భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
113. సప్తమీ కల్పమున ఆదిత్యాలయ వందన మార్జనాది వర్ణనము
తా॥ విష్ణుదేవుడిట్లనెను. “ఓ సుర జ్యేష్ణా! నేనడుగ బోవు ప్రశ్నల కన్నింటికి మొదటి నుండియు సమాధానములు చెప్పుడు. రవి మందిరమును నిర్మింపఁజేసిన వానికి కలుగు ఫలమేమి?. సూర్యదేవార్చన చేయించువానికెట్టి పుణ్యము కలుగును? విధి విధానముగ పూజించి మందిరము నలుఁకుఁబూతలతో నలంకరించిన నే ఫలము కలుగును? సూర్యోపాసనలోనే యే విలువలు ప్రశస్తములైనవి? ఏవి అప్రశస్తములు? భాసుదేవున కిష్టమైన ధూపములెవ్వి? విసర్జింపదగిన ధూపములెవ్వి?. భానుదేవున కర్పింపబడు నుపచారముల ఫలమేమి? ఆతని సమక్షమున చేయబడు "గీత వాద్యాది సేవకు ఫలమేమి? ఘృతము, క్షీరముమున్నగువాని చేత సూర్యదేవునకు స్నానము చేయించినచో కలుగు ఫలమేమి?. సూర్య మందిరమున అలుకుట మొదలగు వాని చేతను, నీరు మొదలగునవి చల్లుట చేతను ఎట్టి ఫలములు కలుగునో సాకల్యముగ నాకుఁజెప్పుడు”-5, బ్రహ్మదేవుడిట్లు చెప్పందొడంగెను. "వత్సా! సూర్యారాధన సంబంధములగు విషయములను గూర్చిలెస్సగా ప్రశ్నించితివి. (విధిని వినుటచేత - వినగోరుట చేత కూడా పుణ్యమే) సేవ యందలి పుణ్యప్రదమైన విధిని సావధానుడవై వినుము-6. సూర్యదేవాలయమును కఱ్ఱతో గాని, శిలతోగాని, మట్టితోగాని నిర్మింపజేసిన వానికి కలిగెడి ఫలమును గూర్చి వినుము. ప్రతిదినము యజ్ఞము, పూజ చేయుచుండుచే కలుగు మహత్పలము సూర్యమందిరమును నిర్మింపజేసిన వానికి కలుగును. ఆలయ నిర్మాణము, దేవతా ప్రతిష్ఠ చేయించినవాడు రాబోవు వందతరముల తన కులము వారిని, గడచిన వందతరముల వారిని కూడా తరింప జేయ గలుగుటయే గాక పరమున సూర్యలోక ప్రాప్తినందును. ఏడు జన్మలలో చేసిన పాపము-అల్పమైనను అనల్పమైనను, సూర్యదేవాలయ ప్రారంభ శిలాన్యాసముననే నశించిపోవును.
తా॥ సప్తలోకమయుడగు సూర్యదేవున కాలయము నిర్మించు మనుష్యుడు సప్తలోక పరివ్యాప్తమగు ప్రతిష్ఠను పొందును. ప్రశస్తమైన దేశమునందలి శ్రేష్ఠమైన భూభాగమున సూర్యదేవుని మందిరమును నిర్మింపజేయవలెను. అటుల చేసిన వాడక్షయ లోకములను పొందును. ఇటుక ఇలాళ్ల సమూహపుటమరిక యెన్నిసంవత్సరముల వఱకుండునో అన్ని వేల సంవత్సరములో మందిర నిర్మాత స్వర్గమునందు నివసించును. సలక్షణమైన సూర్య విగ్రహమును చేయించు మానవుడు చిరకాలము సూర్యలోకమున నివసించును. అరువదివేల సంవత్సరములతడు ప్రత్యేకముగ దేవలోకమున సుఖజీవనము చేయును. ప్రశస్తమైన యాలయమున సూర్యదేవుని ప్రతిష్టించి, అతనికి పూజలు జరిపించువాడు కృతకృత్యుడగును. అతనినేదోషములంటవు. సూర్యభగవానుని విగ్రహమును ప్రతిష్ఠించిన వాడు ఒక బ్రహ్మకల్పము వఱకు, తనకులమునందలి రాబోవు తరముల వారిని, గడచిన తరముల వారిని తరింపజేయును. విష్ణుదేవా! పూర్వము పాశదండములను చేతులయందు ధరించి యున్నవారును, ప్రజలను నియమించుటకు (బూనుకొనినవారునునైన యమకింకరులు యమునిచేనట్లు శాసింపబడిరి. యమధర్మరాజిట్లనెను. “నా యాజ్ఞను పాలించుచు మీరు యథాన్యాయముగ ప్రపంచమున విహరింపుడు. ఏ ప్రాణియును మీ యాజ్ఞల నుల్లంఘింపదు -19. కేవలము జగత్తునకు మూలభూతుడైన వివస్వంతునాశ్రయించి యుపాసించు వారిని మాత్రము విడిచి పెట్టవలెను. ఏలయన వారికీ యమలోకమున చోటులేదు.
