భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
29. చతుర్థి కల్పములోని గణపతి కల్ప వర్ణనము
సుమంతురువాచ :
తా॥ శతానీకుడిట్లనెను. గకారాక్షరదేవుడు, మహాత్ముడునైన గణేశ్వరుని పూజావిధిని, అంగములతో మంత్రములతో సహానాకు చెప్పుడు-1. సుమంతుముని ఇట్లు చెప్పదొడగెను. వినాయకుని పూజకోకు తిథి, నక్షత్రము, ఉపవాస విధులు ప్రత్యేకముగ ఏమియునులేవు. స్వేచ్ఛగా ఎప్పుడు ఎట్లు చేసినను కోరిన కోరిక సిద్ధించును-2. తెల్ల జిల్లేడు వేరు తెచ్చి దానితో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున పద్మాసనమున నున్న గణపతిని చేయవలెను-3. పండితుడైనవాడు ఆ గణపతిని, నాలుగు భుజములు, మూడుకన్నులు గలవానిగను, వివిధములైన ఆభరణములు, సర్పయజ్ఞోపవీతము ధరించిన వానిగను, శేఖరమున చంద్రరేఖను ధరించిన వానిగను-4. ఎడమ చేతియందు దంతమును, కుడిచేత జపమాల, మూడవచేత గొడ్డలి (పరశువు), నాల్గవ చేతిలో లడువము ధరించిన వానిగను నిర్మింపవలెను-5. కుంకుమము, చందనము కలిపి “సమాలంభన'మనబడును. అట్టి సమాలంభనముతో, వస్త్రభూషణములతో, ఎఱ్ఱని పుష్పములతో గణనాయకుని పూజింపవలెను-6. సుగంధధూపము, లడ్డువములు (ఉండ్రాళ్లు) సమర్పింపవలెను. ఇట్లు పూజించుముందు బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను-7. పొట్టివాడు, మరుగుజ్జువాడునైన బ్రాహ్మణునకు పూజకంటేముందు భోజనము పెట్టవలెను. అతని ఆశీర్వాదముతో సిద్ధి కలుగును-8. కురుకుల శ్రేష్టా! మంత్రపదములు చెప్పుచున్నాను. భక్తితో వినుము. ఓం గం స్వాహా” ఇది మూలమంత్రము-9 గాం నమః' హృదయమని, 'గీం'నమః శిరస్సని, 'గూం నమః శిఖయని, గైం నమ:” కవచమని-10. గౌంనమః' నేత్రములనుద్దేశించినవియని 'గః ఫట్ కామాస్త్రమనియు చెప్పబడును. ఆగచ్ఛ ఉల్కాముఖాయ' అనుమంత్రము ఇతని ఆవాహనమునందు వినియోగింపవలెను.
తా॥ గం గణేశాయనమః” ఇది గంధమంత్రమని చెప్పబడినది. పుష్పోలాయనమః' ఇది పుష్పమంత్రము-12. “ధూపోల్కాయనమ”: ఇది ధూపమంత్రము “దీపోల్కాయనమ:” ఇది దీపమంత్రము-13. ఓం గం మహోల్కాయనమః” ఇది బలిమంత్రమని చెప్పబడును. ఓం సంసిదోల్కాయనమ:” ఈ మంత్రము విసర్జనమునందు వినియోగింపబడును-14. ఓం మహాకర్ణాయ విద్మహే! వక్రతుండాయ ధీమహి! తన్నో దంతిః ప్రచోదయాత్" అని గణపతి గాయత్రీమంత్రముతో తూర్పునను-15. మహగణపతయే స్వాహా' అని దక్షిణమునను, “మహోల్కాయ' అని పడమరయందును, 'కూశ్మాండాయ' అని ఉత్తరమునను, “ఏకదంత త్రిపురాంతకాయ' అని గ్నేయదిశయందును-16. ఓం శివదత్త వికటహర హాసప్రాణాయ స్వాహా” అని నైరృతి దిశయందు, తులంబనాత్యచల దంతకాయ స్వాహా' అని వాయవ్యమునందును-17. పద్మదంష్ట్రాయ నరాయ' అని ఈశాన్యమునను, స్వాహాకారములతో హోమము చేయవలెను. “హుంఫట్ హుంఫట్ అని చప్పట్లుకొట్టుచు నవ్వుచువాడవలెను-18. 'బహుభంగుల నాట్యమాడు గణపతిదేవుని ముద్రను ప్రదర్శించి అప్పుడు హోమము చేయవలెను. అన్నియునిచ్చు దేవత వశమగును. నల్లని నువ్వులతో నెనిమిది వేల పర్యాయములాహుతులిచ్చినచో మూడు రాత్రులలో రాజు వశుడగును-19. తిలలు, యువలు హోమము చేసినచో జానపదులందఱు వశ్యులగుదురు. మిక్కిలి రూపవతియైన కన్య పోవుచున్న వాని వెంటపడును.
