భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
79. ఆదిత్య మాహాత్మ్య వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. జాంబవతీ సుతుడైన సాంబుడిదంతయు విని మిక్కిలి సంతోషించి, మల నాసక్తికలిగి నారదునిట్లడిగెను-1. “ఆహా! సూర్యుని మాహాత్మ్యమును నా సంతోషమతిశయించునట్లు వర్ణించితిరి. మీ కథనము పూర్తికాక ముందే సూర్యభగవానుని యందు నాలో భక్తి ఉదయించినది-2. మునీశ్వరా! ఇక నాకు రాజ్ఞి, నిక్షుభ, దిండి, పింగలుడు మొదలగు సూర్యపరివార దేవతలందఱిని గూర్చి తెలుపుడు”-3. సాంబుని ఆసక్తిని గమనించి నారదుడిట్లు చెప్పఁదొడగెను. “రాజ్జి, నిక్షుభ అనువారిద్దఱు సూర్యుని భార్యలని లోగడ చెప్పియున్నాను. వారిలో రాజ్ఞయనునామె అకాశమనియు, నిక్షుభయనునామె భూమియనియు నెఱుంగవలెను-4: పుష్యశుద్ధ సప్తమీనాడు సూర్యుడు, ఆకాశము కలిసియుందురు. మాఘబహుళ సప్తమీనాడు సూర్యుడు, భూమితో కలిసియుండును. అనగా నాదినమును సూర్యుడు భూమి సంగమింతురు-5. ఋతుస్నాతమైన భూమి సూర్యుని వలన గర్భము ధరించును. ఆకాశము వర్షర్తువులలో భూతలము పై జలమును ప్రసవించును (వర్షించును)-6. ముల్లోకములలో సంపదలను కలిగించుటకు భూమి పంటలనిచ్చును. సస్యములతో సంతుష్టులై బ్రాహ్మణులు యజ్ఞములొనర్తురు.-7. స్వాహా కారములతో దేవతలను, స్వథాకారములతో పితృదేవతలను పూజింతురు-8. అన్నములను, ఓషదులను ప్రసవించి సుధామృతముల చేత మానవులను, పితరులను, దేవతలను తృప్తిపఱచుచుండుటచే భూమి, నిక్షుభయనబడును-9.ఇక రాజ్జి రెండు రూపములేట్లు ధరించెనో, ఆమె సంతానమెవరో, ఆమె యెవరి సంతానమో ఆ వివరములన్నింటిని చెప్పెదను.
తా॥ బ్రహ్మపుత్రుడు మరీచి మరీచి, పుత్రుడు కశ్యపుడు. అతని పుత్రుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు-11. విరోచనుడు ప్రహ్లాదుని తనయుడు. ఈ విరోచనుని సోదరియే సంజ్ఞాదేవికి తల్లి-12. దితిపుత్రుడైన హిరణ్యకశిపుని మనుమరాలే ఈమె. ఈమె విశ్వకర్మకు పుత్రికయగును. ఆమెను దేవతలు ప్రాహ్లాది యని పిలుతురు-13. సురూపయను పేరుగల మరీచి పుత్రిక అంగిరసుని భార్య. ఈమెయే బృహస్పతికి తల్లి-14. బృహస్పతి సోదరి బ్రహ్మవాదిని ప్రసిద్ధమైనది. వసువులలో నెనిమిదవ వాడగుప్రభాసునకీమె సోదరి బ్రహ్మవాదిని ప్రసిద్ధమైనది. వసువులలో నెనిమిదవ వాడగు ప్రభాసునకీమె భార్యయగును.-15. వీరి సంతానమే శిల్పవిద్యానిపుణుడగు విశ్వకర్మ అతనికే మఱియొక పేరు త్వష్ట అతడే దేవ శిల్పియయ్యెను-16. దేవాచార్యుడయ్యెను. ఇట్టి యీ విశ్వకర్మ కుమార్తె సురేణువుగా ముల్లోకములలో ప్రఖ్యాతిబడ సేను-17. ఆమెయే రాజ్జీ, సంజ్ఞాద్యౌ, త్వాష్టీ, ప్రభాయని పిలువబడుచుండెను. ఆమె ఛాయయే పృథ్వీరూపమగు నిక్షుభ-18. ఆమె భగవంతుడైన సూర్యదేవుని భార్య. రూపయౌవనములతో ప్రకాశించు సాధ్వి, పతివ్రత-19. సూర్యడామెను నరరూపముతో మొదట స్వీకరింపకుండెను, అతనికి తన అతిశయించిన తేజస్సు చేత నామె రూపము, వ్యక్తము కాకుండెను.
