భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

114. సప్తమీ కల్పమున ఆదిత్యస్నోపనయోగ వర్ణనము

తా॥ బ్రహ్మ దేవుడిట్లనెను. సూర్యదేవుని స్థాపిత ప్రతిమను చక్కగా పూజించిన మానవుడేయే కోరికలను తీర్చుటకై యాదేవుని ప్రార్ధించునో వానినన్నింటిని నిస్సంశయముగ పొందును. సూర్య ప్రతిమను ఘృతముతో నభిషేకించువాడు ప్రతి జనపదమునందలి బ్రాహ్మణ శ్రేష్ఠులకు వంద గోదానములు చేసిన పుణ్య ఫలమును పొందును. నాలుగు మానికల నేతితో సూర్యభగవానునకు స్నానము చేయించువారికి, సూజుగోవులను బ్రాహ్మణులకు దానము చేసిన ఫలము కలుగును. ఘటోదకముచే మార్తాండుని ప్రతిమను అభిషేకించినందువలన భూరిద్యుమ్నునకు సప్తద్వీపమైన వసుంధర ప్రాప్తించినదట. కృష్ణా! జగత్పతియైన భాస్కర దేవునకు శుక్ల పక్షమునందలి యష్టమినాడు నేతితో స్నానము చేయించినచో సమస్త పాపముల నుండి ముక్తిలభించును. సప్తమీ నాడుగాని లేక షష్ఠినాడు గాని ఆవునేతితో సూర్యునకు స్నపనము చేసిన యెడల మహా పాతకములు నశించి శ్రేష్టమగు ఫలము లభించును. సంధ్యాకాలమున సూర్యునకు ఘృతస్నపనము జరిపించినచో నట్టివాని జ్ఞాతాజ్ఞాతములైన పాపములు ప్రక్షాళితములగును. సూర్యుడు సర్వయజ్ఞమయుడు. హవ్యములలో ఘృతము శ్రేష్టమైనది. అవి రెండును సంగమించినచో నశేష పాపములు క్షాళనము చేయబడును-8. సూర్యునకు క్షీరాభిషేకము చేయువాడు, క్షీరములు ప్రవహించు నదులతోను, పాయస కర్దమములుగల ప్రదములతోను శోభించేడి దివ్యలోకములలో నానందించును -9. సూర్య భగవానునకు క్షీరస్నానము చేయించువాడేడు జన్మల వఱకును ఆహ్లాదము, సుఖము, పదవి, ఆరోగ్యము, సౌందర్యము కలిగియుండును. క్షీర మెట్లు నిర్మలమైనదో, సుఖకారకమైనదో జ్ఞానము కూడ అట్టిదే. క్షీరమునుండి పెరుగు, నేయి మొదలగు రుచికరములు ఆరోగ్య ప్రదములునైన వస్తువులు పుట్టునట్లు జ్ఞానము నుండి కూడా నటులే జగద్ధిత కరములైన సద్విచారములు పుట్టును. సంశయములేదు. భగవానుడైన భాను దేవునకు చేసిన క్షీరాభిషేకము గ్రహానుకూలతను, పుష్టిని, సర్వజన ప్రీతిని కలిగించును. తిమిరధ్వంసకుడైన భానుదేవుని ఘృత క్షీరములతో నభిషేకించిన వాని దర్శన మాత్రముననే సర్వజనులు ప్రసన్నులై యతనితో స్నేహ భావమున నుందురు.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్య స్నాపన యోగ వర్ణనమను నూట పదునాలుగవ అధ్యాయము సమాప్తము.