భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
11. గృహధర్మ వర్ణనము
తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను. మనోవాక్కాయ కర్మలచేత తన భర్తను దైవముగా చూచెడి స్త్రీ, అతని శరీరములోని అర్థభాగము వలె నగుచు ఎల్లప్పుడును మేలు చేయుచుండును. ఎప్పడును తన భర్త కిష్టమైన దానిని తనకుకూడ ఇష్టమైనదానిగను, అతనిచే ద్వేషింపబడుదానిని తనకు కూడ ద్వేషింపతగినదిగను చూడవలెను. దీని వలన అతని, అధర్మముతోడను అనర్థకములతోడను కూడిన పనుల నుండి ఏర్పడు అయుక్తమైన చర్య నివారింపబడును. అతనికి ప్రియమైనది, హితమైనది, ఏదియో తెలిసికొని, అతనికీ సరియైనదేదియో గుర్తించి, సేవకులందజీయెడను ప్రమాదపడక ప్రవర్తింపవలేను. దేవ పితృకర్మలయందును, భర్తయొక్క స్నానభోజనాదులయందును, అభ్యాగతులకు చేసెడు సత్కారమునందును ఉచితమైన రీతిని ప్రవర్తింపకుండనుండరాదు. ఇల్లాండ్ర శరీరము, ఇల్లు, తాను అని రెండు భాగములు చేయబడినది. అందు మొదటిదైన యింటినీ, తరువాతిదియైన తన శరీరము కంటే ముందు సంస్కరింపవలెను. ఇంటిని చక్కగా శుభ్రపఱచి, దినమున మూడు పర్యాయములు అందముగ నలంకరించి, ఆ పిదప కుటుంబ జీవనమునకు సంబంధించిన పనులను వస్తువులను ఉచితమైన రీతిగా చక్కబెట్టవలెను. ఉదయమున, మధ్యాహ్నమును, అపరాష్ట్రకాలమునకు ఇంటి వెలుపల, మధ్యభాగములను, లోపలి భాగమునను చక్కగా నూడ్చి, రాత్రిపూటమాత్రము చిమ్మకుండనుండవలెను. గోశాల పశుశాలలను పేడ మొదలగునవి తీసివేసి చీపురుతో శుభ్రపఱచవలేను. ఇంటిలోపలను, బయటను, పనిచేయు దాస దాసీ జనమును పోషించు విధానమును, వారిని ఆయా పనులలో నీయోగించు పద్దతిని తెలిసీ ప్రవర్తింపవలెను. శాకములు, కందమూలములు, ఫలములు, ఓషధీలతలు, విత్తనములు మొదలగువానిని ఆయా కాలములలో యధావకాశముగ ప్రోగుచేయుచుండవలెను.
తా II రాగి, కంచు, ఇనుము మొదలగు -లోహములతోను, కజ్జ, వెదురు, మట్టిమొదలైన వానితోను చేయబడిన వివిధములైన కుండలు మొదలగు పాత్ర సామగ్రి సమకూర్చుకొనవలెను. నీరు పోయుటయు గోకర్ణము వంటి ద్రోణులుగల నీటి పాత్రలు, నీరు నింపియుంచుకొనుపాత్రలు, అంచులుగల పాత్రలు, శాకములు వండుటకు వివిధములైన గిన్నెలు మొదలగునవి, మజ్జిగ, వెన్న, నేయి మొదలగునవి. రోఁకలి, టోలు, తిరుగలి, పొడిచేయు సాధనము, పాలు పితుకు సాధనము, కవ్వము, కవ్వపుత్రాడు, అలంకరించెడి పరికరములు; గొలుసులు, (సంకేలలు) పట్టుకాటు, గిండ్లు, మేకులు; నూజెడుయి, కుట్టునూలు కలువపుగుండు, డాకలి, సమ్మెట,. గరిటె, వేపుడు చట్టి, ప్రక్కలించు పరికరములు (అడకత్తెర). త్రాసు, తూనికరాళ్లు, మొదలగునవి , చీపురులు, చిన్నగంపలు. ఇవి యన్నియును ప్రయత్నపూర్వకముగ సమకూర్చుకొనవలెను, ఇంగువ మొదలగు వస్తువులు, జాజికాయ, పిప్పళ్ళు, మిరియములు, నల్లని ఆవాలు, ధనియాలు, శొంఠి, కంపిల్లము (రోచనియను ఔషధము). ఉప్పుకారము మొదలగు రుచికలిగించు వస్తువులు, రేగు, ఖర్జూర, ఉసిరిక, చింత, అన్ని విధములైన నూనెలు: ఎండు కఱ్ఱలు, ఎండిన మాంసము (చేపలు) వెల్లుల్లి, నూఁబొడి: మినుములతో చేయబడిన మజ్జిగ, పాలవికారములగు: పెరుగు, వెన్న, నేయి మొదలగునవి, వివిధములైన గడ్డదినుసులు. ఇంకను నిత్యనైమిత్తికాది కర్మలకుపయోగపడు సర్వపదార్ధములను తమ స్తోమతకు తగినట్లుగా సంగ్రహము చేయవలెను. కార్యములు సంభవించినప్పుడు సంపాదించుటకు సాధ్యము కాని యట్లు కనబడువస్తువులన్నింటిని ప్రయత్నపూర్వకముగ; యథాసంభవముగ ముందే సేకరించి పెట్టుకొనవలెను.
తా॥ వివిధ ధాన్యముల యొక్క, నూరబడిన, విసరబడిన, పొడిగా నలగగొట్టబడిన, ఉపయుక్తతకోల్పోయిన, మిక్కిలి ఎండించుటచేత లేక మిక్కిలి తడుపుట చేత సిద్ధపడిన వివిధ ఆహార పదార్థముల వృద్ధిక్షయములను ఎప్పటి కప్పుడు నిర్ధరించుకొనుచుండవలయును.
ఇది శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున గృహధర్మవర్ణనమను పదునొకండవ అధ్యాయము.
