దేవీ! లెస్సబలికితీవి. నా హృదయాంతర్గమైన సంశయమునేనీవు భగ్యంతరముగ ప్రకటించితివి. పురుషులకు 'గృహిణి' యనునది 'తనలోని అర్ధభాగ'మను మహరుల మాట సత్యము కదా!. మహాభాగా! నీలోని యర్ధభాగమునైన నేను ఇదే విషయమును గూర్చి యీ మునీశ్వరులను ప్రశ్నించును. వారికి తెలియనిదీ ముల్లోకములలో నేదియులేదు”. భార్యతో నిట్లు నుడివి సత్రాజిత్తు ఋషుల వంక తిరిగి వారికి నమస్కరించి తమ సంశయ స్వరూపమునంతయును వారి ముందు నివేదించెను. రాజిట్లు నుడినెను. “మహరులారా! కరుణాహృదయులై విషయము నంతయు నున్నది యున్నట్లుగఁ జెప్పుడు. నేనెట్టి సుకృతమొసరించితినో తెలుపుడు.
తా॥ 'బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వజన్మలో నెవరినై యుంటిని? ఎట్టి కర్మనొనరించియుంటిని? నా భార్యయగు నీ సౌందర్యవతి చేసిన పుణ్యమేమి?. మర్త్యలోకమునందు మాకీ దుర్లభమైన సిరిసంపదలు కలుగుటకు మేము చేసిన సత్కర్మలెవ్వి? అప్రతిహతులైన నలుగురు మంత్రులు నాకెట్లు లభించిరి? రాజులందఱు వశులై యుండుట, తరగనిసంపద, అప్రతిహతమగు సైన్యము, శరీరారోగ్యము ఇవియన్నియు నాకెట్లు సమకూరినవి? సర్వ ప్రపంచమును కాంతిచే ప్రకాశించు నా భార్యయందే యున్నట్లు నాకు భాసించుచున్నది. నా శరీరకాంతియు నెవ్వడును సహింపని రీతిన నున్నది. అట్టినేను, అనిందితయగు నా భార్యయు దీనికి కారణము నెఱుంగ కోరుచున్నాము. ఏ యనుష్టాన ఫల స్వరూపముగ నీ యశేషమగు సురూ పైశ్వర్యతేజో బలాది సంపదలు మాకు సంఘటించినవో దానినంతయును తెలియగోరుచున్నాను”. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడగెను. “సత్రాజిత్తు జిజ్ఞాసువై యిట్లు ప్రశ్నింప తపోధనులగు బ్రాహ్మణులందఱు తమలో నొకడగు పరావసుని జూచి జేని సందేహమునకు సమాధానము చెప్పుమని కోరిరి. ధర్మజ్ఞులగు నా విద్వాంసులచే ప్రేరితుడై శూరుడు, మతిమంతుడునగు పరావసుడు విధిననుసరించి సంయత మనస్కుడై చాల సేపు ధ్యానయోగమున నుండీ. చివరకు సత్రాజితుని పూర్వ జన్మవృత్తాంతము నంతయును తెలిసికొనెను. అటు పై జిజ్ఞాసువు బుద్ధిమంతుడునైన అతనితో మునిపుంగవుడగు పరావసువు యిట్లు చెప్పుటకుద్యుక్తుడయ్యెను. మహాత్ముడు, జితశత్రుడు, మనస్వి, భార్యాయుక్తుడు, మహా బుద్ధిశాలియైన నత్రాజిత్తుకేగాక సత్యవాదులగు నచటి బ్రాహ్మణులందఱు వినునట్లుగా పరావసువిట్లనెను. 'రాజా! వినుము. నీ రాజ్యాది విభవములు, నీ సుందరాంగి భార్యయగుట మొదలగు నుత్తమ ఫలములన్నియు నే కర్మవలన కలిగేనో తెలిసికొనుము.
