భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
124. బ్రహ్మర్షి సంవాదమున ప్రవర వర్ణనము
తా॥ బ్రహ్మ దేవుడిట్లనెను. "దిండీ! ఇక సూర్యుని పరివారమునందలి ముఖ్యులను గూర్చి నీకు వివిరించెదను. ఆకాశపు దవ్వున మునిగియుండు నా సూర్య దేవుడీ లోకమునకు గూడ తన ప్రకాశమును ప్రసరింపఁజేయును. పూర్వ కాలమున నొకప్పుడు శివుడు బ్రహ్మ శిరస్సును ఛేదించి శిరః కపాలమును చేత ధరించి తిరుగుచు ఫల పుష్పజల భరితమైన ఒక శ్రేష్ఠమగు ఋష్యా శ్రమమునకు దిగంబరుడై యేతెంచెను. మునులు నివసించెడి యాదారువనమునకు భిక్షాచర్యగా వచ్చిన ఆ పరమేశ్వరునిఁ జూచి స్త్రీలు, పిల్లలు కలఁతఁజేందిరి. కొందఱు మునులాతని యొద్దకు సంతోషముగఁబోయిరి. కాని మఱికొందఱు “ముని ముఖ్యు'లాతని మట్టి పెడ్తలతోను, కట్టలతోను, తమ దండములతోను కొట్టుచు బాధించిరి. ఇఁక నచట నుండ నొల్లక ఋషులను వదలి శివుడు సూర్య లోకమునకు వచ్చెను. వచ్చుచున్న శివునిఁజూచి యచటి ప్రమథులాతనితో “దేవేశ్వరా! తాము నిత్యమిటులెందుకు తిరుగుచుంటిర'ని ప్రశ్నించిరి. దాని కీశ్వరుడు “పాపములనుండి ముక్తి నొందుటకై వివిధ తీర్ధ స్థానములు, దేవతల లోకములు తిరుగుచుందు”నని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ ప్రమథులు మఱల నతనితో నిట్లనిరి. “దేవా! మీ రిచటనే సూర్య దేవుని ముందుండుడు. అతడే మిమ్ము పవిత్రీకరింపగలడు. శుద్ధియైన పిదప మీ రుద్ర లోకమునకు మీరు వెడలిపోవచ్చును". ప్రమథులచే నీట్లు చెప్పబడిన శివుడు సూర్య ప్రీత్యర్థముగనటనే యుండిపోయెను. దిగంబరుడై, జటలు గలవాడై, బ్రహ్మ కపాలమును చేత ధరించి యతడు ముల్లోకములలోను నిరుపమాన రూపముగలవాడై యచట సూర్య సన్నిధిలో నుండెను. సూర్య భగవానుడు, "దేవా! మీ రాకతో మేము మిక్కిలి సంతసించితిని. మా దర్శనముతో మీరు పరిశుద్దులపై దీండియను పేర లోకమున ప్రసిద్ధి నొందగలరు”. అని హర్షముతోఁబలికేను. పదునెనమండుగురు ప్రమథులు భాను దేవుని చెంతనుందురు. వీరుగాక పదునల్వురాతని రథము పై నుందురు. ఇరువురు దేవతా ప్రథానులు, ఇరువురు ఋషి ముఖ్యులు, ఇద్దలు గంధర్వులు, ఇద్దకు పన్నగులు, ఇంకను. యక్షులు, సిద్ధులు, రాక్షసులు, సూర్యతనయులు, అప్సరలలో ప్రధానులు ఇద్దజేసి చొప్పున సూర్యునియందుదయాస్తమయములందును ఉందురు. వారి సంఖ్య మొత్తమెనుబది నాలుగు. ఇట్లు సూర్యదేవుని పరివార దేవతలందఱును ధాత్వర్థములచే నేర్పడు నన్వర్థనామములతో పేర్కొనబడుచుందురు.
తా॥ ఋషులిట్లనిరి. “బ్రహ్మదేవా! ధాత్వర్థముల ననుసరించి నిష్పన్నములగు శబ్దములతో పేర్కొనబడు దేవతాశ్రేష్టులను గూర్చి మాకు వినఁ గుతూహలముగ నున్నందున సవిస్తరముగఁజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “మీకు దండనాయక పింగలుల గూర్చియు, దిండితో గూడ దిగేవతలగు రాజ్ఞ సౌషాదులగు నితర ప్రవరుల గూర్చియు చెప్పెదను. పూర్వ కాలమున నాతో సహా దేవతలందఱు నొక్కచో సమావిష్ణులై యిట్లాలోచించిరి. 'ఈ దయాళుడగు సూర్య భగవానుడు దానవులతో యుద్ధము చేయుచున్నాడు. వారేమొ వారి మంత్రులతో గూడ కోరిన వరములను పొంది యుండి, యాదిత్యుని తపించుచున్న వానిగ నేజింగి, యతనిని చంపుటకుద్యమించిరి. అందువలన వారిని వధించుటకు మనము సైన్య ముఖ్యులమయ్యెదము. మనతో నెదుర్కొని వారు సూర్య భగవానుని వైపు చూడనోపరు". ఈ విధముగ నాలోచించి - తదనుసారము కార్తికేయుడు సూర్యునకేడమ భాగమునుందుండి దానవులతో యుద్ధ వ్యవహారమును జూచుకొనుచుండెను. ఇఁక దండనాయకుడను పేరుగలవాడు సర్వలోక ప్రభువు”. నీవు ప్రజలను దండింపగల నాయకుడవు. దండనీతిని నేటపువాడవు. కావుననే నీవు దండనాయకుడవు. ప్రజల పాప పుణ్యములను కూడ నీవు వ్రాయుచుందువు” అని యిట్లు సూర్య భగవానునిచే నతడు చెప్పబడెను కూడ. అగ్ని దేవుడు సూర్యునకు కుడి భాగమున నుండెను. అతడు గోరోజనము వంటి వర్ణముగల వాడగుటచే పింగళుడనబడెను. అశ్వినీ కుమారులిరువురును సూర్య భగవానునకిరుపక్కల నుండిరి. అశ్వరూపమున జన్మించిన వారగుటచే వారు అశ్వినులను పేరఁ బరగిరి.
