భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
14. స్త్రీ ధర్మములందు సపత్నీకర్తవ్యము
బ్రహ్మయిట్లనెను :
తా ॥ భర్త పరదేశమునకు వెడలియుండిన సమయములందు స్త్రీకి సువాసినీత్వ సూచక మాత్రపరిమితమైన అలంకరణము, మంగళసూత్రాది మాత్రమైన భూషణాదులుండవలెను. అతనిచే ప్రారంభింపబడిన కార్యము సఫలమగునట్లు కృషి చేయవలెను. దేహాలంకారాదులు లేకుండ నుండవలెను. అత్తగారు, దాది మొదలగు పెద్దవారి సమీపమున పరుండవలెను. ధనార్జనకు సంబంధించిన వ్యవహారములను యథాతథముగా కొనసాగింపుచు వ్యయమును తగ్గింపవలేను. వ్రతములు, ఉపవాసములు మొదలగు వానియందు తత్పరత్వము కలిగి ఆయా దీక్షలలో వర్తించు విధానముల నన్వేషించి తెలిసికొనవలెను. వానిని పాటింపుచుండవలెను. తన భర్త క్షేమము గుఱించి దైవజ్ఞులను ప్రశ్నింపుచు అతని శీఘ్రగమనము గుఱించి ఆయా దేవతలకు మొక్కుబడులు, పూజలు చెల్లింపుచుండవలెను. నిత్యమును అతని రాకకై కోరుచు;అతని క్షేమము కొఱకు దైవమును పూజింపుచుండవలెను. ఎప్పుడును విలువగల వస్త్రాభరణాదులతో ఉజ్జ్వలవేషమును ధరింపకూడదు. సుగంధ తైలములు మొదలగునవి వాడకూడదు. తన బంధుజనుల (జ్ఞానుల) ఇండ్లకు పోకూడదు. ఒకవేళ ఆవశ్యకమైనచో అత్త, మామ మొదలగు పెద్దవారీ ఆజ్ఞతో, భర్త కాపులైనవారితో కలిసి పోవలేను. పోయినను అచ్చట ఎక్కువ సేపు ఉండకూడదు. అచట స్నానాదులు చేయకూడదు. అవసరమైన క్షణము మాత్రమే ఉండి ఆ వెంటనే ఇంటికి తిరిగి రావలెను. భర్త వచ్చిన పిదప స్వాభావికముగనే ఉండి తత్కాలవిధులు నిర్వర్తింపవలెను. ప్రవాసమును విడిచి స్వగృహమునకు వచ్చిన భర్త, హితమైన రీతిగా స్నాన భోజనాదులు ముగించిన పిమ్మట. తనను తాను చక్కగా అలంకరించుకొని, సంతోషముతో భర్త వద్దకు పోయి, అతఃపూర్వము తాను దేవునికి సమర్పించియున్న ఉపాయనములను, ప్రసాదములను భర్త కీయవలెను. భర్త పరివారములోని పెద్ద అమ్మాయి యెడల తాను చిన్నమ్మగా ప్రవర్తింపవలెను. ఆమె సంతానమును తన సంతానముగా చూడవలేను. ఆమె బంధువర్గమును తన బంధువర్గముగానే భావింపవలెను. భర్త యెదుట తాను ఆసనమున నుండరాదు. అతనిని పిలుచుట కూడదు. అన్ని పనులయందును అతని అభిప్రాయము ననుసరించియే ప్రవర్తింపవలెను.
తా ॥ భర్తకు అహితులైన వారితో మాట్లాడకూడదు. అతని హితులతో సఖ్యము చేయవలెను. భర్తకు మిక్కిలి ఆహులైన వారిని ఎప్పుడును గౌరవింపవలెను. తన తల్లిదండ్రుల నుండి కొని వచ్చిన బంగారము (ధనము) మాణిక్యములు మొదలగు వానిని ప్రేమతో భర్తకీయవలెను. అప్పుడే దానికి తగిన ప్రయోజనము చేకూరును. అతడుకూడ ఆ ద్రవ్యమును స్వీకరించి ఆమె ప్రీతి కొఱకు స్వల్పమూల్యము గల ఏదేని పారితోషికమును ప్రతిఫలముగా ఆమేకీయవలెను. అస్థిరమైన సొమ్మును జాగరూకతతో దాచి పెట్టి తిరిగి ఆమెకు కానుకగా నిచ్చుటకే వినియోగింపవలెను. ఆమె సంతోషము కొఱకు తీసికొనబడిన ఆ సొమ్మును, తాను స్వీకరించినందువలన తనకు కలిగిన లజ్జాదుల నివర్తించుటకు, ఏదేని ఒక విశేష ప్రస్తావనతో తిరిగి ఆమెకే చెందింపవలెను. స్త్రీలకు సవతులుండుటయనునది ఈర్ష్యాద్వేషములకు కారణమగుచున్నది. అందువలన భర్తయనువాడు ఉదారముగా వ్యవహరించుచు సపత్నులలోని మచ్చరమును మాన్పవలేను. భర్తతో తాను గడుపవలసిన క్రమప్రాప్తమైన దినమందు, వస్తమాల్యగంధాదులతో చక్కగా అలంకరించుకొని, అంతకుముందున్న నియమమును విడిచి, సిగ్గునొందిన దానివలె భర్త వద్దకు పోవలయును. పోయి ఏకాంతమునందు, తత్కాలోచితమైన సంభ్రమములు చేతను, అతని అభిరుచిననుసరించిన ఆయా క్రియా కలాపముల చేతను విషేషముగా భర్తను ఆనందపఱచవలెను. కొంత సమయమునకు బాహ్యస్మృతినొంది పెద్ద సవతి వసతికి పోవలెను. తానాదినమున భర్తతో నుండుటకై పెద్దసవతికి ప్రాతికూల్యము లేకుండుటయు, ఆమెకు (పెద్దభార్యకు) భర్తతో నుండుటకన్న నితరమైన ఏదో కార్యమునందాసక్తి ఉండుటయును, గమనించి మెల్లగా అచటినుండి విడివడి తిరిగి భర్తను చేరి అతనిని వశీకరించుకొనవలెను. బాహిరములైన శృంగార చేష్టలు పరిపక్వతను గూర్పగా ఏకాంతగతములైన ఆరువదినాలుగు కళలతో (లేక అగణ్యమైన ప్రక్రియలతో ) పెద్దభార్య నతిశయించినదానివలె భర్తను రంజింపచేయవలెను.