తా॥ పూర్వ జన్మమున నీవు హింసా పరాయణుడవైన శూద్ర జాతీయుడవు. కుష్ఠముతో బాధపడుచు, దండ పారుష్యముగలిగి సర్వ ప్రాణులయెడ నిర్దయుడవై జీవించు చుంటివి. నీ భార్యయగు ఈ విమలమతి పూర్వ జన్మమున కూడ విశాలనేత్రయై సౌందర్యవతియై యుండెను. నిరంతరము నీ యందే మనస్సు నిలిపి నీ సేవలోనే నిమగ్నమై యుండెను పతివ్రతయై, సాధ్వియై, నిష్ఠుర వాక్యములతో బెదరింపబడినను నీ యాజ్ఞలకే విధేయురాలై, నీ కర్మలనే చేయుచుండెడిది-53. దారిద్ర్యముచే నిస్సహాయుడవై, బంధు జనములచే విడిచివేయబడిన నీ తాతలనాటి యాస్తిపాస్తులన్నియు ధ్వంసమైపోయెను. రాజా! అట్టి క్షీణదశలో నీవు వ్యవసాయము చేయదొరకొంటివి. కాని దైవానుకూల్యములేమింజేసి నీ కృషియును వైఫల్యమునందెను. సాయనువారులేక మిక్కిలి దైన్యముతో నితరులకు సేవజేయుచు జీవింపనుంకించిననిన్ను సాధ్వియగునీమె విడువక తోడునీడయై యుండెను. పతివ్రతయగు నీమెతో గూడి నీవొక సూర్య దేవాలయమున నూడ్చి శుభ్రము చేయు నుద్యోగమున నుండి సూర్య భగవానునకు భక్తి శ్రద్ధలతో సేవ చేయుచుంటివి. సర్వ కామ్యముల నుండియు నిస్సంగుడవై, సూర్య భగవానుని భక్తితో తన్మయుడవై, యంకిత భావమున అహరహమును నా దేవునియందలి విశ్వాసముతో. కన్యాకుబ్జపురమునందలి యా సూర్యదేవాలయమున శ్రద్ధగా సేవ చేయుచుంటివి. ఆలయమున కసవు చిమ్మి. నీరుజల్లి, చక్కగా నలికి, అనుకూలవతియగు నీ భార్యతో గూడి శుశ్రూష చేయు చుంటివి.
తా॥ వాచకునకు పితృదత్తమైన అంగుళీయకమునిచ్చి పురాణేతిహాస పుణ్య కథాశ్రవణముఁజేయించితివి. మీరిరువురు ప్రతి దీనమాదేవాలయమున తన్మయత్వముతో నొనరించిన పుణ్యకర్మల వలన మీ పాపమంతయు నశించిపోయెను. 'సూర్య భగవానుని సేవ నాచే చేయబడవలయును. శ్రేష్ఠములైన పురాణ శ్రవణములాదిగ భానుదేవునికి ప్రీతి కలిగించు కార్యములు నేను చేయవలెను'. అని రాత్రింబవలు నీకిదే చింత కలుగుచుండెను. ఈ సూర్య మందిరమెల్లప్పుడును సూర్య భగవానునివలెనే రమ్యముగ ప్రకాశించుచు సుఖావహమైయుండవలెనని నీ మనస్సెప్పుడును తహతహలాడుచుండెను. యోగులకు యోగకర్మ సుఖ ప్రదమైనట్లు నీ చిత్తముకూడ నహర్నిశమును సూర్య సేవా రూపమగు. యోగ కర్మయందు లగ్నమై యుండెను-65. ఇట్లు తన్మయత్వముతో వృత్తిని నిర్వహించుచు, యోగ్యమైన యూహలు సేయుచు చెప్పిన దానికన్న నెక్కుడుగ పని చేయుచు-66. దృఢమనస్కతతో నెల్లప్పుడును సూర్య భగవానుని స్మరించుచుండిన నీ పాపమంతయును, సూర్య సేవ వలన, నిశ్శేషముగ నశించిపోయెను. దానికన్న నెక్కువగా నా పురమున నుండి, సూర్య మందిరమున, లేపన సమ్మార్జనాదికములను అనేక విధములుగ నీ భార్యతో గూడి చేసినందువలన పాపక్షయమయ్యెను. కేవలము ధర్మమునాశ్రయించి తక్కిన వృత్తులను వదలి పెట్టి వాచకునితో పుణ్య కథా శ్రవణములను చేయించుట వలన పాపక్షయమయ్యెను. వివిధములైన ధాతు విశేషములచేత, గోమయముచేత, మట్టిచేత సూర్యాలయమున భక్తితో నుపలేపనము చేసినందువలన నట్టి ఫలము నీకు లభించేను.
