భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
25. చతుర్థీ కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
తా॥ బ్రహ్మ ఇట్లనెను.
“కుడివైపునకు తిరిగియున్న లింగముగల మనుష్యుడు పుత్రవంతుడగును. ఎడమవైపునకు తిరిగియున్నవాడు స్త్రీ సంతానమును పొందును-1. స్థూలముగ, నరములతో కూడి, అసమముగానున్న లింగములు గలవారికి దారిద్ర్యము కలుగునని చెప్పవలెను. చక్కగను, గుండ్రముగను, మగ గుఱులున్న పురుషులు పుత్రవంతులగుదురు-2. కాళ్లునేల పై నుంచి కూర్చున్నవాని 'యంగము' నేలను తాకుచున్నచో అట్టిపురుషుడు దుఃఖితుడగునని తెలిసికొనవలెను. సంశయములేదు-3. నేల పై పాదములుంచి కూర్చున్న వాని ‘అంగము' చీలమండలను తాకినచో అట్టివాడు రాజని యెఱుంగవలేను. స్త్రీలకు ప్రేమపాత్రుడని తెలియవలెను-4. సింహము పులి మొదలగువాని అంగములవలె కుచయైన అంగము గలవాడు భోగియగును. అశేష భోగములనుభవింపగలడని తెలియవలెను-5. అంగము చివరి భాగము (మణి) రేఖాకృతిగా నున్నవాడు, సముద్రుని వాక్యముననుసరించి, రాజని యెఱుంగవలెను-6. 'మణులు', బంగారముతో, వెండితో సమానవర్ణముగలవియైయున్నను, మణులు, ముత్యములు మొదలైనవానితో సమానమైన కాంతి గల్గియుండినను పగడములవలె మెఱయుచున్నను, మిక్కిలి నునుపుగనున్నను అట్టివాడు రాజగును-7. తెల్లని వర్ణముతో పేలవముగను కఱకుగను, పొడవైన చుట్టుకొలత కలిగియున్నను అట్టివాడు దేశద్రిమ్మరి లేక ప్రవాసి యగును. సమముగను, ఉబ్బెత్తుగను, నునుపుగను ఉన్నచోడు గృహస్థగును-8. అట్టివారు ధనమును కూడబెట్టువారు, స్త్రీలననుభవించువారును అగుదురు. మధ్య భాగమున నొక్కబడినట్లుండెనేని సంతానవంతులయ్యేదరు-9. అయినను వారు యువతులకు పట్టని వారయ్యేదరు. పొంగినట్లు అతిశయముగలేని ‘మణులు' గలవారు ధనవంతులగుదురు-10.
తా॥ మూత్రాధార కడివైపుకు చుట్టుకొని ఒకే ధారగా పడినచో, సముద్రుని వాక్యముననుసరించి, అట్టివాడు భూపాలకుడగును-11. అట్లు స్నిగ్ధమైన రెండు ధారలు పడినచోనట్టివాడు ధనవంతుడు, భోగియగును. శబ్దముతో కూడి అనేకధారలు రూక్షముగ పడినచోనట్టివారు అధమజాతి పురుషులు-12. రేతస్సు చేప వాసన కలిగియున్నచో ధనవంతుడు, పుత్రవంతుడును అగును. హవిస్సుపోసన గల రేతస్సు గలవాడు ధనాఢ్యుడు, శ్రోత్రియుడును అగును-13. ఎలుక వాసన కలిగినచో స్త్రీ సంతానము కలుగును. తామరపువ్వు సుగంధము కలిగినచో రాజగును. రేతస్సు లక్కవాసన కల్గియున్నవాడు అనేక పుత్రికలు కలవాడగును. కల్లు వాసన కల్గినచో యోధుడగును. ఘాటువాసన యున్నచో దరిద్రుడగును-14. శ్రీఘ్ర మైధునము గల వాడు దీర్ఘాయుష్మంతుడు కానేరడు. అల్పాయుష్కుడే యగుననుటలో సందియము లేదు-15. పలుచని (తక్కువ) శుక్రము గలవాడు ఆడసంతానమును కనును. మాంసపు వాసన గల శుక్రము గలవాడు భోగియగును. రక్తము తామర పువ్వు వర్ణమున నుండిన మనుష్యుడు ధనవంతుడగును-16. కొంచెము రక్తము, నలుపు (నీల) వర్ణముననున్న రక్తము గలవాడు, ఎల్లప్పుడు దుఃఖిక భాజనుడై అధముడగును-17. రక్తము పగడపు వన్నెకలిగి చిక్కగ నున్నవాడు సప్తద్వీపములనేల గల రాజగునని తెలియవలెను-18. పురుషులకు విశాలమై, మాంసలమై నునుపుగనున్న పొత్తి కడుపు ప్రశస్తమైనది. మాంసము లేనిది, వంకరగనున్నది, గబుకైనది అయిన పొత్తి కడుపు శుభప్రదము కాదు-19. నక్క, కుక్క, ఒంటె, గేదె కడుపువంటి కడుపుగలవాడు నిత్య దుఃఖితుడగుటలో సందేహములేదు-20.
