భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

97. సప్తమీ కల్పమున జయంతీ కల్ప వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “త్రిలోచనా! మాఘమాస శుక్లపక్ష సప్తమీ “జయంతి'యని చెప్పబడును. అది పుణ్యప్రదము, పాపహరము, శుభంకరమునైనది. దాని నెట్లాచరింపవలెనో చెప్పుచున్నాను వినుము. తెలిసినవారు దీనియందును నాలుగు పారణలు చేయుదురు. పంచమినాడు ఒక పూట భోజనము, షష్ఠినాడు నక్తవ్రతము, సప్తమీదినముననుపవాసము, అష్టమినాడు పారణ చేయవలెను. మాఘ, ఫాల్గున, చైత్రమాసములందీ జయంతీ సప్తమీ వ్రతమాచరించు సందర్భమున రమ్యమైన శివమల్లీ పుష్పములు, కుంకుమ విలేపనము. నైవేద్యము కొఱకు లడ్డువములు, ఆజ్యధూపములతో సూర్యదేవుని పూజింపవలెను. పవిత్రీకరణ కొఱకు పంచగవ్యమును ప్రాశనము చేయవలెను. శక్తి కొలదిగ బ్రాహ్మణులకు లడ్డువములతో భోజనము పెట్టవలెను. బ్రాహ్మణ భోజనమున శాల్యన్నము వినియోగింపవలేను. అన్ని పారణముల యందును లోకపూజితుడైన భాస్కరదేవు నీటులే పూజించువాడు అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందును. రెండవ పారణమునందలి పూజనము వలన రాజసూయ యాగ ఫలము లభించును. వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము, శ్రావణములలో సూర్యపూజకు తామర పువ్వులు. తెల్ల చందనము, గుగ్గులు ధూపము, బెల్లపు భక్ష్యములు వినియోగింపవలేను. పాప నివారకము, రాజసూయాశ్వమేథముల ఫలమునిచ్చునది, సూర్యదేవునకు ప్రియమైనదియునైన రెండవ పారణ విధాన మిదియిట్లు చెప్పబడినది.

తా॥ భాద్రపద, ఆశ్వయుజమాసములలో, కార్తికములోను జరుపబడు మూడవ పారణ విధిలో సూర్యపూజకై ఉపయోగింపదగిన పుష్పాది ద్రవ్యములను గూర్చి చెప్పుచున్నాను వినుము. ఎఱ్ఱని చందనము, జాజిపూలు, విజయధూపము నుపయోగింపవలెను. నైవేద్యముగా నేతి భక్ష్యములు సమర్పింపవలెను. బ్రాహ్మణ భోజనము, శరీర పావిత్ర్యమునకు కుశోదక ప్రాశనము విధ్యుక్తములు. ఇట్లు పాపనాశకమగు తృతీయ పారణ చెప్పబడినది. ఇది సూర్యదేవునకు ప్రియమైనది. రాజసూయాశ్వమేధ యాగముల ఫలములనిచ్చునది. పాపనాశకమగు నాల్గవ పారణ విధిని కూడ చెప్పుచున్నాను వినుము. ఇదికూడ రాజసూయాశ్వమేధముల ఫలముల నిచ్చును. సూర్యదేవునకు ప్రీతిగూర్చునది. శ్రేయస్సు కొఱకు దీని విధానము వినుము. మార్గశిర, పుష్య. మాఘమాసములలో నిర్వహింపబడు నీ విధి యనేకములగు పుణ్యఫలములిచ్చునది. ఎఱ్ఱని గన్నేరు పూలు, రక్తచందనము. అమృతమను పేరుగల ధూపము, నైవేద్యమునకు పాయసమును వినియోగించి సూర్యపూజచేయవలెను. పావిత్ర్యము కొఱకు మజ్జిగ సంపాదించి ప్రాశనము చేయవలెను. అది మిక్కిలి ప్రశస్తమని చెప్పబడినది. అగరు చందనము, తుంగముస్తలు, యావనము, సొంటి, పిప్పలి, మిరియాలు (త్ర్యూషణం) వీనిని సమభాగములుగా మిశ్రమము చేసిన నది అమృతమను ధూపద్రవ్యమని చెప్పబడును.

            తా॥ ప్రార్థించుట కొఱకు మహాత్ముడైన భాస్కరదేవుని నామములిట చెప్పబడినవి. “చిత్ర భానుడు, భాను, భాస్కరుడు, ఆదిత్యుడు. ప్రీతుడగుగాక” అని పారణములన్నింటియందును ఆ దేవదేవుని ప్రసన్నుని చేసికొనుట విధియైయున్నది. ఈ విధానమున ఆ తిథినాడు విభావసుని పూజనొనర్చువాడు పరమపదమునొందును. ఇటులీసప్తమీ వ్రతమునాచరించి సర్వకామములను పొందును. పుత్రులు కావలసిన వాడు పుత్రులను, ధనమునుగోరువాడు ధనమును, పొందును. రోగగ్రస్తుడు సర్వరోగములనుండి విముక్తుడగును. సమృద్ధమైన శుభములఁబడయును. సంవత్సరమంతయును సూర్యపూజ చేయవలెను. గంధపుష్పోపహారములతోను, బ్రాహ్మణ సంతర్పణలతోను, నానావిధనాట్యసంగీత కార్యక్రమములతోను, పురాణ ప్రవచనలతోను, పౌరాణిక పూజతోను ఈ వ్రతమునాచరింపవలెను. ఇట్లు సూర్యదేవునర్చించి, బ్రాహ్మణులనుపూజించి, పురాణ ప్రవచనము చేసిన బ్రాహ్మణోత్తమునారాధించి ఈ వాక్యమునుచ్చరింపవలేను-25. “ధర్మకార్యములందు, అర్థకార్యములందు, కామకార్యములందును ఓ దేవదేవా! నాకు సర్వదా జయము కలుగునుగాక!”. ఇట్లు ప్రార్థించిన పిమ్మట బ్రాహ్మణులను వాచకోత్తముని యధోచితముగ సాగనంపవలయును. ఈ వ్రతము నిట్లు చేయువాడు జయఫలమును పొందును. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. సూర్యతేజముతో సమానమగు తేజముతో, రవిప్రభ వంటి ప్రభతో వెలుగుచు బ్రహ్మ సృష్టించిన దివ్యవిమానమున సూర్యలోక ప్రాప్తినందును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు జయంతీ కల్ప వర్ణనమను తొంబది యేడవ అధ్యాయము సమాప్తము.