తా॥ ఇట్లుండ నొకనాడచటికి కువలాశ్వుడను రాజు మహాసైన్య పరివారములుగలవాడై, అధికమైన గజవాహనములు గలవాడై యేతెంచెను. ఇంద్రవైభవముతో, తనవేయిమంది భార్యలతో నావరింపబడి, సర్వాభరణ భూషితుడై, సర్వ సంపత్సమేతుడై వచ్చిన ఆ రాజును చూచి, యందమైన కిరీటమును ధరింపగల రాజును కావలెనని నీకు కోరికపుట్టెను. సర్వ కామ ప్రదమైన భాస్కర దేవునీ సేవా ఫలముగ నీ యఖిల విభవాభిరామమగు నశేష రాజ్యమును పొంది చక్రవర్తివి కాగలిగితివి. నీ విశేషమగు తేజ స్సే యోగప్రభావముతో కలిగినదో సాకల్యముగ వివరించుచున్నాను వినుము. సూర్య మందిరమునందలి దీపము, నూనె నిండుకొనుటచేత కొండకెక్కిపోయినప్పుడు నీ భోజన సంబంధమగు తైలమును బోసి మఱల వెల్డించుచుంటివి. వత్తి క్షీణించిపోయినపుడీమె తన చీర చెఱఁగుతో వత్తిని సిద్దముచేసి పూర్వపు వత్తికి కలిపి పెంచుచుండెడిది. నీ భార్య యిట్లు మిక్కిలిగ నారాధించుటచేత నీ కిట్లు రాజులందఱు నీర్యపడగల తేజస్సు కలిగెను. రాజా! శూద్రత్వమువలన సంక్రమించిన సేవా పరాయణత్వము సూర్య సంబంధముగ సంఘటించుటచేతను, దానిని నీవు తన్మయత్వముతో నిర్వహించియుండుటచేతను సర్వోత్తమమగు ఘనతను పొందగల్గితివి. ఇక తదేక మనస్కుడై, నిష్కామ భావముతో సూర్య భగవానుని పూజా సేవాదులు నిత్యము చేయగలు మానవుడు పొందు ఫలమును గుఱించి చెప్పునదేమి?. ఈశ్వరేశ్వరుడగు సూర్యుని పూజించువాడు సకల సంపత్సమృద్ధిని, సర్వ లోక మహేశ్వరత్వమును పొంది సుఖించునే గాని యెన్నటికిని నష్టము నొందడు.
