భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

22. చతుర్థీ కల్ప వర్ణనము

తా॥ సుమంతుముని యిట్లనెను.

“చవితినాడు నిరాహార వ్రతమును బూని బ్రాహ్మణునకు తిలాన్నము సమర్పించి ప్రతియైన వాడు తాను కూడా తిలాన్నమునే భుజింపవలెను-1. ఇట్లు రెండు సంవత్సరములాచరించి వ్రాత సమాప్తి చేసిన వాని యెడ వినాయకుడు సంతుష్టుడై కోరిన ఫలము నిచ్చును-2. అతడు అదృష్టలోకములకు పోయి అచట వివిధ బోగములనుభవించును. పుణ్యము సమాప్తమైన పిదప ఈ లోకమునకు వచ్చి దివ్య శరీరుడై గొప్ప కీర్తి సంపాదించును-3. బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, వక్త, భాగ్యవంతుడు, స్వేఛ్చాజీవియై అసాధ్యములైన గొప్ప కార్యములను కూడ క్షణములో పూర్తి చేయగలిగి తత్పల సిద్ధిని పొందును-4. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు గలవాడై, భార్యాపుత్రుల సేవలందుచు ఏడు జన్మల వఱకును దీర్ఘాయుష్మంతుడగు రాజగును.  ఈ ఫలమును విఘ్ననాశకుడైన వినాయకుడిచ్చును”-5. శతానీకుడిట్లనెను. “అతనికి విఘ్ననాయకుడని పేరు వచ్చుటకు కారణమేమి? అతడెవరికి విఘ్నమును కలిగించేను? చెప్పుడు”-6. సుమంతుడిట్లనెను. “కుమారస్వామి స్త్రీ పురుషుల లక్షణములను గుఱించి రచన సాగింపుచుండగా వినాయకుడు అతనికి విఘ్నము కలిగించెను-7. వినాయకుడు కలిగించిన ఆటంకమును తెలిసికొని కుమారస్వామి కోపోద్దీపితుడై అతని ముఖము నుండి దంతము నూడ బెణికి అతనిని చంపుటకుద్యమించెను-8. అంతలో మహేశ్వరుడటకేతెంచి కుమారుని వారించి, “కుమారా! క్రుద్ధుడవై ఈపనికి పూనుకొన కారణమేమి?” అని ప్రశ్నించేను. కుమారస్వామి ఇట్లు బదులు పలికెను. “నేను పురుషలక్షణ రచన సమాప్తి చేసి స్త్రీ లక్షణ రచన ప్రారంభింపకముందే ఈ గణేశుడు నన్నాటంకపరచెను "-9. అప్పుడు మహేశ్వరుడు నవ్వుచు తన కుమారునితో నిట్లనెను. " కుమారా! నాలో ఏ లక్షణములను చూచితివో చెప్పుము”-10.

తా॥ కార్తికేయుడిట్లు సమాధానము చెప్పెను.

“నీ చేతియందు బ్రహ్మచే చూడబడు పుట్టైయున్నది. అది అవిచారితముగ నుంచబడినది. అందువలన నీవు 'కపాలి'యని పిలువబడుచున్నావు.” ఆమాట విని శివుడు, కార్తికేయుని లక్షణ గ్రంథమును కోపముతో సముద్రమున బడవైచేను-11. ఒకప్పుడు దేవ సమాజము ప్రవృత్తమగుచుండగా బ్రహ్మరుద్రుల మధ్య 'నేను గొప్ప నేను గొప్ప' అనెడి వివాదమేర్పడెను. “నీ పుట్టుక అందజికి తెలియును కాని నన్నుమాత్రమేవరును తెలియలేరు”. అని శివుడనగానే బ్రహ్మ ఐదవతల అట్టహాసమును మాని, “నేను నిన్నెఱుంగుదుననెను”-13. ఇట్లనుచుండగానే రుద్రుడు బ్రహ్మయొక్క ఐదవదగు అశ్వశిరమును గోటీకొనతో త్రుంచివైచేను. ఆ తల చేతికి అంటుకోనియే ఉండిపోయెను-14. చేతిని అంటుకొని యున్న తోడనే శివుడు హరినివాసమునకు వచ్చెను. అటుపై భగవానుడైన శివుడు మేరు పర్వతము పై తపస్సులోనుండెను-15. బ్రహ్మయొక్క కత్తిరింపబడిన గుఱ్ఱపు ముఖపు స్టానమునుండి ఒక పురుషుడు వెలువడెను. అతడు మిక్కిలి కోపముతోనుండెను. వెండి కుండలములు ధరించి యుండెను-16. వానికి కవచము, శిరస్త్రాణము, ధనుర్బాణములుండేను. గొప్ప శరీరము గలిగి పూలదండలు ధరించియుండెను. అట్టి ఆ పురుషుడు " ఏమి చేయవలెనో సెలవిండు” అని బ్రహ్మముందు నిలిచెను-17. "ఆ దుర్మతి సంహరింపబడుగాక” అని బ్రహ్మ కోపముతో ఆజ్ఞాపించెను. ఆ పురుషుడు క్రోధముతో రుద్రుని స్థానమునకు వేగముగా పరుగెత్తెను-18. రుద్రుడు కూడ లోన ప్రవేశించిన విష్ణు తేజములు గలవాడై వానినధిష్టించియుండెను. ఇట్లు ఉత్తమమైన తపస్సు చేయుచున్న శివుని ఆ పురుషుడు చూచెను. హరుడు వైకుంఠవాసుడు, అపరాజితుడు అయిన నారాయణ దేవుని ఆంతర్యమున కలిగియుండెను-19. శివుని చూచిప ఆ పురుషుడు తాను కార్యమును గుఱించి ఆలోచించేను. “నా భుజమును శూలముతో భేదింపుము” అని శివునితోననేను-20.

