భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

26. చతుర్థి కల్పమునందలి పురుష లక్షణ వర్ణనము

తా॥ కడుపు సమముగా నున్నవాడు భోగియగును. లోతున్నవాడు ధనమునపహరించును. ఎగుడు దిగుడుగానున్నవాడు మాయావి, వంచకును అగును-1. నిమ్నకుక్షిగలవాడు మహాబలవంతుడైన రాజు లేక చక్రవర్తియగును. పాము కడుపుగలవారు దరిద్రులు, తిండిపోతులునగుదురు-2. విశాలమై, ఎత్తైన నాభిమండలములు గలవారు సుఖజీవులు, వీరులు ధనధాన్యములతో కూడిన వారగుదురు-3. లోతుగను అల్పముగను ఉండువారు కష్టములనుభవించువారు అగుదురు. ముఖ్యముగ కడుపు ముడుతల మధ్య భాగమునగల నాభి, విషమముగ నున్న నాభిగలవారు క్లేశమనుభవింతురు. అట్టివారికి ధనహానీ, వ్యాధి, మృత్యువు కలుగును-4. ఎడమవైపు తిరిగియుండు నాభి ఎప్పుడును శాంతి కలిగించునని బుధులు తెలిసికొందురు. కుడివైపునకు తిరిగియుండునది బుద్దీ శాలిత్వము నిచ్చును-5. ప్రక్కలకు నిడివి గలది దీర్ఘాయువును, పైభాగమునకు నిడు పైనది ఐశ్వర్యమునిచ్చును. క్రింది భాగమునకు పొడవుగనుండునది గోసంపదను కలిగించుననని బుధులు చెప్పుదురు-6. ఏ పురుషుని నాభి తామరబొదువలే నుండునో అది అతనికి రాచకమును కలిగించును. సందేహములేదు-7. కడుపు సమముగ నున్నవాడు భోగియగును. విషమముగనున్నవాడు స్వజనులు లేని వాడగును. ఉదరము సూక్ష్మముగ నున్నవాడు గొప్ప సంపదతో కూడిన వాగ్మియగును-8. లేక శస్త్రముచే హతుడగునని, స్త్రీ భోగముననుభవించునని, ఆచార్యుడగునని, బహుపుత్రులు కలపొడగునని విచారణననుసరించి చెప్పవలెను-9. వంకరైన ముడుతలతో నుండు నాభిగలవాడు “అగమ్యగామి' యగునని సముద్రుడు చెప్పెను.

తా॥ ముడుతలు ఋజువుగనుండెనేని భోగి, ఇతరుల భార్యలచే నిందింపబడువాడు లేక వారిని నిందించువాడగును. ప్రక్కలు మాంసముతో గూడి మృదువుగనున్నచో రాజగును. సంశయములేదు-11. గద్దువ, మీదికెత్తబడినట్లుగాని పొడవుగ గాని లేక సమముగనున్నవారు సౌభాగ్యవంతులగుదురు. వంకరగనో పొడవుగనో ఉన్నవారు నిర్దినులగుదురు-12, బలిష్ఠములైన ఎగుభుజములు గలవారు రాజులు, సుఖముగ జీవించువారు నగుదురనుటలో సందేహములేదు-13. హృదయస్థానము, సమముగను, సమానముగ ఎత్తుకలిగి, విశాలమై, వణుకు లేనిదై మాంసలమైయుండెనేని అట్టిది రాజులకు సంబంధించినదనుటలో సందేహము లేదు -14. కుమారా! గాడిద వెంట్రుకల వంటి దట్టమైన వెంట్రుకలుగలదై, ముఖ్యముగా నరములు కలిగినదైయున్న హృదయ ప్రదేశము బీదవారికి సంబంధించినదైయుండును. సమమైన వక్షముగల వారు ధనవంతులును, బలిష్టముగనున్నవారు శూరులు-15. బక్కగనున్నవారు ధనహీనులును, అసమముగనున్నవారు దరిద్రులును అగుదురు. అంతియేకాక అట్టివారు శస్త్రములతో వధింపబడుదురని, అందు సందేహములేదని బుధులు చెప్పుదురు-16. దవడలు ఎగుడు దిగుడుగ నుండెనేని సంతానము లేనివాడు, ఎత్తుగనుండినచో భోగి యగును-17. మాంసరహితముగ, వంకరగ, లోతుగను ఉన్నవాడు నిఃస్వయోగము గలవాడగును. బలిష్ఠములైయుండెనేని ధనికుడు, సుఖములనుభవించువాడుఅగును-18. చట్టపడియున్న మెడగల మనుష్యుడు దుష్టుడుగ భావింపబడుచున్నాడు. గేదేమేడ గలవాడు శూరుడు, జింకమెడగలవాడు పీజీకీవాడు-19. శంఖము వంటి మేడ గలవాడు రాజు, పొడవైన మెడ గలుగువాడు తీవ్రస్వభావము గలవాడు, పొట్టి మెడగలవాడు ధనికుడు, సుఖి, భగవంతుడు అగును.