తా॥ ఎల్లవేళల సూర్యభగవానునే పూజించుచు, ఆదేవునే చిత్తమందు నిలిపి, అతని యందే తాత్పర్యము కలిగి యున్న వైవస్వతుల నుండి మీరు మిక్కిలి దూరముగ నుండవలెను. నిలుచుచు, నిదురించుచు, వచ్చుచుఁబోవుచు, లేచుచు, జారినప్పుడు, తుమ్మినప్పుడును సూర్యదేవుని నామస్మరణము చేయువానిని మీరు సమీపింపక చాలా దూరమున నుండవలెను. నిత్య నైమిత్తిక కార్యములందు భాస్కరు నర్చించువారి వైపు మీరు కన్నెత్తి చూడకూడదు. వారి ధ్యానము మీ గతిని నాశనము చేయును. పుష్పములచే,ధూపములచే, వస్త్రములచే, ప్రియమైన యాభరణములచేతను సూర్యభగవానునర్చించువారిని మీరు ముట్టుకొనకూడదు. ఏలయన వారు మా పితృదేవుని యాశ్రయముననున్నవారు. సూర్యాలయముననుపలేపన సమ్మార్జనాది సేవలు చేయువారిని, వారికులమున మూడు తరముల వారిని కూడా మీరు విడిచి యుండవలెను. సూర్యదేవాలయ నిర్మాణము చేసిన వారి కులమున జన్మించిన వానిని కూడా మీరు మీ దుర్దృష్టితో చూడరాదు. నా తండ్రియగు సూర్యభగవానుని పూజించు వారినుండి, వారి కులమునుండి మీరు చాల దూరముగనుండవలెను. అచ్చటచ్చట తిరుగుచుండెడు కెక్కడేని, యెవడేనియు సూర్యదేవునాశ్రయించినట్లున్న మానవుడు తటస్థపడిన యెడల మిలో నెవరేనియు నా యాజ్ఞ, నుల్లంఘించి యతనిని సమీపింపరాదు. మహాత్ముడైన యమధర్మరాజుచే నిట్లాజ్ఞాపింపబడిన యమకింకరు లొకతూరి యముని మాటను పెడచెవిని బెట్టి సూర్యభక్తుడగు సత్రాజిత్తును సమీపించిరి. కాని అతని తేజస్సు వలన మోహితులై, శరాఘాతమున కొండమీది పక్షినేల గూలినట్లు, మూర్ఛితులై పడిపోయిరి. విష్ణుదేవా! సూర్యాలయము నిర్మింపజేసి యాదేవదేవుని పూజాదికము చేయించువానికి కలుగు మహా ఫలము నీకు చెప్పబడినది. మానవులకు యజ్ఞములు పాపసమూహ వినాశకములు. సర్వకామ ప్రదాయకములు జగత్తును ప్రకాశింపజేయు సూర్యభగవానుడు సర్వయజ్ఞ మయుడు గావున నతని ప్రీత్యర్ధముగఁ జేయునదంతయు యజ్ఞఫలమునే యిచ్చును.
శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునం దాదిత్యాలయ వందన మార్జనాది వర్ణనమను నూట పదమూడవ అధ్యాయము సమాప్తము.