తా॥ పుష్ప ధూప దీప వస్తాను లేపనాదులచేతను, సూర్య మందిరమున సమ్మార్జనాది కర్మలచేతను ఆ దేవదేవునారాధింపుము. సూర్య దేవునకు మిక్కిలి ప్రియమైన వస్తువులను, దుర్లభములైన ప్రత్యేక వస్తువులను సర్వ జగత్కర్తయగు భాస్కర భగవానునకు సమర్పించిన వాడెవడైనను చెడడు. పరిమళ ద్రవ్యములు, అగురు, కర్పూరము, చందనము కుంకుమము, వస్త్రములు, వివిధములైన ధూపములు, పుష్పములు, మాలలు, వింజామరలు, టెక్కెములు: ఇతరములగు కానుకలు, ఘృతక్షీరాభిషేకములు, గీత వాద్య నృత్య ప్రదర్శనలు మొదలగువానిచేత సూర్య భగవానుని సంతోష పెట్టుము. పుణ్య రాత్రులందుజ్జ్వలములైన నృత్య గీతాదులతో మార్తాండుని సేవింపుము. రాజా! భక్తితో సూర్య ప్రీత్యర్థముగ జాగరణములను, శుచిర్భూతుడవై హోమ కార్యములను నిర్వహింపుము. ముఖ్యముగ నితిహాస పురాణ కథా శ్రవణములచేత, మంగళ ప్రదములైన ఋగ్యజుస్సా మాధర్వవేద ఘోషల చేతను సూర్య దేవునికి ప్రీతి కలిగింపుము. భవ భంజకుడైన భాను భగవానుడిట్లు భక్త్యుపచారములతో తుష్టినొందును. నరులచే నిట్లు సంతోషింపజేయబడి భాస్కరదేవుడు యమ ధర్మరాజై వారి పాప సంచితమును హరించివేయును ధర్మశాస్త్ర బి సులభముగించి ఈ కరుణ యులో పురుగు - రత్న సమూహములు, పుష్ప ధూపాను లేపనములు మున్నగువాని యక్కఱలేకయే, కేవలము స్వచ్ఛమైన భావముతో నాతని స్మరించిన మాత్రముననే, ప్రసన్నుడై కామ్యములనొసంగును. ఏకాగ్ర మనస్కుడవై నీవు సూర్య మందిరమున సమ్మర్జనాదికములగు నిట్టి సాధారణ కర్మల నాచరించి యుండిన మాత్రమున తత్ఫల స్వరూపముగ నేడన్యదుర్లభమగు రాజ్యమును పొందగలిగితివి.
తా॥ నీ భార్యయగు నీమె సూర్య దేవాలయమున పుణ్య కథా శ్రవణమును నిర్వహించి, వాచకుని పూజించిన ఫలముగ నీ విధమగు సంపదను పొందగలిగినది. లభించిన యుపకరణములతో సేవించి, నిశ్చలమైన మనస్సుతో నా భానుదేవుని, నీవు సంతోషింపఁజేసినట్లుగ నా యింద్రుడు కూడ సంతోషింపఁజేసియుండలేదు. కాబట్టి ఓ రాజా! అత్యంత పవిత్రురాలగు నీ భార్యతో గూడి యీ జన్మలో కూడ సూర్య భగవానునారాధించుటకు ప్రయత్నింపుము. భవిష్యత్తు సుఖావహమై యుండగలదు”. బ్రహ్మదేవుడిట్లు నుడివెను. “విష్ణు దేవా! సత్రాజత్తు చక్రవర్తి యా మునిపుంగవుని వాక్యములు విని భార్యతో సహా సంతుష్టాంతరంగుడై పులకించిపోయెను. తనను తాను కృతకృత్యుడుగ భావించుకొని మునిశ్రేష్ఠునకు నమస్కరించి యిట్లనెను. "మునివర్యా! మీ వాక్యములచే నా ప్రాణ వాయువులు కొత్త బలమును సంతరించుకొని యమృతత్వమును పొంది బ్రహ్మానందము నొందినట్లైనవి. కృతార్థుడనైతిని. మనస్సూట పొందినది. ఇక నిశ్చింతగనుందును. అజ్ఞాన తమస్సుచే నావరింపబడియున్న నేను, మా యుపదేశముతో జ్ఞాన తేజమును బడసితిని. నేను, నా భార్యతో సహా, ఐశ్వర్య భంగ భయమున నుంటిని. కాని బ్రహ్మన్! మీ వాక్యములచే ద్రవ్యమాపాదింపబడినది సుమీ!. ద్విజోత్తమా! మీ ముఖ నిర్గతమైన వాక్కులచే, మా సంపదలకు బీజము చెప్పబడినదని గ్రహించితిమి. రత్నములచే, ధన సమూహములచే, పుష్పాను లేపనములతోగాక ఆదేవదేవుడు స్మరణ మననాదులచే పూజలందుకొనునని తెలిసికొంటిమీ. సర్వేశ్వరేశ్వరుడైన ఆ భానుదేవుడు బాహ్య వస్తు నిరపేక్షముగ, కేవలము మనస్సుచే మాత్రమే, తన వికానివి, అతనివేయైనట్టివియునైన భక్తి భావనలచే పూజింపబడదగియు నుండును.