తా॥ మూఁపులు (భుజశిరస్సులు) రోమములతో, భగ్నమైనట్లుండి, చిన్నవిగానున్నయెడల నిర్ధనుడగుననుట ప్రసిద్దము-21. ధనికులకు వీపున రోమములుండవు. దరిద్రులకుండును-22. చంకలు చెమట పట్టనివియై బలిష్ఠములై, సమమైన రోమములుగలిగి, సువాసనతోకూడి యుండెనేని ధనవంతుడగును-23. చీలియున్నట్లుగాక శరీరముతో సమముగ కలిసియున్నట్లుండి, విపులముగనున్న భుజములు శూరులకుండును-24. పైకి మిక్కుటముగఁబెరిగిన బాహువులున్నవాడు వధ, బంధనములను పొందును. పొడవైన బాహువులవాడు సముద్రుని వాక్యముననుసరించి రాజగును-25. దీర్ఘ బాహువు సర్వసుగుణాన్వితుడై యుండును. పొట్టిగనున్న బాహువులపాడు దాసుడగును. లేక ఇతరులు చెప్పిన పనిచేయు సేవకుడగును-26. అందముగ వడి దిరిగియున్నవి, పొడవై విశాలములైన భుజములు గల సంపూర్ణబాహుడు రాజగునని సముద్రుడు చెప్పెను-27. శంఖము పైవలె రేఖలు గలిగిన గుండ్రని మెడగలవాడు, దుష్టశత్రువులను దునుమాడు రాజుగ ఈ భూమిని పాలించును-28. పొడవుమెడ, కొంగమెడ, చిలుక మెడ, ఒంటిమెడ, ఏనుగుమెడ గలవారందుజును ధనహీనులగుదురని చెప్పబడినది-29. ఏనుగు తొండములవలె గుండ్రనై, సమానములై, బలిష్టములై, మోకాళ్ళ వఱకు వ్రేలాడు బాహువులు రాజులకుండుననుటలో సందియములేదు.

తా॥  దరిద్రులకు రోమములతో కూడిన, పొట్టి వియైన భుజములుండును. దొంగలకు విషమములైన బాహువులు, స్థూలములుగనో సూక్ష్మములుగనో ఉండును-31. అజచేయి లోతుగా నున్నవారికి పైతృకమైన సంపద లభింపదు. అట్టి మనుష్యుడు పిటీకి వాడుగ కూడా అగును-32. గండ్రముగను, పలుచగను, లోతుగను కరతలముండెనేని ధనవంతుడగును. లోతులేని . అరచేయిగలవాడు దాతయగుటలో సంశయములేదు -33. సమముగానుండని లోతైన కరతలములుగలవారు వికట స్వభావులైయుందురు. లక్కవలె ఎఱ్ఱగా ప్రకాశించుచుండెనేని అట్టివారు రాజులని చెప్పదగును-34. కరతలములు పసుపువన్నెలో నున్న అగమ్యగాములు, కజుకుగనున్న నిర్దినులగుదురు. నీలవర్ణమున లేక నలుపుగనుండెనేని అపేయపానము గల వారగుదురు-35. అఱచేతిలోని రేఖలు లోతుగను, నునుపుగను ఉన్నవారు రాజులగుదురు. ఇట్టి రేఖలు ధనికులకేగానీ దరిద్రులకుండవని సముద్రుడు చెప్పెను-36. వంకరవ్రేళ్ళు గలవారు దరిద్రులని చెప్పుదురు. ఘనమైన వేళ్లవారు ధనికులు-37. గుండ్రని ముఖము గల వానిని ధర్మశీలుడని చెప్పవలెను. ఏనుగు తొండమువంటి ముఖములు గలవారు దౌర్బాగ్యులగుటలో సందేహములేదు-38. కోఁతి ముఖములు, వంకముఖములు, వికారమైన ముఖములు, పగిలినట్లున్న ముఖములు, వెఱపు గలిగించు ముఖములు గలవారు దొంగలని చెప్పఁబడుదురు-39. నిండైన ముఖము గలవారు, సింహము, ఏనుగు ముఖములవంటి ముఖములుగలవారు రాజులగుదురు. మేక, కోతి, ముఖములుగలవారు ధనికులని చెప్పబడుదురు.