తా ॥ భర్తతో ఏకాంతమందున్నప్పుడు శృంగార చేషామయత్వము, జనమధ్యమునున్నప్పుడు మిక్కిలి సిగ్గుతో కూడియుండుట స్త్రీలకు యోగ్యతలు. భర్త చిత్తముననుసరించి ప్రవర్తించుచుండుట, అతని సేవించుచుండుట వారికి శ్రేష్టము. ఈ విధముగ భర్తనారాధించి క్రమక్రమముగా గృహాధిపత్యమును చేజిక్కించుకొనియు, తన కంటే ముందు వచ్చిన పెద్ద భార్యలయందలి గౌరవ ప్రతిపత్తులను ఏ మాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. ఇంటి వ్యవహారముల గుఱించి, దాన వ్యయాదుల గుఱించి భర్తకు రహస్యముగా నివేదింపవలెను. ముందుగా భార్యయైన బలముచేత పెద్దభార్యయే చిన్న భార్యపై అయిష్టముగానైనను పెత్తనము వహించియుండవలెను. భర్త, చిన్న భార్య వైపే ఆకర్షితుడగుచున్న విషయము గ్రహించి, తనకు భర్తృసుఖము నుండి విశ్రాంతి కావలెనని' చిన్న భార్యను కోరుచు. ఆమె పై పుత్రికా వాత్సల్యభావముతో పెత్తనపుటధికారము కలిగియుండవలెను. పతి అభిప్రాయమును గమనించి, తన గౌరవము నిలుపుకొనుచు అతనికి తాను చేసిన ఆనుకూల్యమును గుంచి సమాధానపడవలెను. యజమాని అభిప్రాయమొకటైయుండగా భృత్యులు దానికి విరుద్ధముగ నెట్లు వర్తింతురు? పరతంత్రుడైన మూఢాత్ముడు ఇట్టితటీ వ్యర్థముగా క్లేశము పొందును. అందువలన అన్ని అవస్థలయందును, మనోవాక్కాయ కర్మలచేత యజమాని ఆనుకూల్యముననుసరించి యుండుటయే సేవకులకు హితమైనది. స్త్రీల విషయమున ఇది ఇంకను ప్రధానమైనది. పెద్దభార్య, భర్తను, గృహతంత్రమును ఎప్పుడును కని పెట్టియుండి గుణములను సమకూర్చుకొని, ధీరురాలై తన పెద్దఱికమును విస్మరింపక నుండవలెను. ఐశ్వర్యమదమునకు లోను కాకూడదు. గర్వవికారమును పొందరాదు. కిరాతులవలని భయము నుండి యన్నట్లుగా పూర్తిగా భర్తఆజ్ఞకు లోబడియే నడుచుకొనవలెను. యోగ్యతచేత తమ భర్తయందు ఎట్లెట్లు భాగ్యము పెరుగుచుండునో అట్లట్లు స్త్రీలకు తమ కుటుంబము నాశ్రయించియుండు వారందజి పైన ప్రేమాదరములు క్రమాభివృద్ధినందవలెను. స్త్రీ ఈ విధముగ భర్తనారాధింపుచు, ఆయా కార్యములను కడుజాగరుకతతో నిర్వర్తించుచు, పూజ్యులను పూజించుచు, సేవకులను చక్కగా పోషించుచు. సద్గుణములను గూర్చుకొనుచు, వానిని తన సౌశీల్యమువలె రక్షించుకొనుచు నుండెనేని ఇహ పరములయందును అత్యుత్తమమైన సౌఖ్యమును తప్పక అనుభవించును.
శతార్థ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మములయందు ఇది సపత్నీ కర్తవ్య వర్ణనమను పదునాల్గవ అధ్యాయము.
