భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

23. చతుర్థీ కల్ప వర్ణనము

సుమంతురువాచ:

తా॥ శతానీకుడిట్లనెను "వినాయకుడు ప్రమధులకు నాయకుడుగా ఎవరిచేత నియమింపబడెను? విఘ్నములకు అధిపతి యెట్లయ్యెను?”-1. సుమంతుముని ఇట్లు చేప్పెను. “విఘ్నకొరకునీ గుఱించి చక్కగా ప్రశ్నించితివి. ఏ విఘ్నములు కలిగించుటచేత నితడు విఘ్ననాయకుడుగా నియుక్తుడయ్కేనో వివరించేదను. ఏకాగ్రచిత్తుడవై వినుము-2. మొట్టమొదటి కృతయుగమున ప్రజాసృష్టి జరిగెను. అప్పటి ప్రజలకు ఎట్టి విఘ్నములు లేకుండ కార్యసిద్ధియగుచుండుట చూచి-3. వారెట్టి క్లేశములనెదుర్కొనమీ మిక్కిలి గర్వించియుండుట చూచి, ఇట్టి స్థితి పై అనేక విధములుగానాలోచించి-4. బ్రహ్మ విష్ణ్వాదులు ప్రజల సమూహముల సమృద్ధి కొఱకు శివుడు సృష్టించిన వినాయకుని గణనాథునిగా నియోగించిరి. గణపతిని నిర్లక్ష్యము చేసిన వాని లక్షణములెట్టివో తెలిసికొనుము-5. ఆ మానవుడు స్వప్నమునందు పెల్లుగానున్న జలమునందు తాను మునకలువేయుట చూచును, కాషాయ వస్త్రములు ధరించియున్న సన్యాసులను చూచును. పులులు, సింహముల పై స్వారీచేయును-6. చండాలురతో, గార్దభములతో, ఒంటెలతో కలిసి యొక్కచోనుండును. త్రోవ నడచుచు తనను శత్రువులు వెన్నాడుచున్నట్లు భావించును-7. వికల మనస్కుడై, పనులు చెడిపోయినట్లు అకారణముగ వ్యధచెందును. ఏనుగు పైనెక్కి నీటిలోనికి పోయినట్లు భావించును-8. సైన్యసమూహములు తననేదుర్కొనుటకు సమీపమునకు వచ్చి చుట్టుముట్టినట్లు కలలో చూచును. ఇట్టివి కన్పట్టుటలో సందేహములేదు-9. చిత్తము, తాను వికృతాకారము ధరించి, గన్నేరు పూల మూల నలంకరించుకొని తనను తాను స్వప్నమున చూచునో అట్టి స్వాప్నికుడు, తాను కోల్పోయిన రాజ్యమును తిరిగి పొందనేరడు-10. అది వినాయకుని ఆగ్రహఫలితమని తెలియవలెను.

తా॥ వినాయకుని ఆగ్రహ ప్రభావముచేత కన్య, తనకనురూపుడైన భర్తను పొందజాలదు. గర్భిణీ స్త్రీ సంతానమును బడయజాలదు. శ్రోత్రియుడు ఆచార్యత్వమును పొందజాలడు, శిష్యుల కధ్యాపనము చేయనేరడు. వైశ్యుడు తన వ్యాపారమునందు లాభమును పొందజాలడు. కృషీవలుడు తన వ్యవసాయమున సఫలుడు కాడు-11. అట్టితటి వినాయకుని ప్రసన్నుని చేసికొనుటకు (అతనికి) అభి షేక పూజాదులు నిర్వర్తించుచు పుణ్యదినమున అతనికి శాంతిజరుపవలెను. నేతితో కలిపిన తెల్లని ఆవాల పిండి నలుగుతో స్నానము చేయింపవలెను-12. శుక్లపక్ష చతుర్ధ గురువారము, వీర నక్షత్రమైన పుష్యమి దినమున-13. అన్నిఓషధులచేత, అన్ని విధములైన సుగంధద్రవ్యములచేతనతనిని విలిప్తుని చేసి, తల పైన పూసి, భద్రాసనమున నుపవిష్టునిజేసి, అతని యెదుట తాను కూర్చుండి బ్రాహ్మణోత్తముల చేత స్వస్తివాచనము చేయింపవలెను-14. శివుని, పార్వతిని, విఘ్నేశ్వరుని, కృష్ణుని, పితరులను, వాయువును, శక్రుని-15. బృహస్పతిని, బుధునీ, అంగారకుని, రాహుకేతువులను, కుమారస్వామిని, విష్ణువును పూజించి-16. గుఱ్ఱము లుండు స్థలమందలి మట్టిని, ఏనుగులుండు స్థలమందలి మట్టిని, పుట్టమట్టిని నదీ సంగమమందలి మట్టిని, గోరోజనమును,  వివిధ సుగంధములను, గుగ్గిలమును నీటిలో కలుపవలేను-17. ఆనీరు ఒకే వర్ణముగల నాలుగు కలశములలో తేబడినదియై  యుండవలెను. ఎఱ్ఱని ఎద్దు చర్మము నందు భద్రాసనము కల్పించి వినాయకుని అందు స్థాపించి (అభి షేకింపవలెను)-18. “వేయి విధములుగా వర్తించునది, నూటు విధములుగా ప్రవహించునది అయిన ఈ జలము ఋషులచేత పవిత్రీకరింపబడినది. అట్టి జలముచేత నిన్ను అభిషేకించుచున్నాను. పావమానీ సూక్తములు నీకు పావిత్ర్యమును కలిగించుగాక-19. వరుణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు, నీకు ప్రభుత నిచ్చెదరు గాక-20.