తా॥  చెక్కిళ్లు తామర రేకుల వలె మెఱయుచు నిండుగ నున్నవాడు శ్రమజీవి, గొప్ప ధనవంతును అగును.-41. సింహము, పులి, ఏనుగు చెక్కిళుల వంటి చెక్కిళులుండె నేని గొప్ప భోగి, సేనానాయకుడగునని తెలియవలెను-42. ముఖము సమముగను, పలుచగను (ప్రియముగను) సౌమ్యముగను, కుదురుగను ఉన్నచో రాజులగుదురు. ఇందుకు విరుద్ధముగ నున్న ముఖము దుః ఖదాయకము-43. మిక్కిలి పెద్దగ నున్న ముఖము దౌర్భాగ్యమునే కలిగించును. ఆడదాని ముఖము వంటి ముఖము పుత్రనాశకము, గుండ్రముగ నుండిన సుఖిత్వము కలుగును-44. పొడవైన ముఖము ద్రవ్యనాశమొనర్చుటయే గాక పాపములు చేయించును. భయములిగించును. చుతుష్కోణాకృతిగ నున్న వదనము ధూర్తత్వమును, పుత్రనాశకత్వమును కలిగించును-45. లోతుగ నున్న ముఖము కూడ పుత్రులకు హానికరమగును. పొట్టి మొగము క్షుద్రత్వమును కలిగించును. నిండుమొగము భోగులకుండును-46. పెదవులు ఎఱుపు వన్నెలో నున్నవాడు రాజగును. తామరపువ్వు వన్నెలో నున్నవాడు ధనవంతుడగును. దౌడల మూలములవఱకు వ్యాపించియున్న స్టూలమైన పెదవులు, ఎండిపోయినట్లు, తీక్షముగను ఉన్నయెడల దుఃఖితులగుదురు-47. కొనలు పగిలినట్లుగాక నునుపుగను, మెత్తగను వంగియుండిన నిండు మాసములు పురుషులకు ప్రశస్తమైనవి. అట్టివారు రాజులగుదురు-48. ఎఱుపు వన్నెలోను, పలుచగను, కణుకుగను ఉన్న మాసములు గలవారు దొంగలు, వ్యభిచారులును అయ్యేదరు-49. మాంసము లేని చెవులు గలవారు యుద్దము వలన నశింతురు. అణగిన చెవులపోరు భోగులు, పొట్టి చెవులవారు దీనులును అగుదురు.