తా॥ అనురూపముగ లేని అవయవములందు ఆకర్షణ కలుగదయ్యెను. నిష్పన్నములుకాని అవయవములందలి గోళాకారమును చూచి బ్రహ్మదేవుడు మార్తమైన అండముకలవాడవు కమ్మని సూర్యునకు సూచించేను-21. అందువలన నతడు మార్తాండుడనబడెను. దేవతలందలోను మొదటి వాడగుటచే నాదిత్యుడనబడెను-22. ఇంక నిటు పైన మహాత్ముడైన సూర్యదేవుని సంతానముల గుణించి చెప్పేదను. సంజ్ఞయందతనికి ముగ్గురు బిడ్డలు కలిగిరి-23. భర్త కడకు వెడలుమని తండ్రి మఱల మఱల చెప్పినను వినక, సంజ్ఞ వేయిసంవత్సరములు తండ్రి వద్దనే ఉండేను-24. ఆమె తన స్వీయ రూపమును వదలి ఆడు గుఱ్ఱము రూపమును ధరించి ఉత్తర కురుదేశములకుఁబోయి గడ్డిమేయుచు కాలము గడుపుచుండెను-25. సంజ్ఞమాటననుసరించి ఛాయ, సంజ్ఞరూపమును ధరించి సూర్యుని వద్దకు చేరెను-26. సంజ్ఞారూపమున నున్న ఛాయను సంజ్ఞగానే భావించి సూర్యదేవుడామెయందు ఇద్దలు కుమారులను, ఒక సౌందర్యవతియైన కుమార్తెను కనెను-27. వారిద్దఱు కుమారులును, శ్రుతశ్రవుడు, శ్రుతకర్మ అనువారలు మనువుతో సమానులైయుండిరి-28. శ్రుత శ్రవుడు మునుముందు సావర్ణియను మనువు కాగలిగియుండెను. శ్రుతకర్మను శనైశ్చర గ్రహముగా నెఱుంగవలేను-29, కుమార్తెయగు తపతి అసమాన సౌందర్యరాశియై విలసిల్లెను. సంజ్ఞ తమ బిడ్డల యెడ ప్రేమతో వర్తించి యుండినట్లు-30. ఛాయ, సంజ్ఞ బిడ్డల యెడ వర్తింపకుండెను. దీనిని మనువు సహించెను కాని యముడు సహింపలేక పోయెను.
