భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

73. సాంబకృత సూర్యారాధన వర్ణనము

తా॥ బ్రహ్మ మాననసపుత్రడు, త్రిలోక ప్రసిద్ధుడు, సర్వ లోకములందు సంచరించుచుండువాడు, ఎప్పుడును తిరుగుచుండు వాడునైన నారద మహర్షి తఱచుగా శ్రీ కృష్ణదర్శనార్థమై ద్వారకకు వచ్చుచుండును-1, 2. గంభీరుడైన ఆమునిసత్తముడు కొందఱు ఋషులతోగూడి ద్వారకా పట్టణమునకీ సమయమున నేతెంచెను. ఆయన రాకతో యదుకుమారులందఱు-3. ప్రద్యుమ్నుడు మొదలగువారు వినయముతో వినమ్రులై ఆయనకు అభివాదముచేసి, అర్ఘ్య పాద్యాదులతో ఆ ఋషివర్యుని పూజించిరి-4, సాంబుడు మాత్రము, అవశ్యముగా ననుభవింపబోవు శాపకారణమున నేమో మహాత్ముడైన నారదుని కూడ అవమానింపదొడగెను-5. తాను సుందరుడనని, యావనవంతుడననీ అహంకరించి, క్రీడాసక్తుడై నిత్యము కన్నుమిన్నుగానక తీరుగుచుండెను. అవినీతుడైన సాంబుని వైఖరి గమనించి నారదుడాలోచనలోఁబడెను-6. “అవినీతుడైన ఈ సాంబుని వినయశీలిగ మార్చివేసెదను”. అని నిశ్చయించుకొని శ్రీ కృష్ణునితో నిట్లనెను-7. “ఓ కృష్ణా! ఈ పదహారు వేల మంది స్త్రీలందఱికిని సాంబునియందు ఒక ప్రత్యేక భావముకలదు-8. ఇతడు చరాచర ప్రపంచమంతటిలోను రూప సౌందర్యమున సాటిలేనివాడు. ఈ స్త్రీలందు ఎల్లవేళల నాతని దర్శనము న పేక్షించుచుందురు”-9. నారదుని ఈ వాక్యము విని శ్రీ కృష్ణుడిల్లాలోచించెను. “నారదుడు చెప్పిన ఈ విషయమును బట్టి స్త్రీలందఱు సాంబుని చూచుట కపేక్షించుచుండుటలో వేణు కారణమేమి కలదు?

తా॥ స్త్రీలలో చాపల్యముండునని లోకమున వినబడుచున్నది. స్త్రీ మనస్తత్వము నెఱిగిన మేధావులు పూర్వమి శ్లోకములను చేప్పిరి. “చపల చిత్తమువలన, అంకు తనపు లక్షణము కలిగియుండుట వలన స్వభావముచే వీరిని విశ్వసింపరాదు. వీరు అన్ని వేళల రక్షింపబడుచుండియు భర్తల యెడ వికృత ప్రవర్తన కలిగియుందురు-12, వీరు రూపమును పరీక్షింపరు. వయస్సును నిశ్చయింపరు. సుందరరూపుడో వికారరూపుడో పురుషుడైనచో చాలును. వానితో భోగింతురు”-13. సుమంతుముని యిట్లనెను. “శ్రీకృష్ణుడు మనస్సుననిట్లు చింతింపుచు నారదునితో నిట్లనెను. “నారదా! నీవు చెప్పిన మాటను విశ్వసింప జాలకున్నాను”-14. శ్రీ కృష్ణుని యీ మాటలు విని నారదుడు, “కృష్ణా నీవు విశ్వసించునట్లు నీకు తార్కాణము చూ పెదను' అని చెప్పి-15 ఎట్లు వచ్చెనో అట్లు స్వర్గమునకు వెడలిపోయెను. మఱల కొన్ని దినములకు ద్వారకకు వచ్చెను-16. ఆ దినమున కృష్ణుడు అంతః పురస్త్రీలతో జలక్రీడలాడి, రైవత కోద్యానమున పానము సేవించుచు నేకాంతమున నుండెను-17. వివిధ వృక్షములతో శోభించుచు, ఎప్పుడును పూ సెడి సర్వ ఋతువుల పుష్పములతో విలసిల్లుచు, వాని పరిమళములతో గుబాళించుచు-18. అనేక విధములైన వికసించిన తామరలతో, డిగ్గియలతో శోభించుచు, హంసలు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు మున్నగువానితో నలరుచు-19. ఆహ్లాదకరముగనున్న ఆ ఉద్యానవనమునందు శ్రీ కృష్ణుడు, మణి హారములు, అందియలు, కేయూరములు, మెలనూళ్లు మొదలగు నాభరణములతో నలంకరింపబడి యున్న స్త్రీలతో క్రీడించుచుండెను.

