భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

89. ఆదిత్యవార కల్పమున ఆదిత్యాభిముఖ విధి వర్ణనము

 తా॥  బ్రహ్మదేవుడిట్లనెను. “మాఘమాస కృష్ణపక్ష సప్తమీ ఆదిత్యాభిముఖ వారమని తెలియవలెను. శ్రేష్ఠమైన ఈ విధిని గుణించి వినుము. పూర్వ దినముననేక భుక్తముచేసి, మరుసటి దినమున ప్రాతఃకాలమున స్నానాదికృత్యములు పూర్తిగావించి, సూర్య భగవానుని పూజచేసి,. సూర్యుడస్తమించువఱకును, మహాశ్వేతను జపించుచు సూర్యాభిముఖముగ నీలిచియుండవలెను. ఫలమును కోరువాడీట్లు చేయవలెను. నాలుగు బారల చక్కని, సన్నని, కణుపులేరి, సమముగను, దృఢముగను ఉన్న ఎట్టి చందనపు స్తంభమును సిద్దము చేసికొని. దానినాశ్రయించియుండి భక్తి పురస్సరముగ సూర్య భగవానుని వైపు చూచుచు, మహాశ్వేత మంత్రమును జపించుచు సూర్యుడస్తమించు వఱకును అటులే యుండవలయును. గంధ పుష్పాది ద్రవ్యములతో సూర్య పూజనము చేసి, బ్రాహ్మణునకు దక్షిణ సమర్పించి, వాజ్నియమముగలవాడై అప్పుడు తాను భుజింపవలెను. సూర్యదేవుని ప్రీత్యర్థమై యీ విధముగ నభిముఖ వార వ్రత విధిని నిర్వర్తించువానియెడ భానుదేవుడు ప్రీతుడై, అతనికి ఆ దేవదేవుడు అభిమతార్ధములనన్నింటి నొసంగును. ధనము, ధాన్యము, సంతానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి మున్నగువానినిచ్చును. కావున నాదినమున దేవేశుని పూజింపవలెను...

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యవార కల్పమునందు ఆదిత్యాభిముఖ వర్ణనమను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.