తా॥ మీరు చెప్పుచుండిన దానిని బట్టి నాకీ విషయములన్నియు తెలిసినవి. నాపై యనుగ్రహముంచి యిటు పై నేనడుగబోవు విషయమును గూర్చి సుముఖులరై చెప్పవేడుచున్నాను. విప్రేందా! స్త్రీలుగానీ, పురుషులుగాని సూర్య దేవునెట్లు పూజించిన నాతడు సులభముగ ప్రసన్నుడగును? దయచేసి చెప్పుడు. ఆ దేవ దేవుని ప్రీతి కొఱకునైన రహస్యములు, తిథి, ఇంకను విశేషములేవైననున్నచో వానినన్నంటినీ సూర్యారాధన పై నపేక్షగలనాకు దేలియజేయుడు”. సత్రాజిత్తు జిజ్ఞాసనుగమనించి పరావసుముని యిట్లనెను “రాజా! మిక్కిలి భయంకరమగు సంసార సముద్రమునఁబడి యున్న పురుషులు, స్త్రీలు దానిని తరించుటకై తమ తమ గృహములలో సూర్య భగవానునేట్లారాధింపవలయునో చెప్పుచున్నాను వినుము. జగన్నాథుడైన సూర్య భగవానుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో తదేక మనస్కతతో నారాధించి యొక 'భోజనము తాను చేసిన రెండవ భోజనము బ్రాహ్మణునకు సమర్పింపవలెను. అనగా ప్రతి యైనవాడు ప్రతి పర్యాయమును బ్రాహ్మణ భుక్త శేషమునారగింపవలెను. భాస్కర ప్రీత్యర్థమై కార్తిక మాసమంతయు నిట్లు ప్రతాచరణముచేసినచో తాను పూర్వ వయస్సున తెలిసియో, తెలియకయో. చేసియున్న పాపములన్నియు పటాపంచలై పోవుననుటలో సందియములేదు. ఇట్లే మఱల మార్గశిర మాసమున చేయవలెను. సూర్యు నారాధించి, బ్రాహ్మణులకు గారుత్మతమును (పచ్చజాయిని) భగవత్రీత్యర్థముగ దానముచేయువానికి కలుగు ఫలమును వివరింతును వినుము. స్త్రీగాని, పురుషుడుగాని తమ మధ్య వయస్సున చేసిన పాపము దీనివలన నశించిపోవునని పరమాత్మయే చెప్పియున్నాడు.