తా॥ తండ్రి భార్యయగు ఛాయచేత పెక్కు పర్యాయములవమానింపబడి యముడు మిక్కిలి దుఃఖితుడై, కోపముచేతను, కుజ్ఞతనము వలనను, ముందుజరుగబోవు ప్రయోజన బలమువలనను-32. సంజ్ఞారూపముననున్న తల్లిని, పాదమును లేవనెత్తి, తన్నుదునని బెదరించెను. ఆమెయు మిక్కిలి కోపించి అతనినిట్లు శపించెను. “తండ్రిభార్యను, పెద్దదాననైన నన్ను కాలులేపి తన్నుదునని బెదిరించితి కావున నీకాలు నిస్సంశయముగ పడిపోగలదు”. ఈ శాపవాక్కువలన యముడు మిక్కిలి కలఁత పడి మనువుతో గూడి తండ్రి వద్దకుఁబోయి జరిగిన దంతయును నీవేందించేను-35.' తండ్రీ! ఈ యమ్మ తన బిడ్డల పై ప్రేమ జూపునట్లు మాపైఁజూపుటలేదు. తాను పెద్దదియే నావంటి చిన్నవానియెడల నిర్దయగా వర్తింపనిచ్చగించుచున్నది-36. నేను పాదము నెత్తితిని గాని తన్నియుండలేదు. నేనిట్టిపనిని బాల్యచాపల్యము వలననో అజ్ఞానము వలననో చేసితిని. కావున ఆమె క్షమించి యుండవచ్చును-37. ఈ చిన్న తప్పు వలన ఆ తల్లి చేత నేను శపింపబడితిని. మీరనుగ్రహించి ఈ భయంకరమగు శాపభయము నుండి నన్ను, నా కాలిని రక్షింపుడు”-38. యముని వాక్యములు విని సూర్యదేవుడిట్లనెను. “పుత్రా! ధర్మజుడవు, ధర్మశాలివియునైన నిన్ను వివశుని చేసిన ఈ తప్పిదము చిన్నదేమైనను ఇపుడు పెద్ద పరిణామమునకు కారణము కాగలదనుట నిస్సంశయము-39. కాని వత్సా! అందజేశాపములకు పరిహారముండునుకాని తల్లిశాపమునకు గుతియగు వారికి శాపమోక్షములేదు.
సుమంతురువాచ :
తా॥ “నీ మాతృశాపమును వమ్ముచేయుటకు నాకు సాధ్యముకాదు, కాని పితృవాత్సల్యమున కొంతవఱకు నిన్ననుగ్రహింతును-41. కృములు నీకాలి మాంసమును తీసికొని నేలమీదకు వెడలిపోవును. అప్పుడామే శాపవాక్యము నిజమగును. అంతటితో నీవు రక్షింపబడగలవు”-42. సుమంతుముని యిట్లనెను. “సూర్యదేవుడు సంజ్ఞారూపమున నున్న ఛాయతో నిట్లు పలికెను. “నీ కిరువురును సమానులైన పుత్రులేకదా! ఒకరియందు మాత్రమధికమగు ప్రేమ చూపించుచుండుటకేమి కారణము?”-43. నిర్లక్ష్యముగ ఆమె జరిగిన విషయమేదియును సూర్యునితో విన్నవించక మిన్నకుండెను. తనను తాను సమాధానపఱచుకొని సూర్యుడేదో చెప్పుటకన్నట్లు ఆమెవైపు చూచెను-44. అంతలోననే అతడు కోపముతో ఆమెను శపించుటకుద్యుక్తుడయ్యెను. అప్పుడు ఛాయ, తాను సంజ్ఞారూపముననచటకు వచ్చిన వివరములన్నింటిని సూర్యునితో చెప్పెను-45, సూర్యదేవుడామె చెప్పిన విషయములను విని మిక్కిలి క్రుదుడై వెంటనే తన మామయగు విశ్వకర్మకడకు బోయెను. విశ్వకర్మ, సూర్యుని యథావిధిగ పూజించెను. రోషముతో దహించుకొనిపోవుచున్న సూర్యునోదార్చెను-46. ఓదార్చి విశ్వకర్మయిట్లనెను. “అతిమాత్రమైన ప్రకాశముతోనావరింపబడి చూచుటకసాధ్యమైన నీరూపమును చూడ శక్యముగాక సంజ్ఞ, అడవులలోని గడ్డిమైదానములలో (పచ్చిక బయళ్లలో) తిరుగుచున్నది-47. నీరూపము కొఱకు గాఢమైన తపశ్చర్యలో, అడవిలోనున్న పవిత్రచరిత్రయగు నీ భార్యను నీవు నేడు చూడగలవు-48. బ్రహ్మదేవుని వాక్యము ననుసరించి నీ రూపమును సంస్కరించుకొను నుద్దేశము కలదేనీ, జగత్కల్యాణము కొఱకు నీ ఆకృతిని చెక్కీచక్కఁ జేయుదును”-49. విశ్వకర్మ వాక్యములకు సూర్యదేవుడు సంతసించి తన రూపమును చక్కదిద్దుటకనుమతించెను.