తా॥ శంకువు (బల్లెపు) ఆకారముగనున్న చెవులు గలవాడు, శత్రువులకు భయమును కలిగించు రాజగును. చెవులు విశాలములై రోమములు గలిగియుండెనేని దీర్ఘాయుష్మంతుడగును. బోగి, దేవ బ్రాహ్మణ పూజకుడును నగును-51. నరములుగలిగి విడివడినట్లు, ముఖ్యముగా వ్రేలాడుతున్నట్లు చెవులుండెనేని క్రూరుడగును. మాంసముతో కూడి యున్నచో సుఖదములగును-52. లోతు చెక్కిళ్లవాడు భోగియగును. నిండైన చెక్కిళ్లుండెనేని మంత్రి యగును. చిలుక ముక్కుగలవాడు శుభములు పొందును. ఎండిపోయిన ముక్కగలవాడు దీర్ఘకాలము బ్రతుకును-53. అరవిరిసిన మొల్ల మొగ్గల వలే మెఱయు పలువరస గలవాడు రాజగును. ఎలుగుబంటి, కోతి దంతముల వంటి దంతములు గలవారు నిత్యమును ఆకలితో బాధపడుచుందురు-54. ఏనుగు, గాడిద దంతములు, నును పైన పండ్లుగలవారు గుణవంతులు. పొడవై వేఱుపుబుట్టించునవి, వంకరటింకరగనున్నవి, కఱుకుగనుండునవి అయిన దంతములు గలవారు దుఃఖమునననుభవింతురు-55. ముప్పది రెండు పండ్లు గలవారు రాజులు, ముప్పది యెకటి గలవారు, భోగులు, ముప్పది గలవారు సుఖదుఃఖములను రెంటిని మిశ్రమముగననుభవించువారు, ముప్పదికి తక్కువగానున్న పురుషులు దుఃఖమునే అనుభవించువారగుచున్నారు-56. బలమైన నల్లని నాలుకగలవాడు సేవకుడు, మందముగను, కఱుకుగను ఉన్న  లుక గలవాడు కోపగొండీయగును-57.' తెల్లని నాలుక గలవారు పరిశుద్ధత, ఆచారముగల వారగుదురు. తామరరేకువలే సూక్ష్మమై పొడవై, అందముగను, స్థూలముగాక, అంత విశాలమునుగాక యుండునాలుక గలవారు రాజులగుదురు-58. లోతుగను, నునుపుగను, పొట్టిగను, ఎఱుపుగను నాలుక యున్నవారు సకలవిద్యలను బోధించువారగుదురనుటలో సంశయము లేదు-59. నల్లని దౌడలు గలవాడు కులనాశకుడగును. పసుపు వన్నె దౌడలు గలవాడు సుఖ దుఃఖములు రెండును అనుభవించు రాజగును.

తా॥ వికారముగ, కఱకుగ, పగిలినట్లున్న దౌడలు శ్రేష్ఠములు కావు. సింహము ఏనుగు దౌడల వంటి దౌడలు గలిగిన వాడు రాజగును. తామర పువ్వువంటి దౌడలు గలవాడు రాజు, తెల్లని దౌడలు గలవాడు ధనికుడును అగును-61. హంసనాదము వంటి కంఠస్వరము గల పురుషులు ధన్యులు. మేఘ గంభీర ధ్వని గలవారును ధన్యులే. క్రౌంచపక్షి ధ్వని గలవారు రాజులు, భోగులు, గొప్పధనవంతులును అగుదురు-62. జక్కవ పక్షి స్వరము గలవారు రాజులు, ధర్మమును పోషించు ధన్యులగుదురు. దుందుభిధ్వని, కుంభధ్వని యుండువాడు రాజగును. కర్కశధ్వని, దీర్ఘస్వరము గలవారు క్రూరులు లేక పశుతుల్యులు అగుదురు-63. గురుర ధ్వని గలవారు క్లేశముననుభవింతురు. ధనుష్టంకారము వంటి కంఠస్వరము, కంచుమ్రోతవంటి కంఠధ్వని గలవారు భాగ్యవంతులయ్యెదరు. క్షీణధ్వని, పగిలిన స్వరము గలవారధములుగా చెప్పబడిరి-64. సన్నని ముక్కుగలవారు రాజులు, పొడవైన ముక్కుగలవారు భోగులగుదురు. పొట్టిముక్కు వారు ధర్మశీలురుగా తలఁపబడుదురు-65. ఏనుగు, గుఱ్ఱము, సింహము ముక్కులవంటి ముక్కులు గలవారు మొనదేలిన ముక్కుగలవారు వర్తకమున విజయమునందుదురు. గుఱ్ఱముల అమ్మకము లాభించును-66. స్థూలమైన కొన గలిగి చూచుటకు వికారముగనున్న ముక్కుగలవారు సముద్రుని వాక్యముననుసరించి పాపకర్ములని తెలియవలెను-67. దానిమ్మ పువ్వుల వంటి కన్నులుగలవాడు సప్తద్వీపములను పాలించురాజగును-68. పులికన్నులు గలవారు కోపస్వభావము గలవారు. ఎండ్రికన్నులు గలవారు కలహప్రియులగుదురు. పిల్లి హంస కన్నులవంటి కన్నులు గలవారు పురుషులలో అధములుగా తెలియవలెను-69. నెమలి ముంగిస కన్నులు గలవారు మధ్యములని చెప్పబడుదురు. తేనే వలె పింగళ వర్ణముగల కన్నులు గలవారిని సంపద ఎప్పుడును వదలి పెట్టక యుండును.

