భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
101. సప్తమీ కల్పమున భద్రా కల్ప వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “శుక్లపక్ష సప్తమీ దినమున హస్తా నక్షత్రమైన దానికెప్పుడు ప్రాథమ్యము కలుగునో అప్పుడది భద్రనామమును కూడా పొందును. ఆనాడు సూర్యదేవునకు మొదట నేతితోను, అటుపైన పాలతోను, తదుపరి చెట్టుకు రసముతోను. స్నానము చేయింపవలెనని విద్వాంసుల చేత చెప్పబడినది. స్నపనము తరువాత దేవునకు చందనము పూయవలెను. గుగ్గులు ధూపమువేసి, అటు పైన సర్వతో భద్రను సమర్పింపవలెను. చంద్రుని వలె ప్రకాశించు పరిశుద్దమైన గోధుమ పిండిని, వజ్రము, బెల్లము, ఎఱ్ఱని పుష్పములతోసహాచల్లి. దాని ఈశాన్యమూలయందు ముత్యమును, ఆగ్నేయమున మాణిక్యమును లేక కెంపును ఉంచవలెను. అదే విధముగ నైరృతియందు మరకతము, వాయువ్యమున పద్మరాగము, చివరన బంగారమును, తన శక్తిననుసరించి యుంచవలెను. చతుర్థినాడు' ఒక పూట భోజనము, పంచమినాడు నక్తవ్రతము, షష్ఠినాడు అయాచిత భోజనము, తరువాతి దినమగు సప్తమీనాడు ఉపవాసము చేయవలెను. ఈ సప్తవ్రతానుష్టానము చేయువాడు, వేదబాహ్యులను, కర్మభ్రష్టులను, బిడాల ప్రతికులను, పంచములను చూడరాదు. పగటి సమయమున నిద్రింపరాదు. ఈ విధానముగ భద్రసప్తమీ నాచరించువాడు దేవతలయనుగ్రహము పొందును. వారు అతనికి సర్వవిధములైన శుభముల నిత్తురు. ఈ తిథియందు సూర్యభగవానునకు సర్వతో భద్రను సమర్పించువాని కుమారుడు శుభమును పొందును. అంతీయకాక తాను స్వయముగ శుభమునంది మంగళకరమైన జీవితమును గడుపును.
తా॥ దిండి యిట్లనెను. “భద్రయని దేనినందురు? దాని నెట్లలంకరింపవలెను? అది సమర్పించుట వలన నేమి ఫలము కలుగునని యెఱుంగ వలయును? ఏ విధానమున సమర్పింపవలేను”?. బ్రహ్మదేవుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది వ్యోమభద్రమని చెప్పబడును. సర్వశ్రేష్ఠమైన దేవ చిహ్నము. సూర్యదేవ సంబంధమగు దీనిని ధరించువాడు సర్వపాపములనుండి విముక్తుడగును. ఆవు నేయి, ఖండశర్కర కలపిన శాల్యన్నపు ముద్దను చతురస్రాకారాముగ తీర్చవలెను. నాలుగు విధములైన పండ్లతో, ముఖ్యముగా ద్రాక్షలతోను, నారికేళములతోను పరిమళ ద్రవ్యములతోను దానిని సంపన్నము చేయవలెను. భద్ర మధ్యభాగమున నింద్ర నీలము; పుష్పరాగమును, మరకతమును, పద్మరాగమును. మేటి మాణిక్యమును కోణములందు క్రమముగ, శక్తి కొలదిగ, నుంచవలెను, దానిని పౌరాణికునకుగాని లేక భోజకునకుగాని సమర్పింపవలేను. ఈ పద్దతి ననుసరించి భద్రను సిద్దపఅచీ దానము చేయువాడు శుభములను పొంది సూర్యలోకమును చేరును. అటనుండి, తేజస్సు చేత, కాంతి చేత సూర్య సన్నిభుడై, దివ్యయానమున పయనించి బ్రహ్మలోకమునుజేరును, సందేహము లేదు. ఇట్లు ప్రభ చేతను, బలము చేతను సూర్యసముడై, బ్రహ్మలోకమునుండి మఱల భూలోకమన కేతెంచి నిస్సంశయముగ రాజగును. సూర్యదేవుని యనుగ్రహముచే నింద్రదేవుని వలె అందజి పూజలందుకొనును. ఏ తిథి యందుపవసించుటచేత మానవుడు బ్రహ్మలోక ప్రాప్తినందునో అట్టి భద్రసప్తమీ గుంచి నీ కిట్లు చెప్పితిని.
తా॥ ఈ సప్తమీ వ్రతమును వినినవారు, చదువువారు, చేయువారును శుభమునంది శాశ్వతమైన బ్రహ్మపదమును చేరుదురు. “సుమంతుముని యిట్లనెను. “ సప్తమీ వ్రతమును గూర్చి పూర్వము బ్రహ్మదేవుడు దిండికి చెప్పియుండెను. దానినే నేను వినినట్లు, నాకు తెలిసినట్లు నీకు చెప్పితిని. భూతలమునందు మానవుడెవడైనను సప్తమీ వ్రతమును స్వీకరించియు, కామము వలననో, భయము వలననో పూర్తిచేయక వదలినచో నట్టివాడు పతితుడును, అజ్ఞానియునునగును. అందుచేత దీనిని విడువకుండ పూర్తియగు వఱకును నిర్వహింపుము. మధ్యలో వదలి పెట్టినవాడు కొంత పైకిఁబోయి క్రిందపడిన వాడగును. ఈ సప్తమీ కల్పమును ప్రారంభమునుండియు భక్తులకు శ్రద్ధగా వినిపించువాడశ్వమేథ ఫలమును పొంది పరమపదముఁజేరును.
శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భద్రాకల్ప వర్ణనమను నూటయెకటవ అధ్యాయము సమాప్తము.