తా॥ ఒకే వృషణము గలవాడు నీటిలో ప్రాణములు వదలును. ఎగుడు దిగుడుగా వృషణములుండువాడు స్త్రీచాంచల్యము గలవాడగును. సమముగనుండువాడు రాజ్యమును పొందును-21. పైకి అంటుకొని యుండినట్లున్నవాడు అల్పాయువగును. వ్రేలాడుతున్నట్లుండిన వాడు నూఱుసంవత్సరములు జీవించును. ఎఱుపు వన్నె వృషణములు గలవాడు ధనవంతుడగును-22. స్థూలమైన పిరుదులు గలవాడు క్షేమముగానుండును. మాంసయుక్తములగు పిరుదులుండేనేని ద్రవ్యవంతుడగును. పులి పిరుదుల వంటి పిరుదులు గలిగెనేని రాజగును. కప్పపిరుదులున్నను రాజే యగును. నితంబమండలము సింహము వంటిదైయున్న సార్వభౌమత సిద్దించును-23. ఒంటే, కోతి నితంబముల బోలియుండెనేని ధనధాన్య విహీనుడగునని యెఱుంగవలెను-24. జింక, నెమలి కడుపు వంటి కడుపు కలవాడు ధన్యుడు, పులి కడుపు గలవాడు రాజు, సింహపు కడుపుకలవాడు కూడా రాజేయగును-25. కప్పకడుపు గలవాడు కూడ పార్దివుడగునని సముద్రుడు చెప్పెను-26. మాంసముతో కూడి చక్కగను, గుండ్రముగను ఉన్న ప్రక్కభాగములు కలవారు నరపాలురగుదురు. పులివీపు గలవాడు .రాజో, సేనానాయకుడో అగును-27. సింహము వీపువంటి వీపు గలవాడు చెఱసాల పాలపడునని చెప్పదగును. తాబేలు వీపు గలవారు ధనసౌభాగ్యములతో రాజులగుదురు-28. హృదయ ప్రదేశము విశాలమై, మాంసలమై, కుదురుగనుండెనేని అట్టివాడు ధనవంతుడై, భోగభాగ్యములనుభవించుచు నూజెండ్లు జీవించును-29. చేతివేళ్లు వంకరై, ఎండిపోయినట్లు కణుకుగ కనబడుచో నట్టివాడు ధనహీనుడై దుఃఖముననుభవించును-30.
తా॥ ఎవనికి మినరేఖ ఉండునో వానికి కార్యసిద్ధియగును. అట్టివాడు ధనవంతుడు, బహుపుత్రవంతుడని తెలియవలెను-31. అరచేతిలో త్రాసు, వేదిక గుర్తులు కనబడినచో అట్టివానికి వాణిజ్యము సిద్ధించుటలో సంశయములేదు-32. అచేతులు మృదువుగనున్న వాడు, విశేషించి బ్రాహ్మణుడు, తఱచుగ యజ్ఞములు చేయువాడు, ధనవంతుడై యుండును-33. చేతిలో కొండ, చెట్టు వంటి రేఖలున్నచో దాసదాసీ జనముతో కూడి స్థిర సంపదలతో తులతూగును-34. చిల్లకోల, తోమరము, భాణములు, ధనుస్సు వంటి రేఖలు చేతనున్నవాడు యుద్ధమున శత్రువును జయించును-35. పతాకము, శంఖము వంటి రేఖలు గలవాడు సముద్రయానము చేయువాడు, ధనవంతుడును అగును-36. శ్రీవత్సము, తామర, వజ్రము, చక్రము, రథము, కుండ వంటి ఆకారము గల రేఖలు చేతియందున్నవాడు, శత్రు సైన్యమును దునుమాడురాజని గుర్తింపవలెను-37. కుడిచేతి బొట్టన వ్రేలియందు యవధాన్య చిహ్నము గలదేని అట్టివాడు సర్వ విద్యావిశారదుడై వక్తయగును. సందేహములేదు-38. చిటికెన వేలి మూలమునుండి చూపుడు వ్రేలు మధ్యభాగము వఱకు రేఖ గలిగినవాడు నూజెండ్లు జీవించును.
శతార్ధ సాహస్ర్యసంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్థీకల్పము నందు పురుష లక్షణ వర్ణనమను ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.