తా॥ భూషణములతో నలంకరించుకొని యున్న సుందరాంగులతో - ముఖ్యముగ నతిశయించిన సౌందర్యముగల జవ్వనులతో గూడి మంచి పరిమళముగల శ్రేష్ఠమైన మద్యమును సేవించుచుండెను-21. అంత కొంత తడవైన పిమ్మట నా స్త్రీలు మద్యపానము మత్తు నుండి ఇంచుక తేరుకొనిరి. ఆ సమయమున నారదుడు సాంబునితో “సాంబా! లెమ్ము! మా తండ్రి గారు నిన్ను రమ్మని పిలిచినారు. త్వరగా పొమ్ము. ఇక్కడ జాగు సేయుచునుండుట నీకు తగదు”. అనెను. సాంబుడు నారదుని వాక్యములలోని యంతరార్థము నెఱుంగ జాలక నాతని ప్రేరణతో శ్రీ కృష్ణుడు స్త్రీలతో క్రీడించుచున్న ఉద్యానవనమునకుఁబోయి, కృష్ణునకు సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రేమాస్పదుడైన తండ్రికినట్లు ప్రణమిల్లిన సాంబుని -24 సుందరుడైన సాంబుని ఆ స్త్రీలందఱు ఇంచుక పులకరించుచు తిలకించి చలించిపోయిరి-25. అంతః పురస్త్రీలిట్లు సుందర పురుషుని జూచి కలత చెందుటను శ్రీ కృష్ణుడు లోగడ చూచియుండలేదు. మద్యపానపు మత్తువలన కలిగిన స్మృతి లోపమువలన నా స్త్రీలటు సాంబుని గగుర్పాటుతో చూచిరి-26. స్వాభావికముగ నిగ్రహశక్తి లేని స్త్రీల జఘన భాగములు ఇట్టిత ద్రవించును. ఈ సందర్భముగ పురాణ ప్రసిద్ధమగు శ్లోకమొకటి వినబడుచుండెను-27. దాని భావమిది, బ్రహ్మ చర్యమునందుండు స్త్రీలైనను, సాధ్వీమణులైనను అందగాడైన పురుషుని. జూచినంతనే స్త్రీలకు. యోని ఆర్టమగును-28. మద్యపానము నతిమాత్రముగా జేసిన స్త్రీల విషయముననిది లోకమున కన్నట్టుచునే యున్నది. ఇట్టి సందర్భములందు సిగ్గుగల స్త్రీలు కూడ నిశ్శంకగ సిగ్గువిడిచి ప్రవర్తింతురు-29. మాంసములతోడను, నూనెలతోడను వండిన భోజనములు చేయుటచేత, చేటుకుకల్లు, మద్యము, ఆసవము మున్నగునవి సేవించుటచేత, సుగంధ పరిమళములచేత, అందమైన వస్త్రములు ధరించుట చేతను స్త్రీలలో కామము విజృంభించును-30.