తా॥ మహాతేజుడైన హరుడు తన శూలముతో అతని భుజమును నళికి వేసెను-21. శూల భేదనము వలన రక్తము రోదసి నావరించుటనట్లు పైకి చిమ్మెను. అటునుండి క్రిందికి వచ్చి కపాలమునందు పడెను-22. అందు పడిన రక్తము చూపుడు వ్రేలంత పెరిగెను. శివుని దృష్టి రక్తము వైపు మరలగానే తాను పశ్చిమము వైపు తిరిగి జలమును సృష్టించేను. కపాలమందలి రక్తము, నీరు రెండు కలిసిపోగా-24. అతడా కపాలమునందలి వ్రేలెడు రక్తములో నుండి, ఎఱ్ఱనివాడు, ఎఱ్ఱని (రాగి) కుండలములు ధరించిన వాడు, కవచమును ధరించిన వాడునైన ఒక నరుని సృష్టించెను-25. అతడు శివునితో “ఏమి చేయవలెనో సెలవిండనెను. ఇక బ్రహ్మశిరఃస్థానము నుండి పుట్టిన పురుషుడు కూడ, తెల్లని కుండలములు ధరించిన ఒక నరుని సృష్టించేను-26. ధను:శ్రేష్ఠములను ధరించిన ఆ యిరువురును యుద్ధము చేయసాగిరి. యుగాతిక్రమణము నందలి కుజకేతువుల వలె తలపడిరి-27. వారు యుద్ధము చేయుచుండగా ఒక ప్రళయ కాలముకంటే నధికమగు కాలము గడిచేను. వారిరువురిలోను ఏ ఒక్కరికైనను విజయము కలుగునట్టు కన్పట్టుటలేదు-28. అప్పుడు అంతరిక్షమునుండి అశరీరవాణి, వారినిచూచి ఇట్లనెను. “దేవతలతో కూడి భూలోకభారమును తొలగించుట కర్తవ్యము-29. మా యిరువురిది, నాదికూడ అవతారమగును.” దేవ కార్యసిద్ధి కొఱకు అది యొక ఆశ్చర్యకరమగు సంఘటనయయ్యెను-30.

