భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

86. ఆదిత్య వార కల్పమున జయవార తిథి వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లునుడివెను. “ఆదిత్యవారమునాడు ఐదు తారలు గల నక్షత్రము (రోహిణి, పునర్వసు, మఘ, హస్త, విశాఖ) మూలసంభవించెనేని అది 'పుత్రద' వారమనబడును. ఆ దినమున ఉపవాసము చేసి శ్రాద్ధము పెట్టవలెను. మధ్యమ పిండమును భుజింపవలెను. భక్తి శ్రద్దలతో, ఉపవాసముచేసి, ధూపమాల్యోపహారములు, దివ్యమైన సుగంధములతో సూర్యుని పూజించువాడు. పూజించి, రాత్రి సమయమున నా దేవుని ముందు, మహాశ్వేతను జపించుచు భూమి పైపరుండి. ఉదయముననే మేల్కొని, స్నానమాచరించి, రక్తచందనము, గన్నేరు పూలతో కలిపిన జలముతో అర్ఘ్యప్రదానము చేసి. గ్రహేశ్వరుడైన సూర్యదేవుని పూజించి, అటుపిమ్మట శ్రాద్ధకర్మనాచరించువాడు సంతానమును పొందును. ఈ శ్రాద్ధమున నైదురుగు బ్రాహ్మణులు భోక్తలుగ నుండువలేను. 'మఘ' సంజ్ఞులిరువురు దివ్యులు: భీమ సంజ్ఞలు మువ్వురు భౌములుగా నిర్ణయింపవలెను. ఇట్లు సూర్యదేవునకు ప్రియమైన యీ శ్రాద్దమును పార్వణ విధానముగ జరుపవలెను. శ్రాద్దము సమాప్తమైన పిమ్మట మధ్యమ పిండము సూర్యుని యెదుటనునిలిచి, తాను కూడ నా దేవుని యెదుట నిలిచి ఈ క్రింది మంత్రముతో నా పిండమునభిమంత్రింపవలెను. “ఓ సూర్య భగవానుడా! నీ కెల్లప్పుడు నిష్టమగు నీ పిండమును, నీ సమక్షమున నేను తినుచున్నాను. ఫలితముగ నాకు సంతానము కలుగును. నీ అనుగ్రహమున ఈ వాంఛిత ఫలము కలుగునని నా మనస్సు భావించినది”. ఇట్లు సూర్యుని పూజించి నడిమి పిండమును భుజించిన యెడల నా గ్రహరాజు పుత్రునిచ్చును. అందువలన నిది సూర్యదేవుని 'పుత్రద వారము'గ నెన్నబడును. ఇట్లు భాస్కర పూజనమాచరించి. ఉపవాసపరుడై పార్వణ శ్రాద్ధము పూర్తిచేసి, మధ్యమ పిండప్రాశనము చేయువాడు పుత్రుని పొందును. ధనము, బంగారము, ఆరోగ్యము, సుఖప్రదమైన జీవితము పొంది, సూర్యలోకమునకుఁబోయి, ఆ పిదప భూలోకమున చక్రవర్తియగును. తేజస్సుచేత సూర్యునితో సమానుడై, కాంతిచేత చంద్ర సన్నిభుడై, పరాక్రమమున భాస్కరతుల్యుడై (లేక విష్ణుతుల్యుడై) గాంభీర్యమున సముద్రుని వంటివాడై వెలుగొందును.

 తా॥ దక్షిణాయనము నందగు నాదిత్యవారము జయవారమని చెప్పబడును, సూర్యదేవుని ప్రీతికొఱకానాడు చేసెడి ఉపవాస నక్తవ్రతములు, స్నానదానజపములు నూఱురెట్లు ఫలప్రదములగును నూడు రెట్లుధిక ఫలదమగుటచే నక్తాదిగచేయవలెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, ఆదిత్యవార కల్పమునందు జయవార తిథి వర్ణనమను ఎనుబది యాఱవ అధ్యాయము సమాప్తము.