భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

66. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము

తా॥ సుమంతుముని యిట్లనెను. “ఈ విధముగ చెప్పి బ్రహ్మదేవుడు తన లోకమునకు వెడలిపోయెను. దిండి సూర్యభగవాను నారాధించి సూర్యున కనుచరుడయ్యెను”-1. శతానీకుడిట్లనెను. “బ్రాహ్మణోత్తమా! అమృతుడగు భాస్కరుని మాహత్మ్యము నింకను చేప్పుడు. అతని గూర్చి యెంత వినినను తృప్తి కలుగుటలేదు."-2. సుమంతుడిట్లనెను. “రాజా! ద్విజశంఖ సంవాదమును వినుము. దానిని వినుటచే మానవుడు తన పాపములన్నింటి నుండియు ముక్తుడగును-3. ఒకప్పుడు శంఖముని తన యాశ్రమమున సుఖాసీనుడైయున్నవేళ నాతని దర్శించుటకొక ద్విజుడేతెంచెను. శంఖముని ఆశ్రమప్రాంతము పండ్ల బరువుచే వంగిన కొమ్మలుగల చెట్లతో నిండియుండెను-4. లేళ్ళు తమ కొమ్ములతో పరస్పరము గోకికొనుచుండెను. నెమిళ్ళు, ఆకాశమున నుండి కొని రాబడిన నీళ్లను గ్రోలుచు, తామర దుంపలను దీనుచుండెను-5. పువ్వులు వెదజల్లు పరిమళముల వలన మూగిన తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటగల పవిత్ర జలాశయములలో సిద్దులు, దేవతలు, ఋషులు, గంధర్వులు స్నానాదులనొనర్చుచుండిరి-6. ఆయా ప్రాంతములందు యతులు, వానప్రస్థులు, తపస్వులు ఆ ఆశ్రమారణ్యమును శోభింపజేయుచుండిరి. అట్టి సుందరమైన పరిసరములతో నొప్పుచున్న ఆశ్రమమందు ముని శ్రేష్ఠుడైన శంఖుడు సుఖముగా-సూర్యభగవానుని స్తుతులతోస్తోత్రము చేయుటకు, తదేక చిత్తుడై కూర్చుండి యుండెను. అట్టి తజి భోజక కుమారులాయనచెంత కేతెంచిరి-7,8. వారలు వినీతులై మునిని సమీపించి యధావిధిగ నమస్కరించి ముని యనుజ్ఞతో నాసనములందుపవిష్టులై ఆయనతో నిట్లనిరి.

తా II "భగవన్! వేదములన్నింటి విషయమున మాకుగల సందేహములను నివారింపుడు” అవి వినమ్రులై యడిగిన ఆ కుమారులయెడ శంఖముని-10. ప్రీత మానసుడై అనాదులైన నాలుగు వేదములను చెప్పెను. ఆశ్రమమునందు వారి వేదపాఠము జరుగుచుండగా నొకనాడు యాదృచ్చికముగ-11 మునిశ్రేష్ఠుడగు ద్విజుడచటికే తెంచెను. అమిత తేజస్వియైన శంఖముని యాద్విజుని యథోచితముగ సత్కరించెను 12. కుమారులు కూడ అతనికి నమస్కరించిరి. అతడు సంప్రీతుడయ్యెను. అప్పుడు శంఖముని తన శిష్యులైన భోజకుమారులతో నిట్లనెను-13. “శిష్టులగు వారేతెంచినపుడు అధ్యయనము చేయకూడదని శాస్త్రము. నేడు మన చెంతకట్టి మహాత్ముడు వచ్చెను.కావున మీరు పాఠములు చదువుట విరమింపుడు.” కుమారులు “మీ యాజ్ఞప్రకారమటులే చేయుదుమని” బదులు పలికిరి-14. ఆగంతకుడైన ద్విజుడు విద్యార్థులను గూర్చి “ఎవరు వీరు? ఏమి చదువుచున్నారు.? “అని అడిగెను, శంఖముని, సమా ధానముగా " మహాత్మా! వీరు భోజకుని పుత్రులు -15. సూత్రములతో సహా కల్పములను, వేదములను అధ్యయనము చేయుచున్నారు. అటులే సప్తమీ కల్పము, సూర్యభగవానుని పూజా విధానము-16. అగ్నికార్యపద్దతి, ప్రతిష్టాకల్పము మొదలుకొని ఆయాదేవతల అంగలక్షణములను గూర్చి, సూర్యరథయాత్ర గుణించియు నేర్చుకొనుచున్నారు'-17. ద్విజుడిట్లనెను. “సప్తమినాడు చేయవలసిన విధానమేమి? సూర్యదేవుని పూజించు పద్ధతి ఏమి? సూర్యమందిరమున నాదేవుని గంథపుష్పాదులచేత, ధూపదీపనైవేద్యాదులచేత పూజించినచో నెట్టి ఫలము కలుగును?-18. ఆదేవుడే దానముతో తృప్తినందును? ఏ వ్రతముచే, ఏ నియమముచే నాదేవేశుడు సంతోషించును? సూర్య పూజకొఱకెట్టి ధూప, పుష్ప, నైవేద్యములుపయోగింపవలెను?-19. ఓ తపోధనా ఈవిషయములు వినుట కిచ్ఛకలదు. కావున, వినిపింపుడు. ముఖ్యముగా సూర్యుని మాహాత్మ్యమును గూర్చినాకు తెలుపుడు”.