తా॥ అశరీరవాణి ఇట్లు చెప్పి భూలోక భావమును విడిచి దేవలోకమునకు పోయెను. అప్పుడు విష్ణుదేవుడు ఇద్దటి నరులలో ఒకనిని సూర్యునకిచ్చెను-31. సూర్యుడు సంతోషముతతో, శ్వేతకుండలములు ధరించియున్న గర్వితుడగు నరుని స్వీకరించెను, రక్తకుండలముల వానిని ఆపిదప ఇంద్రునకిచ్చెను-32. ఇంద్రుడు కూడా వానిని సంతోషముతో తీసికొని స్వర్గమునకుఁబోయెను. క్రోధము నుండి పుట్టిన ఆ యిరువురు పురుషులను సూర్యుడు ఇంద్రుడు తీసుకొని వెడలిపోయిరి-33. అప్పుడు బ్రహ్మదేవుడు శివునితో “కపాలముగల పొడవై, కపాలవ్రతము నందు చరించుచు నీవు కూడా వెడలిపొమ్ము, మునుష్యలోకము నందీవ్రతమవ తరింపగలదు-34. ఈ నీ వ్రతముననుష్ఠించు మానవులకు ఇహపరలోకములయందు దుర్లభమైన దేదియునుండదు-35. ఇట్లనేక విధములుగా బ్రహ్మ ప్రీతి పూర్వకముగ మాట్లాడగనే శివుడు సంతోషించి సముద్రుని పిలిచి అతనితో నిర్విచారముగ నిట్లనెను. -36 “విలక్షణమైన రీతిలో స్త్రీ లక్షణమను గ్రంథమును అభరణప్రాయమైన దానిని రచింపుము, కార్తికేయుడు రచించియుండిన పురుష లక్షణమును కూడా సంశయింపక రచింపుము" -37 “పురుష లక్షణమను గ్రంథము నా పేరనే ప్రచురము కావలెనని” సముద్రుడు కోరెను. 'అటులేయగున'ని శివుడు వాగ్దానము చేసెను-38 'కార్తికేయుని చేత చెప్పబడిన పురుష లక్షణము నీవు తిరిగి సందేహింపకుండ చెప్పుమని శివుడు మఱల రెట్టించి చెప్పెను-39 “నీవిప్పుడు ఊడబెరికిన వినాయకుని దంతమును అతనికి ఇచ్చివేయుము” అని కార్తికేయునకు చెప్పెను. ఎవనికైనను కానున్నది కాకమానదు-40.

తా॥ వినాయకుని గూర్చి ఇట్టిది నిజముగా దైవయోగము వలననేకాని ఎవరి కోరికను బట్టియు జరుగలేదు. కుమారా! సముద్రమున వేయబడియుండిన ఈ నీ పురుషలక్షణ గ్రంథమును తీసికొనుము-41. స్త్రీ పురుష లక్షణములు చెప్పబడిన శ్రేష్ఠమగు గ్రంథము సాముద్రమనియే ప్రసిద్ధినొందును. దేవ వినాయకుని మఱల కొమ్ము (దంతము) గల వానినిగా చేయుము-42. శివుడు చెప్పిన ఈ మాటవిని కార్తికేయుడు మత్సరముతో నిట్లనెను. “తండ్రీ నీ మాట పాటించి ఇతని దంత మిచ్చివేయుదును. సంశయము లేదు-43. కానీ ఈ దంతమునీతడు ఎప్పుడును పట్టుకొనియేయుండవలెను. దంతమును విడిచి తిరిగిన యెడల అదీ అతనిని భస్మము చేయును-44. అటులే కానిమ్మని అతడు తన సమ్మతి తెలుపగా కుమారస్వామి, దంతమును వినాయకుని చేతికిచ్చెను. వినాయక దేవుడు కార్తికేయుని ఇచ్చననుసరించియేయుండెను-45. రాజా! వినాయకుని విగ్రహము నేటికిని చేతిలో దంతము తోడనే కనపడును. విష్ణుకర్త మహాత్ముడైన శివ కుమారుని మూర్తి దంతయుక్తమై యుండును-46. ఈ దేవతల రహస్యమును నీకు చెప్పితిని. దీనిని దేవదేవుడే తెలిసికొనలేకపోయేను. "భూమిపై దీనిని తెలియుట దుర్లభము-47. నేను ప్రసన్నుడనై నీకు చెప్పితిని. చతుర్టీ తిథి సంయోగమున ఈ వినాయక కథామృతము వివరింపబడినది-48. దీనిని వేదపారగులైన బ్రాహ్మణులకు గాని, తమ వృత్తుల యందు జీవించు క్షత్రియులకుగాని, వైశ్యులకుగాని, గుణవంతులైన శూద్రులకు గాని వినిపించిన విద్వాంసునకు-49. ఇహ పరములయందు దుర్లభమైనదేమియు నుండదు. అతనికి ఎట్టి దుఃస్థితిని అవమానము గాని సంభవింపదు-50. అన్ని పనులను ఆటంకములు లేకుండ సాధించుకొనగలుగును. సకల సంపత్సమృద్ధిని, ఐశ్వర్యమును పొందును-51.

శతార్ధ సాహస సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున

చతుర్ధి కల్పవర్ణనమను ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.