తా॥ బుద్ధిమంతుడైన పురుషుడు మంచివాడుగ నుండగోరెనేని మదిరతోగూడిన కల్లు మొదలగు మత్తు పానీయములను అతి మాత్రముగ సేవింపకూడదు-31. నారదుడు సాంబుని పంపి అతని వెన్నంటియే సత్వర మచటికేతెంచెను-32. దేవర్షియైన నారదుని రాకను చూచి మద విహ్వలురైన స్త్రీలందఱును వెంటనే లేచి నిలబడిరి-33. వారట్లు లేచి నిలబడగానే శ్రీ కృష్ణుడు చూచుచుండగనే వారు ధరించియుండిన శుభ్రములగు వస్త్రములు ఊడిపోయి క్రిందనున్న చెట్ల యాకుల పై పడిపోయెను-34. కృష్ణుడది చూచి మిక్కిలి కోపముతో వారి నందజీని శపించెను. “ఓ కాంతలారా! మీ మనస్సులన్నియు నన్ను విడిచి ఎటకోపోయినవి కావున-35. అంత్యకాలమునందు మీరు భర్తలోకములను పొందకుండెదరుగాక. భర్త లోక పరిభ్రష్టులగుటయేగాక స్వర్గ మార్గమునుండియు భ్రష్టత పొంది-36. శరణ్యములేనివారై దొంగల చేతులలో పడిపోవుదురుగాక" అని శాపమిచ్చెను-37. సుమంతుముని యిట్లనెను. “ఆ శాప దోష కారణమువలన ఆ స్త్రీలందఱు శ్రీ కృష్ణుని నిర్యాణము పిదప, అర్జునుడు నిస్సహాయముగ చూచుచుండగనే పంచనద ప్రాంతీయులైన బందిపోటు దొంగలచే నపహరింపబడిరి. అల్ప న్నిగ్రహులైన కొందఱు స్త్రీలు దూషింపబడిరి-38. రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఆ దొంగల చేతబడకుండిరి. వారు తమ సత్వముచే రక్షింపబడిరి- 39. ఆ స్త్రీలను శపించిన పిమ్మట శ్రీ కృష్ణుడు సాంబుని కూడ శపించెను. "సాంబా మిక్కిలి ఆకర్షణీయమగు నీ రూపమును చూచి ఈ స్త్రీ లందు క్షోభపడిరిగావున-40. నీవు కుష్ఠ రోగమును పొందుము”. కృష్ణుని యీ శాప వాక్యమును వీని సాంబుడు-41. నవ్వుచు, దుర్వాసుడు తనకిచ్చిన శాపమును గుర్తు చేసికొని యిట్లనెను. "తండ్రీ! ఈ స్త్రీల యెడ నే విధమైన దుష్ట భావములేని నేను అకారణముగ నీచేనిట్లు శపింపబడితిని. కాని ఈ నీ శాపము నన్నంటదు. ఏలయన నీ శాపమే నన్నంటినచో క్రోధముతో శపించి యుండిన ఆ దుర్వాసుని శాపము వ్యర్థమగును కదా!

తాII సుమంతుముని యిట్లనెను. “జాంబవతీ కుమారుడైన సాంబుడిట్ల నిమిత్తముగ తండ్రిచే శపింపబడీ కుష్ఠు రోగిత్వమును, కురూపిత్వమును పొందెను-43. సాంబుడు మఱల నొకతూరి దుర్వాసుని శాపమునకు గురియయ్యెను. ఈ శాపమువలన ముసలము పుట్టి కుల నాశనమయ్యెను-44. అవినయ దోషమువలన సాంబునికి కలిగిన దురవస్థలను వినిన మీదట గురువులను, దేవతలను, బ్రాహ్మణులను ఎల్లవేళల పూజ్య భావముతో గౌరవింపవలెనని తెలిసికొనవలెను-45. అందఱకుని ప్రీతి కలుగునట్లు ఎప్పుడును ప్రియ వాక్యమునే మాట్లాడవలెను. ఈ విషయమున పూర్వము బ్రహ్మ దేవునిచే చెప్పబడిన శ్లోకద్వయమును నీవు వినియుండలేదా? బ్రహ్మ దేవుని వలన వినివానినే శంకరుడు కూడ చెప్పియుండెను-46. “ధర్మశీలుడు, స్వాభిమానమును కోపమును జయించినవాడు, విద్యచేత పవిత్రుడు, వినమ్రుడు, ఇతరులను బాధిపంనివాడు, తన భార్యతో మాత్రము తృప్తి పడువాడు, పరస్త్రీలకు దూరముగ నుండువాడునైన సత్పురుషునకు లోకమున కొంచెమైనను భయముండదు-47. “ఒక తీయని మాట మనుష్యుని సంతోషపచినట్లు, . చల్లని నీరుగానీ, చందన ద్రవముగాని, చల్లని నీడగాని సంతోషపటుపజాలవు”-48. శాపతిరస్కృతుడైన సాంబుడు సూర్యదేవుని చక్కగా ఆరాధించి సంపూర్ణారోగ్యమును, పూర్వ రూపమును తిరిగి పొందెను-49. కృష్ణ నందనుడైన సాంబుడు సూర్యునివలన ఆరోగ్యమును, రూపమును పొంది, భక్తితో తన పేరనోక సూర్య మందిరముగల పట్టణమును నిర్మించేను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమి కల్పమునందు సాంబకృత సూర్యారాధన వర్ణనమను డెబ్బది మూడవ అధ్యాయము సమాప్తము.