సాంబఉవాచ :

తా॥శంఖముని యిట్లనెను. “ఇదే విషయమును పూర్వమొకప్పుడు వసిష్ఠ మహర్షి యాదవ నందనుడైన సాంబునడిగెను. సాంబుడు వసిష్ఠునకు చెప్పిన అంశమును మీకు చెప్పెదను వినుడు-21. తీర్థములలో నుత్తమమైనది, పుణ్యతమమైనదియునైన వసిష్టాశ్రమమున కేతెంచి సాంబుడు నియతాత్ముడైన ఆ ముని సత్తమునకు నమస్కరించెను-22. సాంబుడు మిక్కిలి వినయముతో వసిష్ఠ మహర్షిని సమీపించి ఆయన పాదములకు నమస్కరించేను. భక్తితో వినమ్రమైన ముఖము గలవాడై ప్రణమిల్లిన సాంబుని చూచి-23. వసిష్ఠుడు మిక్కిలి సంప్రీతుడై అతని నిట్లు ప్రశ్నించెను. “నీశరీర మంతయు కుష్ఠవ్యాధిచేత తీవ్రముగా, భయంకరముగ 'పగుళ్ళువారి యుండెను గదా! ఆ వ్యాధి ఎట్లు పోయినది? మిక్కిలి మనోహరమైన రూప సౌభాగ్యముతో, సౌకుమార్యముతోను ప్రకాశించుచున్నావు. ఇదెట్లు సంభవించినది?'-25,26. సాంబుడిట్లనెను. “లోకనాథుడైన దివాకరుని సహస్రనామములతో స్తుతించితిని. స్వామీ! ఆదేవదేవుడు నాకు సాక్షాత్తుగ దర్శనమిచ్చెను”-27. వసిష్ఠుడిట్లడిగెను. “సాంబా! సూర్యదేవునెట్లో రాధించితివి? ఏ వ్రతము చేత, ఎట్టి తపస్సు చేత, ఏఏ దానములచేత నాభగవానుడు నీకు దర్శన మొసంగియను గ్రహించెను?” సాంబుడిట్లు సమాధానము చెప్పెను. “హే బ్రహ్మన్! ఏ విధిచేత ఉపాసింపబడుటచేత సూర్యభగవానుడు సంతుష్టుడై నాయెడ ప్రసన్నుడయ్యెనో సాకల్యముగ చెప్పుచున్నాను. అవధానముతో వినుడు.

