భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

109. సప్తమీ కల్పమున మార్తాండ సప్తమీ వర్ణనము

తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను, “విష్ణుదేవా! మార్తాండ సప్తమీ యను పేర గల మఱి యొక వ్రతమును గూర్చి చెప్పెదను. శుభప్రదమైనట్టి యా వ్రతమును సావధానమనస్కుడవై వినుము. ఈ సప్తమీ వ్రతమును చక్కగా ననుష్ఠించిన వాడభిమత ఫలమును పొందును. పుష్యమాస శుక్లపక్షమున వచ్చుసప్తమీనాడుపవసించి. మార్తాండదేవుని భక్తితో పూజించి మార్తాండనామమును జపింపవలెను. ద్విజన్ముని మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. సమాహితచిత్తుడై ధూప పుష్పోపహారములతో, ఉపవాస దీక్షలతోను మార్తాండునర్జింపవలెను. మార్తాండ నామమునే జపించుచుండుటయనగా నతని యందే మనస్సు నిలిపియుండుట. ఖగధ్వజా! బ్రాహ్మణునకు యధాశక్తి దక్షిణనొసంగవలేను. నిదురించునపుడు, మేల్కొనినప్పుడు, తొట్రుపాటు పడునప్పుడు మార్తాండ నామమునే కీర్తింపవలెను. పాఖండులు మొదలగు కర్మహీనులతో సంభాషించుట మానివేయవలయును. గోమూత్రము గాని, గోమయముగాని, గోక్షీరముగాని లేక గోదధిగాని. గోదేహ సముద్భూతమైన పై వానిలో దేనినైనను ఆత్మశుద్ధి కొఱకు ప్రాశనము చేయవలెను. రెండవదినమున కూడ మఱల శుచియై యదే విధమున సూర్యదేవునర్చింపవలెను. అతని పేరుననే బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి గోదోహ సంభూతమైన క్షీరదధి ఘృతములలో దేనితోనేని భోజనము చేయవలెను. ప్రయతుడై శుచియై యిటులే మాసములన్నింటిలో నుపవాసవ్రతము నాచరించి స్వశక్తిననుసరించి ప్రతి మాసమునను బ్రాహ్మణులకు గోదానాదులు చేయవలెను. మఱల ముందు సంవత్సరమున కూడ నీ వ్రత దీక్షను స్వీకరించి సూర్యదేవ ప్రీత్యర్ధముగ నావులు మొదలగు వానిని దానము చేయుట వలన నెట్టేఫలము లభించునో చెప్పెదను వినుము. పంచమినాడు సువర్ణ శృంగిని, షష్ఠినాడు వృషభమును బ్రాహ్మణులకిచ్చువాడు పొందేడీ ఫలమునంతయును నీయుపవాస వ్రతమాచరించువాడు పొందును. పరమున సూర్యలోకప్రాప్తి కలుగును. అగ్నిహోత్రుని తేజమువంటి తేజముతో నీ వ్రతాచరణము చేసినవాడు ప్రకాశించుననుటలో సందేహములేదు. మార్తాండ సప్తమీ నాచరించియే నక్షత్రాదీగణములన్నియు నా కాశమున. ప్రకాశించుచు నేటికీని లోకములచే చూడబడుచున్నవి. కావున నాదిదేవేశుడు, గ్రహరాజు, భాస్కరుడు, గోపతియునైన సూర్యభగవానుని, గోళసన్నిభుని నీవుకూడ ఈ విధానమున పూజింపుము.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు 'మార్తాండ సప్తమీ వర్ణన 'మను నూట తొమ్మిదవ అధ్యాయయము సమాప్తము.