తా॥ సూర్య భగవాను నర్చించి, ఒక భోజనము చేసిన నొక భోజనము బ్రాహ్మణున కర్పించుచు వుష్య మానమునందీ " వ్రతమాచరించి. సూర్య దేవునకు ప్రీతి కలిగించినచో ముసలి తనమున చేసిన ఆయా పాపములన్నియును - పురుషునవియైనను, స్త్రీవి యైనను నశించిపోవును. రాజా! మూడు మాసము లీవ్రతమునోచరించినవాడు సూర్యప్రీతి కలిగించిన పోడగుటవలన నట్టి వాడు లఘుపాపములనుండి ముక్తుడగును. రెండవ సంవత్సరమున చేసినచో నుపపాతకములనుండీ ముక్తుడగును. అట్లే మూడవ సంవత్సరమునకూడ చేసినచో మహా పాపములు నశించిపోవును. పురుషులుగాని, స్త్రీలుగాని యీ వ్రతమును ప్రతి సంవత్సరము మూడేసి మాసముల చొప్పున మూడు సంవత్సరములనుష్ఠించినచో నా దేవుడు గొప్ప ఫలమునిచ్చును. మూడు మాసములుగా మూడు సంవత్సరములీ వ్రతాచరణము చేయువారి మూడు విధములైన పాతకముల నుండి, సూర్య భగవవానుని మూడు నామములు వారిని ముక్తులను జేయును. భాస్కరారాధన విషయమై శ్రేష్టములు, సర్వ పాపప్రశమనములగుటం జేసి ఈ వ్రత విధానములన్నియును నీకుఁజెప్పబడినవి". సత్రాజితుడిట్లనెను. “మునీశ్వరా! రెండవ మాసమున (సంవత్సరమున) బ్రాహ్మణులలో నెట్టి వానికి భక్తితో దానము లాదిగ చేయవలెనో నాకు వివరించి చెప్పుడు”. పరావసుముని యిట్లు చెప్పసాగెను “పురాణముల జ్ఞానముగల విద్వాంసునకు వస్త్రముల జత యీయవలెను. పూర్వ మరుణుడడిగినప్పుడు స్వయముగ సూర్య భగవానుడే చెప్పిన విషయము వినుము.
తా॥ ఉదయాద్రి నధిరోహించిన తిమిరాపహుడైన భాస్కరునకు శిరసు వంచి నమస్కరించి అరుణుడిట్లనెను. దేవో! పుష్పాది పూజా ద్రవ్యములలో తమకు మిక్కిలి ప్రియమైనవేవి? ఎల్లప్పుడును మి పూజలో వినియోగింపదగిన వస్తువులేవి? గ్రహణాది పర్వకాలములందు బ్రాహ్మణులకీయదగిన వస్త్రాది దానములెవ్వి?” అనూరుని ప్రశ్నలు విని భాస్కరదేవుడిట్లనెను "పువ్వులలో గన్నేరు పువ్వులు, చందనములలో ఎట్టి చందనము, ధూపములలో గుగ్గిలము, నైవేద్యములలో లడ్డువములు, నాకు ప్రియమైనవి. పూజకులలో భోజకుడు, దీపములలో నేతి దీపము, దానములలో వాచకునికిచ్చు దానము నాకిష్టము. నన్నుద్దేశించి మానవులు చేయుదానములలో నొక్కువ ప్రీతి కలిగించునది పురాణ వాచకున తీయబడుదానమే. వాచకుడన నితిహాస పురాణాదులను చక్కగా నేజింగియున్న బ్రాహ్మణోత్తముడు, నా ప్రీతి కొఱకతనిని పూజింపవలెను. ఈ వ్రతానుష్టానమున బ్రాహ్మణుని పూజించినచో నన్ను పూజించినయట్లే సందేహములేదు, ఏలయన నాతడేల్లప్పుడు నా కిష్టమైన వాడు. వేద ఘోషలు, వీణా మృదంగాది వాద్యమధురిమలు, సుగంధ విలేపనములు కూడ ఇతిహాస పురాణముల ప్రవచనములు కలిగించునంత ప్రీతిని నాకు కలిగింపజాలవు. అవి వాచకులు చెప్పుచుండ వినినప్పుడు నాకు మిక్కిలి యానందము కలుగుచుండును. కావున నాకు వాచకుడన్నను, పూజకులలో భోజకుడన్నను మిక్కిలి యిష్టము.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్యమున, సప్తమీ కల్పమునందు సత్రాజితోపాఖ్యానమున రవి పూజావిధి వర్ణనమను నూట పదునాఱవ అధ్యాయము సమాప్తము.