తా॥ నేనొక పర్యాయము కోపస్వభావుడైన దుర్వాస మహామునిని అజ్ఞానముచే పరిహసించితిని. ఆతడు నన్ను శపించెను. ఫలితముగా నాకు కుష్టువ్యాధి సోకెను-30. అప్పుడు కుష్ఠవ్యాధి పీడితుడనగునేను నాతండ్రి వద్దకు బోయి సిగ్గుపడుచు, మిక్కిలి గర్వముతో నిట్లంటీని-31. 'తండ్రీ! నా శరీరము వ్యాధిచే గళితమగుచున్నది. కంఠస్వరము కూడా క్షీణించి పోవుచున్నది. భయంకరమగు నీవ్యాధిచే ఈ శరీరము నశించుచున్నది-32. క్రూరకర్ముడైన ఈ రోగరాజు సన్ను శిక్షింపుచున్నాడు. వైద్యుల వలన ఔషధములవలన నాకు శాంతి కలుగుటలేదు-33. అందువలన మీ అనుజ్ఞతో ఈ జీవితము చాలింపవలెనని కోరుచున్నాను. నన్ననుగ్రహింపదలచినచో నాకనుజ్ఞనిండు-34. ఆ మాటలు విని, తండ్రి, పుత్రశోక పీడితుడై, ఒక్కక్షణమాలోచించి నాతో నిట్లనెను-35. “కుమారా! ధైర్యము వహించియుండుము. చింతింపకుము, ఎండుగడ్డిని అగ్ని దహించివేయునట్లు, శోకముతో కుమిలిపోవు వానిని వ్యాధి నశింపజేయును-36. వత్సా! దుఃఖింపవలదు, దేవతారాధన పరుడవు కమ్ము! అదియే నీకు శాంతి నొసంగును.” అని నన్నోదార్చెను. 'ఏ దేవుని పూజింతును?' అను ప్రశ్ననానుండి వెలువడేను-37. 'తండ్రీ! ఏ దేవత నారాధించినచో నేనీ వ్యాధుల నుండి ముక్తుడనగుదును? నా ఈ ప్రశ్నవిని నా తండ్రి యిట్లనెను. “ఇట్టి ప్రశ్ననే పూర్వము యోగీశుడైన యాజ్ఞవల్క్యఋషి సనాతనుడైన బ్రహ్మదేవునడిగెను-39. బ్రహ్మదేవుడా ఋషికి చెప్పిన విషయమునే నేను నీకు చెప్పుచున్నాను. నీ శ్రేయస్సు కొఱకు చెప్పబడు నిట్టి విషయమును శుచియై వినుము.

తా॥ సురజ్యేష్ఠుడు, పద్మసంభవుడు, ప్రజాపతియునైన బ్రహ్మదేవుడు సుఖముగా కూర్చుండియుండగా మహాతేజస్వియైన యాజ్ఞ వల్క్యుడా తనినిట్లు ప్రశ్నించెను-41. “ఓ బ్రహ్మదేవా! నా మనస్సునందుగల ఒక సందేహమునకు మీ నుండి సమాధానము వినదలచితిని. దేవతారాధనము చేతనే మానవుడు సంసారబంధమునుండి ముక్తుడగును. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వీరిలో నెవరేనియు మోక్షమును పొందుటకిచ్చయించినచో నేదేవతను పూజింపవలెను?-43. స్వర్గము పొందుటకే దేవతనుపాసింపవలెను? మోక్షప్రాప్తి కొఱకెవరిని ఆశ్రయింపవలెను? స్వర్గమును పొందిన వాడు కూడ శాశ్వతానందరూపముక్తి నందుటకు-జననమరణ రూప సంసారములోనికి తిరిగిపడిపోకుండుటకేమి చేయవలెను?-44. దేవతలందలోను ప్రధాన దేవత ఎవరు? పితృదేవతలలో ప్రధాన పితృదేవత ఎవరు? పరాత్పరుడెవరు? నా యీ సందేహములను దీర్పుడు -45. స్థావర జంగమాత్మకమగు నీ విశ్వసృష్టికి కర్త ఎవరు? ప్రళయమునందీది ఎవనిలోలయమొందును? దయతో నాకుఁ దెలుపుడు.” యాజ్ఞవల్క్యుని ఈ సందేహములపై బ్రహ్మదేవుడిట్లనెను. “మంచి ప్రశ్నలడిగితివి. సంతోషించితిని. పుణ్యతముడు, ఉత్తమోత్తముడైన ఆ దేవదేవునకు శిరస్సు వంచి నమస్కరించి-47. చెప్పుచున్నాను. సావధానుడవై వినుము. నీ శ్రేయస్సు కొఱకు చెప్పబోయేడు ఈ విషయమును శుచిర్భూతుడవై ఏకాగ్రచిత్తుడవై వినుము-48. ఉదయించుచునే జగత్తులోని చీఁకట్లను పారద్రోలి తన సహస్ర కిరణములతో వెలుగులు ప్రసరింపజేయు సూర్యభగవానుని కంటే శ్రేష్ఠతరుడైన దేవుడు మజిలేడు. ఇంతకంటే వేజేమి చెప్పవలయును?-49. ఈ పురుషుడనాదినిధనుడు. శాశ్వతుడు. అవ్యయుడు. తన దేదీప్యమానమైన కిరణములతో ముల్లోకములను ప్రకాశింపఁజేయువాడు.

