భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

110. సప్తమీ కల్పమున అనంతర సప్తమీ వ్రత వర్ణనము

తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “భాద్రపదమాస శుక్ల పక్ష సప్తమీ దినమున సప్తాశ్వుడైన సూర్యభగవానునికి శిరసు వంచి నమస్కరించి యతనిని, పుష్పధూపాదులచేత బ్రాహ్మణుల సంతర్పణలచేత పూజింపవలెను. పాషండులు (వేదబాహ్యులు) మున్నగు వారితో సంభాషింపరాదు. నియమవంతుడై యుండవలెను. బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి, రాత్రిభోజనము చేయవలెను. నిలుచుండినను, నడచుచున్నను, తుమ్మినను, తొట్రుపడినను, ఏదిచేసినను ఆదిత్యనామమునే ఉచ్చరించుచుండవలెను. ఈ విధానముగ పన్నెండు మాసములు క్రమమున్. ఉపవాస పారణములు పూర్తిగావించి. జగద్గురువగు సూర్యభగవానునర్చించి యతని ప్రీతి కొఱకు పుణ్యకథాశ్రవణమును జరిపించినచో వ్రతము పుష్టినందును. సూర్యభగవానునర్చించినచో గలిగెడి ఫలమే యతని కథాశ్రవణముల వలన కలుగును. ఇట్లు శుచిర్భూతుడై సూర్యదేవునారాధించు పురుషుడు ఇహలోకమున విపులమైన భోగములను, అక్షయమైన ధర్మార్థములను పొంది. పరమున గీత వాద్యాదులతో సుఖమయమైన స్వర్గమునొందును. స్త్రీయైనను ఈవ్రతోపవాసములాచరించి స్వర్గమున ననంత ఫలమును పొందును .

శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు అనంతసప్తమీ వ్రత వర్ణనమను నూటపదవ అధ్యాయము సమాప్తము.