తా॥ సెనగలు, బియ్యముతో హోమము చేసినచో దుర్జయుడగును. వేపాకులు, సమస్తతైలములతోచేసినచో విద్వేషణము చేయును. చంద్రగ్రహణ సమయమున నీటిలోనికి దిగి ఎనిమిది వేల జపము చేయవలెను. యుద్ధమున పరాజయము లేని వాడగును-21. ఓం లంబరాజైనమః) సూర్యునకభీముఖుడై ఎనిమిదివేల జపము చేయవలెను. సూర్యుడు వరమిచ్చును-22. శుక్లపక్ష చతుర్థినాడు ఉపవసించి, గంధపుష్పాదులతో పూజించి నువ్వులు బియ్యమును హోమము చేయవలెను. వానిని తలపై ధరించిన పరాజయము లేని వాడగును-23. ఉత్తరేని సమిధలతో అగ్నిని ప్రజ్వలింపజేసి అందు ఇరువది యొక్క ఆహుతులతో హవనము చేసినవాడు మూడు రాత్రుల వఱకు శత్రువును సంహరించును-24. ఇక అటుపిమ్మట మంత్రమును వ్యాఖ్యానింతును. వృక్షమూలమునందలి కాటుకను తీసికొని ఏడు పర్యాయములభిమంత్రించి దానిని కన్నులకు అంజనముగా పెట్టుకొనినవాడు ఎవనిని చూచునో వాడు వానికి వశుడగును-25. పుష్పమును గాని, ఫలమునుగాని, వేరును గాని, ఎనిమిది వేల మంత్ర జపముతోనభిమంత్రించి దానిని ఎవనికిత్తురో వాడు వశమగును-26. మూలమంత్రమే కొంచెము జపించినను అది సిద్దిప్రదమగును. గ్రహములన్నియు ప్రీతిజెందును. నగర ద్వారము వద్దకుపోయి ఎనిమిదివేల జపము చేసి ఎనిమిదివేల ద్వారములుగా నిరూపింపవలెను-27. ఒక్కొక్కద్వారముచే ఆపురము వశీభూతమగును. తూర్పుముఖముగా యజించువాడు 'ఉచ్చాటనము' చేయగలుగును. ఎదురుగా జపించినచో దొంగలను పరుగెత్తింపగలుగును-28. గడ్డిని కోయింపగలడు. కఱ్ఱలను విరుగునట్లోనరింపగలడు-29. ఏనుగుచేత యుద్దము చేయింపగలడు. నీటి మధ్యభాగమున ఏడురాత్రులు జపింపవలెను. అకాలమున వర్షింపజేయును. బావులు, చెఱువులను ఎండింపజేయును. బొమ్మచేత నాట్యమాడించును, ఆకర్షించును. స్తంభనము చేయును. నూజుయోజనముల దూరము నుండి స్త్రీ పురుషులను ఆకర్షించును.
తా॥ గోరోచనమును వేయి మారులభిమంత్రించి చేతికి కట్టుకొనినచో లక్షయోజనముల దూరము పోయి తిరిగివచ్చును-31. ఇక ఎవరినైనను చంపనిచ్చగలవాడు చండ్రకఱ్ఱతో నొక గూటము సిద్దపరచి మారణము చేయదలచిన స్త్రీ లేక పురుషుని భావించి ఈ గూటమును వారి హృదయమున నాటవలెను. (మనస్సున భావింపవలెను.) క్షణములో మరణించును-32. సర్వపాపముల నుండి ముక్తుడగును. అగ్నివలె తేజస్వియై అందటికిని జయింపరాని వాడగును-33. ఓం వక్రతుండాయ స్వాహా, ఓం ఏక దంష్ట్రాయస్వాహా ఓం కృతకృష్ణాయ స్వాహా, ఓం గజకర్ణాయ స్వాహా, ఓం లంబోదరాయ స్వాహా, ఓం వికటాయస్వాహా, ఓం ధూమ్రవర్ణాయ స్వాహా, ఓం గగనకూజాయ స్వాహా, ఓం వినాయకాయ స్వాహా, ఓం గణపతయే స్వాహా, ఓం హస్తిముఖాయ స్వాహా-34.ఇవి గణపతికి హవిర్దానము చేయు మంత్రములు.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పములోని గణపతి కల్నవర్ణనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