తా॥ ఇతడు సర్వదేవాత్మకుడు. తాను వెలుగుచు జగత్తులను వెలిగించువాడు. సర్వజగత్తులకు నాథుడు. శుభాశుభ కర్మలన్నింటికి సాక్షి-51. సర్వభూతములను లయమొనరించును. మఱల సృష్టించును. అతడు ప్రకాశించును. తపించును. రశ్ములతో వృద్ధియగును-52. అతడే ధాత. విధాత. పూష. ప్రకృతి భావనుడు. ఎప్పుడును క్షయమందక అక్షయమగు మండలము గలవాడై వెలుగుచుండును-53. పితరులకు విత. దేవతలకు దేవత. అతని స్థానము శాశ్వతమైనది. జగదాధారుడతడు-54. సర్వకాలములయందును ఈ చరాచర సృష్టి ఆ ఆదిత్యుని నుండీయే ప్రభవించును. ప్రళయమునను ఆ దీప్తతేజుని చేరును-55. యోగి పుంగవులు తమ కళేబరములను వదలి అతనిలోననే లీనతఁజేందిరి. తేజోరాశియైన దివాకరునిలోనిట్టివారు వాయుభూతులై ప్రవేశింతురు-56. కొమ్మలనాశ్రయించి పక్షులుండినట్లు అతని కిరణముల నాశ్రయించియుండు దేవతలతో కూడ మునులు, సిద్దులును ఉందురు-57. జనకరాజు మొదలగు గృహస్థులు, రాజులు, యోగులు, వాలఖిల్యాది మునులు, బ్రహ్మచారులు, వ్యాసాది వానప్రస్థులు, భిక్షువులు, పంచశిఖులు-వీరందఱును యోగముననుండి సూర్యమండలమున ప్రవేశించిరి-59. వ్యాసుని కుమారుడైన శ్రీశుకుడు యోగధర్మమును పొంది, సూర్యకిరణములను త్రాగి పునర్జన్మలేని వాడయ్యెను.

తా॥ బ్రహ్మ, విష్ణు, రుద్రులు శబ్దమాత్రులు. వినికిడికి సుఖమునిచ్చువారు. కానీ ఈ తిమిరనాశకుడగు సూర్యభగవానుడనినచో ప్రత్యక్షదైవమని చెప్పబడెను-61. కావున శుభమును కోరువాడు సూర్యవ్రతముల యందు తప్పనితర వ్రతములయందు భక్తి కలిగియుండ నక్కఱలేదు. ఏలయన నెల్లప్పుడు అదృష్టమనునది ప్రత్యక్షము చేతనే సాధింపబడగలుగును. అందువలన నీవు కూడా సూర్యభగవానునారాధింపుము-62. యాజ్ఞవల్క్యుడిట్లనెను. “ఆహో! మీరు చెప్పిన ఈ సూర్యదేవుడు సర్వదేవతలకును దేవతయే.అందసత్యమేమియులేదు-63. అతని గొప్పతనమును గూర్చి దేవతలు, ఋషులు, సిద్ధులు, మనుష్యులు స్తోత్రము చేయుటనేననేక విధములుగా వినియుంటిని-64. ఎవని వలన ఈ చరాచర జగత్తెవిర్భవించినదో అట్టి అజుడు, అక్షయుడు అప్రమేయుడునైన దైవతము నెవరు స్తుతింపగలరు?-65. అతని కుడిప్రక్క రశ్మినుండి భగవానుడగు విష్ణువు పుట్టెను. ఎడమ ప్రక్క కిరణము నుండి బ్రహ్మవగు నీవు పుట్టితివి-66. ఫాలభాగమునుండి శివుడు జన్మించెను. అతనితో సమానమగు దేవత ఎవరు? అతని గుణవిశేషములను విస్తరించి చెప్పుటకెవరు సమర్థులు?-67. భవసాగరమును దాటింపగల ఆ సర్వాత్ముడగు సూర్యదేవుని పూజావిధానమును నేను వినగోరుచున్నాను-68. ఏ ఉపాయము చేత, ఏ రహస్యమంత్రముల చేత, ఎట్టి సేవ చేత, ఎట్టి దానముల చేత, ఏ వ్రతములచేత, ఏ ఉపవాసములచేత, ఎట్టి హోమములచేత, ఎట్టిజపములచేత-69. ఆ సూర్యభగవాను డారాధింపబడి క్లేశనాశకుడగును? ఓ బ్రహ్మదేవా! ఆ రవిని ఎట్లు పూజించుటకు సాధ్యపడునో ప్రస్తుతింపుడు.