తా॥ పింగళ వర్ణము కాని కన్నులుగలవారు సర్వభోగములతో గూడిన రాచకముననుభవింతురు. గోరోచనవర్ణమున, హరిదళము వన్నెలోను, గురిజగింజ ఎఱుపునను కనులున్నవారు ధనవంతులగుదురు. అంతియేకాక వీరు బలసత్త్వ గుణములతో గూడిన చక్రవర్తులగుదురు-71. రెండు మాత్రల కాలమునకొకసారి కనుతెప్పవేయువారు శ్రేష్ఠులను (ఈశ్వరుని ఆశ్రయించి జీవింతురు. మూడు మాత్రల జెప్పపాటు గల పురుషులు సుఖజీవనులగుదురు-72. నాలుమాత్రలకొక పర్యాయము జెప్పవేయువారు ప్రభువులయ్యెదరు. ఐదు మాత్రల నిమేషముగలవారు దీర్ఘాయుష్మంతులై ధర్మరతులైయుందురు-73. పొట్టి చెవులవారు విశాలమైన చెవులు గలవారు భాగ్యవంతులు, సుడిదిరిగిన చెవులవారు ధనికులు, నును పైన చెవులు గలవారు కూడ ధనికులేయగుదురు-74. ముత్తెపుచిప్ప, శంఖమువంటి చెవులు గలవారు దీర్ఘాయుష్మంతులు, ధనికులు అగుదురు. పొడవు చెవులవారు చిరంజీవులు, వ్రేలాడు చెవులు గలవారు తపస్వులగుదురు-75. అర్ధచంద్రాకృతిగ నున్న నొసలు గలవారు రాజులగుదురు. విశాలమైన నుదురుచే ధనపతులగుదురు. లలాటము స్వల్పమైయున్నచో నట్టిమనుజుడు ధర్మమునందాసక్తిగలవాడగును-76. స్త్రీ పురుషులలో నెవరికైనను నుదుటి పై ఐదు రేఖలుండినచో నట్టివారు ఐశ్వర్యమును పొంది నూఱు సంవత్సరములు జీవింతురు-77. నాలుగు రేఖలున్న ఎనుబదియేండ్లు, మూడురేఖలుండిన డెబ్బదియేండ్లు, రెండు రేఖలున్న అణువదీవత్సరములు, ఒకే రేఖయున్న నలుబది. సంవత్సరములు, లలాటము పై రేఖలే లేనిచో నిరువదియైదు సంవత్సరములు జీవింతురు-78. రేఖాచ్ఛేదముల చేత మనుష్యులలో ఉత్తమ, మధ్యమాధములను, అల్పాయుష్కులను, వ్యాధిపీడితులను తెలియవలెను-79. త్రిశూలచిహ్నముగాని, అడ్డకత్తి గుర్తుగాని కనబడినచో నట్టివాడు ప్రభువు, భోగి, కీర్తిమంతుడని యెఱుంగవలెను.

 తా॥ పైకి పోవుచున్నట్లు పొడవుగను, లోతుగను ఉన్న తలగలవాడు తక్కువ ఉపద్రవములు కలవాడును, గుండ్రమైన తలగలవాడు రాజు, గోవులతో నొప్పువాడు అగును. అట్టి శిరస్సు శుభప్రదమైనది-81. దరిద్రులకు విషమమైన తల, దు: ఖభాగులకు పొడవైన తల యుండును. రాజులకు సర్ప, గజ శిరస్సులు, భోగులకు కుదురైన తలలుండును-82. తల వెంట్రుకలు, రోమములు, మీసములు, గోరోజనము వర్ణములోను, పగిలినట్లుగను, కఱుకుగను, లావుగను ఉండెనేని అట్టి పురుషులు దుః ఖితులని తెలియవలెను-83. కఱుకుగ, పేలవమైన వన్నెతో, నిస్తేజముగ, వాడిగను, మందముగను, అత్యల్పము అతి బహుళమునుగాక వెంట్రుకలున్నవారు దుఃఖభాగులగుదురు-84. వంకలు తిరిగి, మెత్తగను, నునుపుగను, తుమ్మెదలవలె, కాటుకలవలె ప్రకాశించు వెంట్రుకలు గలవాడు రాజగును.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మ పర్వమున, చతుర్ధి కల్పమునందలి పురుషలక్షణవర్ణనమను నిరువదియాఱవ అధ్యాయము సమాప్తము.