తా॥ విశ్వకర్మ సూర్యునిచే ననుజ్ఞాతుడై శాకద్వీపమునందు, తిరుగు యంత్రము సహాయముతో సూర్యుని తేజమును చెక్కడము చేసెను-51. మిక్కిలి నిపుణముగా మోకాళ్ల వఱకు చెక్కిన పిదప లేఖనము సంపన్నము కాకమును పే సూర్యుడు దానిని నివారించెను-52. అప్పుడతని రూపము ప్రకృష్టమైన తేజముతో అత్యంతాకర్షణీయమై ప్రకాశించెను-53. సూర్యదేవుడు యోగదృష్టితో అశ్విని రూపముననున్న తన భార్యను చూచేను. ఏ ప్రాణికీని కనబడకుండ తన తేజస్సుతోనావరింపబడి అడవులలో తిరుగుచున్న ఆమెను సమీపించి అశ్వరూపమున నామెను 'కది సెను'. పర పురుష శంకతో-55. నాతని వీర్యమునా ముక్కరంధ్రములతో వెలిగ్రక్కుటకు ధరించెను. అందుండి దేవవైద్యశ్రేష్ఠులగు అశ్వినీ కుమారులు పుట్టిరి-56. అశ్వినులైన వారిరువురు నాసత్యుడు, దస్రుడు అని పేర్కొనబడిరి. ఆ పిదప తన నిజరూపమును చూపి భాస్కరుడామెనాశ్చర్యపఱచెను. తన భర్తరూపమును చూచి సంజ్ఞ మురిసిపోయి మోహము చెందెను-57. ఫలితముగ నామే సూర్యుని వలన, సూర్యుని తేజస్సుతో సమానమైన తేజస్సుగల రేవంతుడను కుమారునకు జన్మనిచ్చెను-58. పితృపరాధీనము కాదగిన ఆ ఎనిమిదవ గుఱ్ఱము పుట్టుటతోడనే పలాయన మయ్యెను. ఒకసారి అధిరోహించిన గుఱ్ఱము నెవడును విడిచి పెట్టడు-59. ఆ గుఱ్ఱమును, అర్భకమైనను, బలమునుయోగింపక, ఏ హానియు చేయక తనకు తెచ్చి పెట్టుమని సూర్యుడు దండనాయక పింగలులను పార్శ్వవర్తుల నాదేశించెను.