తా॥ ధర్మార్థ కామములు పొందుటయందు తత్పరులైన పురుషులకు జన్మలో ఎప్పుడును వ్యర్థము కానిది సూర్య భగవాను నాశ్రయించి చేయబడు కర్మ మాత్రమే-71. చొరరాని సంసారమనెడు అరణ్యమునఁబడి పర్వులెత్తుచున్న వారికి సూర్య నమస్కార మొక్కటియే ముక్తి మార్గమును నిర్దేశింపగలది-72. ఏడు లోకములకును సంబంధించి యుండువాడు, అశేష కాలమునందంతట పయనించువాడు, విశ్వ హృదయముననుండువాడు-73. దిక్కులనన్నింటిని పాలించువాడు, గ్రహములకు ప్రభువు, అమిత తేజస్వి, జగత్తునకు సుఖమును వెలుగునుపంచువాడు, స్మరించిన మాత్రముననే పాపములను పటాపంచలు చేయువాడునైన ఆ సూర్యదేవు నారాధింప గోరుచున్నాను-74. అనాద్యుడగు నా దేవతాశ్రేష్ఠుని ప్రసన్నుని చేసికొనగోరు నాకు ఆ మార్గమునుపదేశించి నన్నను. గ్రహింపుడు-75". సూర్య భగవానునియందు భక్తిని ప్రేరేపించు యాజ్ఞవల్క్యుని యీ మాటలు విని మహాతపస్వియైన బ్రహ్మదేవుడమితానందమునొందెను-76. ఆనందముతో బ్రహ్మదేవుడిట్లనెను “ఓ బ్రాహ్మణోత్తమా! నీ వడుగుచున్న సూర్యారాధనము, ప్రతోపవాస జపాదికముల గుఱించి చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము-77. “హేయ వివర్జితము, అనాది, సదసత్తులకతీతమునైన పరబ్రహ్మ వస్తువు సర్వ భూతములయందు పరివ్యాప్తమై యున్నది-78. నిత్యులు, సర్వ వ్యాపకులు, జగత్సృష్టికి మొదటివారు, మహాత్ములునైన ప్రకృతి పురుషులలో సంక్షోభము కలిగినప్పుడు-79. బ్రహ్మాండము సృష్టింపబడుచున్నది. ఈ సృష్టికి కారణము పరమాత్మ, తనకు అన్యకారణమేదియులేని పరమేశ్వరుడిట్లు సృష్టి రూపమున ఆవిర్భవించుచున్నాడు.-80. అతడే తన లీలతో ప్రకృతిత్వ పురుషత్వములనుపొంది విస్తృతమైన ఈ జగద్రూపమును తనయూహగా రచింపుచున్నాడు-81. ఆ పరమాత్మయగు సూర్య భగవానుడే జగత్పరిపాలనావసరమున విష్ణువుగను, క్షయ కాలమున రుద్రుడుగను స్వేచ్ఛచే రూపొందుచున్నాడు-82. అక్షరుడు, తేజోరూపుడు దేవతలందతిచేత నమస్కరింపబడువాడు, భేదాభేద స్వరూపుడునైన ఆ సూర్య దేవునకు నమస్కరించి, అతని ఆరాధన పద్ధతిని అంతయును వర్ణింతును-83. ఇది రహస్యమేమైనను నీకు చెప్పుచున్నాను. నా యెడ ప్రసన్నుడై సూర్యుడే పూర్వము నాకిది చెప్పియుండెను.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున యాజ్ఞ వల్క్య బ్రహ్మసంవాదమున, సప్తమి కల్పమునందు ఆదిత్య మహిమ వర్ణనమను అటువది యాఱవ అధ్యాయము సమాప్తము.