తా॥ నీ కేశములయందు, పాపిటలోను, శిరస్సు పైన, నుదుట, చెవులలో, కన్నులలోగల మాలిన్యమును ఈ నీరు తొలగించును "s-21. (అని చెప్పుచు అభిషేకింపవలెను.) ఎడమ చేత దర్భలు గైకొని, మోదుగ కట్టితో చేయబడిన స్రువముతో స్నాతు డైన వినాయకుని శిరస్సు పై ఆవనూనెను విడువవలెను-22. తగుమాత్రమైన చేపముల్లు, గుమ్మడిగాయ సమకూర్చి, నీ అగ్నులు దీప్తిమంతములు స్వాహాకారములతో కూడినవి అగుగాక అనవలెను. అనుచు వినాయకుని నామముల ఉచ్చారణలతో, నమస్కారములతోడి బలి' మంత్రములతోను, అంతటను దర్భలు పరచి నలుత్రోవల కూడలిలో చేటయందు బలి పెట్టవలెను -24. చేసియు చేయని బియ్యము, మాంసాహారము, వండినవి, వండనివి అయిన చేపలు, అంతవఱకు మాంసము-25. సువాసనగల గుమ్మడి పూవు, గౌడి మాధ్వి పైషులను మూడు విధములైన మద్యము, ముల్లంగి, పూరికలు, భక్ష్యములు, ఉండ్రాళ్ల హారము, పెరుగు, పాయసము, అన్నము, బెల్లముతో చేయబడిన లడ్డువములు-26. నివేదన చేసి ఆపిదప వినాయకుని తల్లియగు పార్వతీదేవిని నిల్పి ఆమెకు గరికపూలు, ఆవాల పూలతో మూడు పర్యాయములు పుష్పాంజలులు సమర్పించి ఇట్లు ప్రార్థింపవలెను-27. “హే భగవతీ! నాకు రూపమును, కీర్తిని, ఐశ్వర్యమును పుత్రులను, ధనమును, అన్ని కోరికలను, అచంచలమైన బుద్ధిని, భూమిపై ప్రఖ్యాతిని ప్రసాదింపుము"-28. ఆమీదట తెల్లని వస్త్రములు, తెల్లని పూలు, మైపూతలు ధరించిన వినాయకుని ప్రార్థింపవలెను.

బ్రాహ్మణులకు, గురువునకు భోజనములు, బట్టల జతలతో సంతర్పణ చేయవలెను-29. ఇట్లు విఘ్నేశ్వరుని, నవగ్రహములను విధి విధానముగ పూజించినవాడు కార్యసాఫల్యమును, ధనమును, అత్యుత్తమమైన ఫలమును పొందును-30. ఆదిత్యుని పూజించి అతని తిలకము ధరించుట, అట్లు వినాయకుని పూజించి అతని తిలకమును ధరించుట సర్వసిద్ధులను కల్గించును-31.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహా పురాణమునందలి బ్రహ్మపర్వమున

చతుర్థి కల్పవర్ణనమను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.