తా॥ సూర్యున కిరుప్రక్కలలో నిలబడియున్న దండనాయక పింగలులు, అశ్వమున నేదేని బలహీనతను, దోషమును వేదుక గోరిరి కాని నేటి వఱకును అతనిలో నట్టి ఛిద్రమును కనుగొనలేకపోయిరి-61. దాట్లువేయుచుఁబోవు రేవంతుడు సంజ్ఞాదేవికి శాంతినిచ్చువాడయ్యేను. 'రే వృప్లవగతౌ ప్లవగతాఅనుధాతువు ననుసరించి, గంతులు వేయుచుఁబోవువాడు గావున నాతడు రేవంతుడనబడెను-62. మనువు, యముడు, యమి, సావర్ణి, శనైశ్చరుడు, తపతి, అశ్వినులు, రేవంతుడు అనువారు సూర్యుని సంతానము-63. ఇట్లు సూర్యుని మొదటి భార్య సంజ్ఞ. రెండవభార్య పార్ధివి (పృథివీ సంబంధి) సంజ్ఞ, రాజ్ఞయనియు, ఛాయ(పార్థివి) నిక్షుభయనియు పిలువబడును-64. 'రాజ' దీప్తా అను ధాతువును బట్టి, సర్వభూతముల కంటే నధికముగ ప్రకాశించువాడు కావున సూర్యుడు రాజనబడును-65. అట్టి విశేష కాంతితో ప్రకాశించు 'రాజైన' సూర్యుని భార్య కావున నామే 'రాజ్ఞయని పిలువబడును-66. 'క్షుభ సంచలనే అను ధాత్వర్థమును బట్టి, చలింపదు (చలించును) గావున భూమికి 'నిక్షుభ' యని పేరు. స్వర్గీయులైన దేవతలు క్షుద్వివర్జితులు. అట్టివారు దివ్యమైన ఛాయను ప్రవేశింతురుగాన ఆమె నిక్షుభ యనబడును-67. మిక్కిలిగా పీడింపబడు మనస్సులు గల జనమును చూచి యా జనమును ధర్మముతో రంజింపజేసినందువలన యముడు ధర్మరాజుగ పేర్కొనబడెను-68. మిక్కిలి తేజస్వియై తన శుద్ధమైన, శుభప్రదమైన కర్మచేత, పితృదేవతల కాధిపత్యమును, లోకపాలత్వమును అతడు పొందగలిగెను-69. ఈ మనువిప్పుడు (తన) లోకముననుండును. శంఖచక్రగదాధరుడగు విష్ణువతని వంశముననే పుట్టియుండెను.
తా॥ యముని సోదరియగు 'యమి' యను కీర్తిశాలిని నదులలో శ్రేష్ఠమైన యమునా నదియై లోకపావని యయ్యెను-71. సావరియను సూర్యతనయుడు ఎనిమిదవ మనువే కీర్తి గడించేను-72. అతడీనాటికి గూడ మేరు పర్వత మూలమున నుండి దివ్యముగ తపమాచరించుచున్నాడు. అతని సోదరుడగు శనైశ్చరుడు గ్రహత్వమును పొందెను-73. తపతి యను పేరంబరగు సూర్యుని పెద్ద కుమార్తె సంవరణుడను రాజుకు భార్యయయ్యెను-74. వింధ్య పర్వతము మూలమునుండి ప్రవహించు తాపి యనునది ఈమెయే, ఈ నది స్నానార్ధ మగు పవిత్ర జలములతో ప్రవహించుచు పశ్చిమ సముద్రమున గలయును-75. సర్వపాపములను భయములను తొలగించునట్టి ఈ నది, యమున గంగయందువలే, సౌమ్యానదిలో సంగమించును-76. రాజా! అశ్వినీ కుమారులు దేవ వైద్యులైరి. ఈ లోకమునందలి వైద్యులందలు వారి వృత్తి ననుసరించియే ఎప్పటికి జీవించుచుందురు-77. రేవంతుడనువాడు సూర్యునితో సమానమైన రూపముగలవాడు. అతడు తన తండ్రియగు సూర్యభగవానునిచే అశ్వాధిపతిగ నియుక్తు డయ్యెను. మార్గమున పయనించుంచుండువాడతనిని పూజించినచో క్షేమముగా తన గమ్యము చేరును. మానవులకెల్లప్పుడాతడు సుఖము నిచ్చుచుండును-79. మార్తాండుని ఆజ్ఞ చేత త్వష్ట కూడ సూర్యునారాధించు కొఱకు అతని తేజస్సుతో భోజులను సృష్టించెను-80. ఈ సూర్య జన్మ ప్రకారము, మిక్కిలి తేజోవంతులైన అతని బిడ్డల గుంచికాని, చదివిన వాడు వినినవాడు-81. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. తిరిగి భూలోకమునకు వచ్చి రాజగును. సంశయము లేదు.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్య మాహాత్మ్య వర్ణనమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