తా॥ మహా బలశాలురగు రాజ్ఞ, సౌషులు సూర్యలోక ద్వారపాలకులు. కార్తికేయుని యవతారము 'రాజు' డనియు, శివావతారము సౌషుడనియు చెప్పబడును. రాజృదీప్తా అని ధాతువు. దానికి నకారము ప్రత్యయము. కార్తికేయుడు సుర సైన్యాధిపతిగ నెప్పుడును దీపించుచుండుటచే నాతడు రాజ్ఞుడని పేర్కొనబడెను. గత్యర్ధమగు 'సృధాతువునకు సకార ప్రత్యయము చేరగా సొషుడని పేర్కొనబడెను పర్యాయంబునరహస్యముగ తిరుగుచుండును కావున నాతడు సౌషుడని పేర్కొనబడెను. బ్రాహ్మణోత్తములారా! ధర్మార్థములచే నాశ్రయింపబడిన మొదటి ద్వారమువద్ద లోక పూజ్యులగు నీ యిరువురు దేవతలుందురు. రెండవ ద్వారమునందు మిక్కిలి దిట్టతనముగల కల్మాషుడు (ప్రేతాధిపుడు), గరుడుడు అను వీరిరువురునుందురు. చిత్ర వర్ణత్వము వలన యముడు. కల్మాషుడనబడును. టెక్కలున్నందువలన నాపక్షి రాజు గరుడుడనబడును. సూర్య దేవునకు దక్షిణ దిక్కున దండధరుడై కుబేరుడుండును. ఉత్తరదిక్కున వినాయకుడుండును. కుబేరుడన ధనదుడు. ఏనుగువలె నుండువాడు వినాయకుడు. కోపించుచున్నవానిచే జుగుప్సతో శపింపబడినందున దుష్ట శరీరము సంప్రాప్తమయ్యెను. ధనదుడు కుశరీరత్వము వలన కుబేరుడని చెప్పబడును. సర్వ భూతములకు నాయకుడగుటచే నాయకుడనబడును. వివిధములను పొందును గావున నాతడు వినాయకుడనబడును. రైవతుడు, దిండి యను వారిరువురు సూర్య దేవునకు తూర్పు దిక్కుననుందురు. దిండియనరుద్రుడు, సూర్యుని కుమారుడు రేవతుడు. సర్వ లోకనమస్కృతుడైన రేవతుడు సమమైన వేగమును నెగురుచు బోవువాడు గావును 'రేవృ' ప్లవగతో అను ధాతువుచే నీతని నామము రేవతుడని చెప్పబడును. 'డీజేగతో అనుధాతువుచే దిండి శబ్దము నిపాతముగ నేర్పడినది. ఎల్లప్పుడును నాకాశమున నెగురుచుఁబోవు చుండును గావున నీతడు 'దిండి' యని కీర్తింపబడును.
తా॥ మంగళకరులైన వేద వ్యాఖ్యాతలచే నిట్టి ధాత్వర్థములతోడి నామములుగల ప్రవరులు చెప్పఁబడిరి. వీరి సంఖ్యను గూర్చి మఱలనొకతూరి సంక్షేపముగఁజెప్పెదను. అశ్వినీ కుమారులిరువురు, దండనాయక పింగలులు వీరిరువురు సూర్య లోక ద్వారపాలకులనీ తెలియవలెను- రాజ్ఞ సౌషులిరువురు. రేవతుడు, దిండి యనునీయిద్దఱు ఇట్టి నామములతో వ్యవహరింప బడునట్టి యితరులు పదునెనమండుగురు సూర్య మండలమున రాక్షస సంహారార్థమై నియమింపబడిన ప్రవరులను గూర్చి సంక్షేపముగ, సంఖ్యాయుక్తముగ జెప్పితిని. వీరందఱు వివిధములైన మారణాయుధములను ధరించి సూర్యదేవుని చుట్టుముట్టి యుందురు. కొందఱు సరూపులు, కొందఱస్వరూపులు, మరి కొందఱు వీరూపులు, ఇంకను కొందఱు కామరూపులై, మహా బలుడైన గరుడునితో సహా వీరందఱును సూర్య దేవుననుసరించి యుందురు. 'దివ్' క్రీడాయాం అను ధాతువుచే నాకాశము దివమనబడును. దీవి యందు క్రీడింతురు గాన వారిని దేవతలందరు. నాచే నితః పూర్వము పేర్కొనబడిన ఋక్కులు, యజుస్సులు, సామములు వివిధ రూపములలో సూర్య భగవానుని కన్నివైపుల నావరించియుండును. ఇదియంతయు వివరించి సుమంతుముని యిట్లనెను. “పూర్వము ఋషులడుగుటచే, బ్రహ్మదేవుడీ వివరములను వారికి దెలిపియుండెను. దీనినంతయును విని వారు సూర్యదేవు నారాధించి సిద్ధులై యాకాశమున నుండిరి.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు బ్రహర్షి సంవాదమున ప్రవర వర్ణనమను నూట యిరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
